రివ్యూ

ఏ’కే ఓకే కాలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్త కర్మ క్రియ * బాగోలేదు
*
తారాగణం: వసంత సమీర్, సెహర్, నూతన్‌రాజ్, కాశీ విశ్వనాథ్, కాదంబరి కిరణ్, రవివర్మ.
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: చదలవాడ పద్మావతి
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగు గవర
*
‘ముందేం జరుగుతుందో’ అన్న ఉత్కంఠరేపే కథా వస్తువుని చిత్రానికి ఎన్నుకుంటే సంబంధితులు దానికోసం అనుసరించే పద్ధతుల్ని సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ముందు జరగబోయే సన్నివేశాల బాపతు క్లూ కూడా అందకుండా సన్నివేశాల్ని సృష్టించడం ఒక విధానం. రెండో పద్ధతిలో ముందు జరగబోయే సీన్ల తాలూకు ఆధారం అందించినా, దాన్ని మరింత ఆసక్తిదాయకంగా చిత్రాన్ని మలచడం. ఈ బాపతు సస్పెన్సు కథా విధానాన్ని ఎంచుకున్నా, ఏ మాదిరి ఉత్కంఠను రేకెత్తించే ఛానే్స లేకుండా చిత్రించిన చిత్రం -కర్త కర్మ క్రియ.
సెల్‌ఫోన్సు రిపేర్ చేసే సిద్ధు (వసంత్ సమీర్) తన వద్దకు బాగుచేయమని తెచ్చే వాటిలోని అసభ్య సన్నివేశాలను సేకరించి సదరు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ ప్రక్రియలో అపవాదు పాలవుతానేమోనన్న ఆవేదనతో దివ్య (నూతన్‌రాజ్) ఆత్మహత్య చేసుకుంటుంది. అలాగే సిద్ధు బారినపడి మహాలక్ష్మి, కల్యాణికూడా ఆత్మహత్య బాటనే ఎంచుకుంటారు. మరి ఇలాంటి ఆత్మహత్యలకు కర్త కర్మ క్రియ ఎవరనే ప్రశ్నకు సమధానం చెప్పడమే సినిమా కథా వస్తువు. ఎంచుకున్న పాయింట్ ఎత్తుకోగానే దాని కర్త ఎవరో, వగైరా చూపరులకు తెలిసిపోతూనే ఉంటుంది. చివరకు కొండను తవ్వి ఎలుకను తీసినట్టయ్యింది. మరి దీంట్లో ఏరకపు థ్రిల్‌ను దర్శకుడు నాగు గవర ప్రేక్షకులనుంచి ఆశించారో అర్థంకాదు. దాన్ని ఎలాగో అలాగ సరిపెట్టుకున్నా, సన్నివేశాల తీరులోనే బోల్డంత అసహజత్వం రాజ్యమేలింది. ఉదాహరణకి నిన్నటివరకూ సరిగ్గావున్న ఓ వ్యక్తి ఈ రోజు ఆత్మహత్య చేసుకుని, దానికెవరూ బాధ్యులు కారు అని వాళ్లే రాసేసినంత మాత్రాన దాన్ని అలాగే ఆత్మహత్య క్రింద భావించేసి కేసుని మూసేసే విధానం సాధారణంగా పోలీసు విభాగంలో అనుసరించరు. వీలైనన్ని సమర్థనీయ కోణాల పరిశోధన గావించే ఆ ముగింపుకొస్తారు. కానీ ఇందులో కేవలం ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి రాసేసిన చిన్న చీటీ ఆధారంగానే విషయానికి ముగింపు ఇచ్చేసినట్టు చూపారు. అలా మరో రెండు ఆత్మహత్యలు జరిగిన అనంతరమే స్పెషల్ ఇనె్వస్టిగేషన్ పేరిట క్లోజ్ చేసిన కేసుల్ని తిరిగి తెరిచినట్టు చూపారు. ఇది ఆ శాఖపై అవగాహన లేకుండా సృష్టించేసిన సన్నివేశాల్లా అనిపించాయి. ఇలాంటివన్నీ మొదట ఆత్మహత్య జరిగిన సందర్భంలో చేస్తారు. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించిన సెల్ఫ్ రికార్డింగ్ వీడియో రొమాన్స్‌ని (తమ శృంగార సన్నివేశాల్ని వారే చిత్రించుకోవడం) ప్రస్తావించారు. అసలు నిజమైన ప్రేమికులెవరూ ఇలాంటివాటిని ఆశ్రయించరు. ఒకవేళ ఇదే జరిగితే అందులో మూడో మనిషి ప్రమేయం ఉన్నట్టే. ఈ సినిమాలో సిద్ధు ఆ పని చేయలేదు. మరి ఎవరు, ఏ కోణంలో అది చేసినట్టు చూపితే కొంత లాజిక్ ఉండేది. అలాగే ఒక దశలో సిద్ధు స్నేహితుడు యాది, చనిపోయిన దివ్య, సిద్ధు ప్రేమిస్తున్న మైత్రి (సెహర్) సోదరిగా తెలిసినంతనే విపరీతమైన కంగారుపడినట్టు చూపుతారు. అంతేకాకుండా పోలీసులు, విచారణ అంటూ లింక్ అందిస్తాడు. అది చూసే ప్రేక్షకుడు సిద్ధుపై విపరీతమైన అనుమానం పెంచేసుకుంటాడు. చివరకు అదే నిజమైంది. ఇంక ఎక్కడి థ్రిల్లింగ్? సిద్ధు కుటుంబపరంగా చూసినా కూడా అది ఒక మంచి పద్ధతైన కుటుంబంగా, కుటుంబ పెద్ద (కాశీవిశ్వనాథ్) మంచి మంచి సూక్తులు చెప్పేవాడిగానూ చూపారు. కానీ తొలుత ఓ మోటారు బైక్ కొనడానికే నీకు డబ్బెక్కడిది అని కుమారుడు సిద్ధుని అడిగినట్టు చూపారు. కానీ మరి అదే తండ్రి, ఓ పక్క అబ్బాయి అలా అన్ని అప్పులూ ఒక్కసారిగా తీర్చేస్తుంటే ఆరా తీయడా? అన్న అనుమామూ ఆడియెన్స్‌కొస్తుంది. మరి ఇవేమీ నాగు ఆలోచించినట్టు అనిపించలేదు. సిద్ధు పాత్రలో వసంత్ సమీర్‌కిది తొలి ప్రయత్నమైనా, పాత్ర పరిధిలో బాగానే చేశాడు. ఇంకాస్త ఈజ్ ఉంటే బాగుండేది. మైత్రిగా సెహర్ కొన్ని కోణాల్లో అందంగా ఉంది. దివ్యగా నూతన్‌రాజ్ కన్పించింది కాస్సేపైనా చక్కటి భావప్రకటన చేసింది. సినిమా డైలాగ్స్ గురించి కాస్త చెప్పుకోవాలి. దర్శకుడు తన దృష్టినంతా ఎక్కువగా, ఆయన నిర్వహించిన ఇతర విభాగాలు (కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం) కంటే సంభాషణలమీదే ఎక్కువ పెట్టినట్టు కనపడింది. ‘కారణం లేకుండా పుట్టుక ఉండొచ్చు కానీ మరణం ఉండదు’, ‘మనిషి తన ఆదాయాన్ని రెండింటిపై తప్పకుండా ఖర్చుపెడతాడు- అవి హాస్పిటల్, సెల్‌ఫోన్’- ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడానికి హాస్పిటల్‌కీ, అలా ఆరోగ్యంగా ఉన్నానని అందరికీ చెప్పడం కోసం సెల్‌ఫోన్‌కీ- వంటివి ఇందుకు తార్కాణాలుగా చెప్పచ్చు. అయితే ఒక మనిషి ఎంతగా నరకం అనుభవిస్తే, ఆత్మహత్య చేసుకుంటాడో వంటివి సరైన సంభాషణలు కావు. ఎలాంటి ఆపదొచ్చినా ఆత్మహత్యను ఆశ్రయించకూడదన్న రీతిలో సంభాషణలు సాగితే పురోగమనంగా ఉంటాయి. భాస్కరభట్ల సింగిల్ కార్డ్ సాంగుల్లో ‘లైట్ తీస్కో..’ పాట సాహిత్యపరంగా చమక్కులతో సాగింది. అందులో ఒకచోట వాడిన పదం- నువ్వు రేషన్ బియ్యంలో రాళ్లేరినా భాస్మతీ రైస్ తిన్నట్టు అన్నది బాగుంది. శ్రవణ్ భరద్వాజ్ పాటల్లోకన్నా, నేపథ్య సంగీతంలో ఎక్కువ ప్రతిభ చూపారు. చివరగా ఓ మాట- తీసుకున్న కథా వస్తువు గురించి కొద్దిగానైనా పరిశోధన చేసి సన్నివేశాల కల్పనకు పూనుకుంటే ఇలాంటి సిల్లీ ఇనె్వస్టిగేషన్స్ సీన్లు వచ్చి ఉండేవి కావు. అందుకే ఈ సినిమా భాషలోనే చెప్పుకుంటే (పుట్టుకకు...) చిత్రం విజయానికి కారణాలు చెప్పలేకపోయినా, అపజయానికి మాత్రం ఇలాంటి కారణాలెన్నో. మరి అలాంటి కారణాలేవీ దరి చేరకుండా తగినన్ని జాగ్రత్తలు దర్శకుడు తన భావి ప్రయత్నాల్లో తీసుకుంటారని ఆశిద్దాం.

అన్వేషి