యువ

చిన్నారుల సేవలో కుర్రాళ్ల సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇతరుల కోసం ఎంతోకొంత పాటుపడితేనే నిజమైన ఆత్మసంతృప్తి’- అని నమ్మిన ఆ యువకుడు సేవామార్గంలో పయనిస్తూ తన స్నేహితులకు స్ఫూర్తిదాతగా మారాడు. సమాజానికి ఏదో ఒక రూపంలో సాయపడాలన్న అతడి నిరంతర తపన ఫలించి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భవించింది. హైదరాబాద్‌కు చెందిన ముషీర్ మొహమ్మద్ ఖాన్ తల్లిదండ్రులు తనకు ఇచ్చే ‘ప్యాకెట్ మనీ’తో ఆహారం, రగ్గులు కొని మురికివాడల్లోని నిరుపేదలకు అందజేసేవాడు. కాలేజీ చదువులకు వచ్చాక ఈ సేవాభావం అతనిలో మరింత పెరిగింది. అందుకే తల్లిదండ్రులు, మిత్రుల ప్రోత్సాహంతో ‘ఫ్రీడం ఎగైన్ ఫౌండేషన్’ (ఎఫ్‌ఎఎఫ్) పేరిట ముషీర్ ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి పేదవర్గాల పిల్లలకు చేరువయ్యాడు. అనేక కారణాలతో చదువుకు దూరమవుతున్న పేదింటి చిన్నారులను బడిబాట పట్టించాలన్న సంకల్పంతో ముషీర్ తన మిత్రులతో కలిసి ముందుకు సాగాడు. ఏదైనా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని, అక్కడి పిల్లలకు కొన్ని సౌకర్యాలైనా కల్పించాలని ఆ దిశగా ప్రయత్నాలు చేసిన ముషీర్ చివరికి అనుకున్నది సాధించాడు. బడిని దత్తత తీసుకునే విషయంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాల నుంచి తగిన స్పందన లభించకపోయినా అతను నీరసపడలేదు. తన ఆరుగురు మిత్రులతో కలిసి కాచిగూడలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడి హెడ్మాస్టర్‌ను కలవడంతో ఎఫ్‌ఎఎఫ్ సంస్థ ఆశయం కార్యరూపం దాల్చింది. అవసరమైన సౌకర్యాలను సమకూర్చడంతో ఆ బడికి వచ్చే పిల్లల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో చిన్నచూపు పోవాలని, తగిన సౌకర్యాలుంటే చిన్నారుల్లో చదువు పట్ల ఆసక్తి పెరగడం ఖాయమని ముషీర్ బృందం నిరూపించింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో 600 మంది విద్యార్థులకు ‘షూ’లను ముషీర్, ఆయన మిత్రులు అందజేశారు. పిల్లలకు అవసరమైన వాటిని సమకూరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ‘డ్రాప్ అవుట్ల’ల సమస్య ఉండదని ముషీర్ అంటున్నాడు. ఇక్కడి విద్యార్థులకు ‘డిజిటల్ తరగతి’ వంటి ఆధునిక బోధనా పద్ధతులను సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ఎఫ్‌ఎఎఫ్ కృషి చేస్తోంది. ఆర్థికంగా భారమైనప్పటికీ విరాళాలను సేకరించి పిల్లలను డిజిటల్ క్లాసులకు చేరువ చేస్తున్నామని ఎఫ్‌ఎఎఫ్ ఉపాధ్యక్షుడు సయ్యద్ షా మొహముద్ ఖాద్రీ చెబుతున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏ విధంగానూ తీసిపోకుండా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు ఎదగాలన్నదే తమ తపన అని ముషీర్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. ‘అందరూ అదృష్టవంతులు కారు.. అవకాశాలు లేని చిన్నారులను ఆదుకోవడమన్నది మన చేతుల్లోనే ఉంటుంది.. చదువు పట్ల పేదపిల్లల్లో ఆసక్తిని పెంచడం ద్వారా లభించే సంతృప్తికి సాటి ఏముంది?’ అని అంటున్నాడు.