విజయవాడ

అందరి దేవుడు ఒకడే (నీతి కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాము చదివే పాఠశాలలో గ్రంథాలయం ఉంది. వాళ్ల టీచరు చదువుకోడానికి పిల్లలకు ఒక మంచి కథల పుస్తకం ఇస్తూ ఉంటారు. రాము అందులో చదివిన కథని గుర్తు పెట్టుకుని ఇంటికి వచ్చాక తన స్నేహితులకి చెప్తూ ఉంటాడు. అది వాళ్లకి ఒక అలవాటుగా మారింది. అందుకోసం ప్రతిరోజు సాయంత్రం అందరూ ఒకచోట కలుసుకుంటారు. ఆరోజు అందరూ శర త్ వాళ్ల వరి పొలంలో ఉన్న గడ్డిమేటు దగ్గర కలుసుకున్నారు. అందరూ కాసేపు కబుర్లు చెప్పుకుని కథ వినడానికి సిద్ధమయ్యారు.
‘శరత్! ఈ కథ వల్ల మనలో ఇంకా ఐకమత్యం పెరుగుతుంది. మనం పెద్దవాళ్లమయ్యాక కూడా విడిపోకుండా కలిసి మెలిసి ఉంటాం. కథ వినిండి మరి’.. అంటూ చెప్పటం మొదలుపెట్టాడు.
‘వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు అంటూ చాలామంది దేవుళ్ల గురించి మనం వింటున్నాం. అలాగే అసలు దేవుడు ఒకడే ఉన్నాడని కూడా వింటున్నాం. దాన్ని గురించే ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుంటున్నాం’ అని చెపుతూ స్నేహితుల్లో మరింత ఆసక్తి రేపాడు.
‘ఒకసారి రాక్షసులకు, దేవతలకి మధ్య యుద్ధం జరిగింది. దేవుళ్లందరూ కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసుల్ని ఓడించారు. రాక్షసుల్ని జయించిన సంతోషంతో దేవుళ్లందరూ తమను తామే అభినందించుకున్నారు. అందరూ ఒకచోట కలిసి సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు. వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. రాక్షసుల్ని ఓడించడానికి తమ బల పరాక్రమాలే కారణమని, తమ కష్టంతోనే రాక్షసుల్ని ఓడించగలిగామని విర్రవీగిపోతున్నారు. వాళ్లు ఓడించింది మామూలువాళ్లని కాదుకదా.. రాక్షసుల్ని! ఎంత కష్టం? అందుకే అంత ఆనందం, అహంకారం. ఇదంతా అసలు దేవుడు చూస్తున్నాడు. వీళ్లందరూ తమకున్న బలంతోనే రాక్షసుల్ని ఓడించామని అనుకుంటున్నారు. దేనికైనా భగవంతుడి సహకారం అవసరం. అది వాళ్లకి ఉంది కాబట్టే రాక్షసుల్ని ఓడించగలిగారని వీళ్లకి తెలియట్లేదు. అది తెలిస్తేనే గాని వీళ్ల అహంకారం తగ్గదు. అందుకని అసలు దేవుడు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్లకి కొంచెం దూరంలో కూర్చున్నాడు. దేవుళ్లు అతణ్ణి చూసి ఈ సాధువు ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చాడో, అతడికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. అగ్ని దేవుణ్ణి పిలిచి ‘అగ్నిదేవా! నువ్వు వెళ్లి అతడి విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకుని, మన పరాక్రమం గురించి కూడా చెప్పిరా!’ అన్నారు. అగ్నిదేవుడు సాధువు దగ్గరికి వెళ్లి ‘నువ్వెవరివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ అని దర్పంగా అడిగాడు. సాధువు అగ్నిదేవుడికి సమాధానం చెప్పకుండానే ‘అసలు నువ్వెవరు?’ అని ఎదురు ప్రశ్న వేశాడు. అగ్నిదేవుడు బిగ్గరగా నవ్వి ‘నేనెవరో తెలియదా నీకు? నాపేరు అగ్నిదేవుడు’ అన్నాడు దర్పంగా. ‘అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు’ అని అడిగాడు సాధువు. ‘ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మసి చేసెయ్యగలను’ అన్నాడు అగ్నిదేవుడు విర్రవీగుతూ. సాధువు ఒక గడ్డిపోచని కింద పెట్టి ‘దీన్ని మసి చేసి చూపించు!’ అన్నాడు. ‘ఓస్.. ఇంతేనా!’ అనుకుని వేడిగా ఉండే తన ఊపిరితో గడ్డిపోచని కాల్చి మసి చెయ్యాలని గట్టిగా ఊదాడు. ఎంత ఊదినా అది మాడలేదు. మంటల్ని సృష్టించి దాన్ని మాడ్చాలని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డిపోచ కాలలేదు. అగ్ని సిగ్గుపడి తల వంచుకుని నీరసంగా మిగిలిన దేవుళ్ల దగ్గరికి వెళ్లాడు. జరిగిన విషయం చెప్పాడు. ఈసారి దేవుళ్లందరూ మాట్లాడుకుని వాయుదేవుణ్ణి సాధువు దగ్గరికి పంపించారు. వాయుదేవుడు సాధువు దగ్గరికి చేరాడు. ‘ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ అని అడిగాడు. అది విని సాధువు సమాధానం చెప్పకుండా ‘అసలు నువ్వు ఏం చేస్తుంటావు? నీకు ఉన్న శక్తి ఏమిటి?’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ‘నా పేరు వాయువు. నేను వాయుగుండాలు, తుపాన్లు సృష్టించగలను’ అన్నాడు ధీమాగా. సాధువు ఒక గడ్డిపోచ తీసి కింద పెట్టి, ‘అయితే నీ బలంతో దీన్ని కదుపు’ అన్నాడు. వాయుదేవుడు దాన్ని చూసి ‘ఇంతేనా!’.. అనుకుని తన శక్తినంతటినీ దానిపై ఉపయోగించాడు. కాని ఆ గడ్డిపోచ ఏమాత్రం కదల్లేదు. షాకయ్యాడు. సిగ్గుపడి వెనక్కి వెళ్లిపోయాడు. జరిగిన విషయం మిగతా దేవుళ్లకి చెప్పాడు.
ఈసారి సాధువు సంగతేమిటో తెలుసుకుని రమ్మని వాళ్లు ఇంద్రుణ్ణి పంపించారు. తమ దేవుళ్లకి సహాయం చెయ్యడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్లగానే సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు. ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకీ చూస్తున్నాడు. తను వచ్చిన పని పూర్తి చెయ్యాలంటే సాధువు కనిపించాలి. అంతలో అక్కడ సాధువుకి బదులు ఒక దేవత ప్రత్యక్షమైంది. ఇంద్రుడు దేవతని చూసి ‘ఇంతవరకు ఇక్కడ ఉన్న సాధువు ఎవరు? ఏమయ్యాడు?’ అని అడిగాడు. దేవత ‘ఇంద్రా! అతడే అసలు దేవుడు. మీరందరూ భగవంతుడి సహకారం లేకుండా ఏ పనీ జరగదు అనే విషయాన్ని మర్చిపోయారు. రాక్షసుల్ని ఓడించడానికి మీకున్న బలమే కారణం అనే భ్రమలో ఉన్నారు. మీకందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడని, అతడి వల్లే మీరు కూడా అన్ని పనులూ చెయ్యగలుగుతున్నారని తెలుసుకోలేకపోయారు. ఆయన సహకారం లేనప్పుడు గడ్డిపోచని కూడా కదిలించలేకపోయారు. అది తెలియ చెప్పడానికే భగవంతుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్లల్లో నువ్వు మొదటివాడివి. నీ తరువాత అగ్ని, తరువాత వాయువు’ అని చెప్పి వెళ్లిపోయింది దేవత.
అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, తరువాత అగ్ని, తరువాత వాయువు అని చెప్తుంటారు. రాక్షసుల్ని చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్లకి దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు ఒక్కడే అన్నమాట. దేవుడు ఏ రూపంలో ఉంటే మనకి ఇష్టమో ఆ రూపంలో మనం దేవుణ్ణి కొలుస్తున్నాం. ఎవరికీ కనిపించని ఆ దేవుడు మంచివాళ్లని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. మతాలు ఎన్ని ఉన్నా.. రూపాలు, పేర్లు ఎన్ని ఉన్నా.. మేమే దేవుళ్లం అని ఎంతమంది చెప్పుకున్నా కూడా దేవుడు మాత్రం ఒక్కడే అని ఈ కథ ద్వారా తెలుస్తోంది కదా! అందుకని మనమందరం పెద్దవాళ్లమయ్యాక కూడా మంచి బుద్ధులతో మంచి పనులు చేస్తూ కలిసిమెలిసి ఉందాం!’ అని తను చెప్తున్న కథని ముగించాడు రాము. స్నేహితులంతా ఆనందంతో చప్పట్లు చరిచి రామును మరింతగా ప్రోత్సహించారు.

- భమిడిపాటి
బాలాత్రిపురసుందరి,
విజయవాడ.
చరవాణి : 9440174797

చిన్న కథ

బాలుడి తెలివి!

గాలిలోకి ఎగరేసిన వస్తువు నేల మీద పడటానికి కారణం భూమ్యాకర్షణ శక్తి. ఆ శక్తి వల్లనే మనం నడవగలుగుతున్నాం. లేకపోతే గాలిలో తేలిపోయేవాళ్లం. అయితే ఆ భూమ్యాకర్షణ శక్తి కొంత ఎత్తువరకే ఉంటుంది. అంతరిక్షంలో ఉండదు. కొందరు వ్యోమగాముల బృందం అంతరిక్షంలో పరిశోధనలు చేయటానికి వెళ్లారు. బృంద నాయకుడు ముఖ్యమైన పాయింట్లు పుస్తకంలో రాసుకుందామని ప్రయత్నించాడు. కానీ భూమ్యాకర్షణ శక్తి లేకపోవటం వల్ల పెన్‌లోని ఇంక్ వెనక్కు వెళ్లిపోయింది. రాయటానికి వీలుకాలేదు. ‘ఇంతదూరం వచ్చి ఏం సమాచారం లేకుండా వెళ్లవలసి వస్తున్నదే!’ అని బాధపడి అందరూ చాలా రోజులు శ్రమపడి ఒక ప్రత్యేకమైన పెన్ తయారు చేశారు. దాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి భూమి మీదకు తిరిగొచ్చారు. వారి అధికారులను, సహచరులను సమావేశపరిచారు. బృంద నాయకుడికి పది సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నాడు. సమావేశానికి తాను కూడా వస్తానని ఆ బాలుడు మారాము చేశాడు. సరేనని అతన్ని కూడా వెంటబెట్టుకొచ్చాడు. బృంద నాయకుడు సమావేశంలో ‘మేము ఒక ప్రత్యేకమైన పెన్ తయారు చేశాము. దీని ప్రత్యేకత ఏమిటంటే అంతరిక్షంలో కూడా దీనిలోని ఇంక్ ముందుకే ప్రవహిస్తుంది. దీని ఫార్ములాతో అనేక పెన్‌లు తయారు చేసి పరిశోధనలకు వెళ్లినప్పుడు మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. దీన్ని మేం చాలారోజులు శ్రమపడి తయారు చేశాము’ అని వివరించాడు. అదంతా వింటున్న బాలుడు ‘ అంత కష్టపడటం దేనికి డాడీ! ఒక పెన్సిల్ తీసుకెళ్లి రాసుకోవచ్చు కదా!’ అన్నాడు. ఆ మాటలు విన్న బృందం అవాక్కయింది.

- గోనుగుంట మురళీకృష్ణ, రేపల్లె, చరవాణి : 9701260448

పుస్తక పరిచయం

రసపరిపాకం..
‘కో.క.కవుల’ శతావధానం!

ఓ పర్యాయం ఓ శతావధాన సభలో ఓ జంట కవులకు పృచ్ఛకులొకరు ‘చీమ, దోమ, నల్లి, పేను’ అన్న పదాలనిచ్చి, శ్రీకృష్ణుని రాయబారాన్ని ఉత్పలమాల పద్యంలో వర్ణించమన్నారు. అప్పుడు వారు -
‘‘చీ!మ’తి చెడ్డదేల? తమసేమము నారయజాలదేల? ఏ
‘దోమ’మకారమెట్లు మిము దోషపు మార్గమునందు నిల్పెనే
ప్రేమను జూపి వారు మును‘పేను’తికెక్కిరి పాండుపుత్రులా
భీమ బలాఢ్యులాలమున వేయరెమ్మిమ్ముల‘నల్లి’బిల్లిగన్’!
అని దూతయైన శ్రీకృష్ణుడు సుయోధనాదులతో చెబుతున్నట్లుగా పూరించారు. చీమ-చీ!మతి చెడ్డదనీ, దోమ-ఏదో మమకారమనీ, పేను-మునుపేనుతికెక్కిరి అని, నల్లి-మిమ్ములనల్లిబిల్లిగన్ అనీ అర్థాలను మారుస్తూ ఆ ఇచ్చిన పదాలనే ఉపయోగిస్తూ సహజ సుందరంగా ఉత్పలమాలను పరిమళింపజేశారు. అలా చేసిన జంటకవులు శ్రీ కడిమిళ్ల వరప్రసాద్, శ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహం గారలు. ఈ దత్తపదినిచ్చిన వారు - శ్రీ తోటేటి పార్థసారథిగారు- నరసాపురం. అవధానం జరిగిన ఊరు తాడేపల్లిగూడెం. తెలుగు సాహితీ సమాఖ్య వారి ఆధ్వర్యంలో. 2002 నవంబర్ 9, 10 తేదీల్లో జరిగిందిది. ఆ అవధానంలో శ్రీ ఏలూరుపాటి ఆంజనేయ శర్మగారు (ఏలూరు) ఐ, లవ్, యూ, కో.క’ అనే పదాల్నిచ్చి, భారతగాథలోని పద్మవ్యూహాన్ని ఉత్పలమాలలో వర్ణించమన్నారు. వెంటనే ఆ అవధానులొక్కొక్కరొక్క పాదం చొప్పున ఇలా పూరించారు.
‘ఆలము మించిపోయినది ‘ఐం’దవ కాంతులు సన్నగిల్లె, మా
పా‘లవు’ నా జయమ్మనుచు వారును వీరును చర్చసేయ నా
బాలుడు తమ్మిమొగ్గరము పాల్పడి ఆయువు గోలుపోయె; కా
కోలము ధర్మపాలన మొ‘కో!క’రవాయెను భ్రాతృబంధముల్’!
పై పద్యంలో ఇచ్చిన పదాలను అత్యద్భుతంగా అర్థ్భేదంతో చక్కగా ఒదిగించారు. ఆంగ్లంలోని ‘యూ’- పూరణలో ‘ఆయువు’ అన్నచోట హ్రస్వమయింది. అదేమీ దోషం కాదు. ఇందులో ‘కో.క’ అంటే కోట - కడిమిళ్ల కవులన్న అర్థంలో ఇచ్చిన సంక్షిప్త పదం. దీన్ని దత్తపదిలో ఇవ్వడం ఒక చమత్కారం. ‘్ధర్మపాలనమొకో! కరవాయెను’ అని ‘కో.క’ను విడగొట్టి ‘కో.క.’ కవులు పూరించటం మరో చమత్కారం.
ఇక సమస్యల విషయానికొస్తే...
‘బ్రాలంగైకొను వేగమందు భువిలో పైచేయి మాదేగదా!’ అని ఈ వ్యాసకర్త ‘బ్రా’ అనే ఆంగ్ల పదంతో ఇచ్చిన సమస్యా పద్యపాదాన్ని సీతారామ కల్యాణపరంగా ఈ జంటకవులెలా పూరించారో చూడండి.
‘లీలామానుష విగ్రహోత్తముని పెండ్లింజూచు నవ్వేళ ము
త్యాలన్ బళ్లెరమందు పెట్టిరట కాంతారత్నముల్ వేడ్క; సం
ద్రాలన్ దాటగ ముచ్చటించుకొనిరౌరా! పెండ్లియందున్; దలం
బ్రాలన్ గైకొను వేగమందు భువిలో పైచేయి మాదేగదా!’
అని ప్రేక్షకులనుకున్నట్లుగా ‘బ్రా’లను ‘తలంబ్రాలన్’ అని అచ్చ తెలుగుపదంగా మార్చేశారు - పూరణపద్యంలో. అది వీరి ప్రతిభా చమత్కారం. శ్రీ పి ఆనంద్ (కాకినాడ) గారిచ్చిన ‘ఆరునుకోరి మూటికొరకై పదకొండున కంగలార్చెడిన్’ అన్న సమస్యకు మూడవ రాశి మిథునం, ఆరవ రాశి కన్య, పదకొండవ రాశి కుంభం కాబట్టి అవి స్ఫురించేలా జ్యోతిష్ష్యాస్తప్రరంగా పూర్తిచేసి తమ ప్రతిభా వ్యుత్పత్తులను చాటుకున్నారీ జంటకవులు.
వర్ణనలు: కొత్తగా అత్తవారింటికి చేరుతున్న వధువు మానసిక స్థితిని మత్తకోకిల వృత్తంలో వర్ణించమని శ్రీమతి కనకవల్లిగారు కోరగా..
‘మెట్టినింటికి చేరబోవుట మీదుమిక్కిలి ముచ్చటే
పుట్టినింటిని వీడలేనిక మోదమెట్టులు కల్గునో
అట్టులిట్టుల నిట్టులట్టుల నంతరంగమె యూగెనే
చెట్టపట్టినవాడి కన్నులు చేయుచుండెను సైగలున్’
అని రసరమ్యంగా పూరించారు. అలాగే జీలుగుమిల్లికి చెందిన శ్రీ సుంకర వెంకట్రామయ్యగారు తెలుగుతల్లిపై అచ్చ తెలుగులో కందపద్యాన్ని కోరగా- వీరు అందంగా మాకందంగా పూరించారు. ఇలా పదమూ, భావమూ, పద్యధారా, ధారణా ఎదలో ఎదలా - కవి పండితుల మనస్సులనే కనులకు పంటగా సాగింది - ఈ జంటకవుల శతావధానం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ‘కో.క’ కవుల శతావధానం రసపరిపాక హేవాకం (విలాసం!)

డా. రామడుగు వేంకటేశ్వర శర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

మనోగీతికలు

అందని ద్రాక్షలు
పసికందుల మీద పచ్చకళ్ల
రాకాసుల కరాళ నృత్యం
సాటి ఉపాధ్యాయులపై
కపట అలౌకిక వివక్షల
విషం చిమ్ముతున్న సర్పాలు
దిష్టి పిడతల డూడూబసవన్నల పాలనలో
కపాలాల కళ్లల్లో పొంచివున్న
రెండుకోరల సూత్రధారులు
సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్లుకాదు విద్యార్థులు
నువ్వు తుంచటానికి..
నీ ఇంటి పెరట్లో
తులసిమొక్కలు కాదు వాళ్లు
సిమెంట్ పూతలు పూయటానికి..
విద్యావనంలో 40 దిక్కులకు విస్తరించే
చిరుతలు, బుడతలు వాళ్లే!
మానవ వనరులు, దేశ భాగ్యసిరులు,
ప్రగతి సౌభాగ్యాలు
వాళ్లూ గువ్వల్లా తుర్రుమంటారు
గవ్వల్లా మెరుస్తారు
కోయిల్లా కూస్తారు కాకుల్లా గోలచేస్తారు
లేడిలా గంతులేస్తారు కూనల్లా కులుకుతారు
రాగాలు తీస్తారు, మారాం చేస్తారు
గారాలు పోతారు ఈ ప్రపంచంలో!
మనకు తెలిసీ
ఒకేఒక్క సౌందర్య తత్వశాస్త్రం పేరే ‘పిల్లలు’
డ్రాప్‌అవుట్ స్టూడెంట్ దయనీయ పరిస్థితులు
బాల్యవివాహాలు ఒకవైపు
కిమ్మనకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా
టీచర్ల వ్యవస్థ - ఇదీ మన ప్రోగ్రెస్ రిపోర్ట్!
ప్రేక్షక పేరంటాళ్ల ముత్తయిదువుల
మీనమీషాల వేషధారణలు మరోవైపు
చెవిటోడి ముందు శంఖం వూదటం
నటించేవాడ్ని నిద్రలేపటం
‘బెల్‌బాటాల్లా, ‘టైం బాంబుల్లా
ఆటోమాటిక్ వాల్‌క్లాక్’ కిక్కుల్లో
కార్తీక మాసాల కాస్మోపాలిటన్
పులిహోర భోజనాలు
హైజనిక్ ఆడంబర జీవన దబ్బనాలు
మన విద్యాప్రమాణాలు!
విద్యార్థుల జ్ఞాన మీమాంసను
నోటకరుస్తున్న శునకాలు
పిల్లల సహజాత జలాల్ని కొట్టేస్తున్న
హైటెక్ టక్కులమారీలు
బాల్యరేఖకు అడ్డంగా నీ తూనికరాళ్లతో
కార్పొరేట్ పనిష్మెంట్లా!?
పిల్లలకు అర్థమయ్యే భాషలోనే
‘వాచకం’ వుండాలి
వాచకాన్ని మించిన ‘వాక్కు’ వుండాలి
ప్రథమ అమోఘ సూర్యుడిలా
పిల్లల మనసులు గెలవాలి
అందని ద్రాక్షగుత్తుల్లా కాకుండా!
కసరత్త్తు చేయాలి
పిల్లల హృదయ ద్వారాలకు కట్టిన
పచ్చని తోరణాలుగా వుండాలి టీచర్లు
నదికి తెలీదా నడిచే దారేదో?
తల్లి స్పర్శ లేకుండానే కదులుతాయా
పిల్లకాలువలు ఎక్కడన్నా!?
నాకు చిన్నప్పుడే సముద్ర మనస్తత్వాన్ని
వదిలేసిపోయారు
నేనిప్పుడు సముద్ర గర్భాన్ని..
(ప్రభుత్వ, ప్రైవేట్ విద్యారంగంలో పిల్లల పట్ల
కొందరు ఉపాధ్యాయుల తీరుతెన్నులు చూశాక)

- సరిశాసి (నీలం సర్వేశ్వరావు), కంచికచర్ల, కృష్ణా జిల్లా. చరవాణి : 9391996005

ప్రియా..!
చంద్రుని కోసం
వేచే కలువలా
అనుక్షణం ఆరాధిస్తాను
మధువు కోసం
చూసే తుమ్మెదలా
ప్రతిక్షణం నిరీక్షిస్తాను
నీ తలపులతో
నా హృదయం
పులకిస్తుంది
నది నిండా నీరున్నది
నా మదినిండా
నీవున్నావు
నీ నవ్వులు సిరులై
నా ముంగిట నిలవాలి
నీ ప్రేమే నా ప్రాణం
నీ మనసే నా ధ్యానం
నీ ప్రేమతో నీ ప్రేమలో
నీ ప్రేమకై జీవిస్తాను!

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం,
తెనాలి. చరవాణి : 9848297711

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- భమిడిపాటి బాలాత్రిపురసుందరి