విశాఖపట్నం

మనసు పలికిన వౌనరాగం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి పని ముగించుకుని భర్త గదికి చేరేటప్పటికి గోడ మీద గడియారం పది గంటలు చూపెడుతుంది.
ఏదో ఇంగ్లీషు నవల చదుతూ అలాగే నిద్రపోయాడు అభిషేక్. గుండెల మీద పడున్న పుస్తకాన్ని తీసి, టేబుల్ లైటు ఆపి, బెడ్‌లైటు వేసింది మధువని.. నీలం రంగు కాంతి గదంతా పరుచుకుంది.
రాధాకృష్ణుల రాసలీల పెయింటింగు ఆ గదికి ఓ వింత శోభనిస్తుంది. కొబ్బరాకుల నడుమ నుండి తొంగి చూస్తున్న జాబిల్లి వెలుగులు కిటికీ గుండా వచ్చి అభిషేక్ ముఖం మీద గిలిగింతలు పెడుతున్నాయి. భర్తకి నిద్రాభంగం కలక్కూడదని పక్కగా ఒదిగి పడుకుంది మధువని.
ఆ చిన్ని అలికిడికే ఉలిక్కిపడి భార్య రాకను గమనించి, కళ్లు విప్పకుండానే ‘‘మధూ’’ అంటూ భార్యని వాటేసుకున్నాడు అభిషేక్ తమకంగా.
‘‘నేను వచ్చేసరికి పుస్తకం మిమ్మల్ని జోకొడుతుంది. మీ నిద్ర భంగం చెయ్యడమెందుకని...’’ భార్య మాటలు పూర్తి కాకుండానే ఆమెను మరింత గట్టిగా వాటేసుకుని ‘‘మరి నువ్వు వచ్చే వరకు ఆ సొత్తమే నా పొత్తు’’ అన్నాడు ఆమె ముఖంలోకి చూసి నవ్వుతూ.
కిలకిలా నవ్వింది మధువని.
‘‘ ఈ నవ్వుల కోసమే నేను కాచుకున్నాను’’ అని రాగయుక్తంగా పాడుతూ భార్య ముఖం చేతుల్లోకి తీసుకున్నాడు.
‘‘అది సరే కాని రేపు ఉదయానే్న లేచి స్టేషన్‌కి వెళతారా’’ అంది గోముగా అతని కౌగిట్లో గువ్వలా ఒదిగిపోతూ.
‘‘అయ్యబాబోయ్ మీ చెల్లాయి వస్తుంది కదూ. అయితే మనకో వారం రోజులు పస్తా?’’ భార్యను మరింత వాటేసుకుంటూ అన్నాడు అభిషేక్.
‘‘అవును మరి అందుకే’’ అంటూ అతని చెవిలో గుసగుసలాడిందామె అతని పట్టు విడిపించుకోకుండానే.
* * *
ఉదయానే్న లేచి రెడీ అయి స్టేషన్‌కి బయలుదేరాడు అభిషేక్.
‘ఎన్ని రోజులైపోయింది కమలినిని చూసి’’ దానికి ఊతప్పం అంటే చచ్చేంత ఇష్టం. వచ్చేసరికి రెడీగా ఉంచుతాను’ అనుకుంటూ అన్ని పనులు చేసుకుంటోంది మధువని చెల్లెలి ఆలోచనలతో.
చక్కగా స్నానం చేసి దేవుడికి దీపం పెట్టింది. వంట ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఆలోచించసాగింది.
కమలిని రాగానే దాన్ని మంచి మూడ్‌లో పెట్టి పెళ్లి విషయం మాట్లాడి ఎలాగైనా దాన్ని ఒప్పించాలి. అమ్మ చెప్పినవన్నీ బాగా బోధపడేటట్టుగా చెప్పాలి. అన్నయ్య పెళ్లి చేసుకుని కెనడా వెళ్లిపోయాడు. వాడి ప్రోత్సాహం వల్లే తనకి పెళ్లి జరిగింది. మంచి సంబంధం అని అమ్మనాన్న తనని తొందర చేసి పెళ్లి ఒప్పించారు. అభిషేక్ నిజంగా బంగారమే. తన అదృష్టం కొద్దీ అటువంటి భర్త లభించాడు. కమలిని పెళ్లి సుముఖత చూపడం లేదు. తన ఫ్రెండు ఎవరి వల్లో మోసపోయిందని, మగాళ్లంతా దగాకోర్లని ఓ అభిప్రాయం ఏర్పరచుకుని పెళ్లంటే ససేమిరా వద్దని మొండికేస్తుంది. తల్లికి, తండ్రికి దాని గురించే దిగులు. మంచి ఉద్యోగంలో స్థిరపడి వేరే ఊళ్లో ఉంటుంది. కమలిని పెళ్లి బాధ్యత తనకే అప్పజెప్పారు. అలా ఆలోచనల్లో ఉండగానే కమలిని వెనుక నుండి వచ్చి కళ్లు మూసింది.
‘‘అరె మీరు అప్పుడే వచ్చేశారా? మీ బావగారి బండి చప్పుడు కూడా వినబడలేదే’’ చెల్లెలిని వాటేసుకుంటూ అంది మధువని.
‘‘అవునవును మీ చెల్లాయి వస్తుందన్న ధ్యాసలో అన్నీ మరిచిపోయావ్’’ సోఫాలో కూర్చుని సాక్సు తీస్తు అన్నాడు అభిషేక్.
‘‘అదేం కాదండీ బావగారూ మా చెల్లాయి వస్తుంది మా ఇద్దరికీ మధ్య ఎన్నాళ్లు ఉంటుందో ఎలాగో అని... ఆ’’
ఆమె వాక్యం పూర్తి కాకుండానే నెత్తి మీద ఓ మొట్టికాయ వేసింది మధువని.
‘‘పోవే పోకిరీ అంత విరహం ఏం లేదమ్మా. నీ గురించే ఆలోచిస్తున్నా’’ అంది మధువని.
‘‘నా గురించి అంత ఆలోచన ఎందుకమ్మా తల్లీ. నేనేం అంత మింగుడు పడని పదార్థాన్నా’’
అక్క భుజం మీద చెయ్యి వేసి అంది కమలిని.
‘‘ ఆ సంగతులన్నీ తరవాత తీరిగ్గా మాట్లాడుకుందాం. నువ్వు ముందు తొందరగా ఫ్రెషప్ అయి రావే. నీకిష్టం అని ఊతప్పం చేశాను. చల్లారిపోతే బాగుండదు’’ అంది మధువని చెల్లెలితో.
‘‘అబ్బ అవునే మధు నా ఇష్టాలు, అభిరుచులు నీకింకా జ్ఞాపం ఉన్నాయటే. ఫెంటాస్టిక్. అక్కంటే నీలా ఉండాలి’’ అంది టవల్ తీసి భుజం మీద వేసుకుని మధువని బుగ్గలు సాగదీస్తూ.
‘‘ ఎందుకుండవే కమ్మూ అసలు మన ఇష్టాలు, అభిరుచుల కన్నా మనకి కావలసిన వారి అభిరుచులు తెలుసుకుని మసలుకోవడంలోనే ఆనందం ఉంది’’
అభిషేక్ టిఫిన్ చేస్తూ భార్య వంక చూశాడు ఆరాధనాపూర్వకంగా.
‘‘అబ్బ థ్యాంక్స్ మధు. అవును నా ఇష్టాలు ఇంకేంటబ్బా? కొన్ని నే మరిచిపోయానే’’ ఊతప్పం తింటూ అంది కమలిని కిలకిలా నవ్వుతూ.
‘‘చెప్తా అన్నీ సావధానంగా చెబుతా’’ కాఫీ కప్పు అందిస్తూ అంది మధువని.
‘‘అలాగా’’
‘‘అవును మరో ఊతప్పం వెయ్యనా’’ పెనం మీద నుండి తీస్తూ అంది మధువని.
‘‘వద్దే బాబూ. ఇప్పటికే ఓవర్ ఫీడింగ్’’ అంది చేత్తో పొట్ట తడుముకుం.
‘‘సర్లే నువ్వు రెస్టు తీసుకో. మీ బావగారు ఆఫీసుకి వెళ్లిపోయారు. అక్కడే లంచ్. ఇక మనిద్దరమే’’ అంది ఖాళీ అయిన ప్లేట్లు సింక్‌లో వేస్తూ.
* * *
అభిషేక్ మేనమామ కూతురు హరిత. చిన్నప్పటి నుండి అభిని పెళ్లి చేసుకుంటాననేది. ఇరువైపులా అంగీకారమే. అభికి హరిత అంటే పంచప్రాణాలు. కాని విధి బలీయమైనది. కాలగమనంలో ఎన్నో మార్పులు. అనుకోకుండా హరిత తండ్రి వ్యాపారంలో మంచి పొజిషన్‌కి వెళ్లాడు. హరితకి తన పొజిషన్‌కి అన్ని విధాలైన అమెరికా సంబంధం కుదిర్చి హరిత పెళ్లి జరిపించారు. హరిత కూడా ఏమీ అభ్యంతరం చెప్పకుండా అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుని భర్తతో కలసి వెళ్లిపోయింది. అభిషేక్ జీవితంలో పెద్ద అఘాతం ఏర్పడినట్టయి బాగా కుంగిపోయాడు. జీవితంలో అన్నీ కోల్పోయినట్లు బాగా డిప్రెస్ అయిపోయాడు.
మధువని అన్నయ్య మాధవ్, అభిషేక్ మంచి స్నేహితులు. మాధవ్ అభిషేక్ పరిస్థితి అర్ధం చేసుకుని అతన్ని ఎలాగైనా మామూలు మనిషిని చెయ్యాలని సంకల్పించుకున్నాడు. తన చెల్లెలు మధువని మంచి ఓర్పు, సహనం కల మనిషి. ఆమె ఎలాగైనా అభి జీవితం చక్కదిద్దగలదని భావించి తల్లిదండ్రులకి, చెల్లెలికి అభి విషయం చెప్పి అతని గుణగణాలు, ఉద్యోగం వివరించి చెల్లెల్ని ఒప్పించాడు.
మంచి మనసు గల మధువని అభిషేక్ భార్య అయింది. మాధవ్ ఊహించినట్లుగానే మధువని సహచర్యంలో, ఆమె ప్రేమానురాగాలతో అభిషేక్ తొందరలోనే మామూలు మనిషి అయ్యాడు.
అలా మధువని మంచితనంతో, ఆదరాభిమానాలతో అభిషేక్ జీవితంలోనే కాదు శరీరంలో ఒక భాగం అయిపోయింది అతనికి ప్రేమతో ఏదైనా సాధించగలం అన్న సిద్ధాంతం మధువనిది. వారిది అన్యోన్య దాంపత్యం అనడంలో సందేహంలేదు.
ఓ సాయంకాలం అలా రామాలయం వైపుగా బయలుదేరారు అక్కాచెల్లెళ్లు.
దైవ దర్శనం చేసుకుని అక్కడున్న కోనేటి గట్టు మీద కూర్చున్నారు. సూర్యాస్తమయం ఎంతో రమణీయంగా ఉంది. అక్కడున్న పసుపు పచ్చని కాగితం పూల చెట్టు నుండి, ఎర్రని గనే్నరు పూలచెట్ల నుండి పూలు రాలి రెండూ కలసి ఆ ప్రదేశం పసుపు, పారాణి అద్దినట్లు రమణీయంగా ఉండి వింత శోభని కలిగిస్తున్నాయి.
కొబ్బరి చిప్ప పగులగొట్టి ఓ చిన్న ముక్క చేతిలో పెట్టి ఓ పువ్వు తీసి తల్లో తురిమి ‘‘చెప్పవే కమ్మూ ఏమైనా కబుర్లు’’ అంది మధువని.
‘‘ ఏం చెప్పాలి అవునూ నీ కాపురం ఎలా ఉందే? బావగారు నిన్ను బాగా చూసుకుంటారా? నేను వచ్చిందగ్గర నుండి చూస్తున్నాననుకో. అయినా అది నిజమైన ప్రేమేనా? లేక ఎవరైనా వస్తేనే నటనా?’’ అంది.
ఆమెకి మగాళ్ల ప్రేమపై నమ్మకం తక్కువ.
‘‘నా కాపురం చాలా బాగుందే కమ్మూ. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు ఆయన నన్ను. అది నటన కాదు. ఎంత బాగా చూసుకుంటారో మాటల్లో చెప్పలేను.
‘‘నిజంగా’’ అంది కమలిని కళ్లు వెడల్పు చేసి. కమలినితో తన పెళ్లి ఏ విధంగా జరిగిందీ, తమ అన్నయ్య తనకు తన భర్త గురించి ఏం చెప్పిందీ వివరించింది.
‘‘చూడు కమ్మూ మనం అనుకుంటాం మగవాళ్లే ఆడవాళ్లని మోసం చేస్తారని. నమ్మించి దగా చేస్తారని. మరి చూడు మీ బావగారి విషయంలో ఏం జరిగిందో. కొందరు ఆడవాళ్లు మగాళ్లని నట్టేట ముంచుతారు’’
‘‘సాధారణంగా ఆడవాళ్లే కదా మోసపోతుంటారు’’
‘‘అలా అని మనం లెక్కలు వెయ్యలేం. ఇక్కడ చూసావా ఏం జరిగిందో. అయినా కమ్మూ మంచివాళ్లంతా ఒకటి, చెడ్డవాళ్లంతా ఒకటి అని రాశులు పోసుండరే. ఇక్కడ ఆడదాని వల్లే మగాడు మోసపోయాడు. ఆయన అదృష్టం, నా అదృష్టం బాగుండి మేం భార్యాభర్తలు అయి హ్యాపీగా ఉండగలుగుతున్నాం’’
‘‘అయినా మధూ నువ్వు’’
‘‘ ఏదో త్యాగం చేసాననుకుంటున్నావా? అదేం లేదే. ప్రేమతో, ఆరాధనతో, ఆప్యాయతతో మసలి అతని ప్రేమను పూర్తిగా పొందగలిగాను. అనుకున్నది సాధించాను అంతే’’
‘‘అంటే నీ ఇష్టాలు, అభిరుచులు, అలవాట్లు అన్నీ త్యాగం చేశావా?’’
‘‘దీన్ని త్యాగం అనరే. జస్ట్ ఎడ్జస్ట్‌మెంట్ అంతే. కాని కమ్మూ కొన్ని వదులుకుంటే కాని కొన్ని పొందలేమే’’
‘‘అయితే ఏమేం వదులుకున్నావు తల్లీ’’
‘‘ ఏమైనా వదులుకోవాలి. అయినా ఇందులో వింత, విశేషం ఏమున్నాయే. మనం మన కోసం కాక మన ఇష్టుల కోసం అదీ భర్త కోసం, అతని ఆనందం కోసం జీవించడంలోనే ఉంది తృప్తి’’
‘‘నేను ఒకళ్ల కోసం బతకలేనే. నా కోసం నేన బతకాలి’’
‘‘చూడు కమ్మూ అసలు మనిషి ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు. ఎదుటి మనిషి మనసు గెలవాలంటే ప్రేమే ఏకైక సాధనం. దివ్యమైన ఔషధం’’
‘‘ఫెంటాస్టిక్. నువ్వు ప్రేమ మీద ఓ థీసిస్ రాయవే’’ గలగలా సెలయేరులా నవ్వుతూ అంది కమలిని.
‘‘చూడు కమ్మూ నే ముందే చెప్పాను. మంచి చెడు రెండూ అందరిలోనూ ఉంటాయి’’
‘‘అవునే నిజమే నువ్వు చెప్పింది బాగా అర్ధం అయింది. బావగారి సంగతి విన్నాక నా అభిప్రాయం మార్చుకున్నాను’’
‘‘ ఎక్స్‌లెంట్. మా కమ్మూ మంచి పిల్ల. అయితే అమ్మకి చెప్పనా కమ్మూని త్వరలో పెళ్లికూతురిగా చూసే ఏర్పాటు చెయ్యమని’’ చెల్లిని గట్టిగా వాటేసుకుని నుదురు చుంచిస్తూ అంది.
‘‘ ఉండవే తల్లీ. లేడికి లేచిందే పరుగా?’’
‘‘కాదా మరి. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అని ఊరకే అన్నారా? ఈ లేడి మనసు మళ్లీ మారిపోతేనో’’ చెల్లెలి భుజం మీద చెయ్యి వేసి అంది మధువని.
‘‘పోవే నీకు నేను బాగానే దొరికిపోయాను’’
మధువని చెయ్యి గట్టిగా పట్టుకుని అంది కమలిని. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి.
కమలిని ఆ విధంగా సిగ్గుపడడం అదే మొదటి సారి. అది చూసిన మధువని మనసు దూదిపింజెలా అయి మది ఆనందంతో గంతులేసింది.
‘‘కమ్మూ పెళ్లి అనేది స్ర్తికి సంఘంలోనే భద్రత, స్థిరత్వము, గౌరవము కలిగిస్తాయి’’
‘‘అలాగే’’ అంది కమలిని.
‘‘అయితే ఇది మనసు పలికిన వౌనరాగమా? మనసు పాడిన మధురగేయమా?’’ అంది మధువని చెల్లెలి చేతిని పట్టుకుని తన చెంపకానిస్తూ.
అక్క వైపు ఆప్యాయంగా చూసింది కమలిని.
సిగ్గుతో ఎరుపెక్కిన సంధ్య కౌగిట్లో కరగడానికి పడమర దిశగా పయనిస్తున్నాడు సూర్యుడు.
ఆ పడమటి సంధ్యారాగాన్ని తిలకిస్తూ ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇంటి ముఖం పట్టారు.

- శివానీ, విశాఖపట్నం.