బిజినెస్

ప్రగతి లేని విశాఖ పారిశ్రామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 9: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని దేశ దేశాలూ తిరుగుతున్నారు. పారిశ్రామిక రాజధాని అయిన విశాఖకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలన్నది సీఎం ఆకాంక్ష. గడచిన మూడేళ్ళలో రెండు సిఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులకు హాజరయ్యారు. ఈ రెండు సదస్సుల్లో సుమారు 14 నుంచి 17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా చేసుకున్నారు. కానీ, నేటికీ ఒక్క కొత్త కంపెనీ కూడా విశాఖలో కనీసం భూమి పూజ కూడా చేయలేదు.
విశాఖ-చెన్నై కారిడార్: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌పై కొంత కాలం కిందట వేగంగా అడుగులు పడ్డాయి. ఆ తరువాత ఈ కారిడార్ గురించి మాట్లాడే పెద్దలు కనిపించడం లేదు. ఈ కారిడార్ వస్తే, వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు భావించారు. కానీ, ఈ కారిడార్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది.
కోస్టల్ కారిడార్: సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖ-కాకినాడ మధ్య కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ కారిడార్‌ను ఇప్పటికీ అవరోధాలు వెంటాడుతునే ఉన్నాయి.
అడుగు ముందుకువేయని ఐటీ: విశాఖను ఐటీ హబ్‌గా మార్చాలన్న సంకల్పానికి అనుకున్న స్థాయిలో ఫలితాలు కనిపించలేదు. ముఖ్యంగా రుషికొండ హిల్-3లో 10 ఎకరాల్లో సిగ్నేచర్ టవర్ నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనివార్య కారణాల వలన టవర్ నిర్మాణ బాధ్యతలను వేరేవారికి అప్పగించాల్సి వచ్చింది. మిలీనియం టవర్ కూడా కొలిక్కి రాలేదు. రుషికొండలోని ఇంక్యుబేషన్ సెంటర్‌కు వచ్చేందుకు స్టార్టప్ కంపెనీలు కూడా ముఖం చాటేస్తున్నాయి.
పర్యాటక ప్రాజెక్టులు: విశాఖ నగరానికి గడచిన మూడున్నర సంవత్సరాల్లో ఒక్క పర్యాటక ప్రాజెక్ట్ కూడా రాకపోవడం దురదృష్టకరం. లక్షల కోట్ల ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితం అయిపోయాయి.
రోడ్డున పడుతున్న కార్మికులు: ఉన్న కంపెనీల్లో నో వేకెన్సీ బోర్డు దర్శనమిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలకు ఆస్కారం లేకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. హిందుస్థాన్ జింక్ మూసివేతతో వందలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణకు సిద్ధమవుతోంది. ఇదే జరిగితే, అందులోని కార్మికుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారబోతోంది. ప్రస్తుతం విశాఖలో ఉన్న పబ్లిక్‌రంగ సంస్థలు కూడా నష్టాల బాటలో నడుస్తున్నాయి. నోట్ల రద్దు, జీఎస్‌టి ప్రభావంతో గాజువాక ఆటోనగర్‌లోని పరిశ్రమలతో పాటు, జిల్లా నలుమూలలా ఉన్న చిన్నతరహా పరిశ్రమలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. అలాగే ఫార్మాసిటీలో ఉన్న కంపెనీల్లో చాలావరకూ భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరిచి, వారి దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించి, త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కానీ అధికారులు నిర్లిప్తంగా పనిచేయడం వలన సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్నిచోట్ల స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు కొత్తగా వచ్చే కంపెనీ యాజమాన్యాల నుంచి ఎంతో కొంత ఆశించడం వలన కూడా పారిశ్రామికవేత్తలు విశాఖ వచ్చేందుకు ఇబ్బందిపడుతున్నారని తెలుస్తోంది.
అన్నీ అక్కడే: విశాఖకు భారీ కర్మాగారాలు రాకుండా నెల్లూరు, అనంతపురం జిల్లాలకు తరలిపోవడం పట్ల స్థానిక ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లు గడిచినా ఒక్క కొత్త కంపెనీ కూడా విశాఖకు రాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ జనానికి ఈ విషయంలో ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎయిర్ కనెక్టివిటీ శాపం: ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడం వలన చాల మంది పారిశ్రామికవేత్తలు విశాఖకు రావడం లేదని తెలుస్తోంది. బెంగళూరు, చెన్నై ఎయిర్‌పోర్టులకు మధ్యలో శ్రీసిటీ ఉండడం వలన అక్కడ జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి ఈ ప్రాంతంలో జరగడం లేదన్న విషయం అర్థమవుతోంది. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆరితేరిన చంద్రబాబు విశాఖ విషయంలో మరింత పట్టుదలతో ఉండాలన్నది స్థానికుల ఆకాంక్ష.