మెయిన్ ఫీచర్

గోవిందుడు అందరివాడు.. (నేడు శ్రీకృష్ణాష్టమి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

..............
వసుదేవ సుతం దేవం కంస చాణుర మర్ధనమ్
దేవకై పరమానందం కృష్ణం వందే జగద్గురమ్
.............

...........
వెన్న దొంగిలించడమంటే, వెన్నవంటి నిష్కల్మషమైన గోపకాంతల హృదయాలలోని ప్రేమను దొంగిలించడం. పెరుగు కుండలను పగలగొట్టడమంటే వారి ఆత్మల చుట్టూ ఉన్న భౌతిక ఆవరణలను ఛేదించడం. అశాశ్వతమైన మమకార, రాగద్వేషాలలో చిక్కుకున్న వారి చిత్తములకు ముక్తి కలిగించడం. అఘాసురుడనే కొండచిలువ నుండీ గోవులనూ, గోపాలకులనూ రక్షించడం, గోవర్ధన గిరినెత్తి గోవులనూ గోకులవాసులనూ, ఇంద్రుడు తనను పూజించనందుకు కోపించి కురిపించిన రాళ్లవాన నుండీ కాపాడటం.. ఆ సందర్భంలో పోతన పద్యం మరువకూడనిది. ‘బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని...’అంటూ వారి మనస్సుల్లోని భావాలను బాలకృష్ణుని నోట పలికిస్తాడాయన.
..........
శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా జరుపుకుంటారు. కృష్ణావతారం అంటే ప్రేమ!. ప్రేమయే దైవం. జగమంతా ప్రేమ మయం. జనులను ప్రేమతో బ్రోచేందుకే శ్రీకృష్ణ్భగవానుడు ప్రేమ స్వరూపుడై మానవావతారం ఎత్తాడు. జగత్తుపై ప్రేమ సుధలను చిలకరించాడు. శ్రావణ బహుళ అష్టమినాడు ‘శ్రీకృష్ణ జన్మాష్టమి’ జరుపుకుంటాం.
శ్రీకృష్ణావతారం దుష్టశిక్షణా, శిష్టరక్షణకై వచ్చింది. బాల్యంలో లీలలు చూపుతూ, రాక్షసులను సంహరిస్తూ, గోపకులతో ఆడుతూ, భక్తులను తన బాల్య లీలలతో ఆనందింపజేస్తూ గడుస్తుంటుంది. మన్ను తిన్నాడని, నోరు చూపమన్నపుడు తల్లి యశోదకు తన నోట్లో విశ్వమంతా చూపుతాడు. ఈ సందర్భంలో పోతన మహాశయుడు వ్రాసిన ఈ పద్యం తెలుగువారి నోట పలుకుతూనే ఉంటుంది. ‘అమ్మా! మన్ను దినంగ నేను శిశువునో యాకొంటినో వెర్రినో..’ అంటూ నోరు తెరచి విశ్వాన్నంతా తన నోట చూపగా యశోద భయవిహ్వలయై...’ కలయో వైష్ణవ మాయయో! ఇతర సంకల్పార్థమో, సత్యమో, తలపనే్నరకయున్నదాన..’ అనుకుంటుంది. మళ్ళీ కృష్ణ మాయ ఆమెను కమ్ముతుంది.
ఇరుగుపొరుగు గోపకాంతల మాటలకు కోపించి కృష్ణుని రోటికి కట్టాలని తాడు తెస్తుంది. జగమంతా లోపల నుండగా తాడుతో పొట్టను కట్ట సాధ్యమా! యశోదకు కట్టాలని తెచ్చిన తాడు రెండు వ్రేళ్ళు తగ్గుతుంది. మళ్ళా వెళ్ళి మరో తాడు తెచ్చి, రెండింటినీ కలిపి కట్టబోతుంది, అదీ రెండు వ్రేళ్ళంత తగ్గుతుంది, ఇలా రెండుమూడు పర్యాయాలయ్యాక, ‘‘ఇహ నా వల్లకాదురా కృష్ణా! నిన్ను కట్టను’’, అని అలసిపోయి కూర్చుంటుంది. అపుడు జాలితో కట్టుబడతాడు కృష్ణయ్య, దేనికీ? యశోదమ్మ వాత్సల్యానికి, ప్రేమ కు, ప్రేమ పాశానికి కట్టుబడతాడు భగవంతుడెప్పుడూ. ఆ త్రాటి రెండు కొస లూ బ్రహ్మ నిష్ట, ధర్మ నిష్ట. వాటికి మాత్రమే పరమాత్మ లొంగేది. రోటికి కట్టబడిన కృష్ణుడు, దానిని లాక్కుంటూ వెళ్ళి శాపగ్రస్తులై, వృక్షాల రూపంలో ఉన్న గంధర్వులకు వాటిని కూల్చి విముక్తి ప్రసాదిస్తాడు. ఇలా ఆయన లీలా నాటకాలు సాగుతాయి. అసలీ గోపికలెవరు? వీరికి కృష్ణుడు ఇంత ప్రాము ఖ్యం ఎందుకిచ్చాడు? ‘గో’అంటే వేదం, భూమి, గోవు. వేద వాక్యాలనూ, వేద సారాన్నీ నమ్మి స్మరించినవారు, భూమిని గోవులను కాపాడినవారు గోపగోపాలకులు. అందుకే వారంటే పరమాత్మకు అంత ప్రీతి. అంతేకాక కృతయుగంలో ఋ షులు, త్రేతాయుగంలో వానరులు, ద్వాపరయుగంలో గోప గోపికలుగా జన్మించారు. కృతయుగంలో వారికి దర్శనం మాత్రమే లభించగా, త్రేతాయుగంలో సంభాషించే భాగ్యం, ద్వాపర యుగంలో దర్శన, స్పర్శన, సంభాషణా భాగ్యాలు మూడూ కలిగాయి.
గోపికలది అనన్య భక్తి. గోపికలు నిరంతరం కృష్ణుని స్మరిస్తూ, ఆయన వేణునాద స్వరంలో సర్వవేదాల సారాన్నీ గ్రోలినవారు. రాధాకృష్ణులది ప్రకృతి పరమాత్మల అవినాభావ సంబంధం, కృష్ణుడు రాధకంటే చాలా చిన్నవాడు, రాధ నందుని చెల్లెలు. కృష్ణుడే ఆధారమని నిరంతరం ‘్ధర’గా ఆయన్నారాధించింది రాధ.
శ్రీకృష్ణావతారం ప్రేమకు భగవంతుడు లొంగుతాడని నిరూపించడమేకాక మానవసేవ తానుచేసి చూపి, సేవకున్న ప్రాధాన్యతను లోకానికి చూపింది. స్వయంగా బాల్యంలో గోసేవ, ఆ తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు యజ్ఞశాలకు వస్తున్న ఋత్విక్కుల పాదాలు కడిగి, వారు భుజించాక వారి ఎంగిలి విస్తరాకులు ఎత్తివేసి, ఆ నేలను సుద్ధిగావించి, యుద్ధ సమయంలో అర్జునునికి సారధిగా ఉన్నపుడు గాయపడిన అశ్వములకు సేవచేసి, ఇలా సేవామాధుర్యాన్ని లోకానికి చవిచూపాడు కృష్ణపరమాత్మ.
కృష్ణావతార ప్రధాన లక్ష్యం గీతాబోధ. గీతలో ఎవరి ధర్మాన్ని, ఎవరి కర్తవ్య కర్మలను, వారు ఆచరించేస్తూ, అహంకార మమకారములను దూరం చేసుకుని భగవంతుని శరణుజొచ్చడం.
‘క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహీ-’అనే శ్లోకార్థం తెల్సుకుని వర్తించడమే కృష్ణ జన్మదినాన మనం చేయవలసినది.
‘క్లీం’అనగా పృథ్వి, ‘కృష్ణాయ’అనగా జలము, ‘గోవిందాయ’అంటే అగ్ని, ‘గోపీజన వల్లభాయ’అంటే వాయువు అంటే గాలి, స్వాహా అంటే ఆకాశము, ఈ వాక్యంలో ఇంత అర్థం ఉంది, కృష్ణతత్వంలో పంచభూతాలు ఉన్నాయి.
కృష్ణాష్టమి రోజున బియ్యం, పాలు, పంచదార పోసుకుని తియ్యని పాయసం చేసుకుని తినడం బాగుంటుంది, దానితోపాటుగా పరమాన్నమంటే పరానికి చేర్చేది, అంటే మధురమైన, ప్రేమ మయమైన కృష్ణ నామము స్మరిస్తూ భగవంతుని దరికి చేరాలని భావించాలి, దానికోసం నిరంతరం ప్రయత్నించాలి. ఓం శ్రీకృష్ణాయనమః సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.

- హైమా శ్రీనివాస్