రివ్యూ

సౌండ్‌లేని రూలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* రూలర్
*
తారాగణం: బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, జయసుధ, భూమిక, ప్రకాష్‌రాజ్, సప్తగిరి తదితరులు
కథ: పరుచూరి మురళి
సంగీతం: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి రామ్‌ప్రసాద్
నిర్మాత: సి కల్యాణ్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కెఎస్ రవికుమార్
*
లెక్కపెట్టుకుని సినిమాలు చేయడం వేరు. లెక్కలేసుకుని సినిమాలు చేయడం వేరు. ఈ రెండు ఎక్స్‌పీరియన్స్‌లూ సీనియర్ హీరో బాలకృష్ణ సినిమాల్లో చూడొచ్చు. కెరీర్‌లో ఎన్నో సినిమా చేస్తున్నామన్నది -లెక్కపెట్టుకోవడం. ఎంచుకున్న కథలో హీరో పాత్ర, పరిమితి, యాక్సెప్టెన్సీ, అడ్జెస్ట్‌మెంట్స్, కామెడీలాంటివి చూడటం -లెక్కలేసుకోవడం. బాలకృష్ణ నుంచి వచ్చిన తాజా సినిమా ‘రూలర్’ను చూస్తే లెక్కకోసం చేశారా? అనిపిస్తోంది. తన తరం హీరోలతో పోల్చిచూస్తే -సంఖ్యాపరంగా చెప్పుకోదగ్గ సినిమాలు ఉండాలన్న సంఖ్య కోసం చేసిన సినిమా అన్న భావనే కలుగుతుంది. వంద సినిమాలు దాటి చేసిన బాలకృష్ణ అనుభవం -కథల ఎంపికలో చిన్నదనలేం. కాని -పరుచూరి మురళి చెప్పిన కథకు ఇంప్రెస్ అవ్వడంలో ఆయన అనుభవం ఏమైంది? అన్న సందేహాన్ని మాత్రం తుడిచేయలేం. ‘వన్ హీరో -టు షేడ్స్’ తరహా సినిమాలు బాలకృష్ణ లెక్కకుమించి చేశాడు. ‘మర్చిపోయిన గతం గుర్తుకొచ్చి -కర్తవ్యాన్ని నిర్వర్తించిన హీరో’ కథ ఇది. పాత ముతక ఫార్ములాను వేరు వేరు దర్శకులతో సినిమాగా చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న బాలకృష్ణ సహనాన్ని మెచ్చుకోక తప్పదు.
కథగా చూస్తే-
సరోజినీ ప్రసాద్ (జయసుధ) ఓ కార్పొరేట్ దిగ్గజం. భర్త, కొడుకుని ప్రమాదంలో పొగొట్టుకుంటుంది. ఆమె రోడ్డుపై వెళ్తుండగా -అపస్మారక స్థితిలో రోడ్డుపై కనిపించిన వ్యక్తికి వైద్యం చేయిస్తుంది. కోమానుంచి కోలుకున్న అతనే -ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడతాడు. తనను రక్షించిన వ్యక్తికి గతం గుర్తు లేకపోవడమే ‘ఫెసిలిటేటివ్ అడ్వాంటేజ్’గా ఫీలై, చనిపోయిన తన కొడుకు స్థానంలో కొడుకుగా కూర్చోబెడుతుంది. అలా సాఫ్ట్‌వేర్ కంపెనీకి చైర్మన్ అయిపోయి ‘టోనీ స్టార్క్’ లుక్‌తో ఎంట్రీ ఇస్తాడు అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ). బిజినెస్‌లో తనతో పోటీపడే ప్రయత్నం చేసిన హారిక (సోనాల్ చౌహాన్)తో ప్రేమలో పడతాడు.
బిజినెస్ విస్తరణలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి వెళ్లాలనుకుంటాడు అర్జున్ ప్రసాద్. కొడుకుని అడ్డుకుంటుంది సరోజినీ ప్రసాద్. అందుకు కారణాలు తెలుసుకుని, తల్లికి జరిగిన అవమానంతో రగిలిపోయిన అర్జున్ ప్రసాద్ -ఝాన్సీలో అడుగుపెడతాడు. తన ప్రత్యర్థి భవానీనాత్ ఠాకూర్ అని తెలిసి యుద్ధానికి దిగుతాడు.
ఈలోగా రాజకీయ గూండాల దౌర్జన్యాలకు గురవుతున్న అక్కడి తెలుగు రైతులు -నువ్వే మా ధర్మ (బాలకృష్ణ) అంటారు. ఒక్కసారిగా ఓపెనైన ఫ్లాష్‌బ్యాక్‌లో చిత్రమైన విగ్‌తో తెరపైకొచ్చిన ధర్మను చూసి ఆడియన్స్ విస్తుపోవాలి. ఝాన్సీలో తెలుగు రైతులు ఎందుకున్నారు? అర్జున్ ప్రసాద్‌ని ధర్మా అని ఎందుకంటున్నారు? ఫ్లాష్‌బ్యాక్ కథేంటి? తెలియాలంటే -రూల్‌ర్‌కి వెళ్లక తప్పదు.
తను రాసుకున్న కథకు ఫినిషింగ్ తేలకపోవడంతో -పరుచూరి మురళి తెచ్చిన కథను తెరకెక్కించానన్నది సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్వూలో దర్శకుడు చెప్పిన మాట. దర్శకుడిగా కెఎస్ రవికుమార్ అనుభవం చిన్నదేం కాదు. చిన్న సినిమాల నుంచీ ఎదిగిన రవికుమార్ -స్టార్స్‌తోనే సినిమాలు చేశాడు. నరసింహా చిత్రంలో రజనీకాంత్‌కి మాంచి ఎలివేషన్లు రాసిన దర్శకుడు. తమిళ ఆడియన్స్ భావజాలాన్ని దృష్టిలో పెట్టుకుని -బాలకృష్ణకూ ఎలివేషన్ సీన్స్ రాశాడు. కాకపోతే -ఒక్కటీ పండలేదు. రెండు పాత్రలకిచ్చిన రెండు ఎంట్రీలు పేలవం. ఆత్మహత్య చేసుకోడానికి టెర్రస్ ఎక్కిన అమ్మాయిని హెలికాఫ్టర్‌లో వచ్చి రక్షించాలన్న సీన్ ఆలోచన అబ్బో అనిపిస్తుంది. కారులో వెళ్తున్న విలన్‌కి హీరో ఫోన్ చేసి ‘హలో’ అనగానే.. ఆ సౌండ్‌కే బెదిరిపోయి డివైడర్‌ను ఢీకొట్టిన డ్రైవర్ సీన్ చూస్తే -ఏకాలంలో ఏ సినిమా చూస్తున్నాం అన్న అనుమానం రెకెత్తుతుంది. కాలం చెల్లిన హీరోయిజాన్ని కథనిండా కుక్కి చూపించటం రవికుమార్‌కే చెల్లిందేమో. పైగా బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశానని చెప్పడం -వెటకారమే. ఇంతకుముందు రవికుమార్ -బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన ‘జై సింహా’కు ‘రూలర్’ ఓ ఎక్స్‌టెన్షన్ అని సరిపెట్టుకోక తప్పదు.
కథ ఎంపికలోనే కాదు, స్టయిలింగ్‌లోనూ బాలకృష్ణ పొరబాటు చేసినట్టే అనిపిస్తుంది. సినిమా సినిమాకూ లుక్ మార్చటం సెంటిమెంట్‌గా ఫీలైనా -ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు ఆప్ట్ అప్పియరెన్స్‌తోనే కనిపించాడు బాలయ్య. రూలర్‌లో.. సాఫ్ట్‌వేర్ పాత్రకు టోనీ స్టార్క్‌లా, పోలీస్ ధర్మ పాత్రకు మధ్యపాపిడి జులపాల విగ్‌తో ఇచ్చిన మేకోవర్ -్ఫన్‌కే తప్ప ప్రతాపం చూపించే హీరోలా అనిపించలేదు. పైగా -బాలకృష్ణ తల్లిగా జయసుధని ఏ సీన్‌లోనూ యాక్సెప్ట్ చేయలేం. ‘అమ్మ’ అని బాలయ్య పిలిచే ప్రతి సందర్భంలో -ఆడియన్స్ అడ్జెస్ట్ అవ్వలేక కుర్చీల్లో సర్దుకుని కూర్చున్నారు. బక్కపల్చని గ్లామర్ చూపించడానికే అలవాటైన సోనాల్ చౌహాన్, పుష్కర కాలానికో సినిమాతో తెరపై కనిపించే వేదికతో సీనియర్ హీరో రొమాన్స్ ఊహించుకోడానికే కష్టమైంది. సోనాల్ చౌహాన్ వెనుక ఓ తొట్టిగ్యాంగ్‌ను పెట్టి చేసిన హ్యాకర్ల సీనూ -ఏ కాలంనాటి కామెడీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. జయసుధ, భూమిక, ప్రకాష్‌రాజ్ లాంటి ఆర్టిస్టులు మెరిసి మాయమవడానికే పరిమితమయ్యారు. గ్లామర్‌పరంగాను, నటనపరంగానూ ఈ పాత్రా ఆకట్టుకోలేకపోవడంతో -తెరనిండా హీరోయిజాన్ని చూస్తూ కాలక్షేపం చేయక తప్పలేదు.
బాలకృష్ణ సినిమాలో కనీసం మాస్ మసాలాతోనైనా ఆడియన్స్ సంతృప్తి పడిపోతుంటారు. అడుగువేస్తే బాంబు పేలి పాతాళగంగ పైకిరావడం, రైతు గొప్పతనంపై గుక్క తిప్పకుండా ‘గుట్కా’ డైలాగుల ఘర్జన వంటివి ఈ చిత్రంలోనూ ఉన్నా -ఏదీ ఆడియన్స్‌కి ధైర్యాన్నివ్వలేకపోయాయి. దానికితోడు ఝాన్సీ ప్రాంత సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా మాట్లాడిన బూతులకు బీప్‌లే ఎక్కువ పడటం -ఆడియన్స్ విసుగు పీక్స్‌కి వెళ్లిపోయింది. టెక్నికల్‌గా చిరంతన్ భట్ సంగీతం బలహీన కథలో కలిసిపోయింది. ‘యాల యాల’ పాట ఓకే అనిపిస్తుంది. బ్యాంకాంక్ లొకేషన్లు చూపించటంలో -రామ్‌ప్రసాద్ ఫొటోగ్రఫీ ఓకే. విషయంలేని కామెడీ సీన్లు, మోతాదు మించిన యాక్షన్ సీన్లపై ఎడిటర్ తెగబడివుంటే -సినిమా కాస్త ట్రిమ్ అయ్యేదేమో. బాలకృష్ణకు డైలాగులే ప్రాణం. వాటి ప్రతాపమూ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. మొత్తంగా స్ట్రక్చర్‌లో బలం, స్క్రీన్‌ప్లేలో వ్యూహం లేకుండా -అపసవ్యంగా సాగిన కథలో దర్శకుడి పనితనం ఆడియన్స్‌కి బోర్‌కొట్టించింది. మాస్ ఆడియన్స్ సైతం ముసిముసిగా నవ్వుకునేలా పాత్రల్ని డిజైన్ చేసిన తీరు రవికుమార్‌కే చెల్లిందనుకోవాలి. బాలయ్యకు హిట్లూ, ఫ్లాపులూ కొత్తేం కాకపోవచ్చు. కాకపోతే -ఈ తరహా వైఫల్యాన్ని ప్యాన్స్ సైతం జీర్ణించుకోలేరు.

-విజయ్