బిజినెస్

* రెండోరోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయికి దిగజారడం, ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనల మధ్య ఫైనాన్సియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురికావడం వల్ల మార్కెట్ కీలక సూచీలు గురువారం పడిపోయాయి. ఆగస్టు నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) కాలపరిమితి గురువారంతో ముగియడం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందడం వల్ల దేశీయ మార్కెట్లలో మదుపరులు కూడా అప్రమత్తంగా వ్యవహరించారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం 33 పాయింట్లు (0.08 శాతం) పడిపోయి, 38,690 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ గరిష్ఠ స్థాయి 38,819.06, కనిష్ట స్థాయి 38,581.83 పాయింట్ల మధ్య కదలాడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 15 పాయింట్లు (0.13 శాతం) పడిపోయి, 11,677 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 11,698.80- 11,639.70 పాయింట్ల మధ్య కదలాడింది. మదుపరులు దీర్ఘకాలికంగా తమ వద్ద ఉన్న ఎఫ్‌అండ్‌ఓ సెగ్మెంట్‌లోని బెట్స్‌ను సెప్టెంబర్ నెల సిరీస్‌కు పొడిగించుకోకుండా వదులుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇది మార్కెట్‌లో ఊగిసలాటను పెంచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గురువారం ఇంట్రా-డేలో సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 70.85 మార్కుకు పడిపోవడం కూడా స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి దారితీసింది. అమెరికాలో ముడి చమురు నిల్వలు పడిపోవడం, ఇరాన్, వెనిజులా నుంచి ముడి చమురు సరఫరాలకు ఆటంకాలు కలుగుతాయనే ఆందోళనల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బారెల్‌కు 77 డాలర్లకు మించిపోవడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మదుపరులు శుక్రవారం వెలువడనున్న ఏప్రిల్-జూన్ త్రైమాసిక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలవైపు తమ దృష్టిని మరల్చారు. ఈ గణాంకాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ ధోరణిని నిర్దేశించనున్నాయి. జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.6 శాతం వృద్ధి రేటుతో పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలే నిజమయితే, స్టాక్ మార్కెట్లకు ఊరట కలుగుతుంది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం నికరంగా రూ. 1,415.87 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 1,114.36 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ గురువారం అత్యధికంగా 1.62 శాతం నష్టపోయింది. మారుతి సుజుకి కూడా 1.62 శాతం నష్టపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో ఆసియన్ పెయింట్స్, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐ, అదాని పోర్ట్స్, ఎల్‌అండ్‌టీ ఉన్నాయి. మరోవైపు, సన్ ఫార్మా అత్యధికంగా 3.03 శాతం లాభపడింది. రూపాయి విలువ పడిపోవడంతో ఔషధాలను ఎగుమతి చేస్తున్న ఫార్మా కంపెనీల షేర్లకు మదుపరుల నుంచి ఆదరణ లభించింది. లాభపడిన ఇతర సంస్థల్లో టాటా స్టీల్, ఐటీసీ లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, వేదాంత, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.