మెయిన్ ఫీచర్

యుగపురుషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్టోబర్ 2వ తేదీ మహోన్నత వ్యక్తులైన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తిల జన్మదినమవడం గొప్ప విశేషం.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తి ల దేశభక్తి గురించి తెలుసుకుందాం..

‘‘మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ’’ 1869 అక్టోబరు 2న గుజరాత్ లోని పోర్‌బందర్లో సామాన్య సంప్రదాయక కుటుంబములో జన్మించారు.
లాల్ బహదూర్ శాస్ర్తి వారణాసిలోని రామనగర్‌లో తన తాతగారింట సామాన్య కాయస్థ హిందూ కుటుంబంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు.
ఇద్దరూ జన్మించినది సామాన్యకుటుంబాలలోనే. ఇద్దరూ దేశసేవకి జీవితాల్ని అంకితం చేశారు. ఇద్దరి వయసులో 35 సంవత్సరాలు తేడా వున్నప్పటికీ మహాత్మాగాంధీ దేశ ప్రజలందరినీ ఒకే తాటిమీద నడిపించి పరాయి సంకెళ్ళనుంచి విముక్తుల్ని చేస్తే, శాస్ర్తిగారు స్వాతంత్య్ర పోరాటంలో భాగస్థులై స్వతంత్ర భారతదేశానికి నెహ్రూ తరవాత ప్రధానమంత్రిగా దేశ ప్రజలకి చేసిన సేవ ఎనలేనిది. ఇద్దరి దేశభక్తిలో ఎంతో సామ్యముంది. మహాత్మా గాంధీ కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.
శాస్ర్తి కుటుంబానికి ఏ విధమైన స్వాతంత్య్రోద్యమ నేపథ్యం లేనప్పటికీ అతను చదివే హరిష్ చంద్ర హైస్కూల్ లోని ఉపాధ్యాయులలో ఒకరైన నిశే్మమేశ్వర ప్రసాద్ మిశ్రా ద్వారా దేశభక్తి కలిగింది. ఆ ఉపాధ్యాయుడు అతని పిల్లలకు శాస్ర్తిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం చేసేవాడు. మిశ్రా దేశభక్తిని ప్రేరణగా పొందిన శాస్ర్తి, స్వాతంత్య్రోద్యమంపై మక్కువ పెంచు కున్నాడు. మహాత్మాగాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మాగాంధీకి, తరువాత జవహర్‌లాల్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు.
గాంధీ దక్షిణాఫ్రికాలో కేవలం తెల్లవాడు కాకపోవడం వలన ఎదుర్కొన్న జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనాసరళి పరిపక్వం కావడానికీ, రాజకీయ విధి విధానాలు రూపుదిద్దుకోవడానికీ ఇది అనువైన సమయమైంది. ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్ర్తి ఇద్దరూ రైతులకి జరిగే అన్యాయాలపట్ల పోరాటాలు చేశారు. ఇద్దరి పోరాటాల్లో రైతులకి న్యాయం జరిగింది. బీహారులోని వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులూ ఆహార పంటలు వదలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికమూ, దురాచారాలూ, మురికివాడలూ ఎక్కువగా ఉన్నాయి. తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. గుజరాత్ లోని ఖేడాలోనూ ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించారు.. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగమయ్యాయి. ఉక్కుమనిషిగా పిలవబడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలిచాడు. వేలాది గా ప్రజలు జైలుకు తరలి వెళ్ళారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై ఆయనను అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయి. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో ‘‘బాపు’’ అనీ, ‘‘మహాత్ముడు’’ అనీ పిలుచుకోసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి. ఇది స్వాతంత్య్రోద్యమానికి ఆరంభ దశ అయింది.
1964 జూన్ 11న లాల్ బహదూర్ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ వ్యాప్తంగా దీర్ఘకాలిక ఆహార కొరత గురించి మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ఒక భోజనాన్ని ఇవ్వాలని కోరారు. దీనివల్ల ఆహార కొరత గల ప్రజలకు కూడా ఆహారం దొరుకుతుందని తెలియజేసారు. అయితే దేశానికి విజ్ఞప్తి చేసే ముందు అతను మొదట తన సొంత కుటుంబంలో దీనిని అమలు చేసి చూపించారు. వారంలో ఒక భోజనాన్ని వదిలెయ్యడమనే అభ్యర్థనను ప్రజలకు తెలియజేయడానికి అతను దేశమంతా పర్యటించారు. ఆయన విజ్ఞప్తికి విశేషమైన ప్రతిస్పందన వచ్చింది. దీని ఫలితంగా రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ప్రతీ సోమవారం సాయంత్రం మూసేశారు. దేశంలోని అనేక ప్రాంతాలు ‘‘శాస్ర్తి వ్రత్’’ను పరిశీలించాయ. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో రైతులకి, ప్రజలకి ఏవిధమైన లాభం చేకూరుతుందో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రేరణ కలిగించారు. ఇది శాస్ర్తిగారి మీద ప్రజలలో ఆదరణ పొందడానికి మొదటి మెట్టు అయింది.
1965 అక్టోబరు 19న పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో 22వ రోజున అతను అలహాబాదులోని ఉర్వాలో ప్రభావశీలమైన ‘‘జై జవాన్ జై కిసాన్’’ (సైనికుల కు అభినందనలు, రైతులకు అభినందనలు) నినాదాన్నిచ్చాడు. అది తరువాత జాతీయ నినాదమైనది. భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) అతను బాటలు వేసారు. 1964 ఫుడ్ కార్పొరేషన్ చట్టం ఆధ్వర్యంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడినది. తరువాత నేషనల్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బోర్డ్ చట్టం కూడా ఏర్పడినది. ప్రధానమంత్రిగా శాస్ర్తి గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
నాయకత్వంలో పటిష్ఠత కలిగిన మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్ర్తి కూడా పాకిస్తాన్ దుశ్చర్యలవలనే మరణించటం విచారకరం. గాంధీ దృష్టిలో స్వాతంత్య్రం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరాని తనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూముస్లిములు తగవులాడుకొం టున్నచోట స్వాతంత్య్రమున్నదనుకోవడంలో అర్థం లేదని చెప్పారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహము ఆయన ఆయుధాలయ్యాయి. క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా అరెస్టయిన గాంధీజీని అనారోగ్య కారణం గాను, అదే సమయంలో ఉద్యమకారుల్ని కూడా విడుదల చెయ్యడం జరిగింది. క్రమంగా స్వాతంత్య్రం ఇస్తామని అంగీకరించారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం ప్రకటించారు. కానీ జిన్నా - ‘‘దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి’’ అని హెచ్చరించాడు. చివరకు హిందూ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యం తరము లేదనుకున్నారు. ఈ విషయం గాంధీని బాగా కుంగదీసింది. విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తాన్‌కు ఇవ్వవలసిన 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్ వంటి నాయకుల అభిప్రాయం. కానీ అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్ధానికి దారితీస్తుందనీ గాంధీ అభిప్రాయం. ఈ విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆయన డిమాండ్లు రెండు - (1) మత హింస ఆగాలి (2) పాకిస్తాన్‌కు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తాన్‌కు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు.
1965 ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్ర్తి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్ర్తిగారిపై అమెరికా తీవ్ర ఒత్తిళలు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయి కి చేరిన సమయంలో పాకిస్థాన్ - అమెరికా, భారత్ - అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. 1965లో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత, శాస్ర్తి, అయుబ్ ఖాన్ తాష్కెంట్‌లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 1966 జనవరి 10న శాస్ర్తి, ఆయూబ్ ఖాన్ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్‌లోని టాష్కెంట్లో ఒప్పందంపై సంతకం చేసి అక్కడే మృతిచెందారు. ఇది సహజ మరణమా... హత్యా అనే విషయాలపై ఇప్పటికీ వివాదాస్పదంగానే వుంది. లాల్ బహదూర్ శాస్ర్తి పరిపాలనా కాలంలో 1955లో మద్రాసులో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగింది. భారతీయ ప్రభుత్వం చాలాకాలంగా భారతదేశ ఏకైక జాతీయ భాషగా హిందీని స్థాపించడానికి ప్రయత్నం చేసింది. ఈ విధానాన్ని హిందీ భాషేతర ప్రాంతాలైన ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం వ్యతిరేకించింది. పరిస్థితిని శాంతింపజేయడానికి శాస్ర్తి హిందీ భాష మాట్లాడని రాష్ట్రాలలో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉపయోగించబడుతుందనే హామీ ఇచ్చాడు. రవాణా మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా మహిళా కండక్టర్లను నియమించాడు. పోలీసు మంత్రిగా అతను పోలీసులు ఎక్కువగా ఉన్న జన సమూహాలను పారద్రోలేటందుకు లాఠీఛార్జ్‌కు బదులుగా వాటర్ జెట్‌లు వాడాలని ఆదేశించాడు. ఇద్దరు నాయకులూ దేశానికి ఎనలేని సేవ చేశారు. లాల్‌బహదుర్ శాస్ర్తి ఎప్పుడూ తన పుట్టినరోజు చేసుకోకుండా మహాత్మాగాంధీ పుట్టినరోజు చేసేవారట. ఈరోజు చాలామందికి లాల్ బహదూర్ శాస్ర్తి ఎవరో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతోంది.

- నాగలక్ష్మి దామరాజు