రివ్యూ

ఇంటెలిజెంట్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** వివేకం

తారాగణం: అజిత్, కాజల్, వివేక్ ఓబెరాయ్, అక్షరహాసన్ తదితరులు
సంగీతం: అనిరుధ్
ఛాయాగ్రహణం: వెట్రి
కూర్పు: రూబెన్
నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్,
అర్జున్ త్యాగరాజన్
రచన, దర్శకత్వం: శివ

బాహుబలి తరువాత టాలీవుడ్ మార్కెట్ వాల్యూమీద సినిమా ప్రపంచానికి ఓ నమ్మకం వచ్చేసింది. భాషా భేధాలు లేకుండా సినిమాను సినిమాలా చూసేవాళ్లలో తెలుగువాళ్ల తరువాతే ఎవరైనా? అన్న విషయమూ అనేకసార్లు రుజువైంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే ఈమధ్య తమిళ హీరోలు, దర్శక నిర్మాతలు తెలుగు మార్కెట్‌పైనా కాస్త ఎక్కువగానే దృష్టి పెడుతున్నారు. లేదూ తమిళ, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. తెలుగులో మార్కెట్ పెంచుకోడానికి సూర్య, కార్తి, విజయ్, ధనుష్, అజిత్, విశాల్‌వంటి హీరోలు విశ్వ ప్రయత్నం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఆ కోవలో అజిత్ 25వ సినిమా ‘వివేగం’ -తెలుగులో వివేకంగా విడుదలైంది. వీరం, వేదాళంవంటి హిట్లు ఇచ్చిన దర్శకుడు శివ -అజిత్‌తో చేసిన మూడో సినిమా కావటం, అజిత్ వెరైటీ మేకోవర్ కలిసి తెలుగులోనూ ప్రాజెక్టుపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
సీక్రెట్ ఏజెన్సీలో పేరుమోసిన వెపానిక్ ఏజెంట్ ఏకె అలియాస్ అజయ్‌కుమార్ (అజిత్). తీవ్ర నేర చరిత్రవున్న అండర్ వరల్డ్ ద్రోహుల్ని అంతమొందించటం అతని స్పెషల్ డ్యూటీ. శత్రువుకి బెదరడు. ఓటమి ఎరుగడు. స్నేహితులంటే ప్రాణం ఇవ్వడం ఏకె తత్వం. అతని సీక్రెట్ టీంలోని నలుగురు కాప్స్‌లో ఆర్యన్ (వివేక్ ఓబెరాయ్) అంటే ఏకెకు ప్రత్యేకమైన ఇష్టం.
అణుశక్తితో భూకంపాలను సృష్టించగల డిజైన్‌ను రూపొందించి క్యాష్ చేసుకోవాలని కొన్ని కార్పొరేట్ కంపెనీలు కుట్ర పన్నుతాయి. ప్లుటోనియం అణుబాంబు ప్రయోగం కోసం రెండు డివైజ్‌లను రూపొందిస్తారు. ఆ సమాచారం ఏకె ఇంటిలిజెన్స్ టీంకు అందుతుంది. ఆ డివైజ్‌లను స్వాధీనం చేసుకుంటే విపత్తును ఆపొచ్చన్న నిర్ణయానికి వస్తారు. ఆ డివైజ్‌లు ఎవరి దగ్గరున్నాయన్న అనే్వషణలో క్రిమినల్ నటషా (అక్షర హాసన్) తెరపైకొస్తుంది. నటాషాను పట్టుకుని డివైజ్‌లను నాశనం చేయాలని అనుకుంటుంది ఏకె టీం. ఆ ప్రయత్నంలో ఉండగానే -ఆమెను కొందరు కాల్చి చంపేస్తారు. ఈ పరిస్థితుల్లో ఏకే ఎవరిపై యుద్ధం చేయాల్సి వచ్చింది? విధ్వంస కుట్రను ఎలా చేధించాడు? అన్నది సినిమా ముగింపు.
హాలీవుడ్ యాక్షన్ చిత్రాన్ని తలపించేలా వివేకంను డిజైన్ చేశారు. నేటివిటీ మిస్సవకుండా పేరుకు తగ్గట్టే దర్శకుడు తెలివైన సన్నివేశాలను జోడించాడు. హీరో -విలన్ల ఎత్తుకు పైఎత్తులు, క్రిమినల్ తెలివితేటల చుట్టూ కథ నడుస్తుంది. నటాషాని అనే్వషించే ఎపిసోడ్ ఊపిరి బిగబట్టేలా డిజైన్ చేయడం బావుంది. పతాక సన్నివేశాల్నీ దర్శకుడు బాగా రాసుకున్నాడు. టూ మచ్ ఇంటిలిజెంట్ గేమ్ అబ్బురపరుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటుగా, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని గాఢతతో చూపించటం బావుంది. సాంకేతికత చుట్టూ తిరిగే కొన్ని సన్నివేశాలు మాత్రం సగటు ప్రేక్షకుడిని కొంత గందరగోళపరుస్తాయి.
హీరో అజిత్ మేకోవర్, స్టైలిష్ లుక్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లోని ఫ్లైట్ ఫైట్‌లో అజిత్ సిక్స్‌ప్యాక్ బాడీ అప్పియరెన్స్ ఆకట్టుకుంది. అజిత్ భార్యగా కాజల్ అగర్వాల్ పాత్రమేరకు మెప్పించగలిగింది. తెలుగు తెరపై వివేక్ ఓబెరాయ్ మెప్పించాడు. క్రిమినల్ పాత్రలోఅక్షర హాసన్ కొంచెం సేపే కనిపించినా ఆకట్టుకుంటుంది. సినిమా నిండా విదేశీ లొకేషనే్ల ఉన్నా, కెమెరా పనితనంతో మరింత రిచ్‌గా చూపించారు. సంగీతపరంగా అనిరుధ్ ఫెయిలయ్యాడు. షార్ప్ ఎడిటింగ్ సినిమాలో వేగాన్ని పెంచింది. మొత్తం అజిత్‌స్థాయి సినిమా అనిపిస్తుంది.

-ప్రవవి