ఈ వారం కథ

సబల (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యప్రసాద్ చనిపోయాడు. అయితే, ఆ విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. నేను ఇతరుల విషయం పట్టించుకోను. ఎవరితోనూ పరిచయాలు పెంచుకోను. చిన్నతనం నుంచి ఒంటరి బతుక్కి అలవాటు పడ్డాను. ఆర్మీలో పదిహేనేళ్లు పనిచేశాను. ప్రతి నెలా పెన్షను వస్తుంది. చిన్న ఉద్యోగం కూడా ఉంది. మరి నాకు ఇతరులతో ఏం పని?
నిన్న రాత్రి ఎనిమిది గంటలకు బయట భోజనం చేసి ఇంటికి వచ్చాను. నేను ఉంటున్నది పెద్ద ఇల్లేం కాదు. ఒక గది, అటాచ్డ్ బాత్‌రూం. మిగతా ఇంట్లో ఓనరు ఉంటాడు. అతను ఎపుడో కాని రాడు. అందుకే నాది చీకూచింతా లేని జీవితం. నేను ఇంటికి వచ్చిన కాసేపటికి ఎదురింటి తలుపు చప్పుడైంది. ‘అనుకృతీ..!’ అంటూ ఆ ఇంట్లో ఉంటున్న సత్యప్రసాద్ తన భార్యను కేకేశాడు. సాధారణంగా అతను డ్యూటీ నుంచి రాత్రి ఎనిమిది తర్వాతే వస్తాడు.
సత్యప్రసాద్ భార్య సాధారణంగా బయటకు రాదు. ఒకటి, రెండు సార్లు సత్యప్రసాద్ నన్ను పలకరించే ప్రయత్నం చేసి చిరునవ్వు నవ్వేడు. నేను పట్టించుకోలేదు. ఆ తరువాత నేను ఎదురైనా అతడు నన్ను పలకరించే ప్రయత్నం చేయలేదు. అతనికి ఇద్దరబ్బాయిలు. పెద్దవాడికి ఏడేళ్ల వయస్సు ఉండొచ్చేమో. రెండోవాడు నాలుగేళ్ళవాడు. ఆ పిల్లలిద్దరూ నాలుగైదు సార్లు నా గదికి వచ్చారు. నాలుగు చిలుక పలుకులు చెప్పి తల్లి పిలిస్తే వెంటనే వెళ్లిపోయేవారు. నేను ఈ గదిలో దిగి నాలుగు నెలలు కాలేదు. ఓసారి నాకు జ్వరం వచ్చింది. మొదటి రోజు మంచం దిగలేదు. తిండి కూడా తినలేదు. దాంతో నీరసం వచ్చింది. మర్నాడు కాఫీకని హోటల్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. అపుడు సత్యప్రసాద్ పెద్దకొడుకు ‘అంకుల్’ అని పిలుస్తూ నా గది తలుపు తట్టేడు.
‘మా అమ్మ కాఫీ పంపించింది..’ వాడి చేతిలో ట్రేలో కప్పు, సాసరు ఉన్నాయి.
‘అక్కర్లేదు.. హోటల్‌కి వెళ్తున్నాను’ అంటూ తాళం వేస్తున్నాను. ఆ అబ్బాయి చిన్నబుచ్చుకుని వెళ్లిపోయి ‘అమ్మా! అంకుల్ వద్దన్నారు’ అన్నాడు. సత్యప్రసాద్ భార్య బయటకు వచ్చి ‘ఏమండీ! టీ తీసుకోలేదేం? నిన్నంతా బయటకు వెళ్లినట్లు లేదు. జ్వరమా? తలనొప్పా? రెండింటికి ఇంట్లో మాత్రలున్నాయి పంపిస్తాను, ముందు కాఫీ తీసుకోండి’ అంది.
అయిష్టంగానే కాఫీ తీసుకున్నాను. కొంతసేపటికి ఆ అబ్బాయి వచ్చి ‘ఈ మాత్రలు మా అమ్మ మీకివ్వమంది. ఇవి తలనొప్పికి, ఇవి జ్వరానికి’ అంటూనే ‘మరో విషయం అమ్మ చెప్పమంది’ అన్నాడు.
‘ఏమిటి?’ అన్నాను.
‘మీరు బయటకు రండి. అమ్మ చెప్తుంది’ అన్నాడు. మధ్యాహ్నం భోజనానికి తమ ఇంటికి రమ్మంటూ ఆమె చెప్పింది. నేను వస్తానని కానీ, రానని కానీ చెప్పలేదు. బయటకు వెళ్లే ఓపిక లేక పడుకునే ఉన్నాను. మధ్యాహ్నం పనె్నండు గంటల వేళ పిల్లలిద్దరూ వచ్చి బలవంతంగా వారింటికి తీసుకువెళ్లారు. ఆ రోజు ఆదివారం గనుక సత్యప్రసాద్ ఇంటిపట్టునే ఉంటాడనుకున్నాను.
‘సత్యప్రసాద్ గారు లేరా?’ అన్నాను. ఇంటి యజమాని లేకుండా వారింట్లో భోజనం అంటే ఇబ్బందిగా వుంది.
‘మావారికి బుధవారాలు సెలవు’అని ఆమె జవాబిచ్చింది. ఆ రోజు తృప్తిగా భోజనం చేశాను.
***
నా గది తలుపుకి తాళం వేస్తూ చూసాను. ఎదురింటి గుమ్మం దగ్గర చాలా జతల చెప్పుల అస్తవ్యస్తంగా వున్నాయి. ఇంత ఉదయానే్న అంతమంది వారింటికి వచ్చారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరో చనిపోయి ఉంటారన్న అనుమానం నాకప్పుడు రాలేదు. లిఫ్ట్‌లో కిందకి దిగేను. గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వెళ్లి గేటు తీయగానే వెంకట్రావు ఎదురుపడ్డాడు. అతడు నాకు బంధువు, స్నేహితుడు కాకపోయినా నన్ను చూసిన ప్రతీసారీ పలకరిస్తాడు. ఏదో చెప్పాలనుకుంటాడు. నేను అవకాశం ఇవ్వకపోతే ‘మరోమారు చెప్తా..’ అంటూ వెళ్లిపోతాడు.
ఒక రోజు వెంకట్రావు నుంచి తప్పించుకోవడం నాకు సాధ్యం కాలేదు. సెలవురోజు కావడంతో ఇంట్లోనే ఉన్నాను. అకాల వర్షంలా వచ్చి, ‘బాగున్నారా?’ అంటూ పలకరించి కుర్చీలో కూలబడ్డాడు వెంకట్రావు.
అతను డొంక తిరుగుడుగా ఎందుకు మాట్లాడుతాడో నాకర్థం కాదు. ‘యద్భవిష్యుల గురించి విన్నారా?’ అన్నాడు. ‘ఇదేం ప్రశ్న? యద్భవిష్యులు ఎవరైతేనేం? నాకు వారితో ఏమిటి సంబంధం?
నాకు సంస్కృతం రాదు, అది తెలుగు పదమైనా అర్థం తెలియదు. మీరే పనిమీద వచ్చారో చెప్పండి’అని నేను చిరాకుపడినా అతను నవ్వేశాడు.
‘్భలేవారే! ఈ రోజు ఆదివారం మీకు సెలవు. ఆ పదం అర్థం తెలియదన్నారుగా! అది సంస్కృత పదమే. ‘స్వప్రయత్నం లేకున్నా అయ్యేది అవుతుందని భావించేవార’ని దానికి అర్థం. శరత్‌గారూ.. మానవ ప్రయత్నం లేకుండా ఏ పనులూ జరగవు. ఈ పదం మీకు పూర్తిగా అన్వయిస్తుంది. ‘్ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలనాచరింపుము’ అని శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో ఉపదేశించాడు. మీలాంటి యద్భవిష్యులు సత్ఫలితం లభించదని సాధారణ కర్మలను కూడా ఆచరించరు.’ అన్నాడు.
‘అసలు విషయానికి వస్తాను.. మీకు పెళ్లి చేసుకోవాలని, సంసార జీవితం గడపాలన్న కోరిక లేదా? భవసాగరాన్ని ఈదలేనన్న భయమా? మీ వయస్సు ఇపుడు ముప్ఫై అయిదు దాటి ఉంటుంది. ఇపుడు కాకుంటే మరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? నీకా కోరిక వుంటే నా చెవిన వెయ్యి. యోగ్యురాలైన పిల్లను క్షణాల్లో వెతికి పెడతాను. నువ్వు నాకు కావలసినవాడివి’ అన్నాడు వెంకట్రావు.
***
‘శరత్ గారూ! ఎటు వెళ్తున్నారు? మీ ఎదురింటి సత్యప్రసాద్ చనిపోయిన విషయం మీకు తెలియదా? నాతో కలసి రండి, ఇలాంటి సమయంలో వెళ్లకపోతే మరెప్పుడు వెళ్తాము?’ అంటూ అతను నా రెక్క పట్టుకొని లిఫ్ట్‌లోనికి తీసుకువెళ్లి డోర్ వేశాడు. నేను నిర్ఘాంతపోయాను.
భర్త మరణంతో అనుకృతి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్లుంది, ఆమె చెంపలమీద నల్లటి నీటి చారలున్నాయి. ఒకరిద్దరామెను పట్టుకున్నారు. పిల్లలు బిక్క చచ్చిపోయి ఒక మూల కూర్చున్నారు. అందరూ ఏవేవో అంటున్నారు. ఇదంతా చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. నేను స్కూల్లో చదువుకునే సమయంలోనే నా అక్క భర్త చనిపోయాడు. అప్పుడు అతడి వయస్సు ముప్ఫై రెండేళ్లు. నాకు ఏడుపు రాలేదు. కొన్నాళ్లకు- అరవై ఏళ్ల వయసున్న నా చిన్నాన్న చనిపోయాడు. అపుడు నా మనసులో ఒక భావం పొడసూపింది. అసలు మృత్యువంటే ఏమిటి? నేను, మిగతా అందరూ ఏదో ఒక రోజున చనిపోవల్సిందేనా? ఇంత చిన్నవయసులో భర్త చనిపోతే అనుకృతి గతేం కాను? పిల్లలింకా ఎదగాలి.. ఆమె ఎలా గట్టెక్కుతుందో..? చావుకి వయసుతో సంబంధం లేదు.. అంతా విధి రాత.. నారు పోసినవాడే నీరు పోస్తాడు.. ఇలా తలా ఒక మాట అంటున్నారు. శవాన్ని కాటికి చేర్చాలి. దహన సంస్కారం చేయాలి. పాడెమీద శవాన్ని పరుండబెట్టి తాళ్ళతో కట్టారు. ఆ పాడె ఒక కొమ్ము నాకందించాడు వెంకట్రావు. నాలుగడుగులు ముందుకు వేసానో లేదో ననె్నవరో వెనుకనుంచి లాగేరు. వెనక్కి తిరిగి చూసాను. సత్యప్రసాద్ చిన్న కొడుకు ‘అంకుల్.. నాన్నను కట్టేసి ఎక్కడకు తీసుకుపోతున్నారు?’ ఏడుస్తూ అడిగాడు. పాడె మరొకరికిచ్చి నేను వాడిని ఎత్తుకున్నాను. కాసేపటికి అంతిమ సంస్కారం ముగిశాక అంతా వెళ్లిపోయారు. నేను గబగబా హోటలుకెళ్లి పాలు తీసుకువచ్చి, బలవంతాన అనుకృతి చేత తాగించాను. ఆ రాత్రి భోజనం తెప్పించి వారి చేత తినిపించాను. రాత్రి పది గంటల వేళ నేను నా గదికి వచ్చాక- నాకో ఆశ్చర్యకరమైన విషయం తట్టింది.
అనుకృతి తల్లిదండ్రులు, అన్నదమ్ములు గానీ, సత్యప్రసాద్ బంధువులు గానీ రాలేదేం? వీరి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయా? పేగుబంధం ఇంత పలచనిదా? మగదిక్కు లేకుండా ఆడది తన ఇద్దరు పిల్లలతో ఈ లోకంలో ఎలా బతుకుతుంది? ఇదే విషయాన్ని అనుకృతిని అడిగాను.
‘శరత్..! మాది ప్రేమవివాహం. సత్యప్రసాద్‌ను నేను పెళ్లి చేసుకోవడం అతని పేరెంట్స్‌కి ఇష్టం లేదు. తమ మేనకోడలిని చేసుకోవాలనుకున్నారు. అతను వారి మాటలను లక్ష్యపెట్టలేదు. మేం పెళ్లి చేసుకున్నాక వారు మమ్మల్ని తిరస్కరించారు. ఇక- నేను వేరే కులం వ్యక్తిని పెళ్లాడడం మా అమ్మానాన్నలకు ఇష్టం లేదు. గడప తొక్కవద్దన్నారు. కొన్నాళ్లకు వారి మనసులు మారతాయోమోనని అనుకుంటుండగా, కుటుంబానికి అపకీర్తి తెచ్చానన్న బాధతో నా తల్లిదండ్రులు మరణించారు. అన్నదమ్ములు ఆదరించలేదు. అమ్మ పోయినపుడు, నాన్నపోయినపుడు వెళ్లినా వారు మమ్మల్ని ఇంట్లోకి రానీయలేదు.’ అంది ఏడుస్తూ అనుకృతి.
‘పేగు బంధం తెగిపోదు. మీ అన్నదమ్ములకి నచ్చచెప్తాను. నిన్ను ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’ అన్నాను.
అనుకృతి అంత దుఃఖంలోనూ నవ్వింది. ‘నువ్వు ప్రయత్నిస్తానంటున్నావుగా.. అడ్డుపెట్టను’ అంది. వెంటనే ఆమె అన్నదమ్ముల చిరునామాలు తీసుకున్నాను.
నాలోని జడత్వం ఎలా మాయమైంది? మానవత్వం ఎలా పరిఢవిల్లింది? నాకంతా ఆశ్చర్యంగా ఉంది. యద్భవిష్యుడు అన్న ముద్రను చెరుపుకోవాలనుకుంటున్నానా? అయితే, నా ప్రయత్నాలు ఏ విధంగానూ ఫలించలేదు. ఆమె సోదరుల పాషాణ హృదయాలు కరగలేదు. తిరిగి వచ్చిన నేను అనుకృతికి ముఖం చూపించలేకపోయాను. వారం రోజులై ఆమె ఇంటికి వెళ్లలేదు. మరో మార్గం లేదా? అని ఆలోచిస్తుండగా వెంకట్రావు గుర్తుకొచ్చాడు. వెంటనే అతనింటికి వెళ్లాను. నన్ను ఆప్యాయంగా ఆహ్వానించాక, అనుకృతి సమస్య గురించి చెప్పాను. ఏదైనా సలహా ఇవ్వాలని అడిగాను.
‘నీలో ఎంత మార్పు? కొన్ని సమస్యలను కాలమే పరిష్కరిస్తుంది. ఆమె గురించి మరిచిపో. వాళ్ళ బాధలు వారు పడతారు. ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖపడు’ అన్నాడు.
అతని మాటలు నాకు రుచించలేదు. ఎంత కటువుగా అన్నాడు. ఒక అబల కష్టాల్లో ఉంటే ఆదుకునే బాధ్యత సమాజానికి లేదా?
‘ఎంత నిర్దయగా అన్నారు. మానవత్వాన్ని విస్మరించేరు. నన్ను మీరు యద్భవిష్యుడనని గేలిచేశారు. నిజానికి మీరే యద్భవిష్యులు. మీలా మొసలి కన్నీరు కార్చేవారంటే నాకు అసహ్యం.. ఇక వస్తాను’ అంటూ లేచాను.
‘‘శరత్! కూర్చో. నీలోని మార్పు ఎంత సహజమైందో తెలుసుకోవాలని అన్నాను. అనుకృతి నా బిడ్డలాంటిది. ఆమె గురించి నాకు బాధగానే ఉన్నా- ఏ విధంగానూ ఆదుకోలేను’.
‘మరి ననె్నందుకు నిరుత్సాహపరుస్తున్నారు? నేను చేయగలిగింది చేయాలనుకుంటున్నాను’ అన్నాను.
‘శరత్! నీవు ఆమె కష్టాన్ని చూసి బాధపడుతున్నావు. ఆమెకు చేయూతనిచ్చే స్థితిలో ఉన్నందున నువ్వు కొంత త్యాగం చేయాలి. ఈ వయసులో నీవు ఒక పడుచును పెళ్లి చేసుకుని సంసారం చేస్తే నీ పిల్లలమీద, భార్యమీద నీకు అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. కానీ- ఒక విధవరాలిని భార్యగా చేసుకుని, ఆమె పిల్లలను నీ సొంతబిడ్డల్లా చూసుకోవటం త్యాగం పరిధిలోనికి వస్తుంది. అయితే- అది జాలి అని, దయ అనే భావం నీలో రారాదు. అలాంటి ఆలోచనలు వస్తే మీరెవరూ సుఖపడలేరు’.
‘ఆమెను పెళ్లి చేసుకోవాలా? ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి. మొదటి భర్తను మరచిపోగలదా? పెళ్లికి అంగీకరిస్తుందా?’ అన్నాను.
‘ఆమె ఏమంటుందో ప్రస్తుతం అనవసరం. ఆమెను స్వీకరించడం నీకు సమ్మతమేనా?’ అన్నాడు వెంకట్రావు.
నేను ధర్మ సంకటంలో పడ్డాను. వెంకట్రావు ఇలాంటి సలహా ఇస్తాడని నేను ఊహించలేదు.
‘వెంకట్రావుగారూ! నేనింతవరకు కొన్ని సిద్ధాంతాలను పాటిస్తున్నాను. ఒక విధవని పెళ్లి చేసుకుని నా సిద్ధాంతాలకు తిలోదకాలివ్వాలా? మరో దారి లేదా?’ అన్నాను.
‘నువ్విలా అంటావని నాకు తెలుసు. నీవు అనుకృతిని మరిచిపోవాలి. అందుకు రెండు మార్గాలున్నాయి..’ అన్నాడు వెంకట్రావు.
‘ఆమెను ఎలా మరిచిపోతాను? నావికుడు లేని నావలా ఆమె నడి సముద్రంలో మునిగిపోతున్నది. ఆమెకు దారి చూపాలా? వద్దా?’
‘శరత్! రెండు నావలపై ప్రయాణం ప్రాణాంతకం. ఆమెను పెళ్లి చేసుకోలేవు. ఒడ్డున నిలబడి ఆమెకు సలహాలిస్తావా?’
‘నన్ను మీరు అర్థం చేసుకోలేదు..’
‘అర్థం చేసుకున్నా.. కాబట్టే నేనీ సలహా ఇచ్చాను’ అన్నాడు వెంకట్రావు.
‘ఏమిటి?’
‘ఆమెను మరచిపోవడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. రెండు- ఇక్కడి నుంచి ఆమెకు దూరంగా వెళ్లిపో. నువ్వు రెడీ అంటే పెళ్లికూతుర్ని వెతుకుతాను’.
‘మీ సలహాలకు ధన్యవాదాలు’ అంటూ లేచాను.
నాలుగైదు రోజులపాటు ఏదీ నిర్ణయించుకోలేకపోయాను. ఆమెను ఆదుకోవడం నా ధర్మం. మంచి పనికోసం సిద్ధాంతాలతో రాజీపడాలి.
***
అనుకృతి నన్ను సాదరంగా లోపలికి రమ్మంది.
‘పదిహేను రోజులై మీరు ఇటు రాకపోతే మమ్మల్ని మరిచిపోయారనుకున్నా. మీరు మా వాళ్ళ అడ్రసులు తీసుకున్నారు. అక్కడికి వెళ్ళేరని అనుకుంటున్నాను. మీరు నెరవేర్చాలనుకున్న కార్యం కాయా? పండా? అని అడగను. పిందె దశలోనే అది తొలగిపోయింది’ అంది.
పక్షం రోజుల్లో ఆమెలో ఎంత మార్పు వచ్చింది? భర్త చనిపోయాడన్న దుఃఖాన్ని తొందరగానే ఎలా మరిచిపోయిందని నాకు ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారి కలిగాయి. నేను అసలు విషయం చెప్పాను.
‘మీరు మళ్లీ సంతోషంతో కిలకిలలాడాలి. మళ్లీ పెళ్లి చేసుకోవాలి. ఇద్దరు పిల్లలున్న విధవరాలిని ఎవరు పెళ్లి చేసుకుంటారని అనుకోకండి. మీరు ఇష్టపడితే నేను మిమ్మల్ని పెళ్లాడి, మీ పిల్లలను నా కన్నబిడ్డలా చూసుకుంటాను’ అంతవరకు రిహార్సల్ చేసుకున్న మాటలను గుక్క తిప్పకుండా చెప్పి ఆమె ముఖంలోకి చూసాను. అప్పటివరకూ మృదుమధరంగా మాట్లాడిన ఆమె ఒక్కసారి రౌద్రమూర్తి అయింది. చండికలా నాపై విరుచుకుపడింది.
‘ఏమన్నారు..? నేను ఇష్టపడితే నన్ను పెళ్లి చేసుకుంటారా? మనసిచ్చిన మగడితో పదిహేనేళ్లు కాపురం చేసిన నేను- భర్త చనిపోయి నెల రోజులు కాకుండానే మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? అయినా- ఇది మీ తప్పు కాదు. మీ పురుష జాతి అహంకారం. ఆడదంటే అంత చులకనా? ఆడదంటే పరాశక్తి. నేను అసహాయురాలినని భావించి, వంచన చేసి నన్ను మీ చరణదాసిని చేసుకోవాలనుకుంటున్నారా? పొరుగున ఉంటున్నారని నా కష్టం చెప్పుకోవాలనుకున్నాను. ఇలాంటి నీచమైన ఆలోచనలున్న మీ ముఖం నాకు చూపించకండి. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళండి..’ అంటూ కుర్చీలోంచి లేచి నిలబడింది అనుకృతి. నేను భయంతో లేచి బయటకు వెళ్ళబోయాను.
‘ఆగు శరత్..’ అంది. ఏ ప్రళయం ముంచుకు వస్తుందోనని భయపడ్డాను.
‘నిన్ను మొదటిసారి చూసినపుడు నా తమ్ముడు గుర్తుకొచ్చాడు. వాళ్ళు నన్ను వెలివేశారు. నీలో నా తమ్ముడ్ని చూసుకొని తృప్తిపడ్డాను. అక్కగా నీ కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలనుకున్నాను. నువ్వు చెప్పు, నాలా యవ్వనంలో భర్తను కోల్పోయిన ఆడవాళ్ళు లేనేలేరా? వాళ్ళందరినీ నీవు ఉద్ధరించగలవా? రక్షణ కోసం మేక తోడేలును నమ్మదన్నట్లు స్ర్తి పరాయి పురుషుడిని నమ్మదు. భర్తలేని లోటు ఎల్లకాలం ఉండేదే. నన్నూ నా పిల్లలను పోషించుకోగల శక్తియుక్తులు నాకున్నాయి. నేను ఈ సమాజంలో ఒక సబలను.. కాఫీ తెస్తాను తాగి వెళ్ళు’ అంది.
‘నన్ను క్షమించు.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎంతటి జటిలమైన సమస్య అయినా కాలం పరిష్కారం చూపిస్తుందని నాకిప్పుడు అర్థమైంది’ అన్నాను.
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ వెంకట్రావిచ్చిన మూడో సలహాలో నాకు తప్పేమీ కనిపించలేదు. *

గుమ్మా ప్రసాదరావు (కలం పేరు: నిత్యకళ్యాణమ్మ)
సెల్ నెం: 09755 110 398

గుమ్మా ప్రసాదరావు