నిజామాబాద్

నేడు తెరాస అభ్యర్థుల నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 13: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియకు తెరపడేందుకు మరో ఆరు రోజుల గడువు మిగిలి ఉన్నప్పటికీ, అధికార పార్టీ తరఫున బీ.్ఫరంలు పొందిన తాజామాజీ ఎమ్మెల్యేలంతా బుధవారం రోజునే నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. దివ్యమైన ముహూర్తమని తేలడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులంతా బుధవారం ఒకే రోజున నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మంగళవారం తొలి సెట్ నామినేషన్‌ను మద్నూర్ తహశీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆయన వెంట ఎం.పీ బీబీ.పాటిల్, జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఇతర తెరాస నాయకులు ఉన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడుతున్న ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా ఇప్పటికే తన తొలిసెట్ నామినేషన్‌ను అందజేశారు. మంగళవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా చక్రధర్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఎప్పటిలాగే ఆయన ప్రత్యేకంగా గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా పలువురి దృష్టిని ఆకర్షించారు. నామినేషన్ల పర్వం ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లో నామమాత్రంగానే నామినేషన్లు దాఖలవగా, బుధవారం నుండి ఊపందుకోనున్నాయని స్పష్టమవుతోంది. తెరాస అభ్యర్థులంతా అట్టహాసంగా నామినేషన్‌లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం కార్తీక శుద్ధ సప్తమి కావడంతో మంచిరోజుగా భావిస్తూ విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా చాలామంది నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. అర్బన్ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ బుధవారం నామినేషన్ వేయనుండగా, ఇప్పటికే ఖరారైన పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంచి ముహూర్తం కావడంతో హేమాహేమీలుగా ఎన్నికల పోరులో తలపడుతున్న అభ్యర్థులంతా నేడు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమాయత్తమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు అట్టహాసపు ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ప్రచారబరిలో ఇప్పటికే ఆధిపత్యం కనబర్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్ల పర్వం సందర్భంగా కూడా పై చేయిని చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోపక్క ఇదే రోజున వారికి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న ఒకరిద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నట్టు తెలిసింది. ఒకేరోజున ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులంతా ఒకేరోజు నామినేషన్ దరఖాస్తులు అందజేయనుండడంతో దాదాపుగా అన్ని సెగ్మెంట్లలోనూ నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద కోలాహలం నెలకోనుంది. సాధారణంగా ప్రతీసారి నామినేషన్ల గడువు ముగిసే రోజునే ప్రధాన పార్టీల అభ్యర్థులు హంగు, ఆర్భాటాలతో నామినేషన్లు దాఖలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ముహూర్తం కలిసిరావడంతో గడువు ముగిసేందుకు ఐదు రోజుల ముందుగానే నామినేషన్ల దాఖలుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమతమ అభ్యర్థులకు బీ.్ఫరంలను సమర్పించడంతో వారు నామినేషన్లు దాఖలు చేయడమే తరువాయిగా ఉంది. కాగా, ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులతో పాటు వారి పక్షాన డమీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ మేరకు ఎవరెవరు డమీ నామినేషన్లు వేయాలన్నది ఇప్పటికే నిర్ణయించి సదరు నాయకులను కూడా సన్నద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ల ప్రహసనంలో పాల్గొనేందుకు ముఖ్య నేతలు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నామినేషన్‌ల దాఖలు సమయంలో అభ్యర్థి వెంట ఐదుగురికి మించి వ్యక్తులు ఉండరాదని ఈ.సీ నిబంధనలు సూచిస్తున్నప్పటికీ, అభ్యర్థుల అట్టహాసపు ఏర్పాట్లను బట్టి చూస్తే అవి అమలవుతాయన్న దాఖలాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. తమకు పెద్దఎత్తున ఓటర్ల మద్దతు ఉందని నిరూపించుకునేందుకు నామినేషన్ల దాఖలు సమయంలో భారీగా ర్యాలీ నిర్వహించేందుకు జన సమీకరణ కోసం తంటాలు పడుతున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో పాటు ఆయా వర్గాల వారిని కూడగట్టుకునేందుకు రెండు రోజుల నుండే సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు వాహనాలను సైతం సమకూరుస్తున్నట్టు తెలిసింది.

మండలంలో తనిఖీలు ముమ్మరం
నందిపేట, నవంబర్ 13: నందిపేట మండలంలో ఎన్నికల కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల్లో సరఫరా చేసే మద్యం, నగదును పూర్తిస్థాయిలో నిలువరించేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకు ఫ్లయింగ్ స్వ్కాడ్, స్టాటిస్టికల్ సర్వే లైన్స్ బృందాలను రంగంలోకి దింపి తనిఖీలు చేపట్టారు. ఫ్లయింగ్ స్వ్కాడ్, ఎస్‌ఎస్‌టీ అధికారులు రవీందర్, వినోదలు మండలం ప్రాంతంతో పాటు శివారు ప్రాంతాల్లో తనిఖీలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారుల గుండా రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు అన్ని ప్రధాన రహదారుల్లో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీల్లో 49,950రూపాయలకు పైగా నగదు లభిస్తే, డబ్బులకు సంబంధించి సరైన ఆధారాలు చూపిస్తేనే వదిలిపెడ్తామని, లేదంటే నగదును సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని అధికారి రవీందర్ స్పష్టం చేశారు.