భక్తి కథలు

కాశీ ఖండం.. 173

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓ మునీశ్వరా! ఉన్న వూరు, కన్నతల్లి ఒకే రకం వారనే నీతిని విని వుండవా? అంతకన్నా విశేషించి శివుడి అర్థాంగ లక్ష్మి కాశి! ఆ పట్టణం మీద ఆగ్రహించడం తగుతుందా?
వేయి శాఖలతో సామవేదం, ఇరవై యొక్క శాఖలతో రుగ్వేదం, తొమ్మిది శాఖలతో అధర్వణ వేదం, నూట ఒక్క శాఖలతో యజుర్వేదం ఒరిమతో కాశీలో వుంటాయి.
ఇంత గొప్పదైన కాశీ నగరంమీద భిక్షాన్నం లభింపని కారణంగా, నీ అంతవాడు అలిగి శపించతలంచుతాడా? విప్రుడివి కదా! నువ్వు ఏమన్నా చెల్లుతుంది! అంతకన్నా విశేషించి ఆకలిగొని వున్నావు. కనుక ఈ విషయంలో నిన్ను నిందించడం మా వంటి గృహిణులకి మెప్పు కలిగించదు. మా ఇంటికి భుజింపరమ్ము! భుజించి, తీరికగా కూర్చున్న తర్వాత నీతో ఆడవలసిన మాటలు కొన్ని వున్నాయి.
ప్రస్తుతం నా భర్త వైశ్వదేవం మొదలైన విధుల్ని నిర్వర్తించి, అతిథి రాకకి వేచి వున్నాడు. సహపంక్తి భోజనానికి అతిథి రాకుంటే నా పతి ఎటువంటి కఠిన పరిస్థితుల్లోను ఆరగించడు.
విప్రవరుడా! ఆకాశగంగలో స్నానాచమనాదులు ఆచరించి శీఘ్రంగా వేంచేయాలి. నా విభుడు దశమి (పదవ పడిలో వున్నవాడు) ఆకలికి ఓర్చుకోలేడు. సూర్యభగవానుడు పడమటి దిక్కుకి వ్రాలిపోయాడు. ఆమె మాటలు ఆలించి వేదవ్యాసుడు ఆ ముత్తయిదువతో ఈ కరణి వాకొన్నాడు.
‘‘ఓ పద్మలోచనా! నువ్వు కిన్నరాంగనవా? అలినీలవేణీ! నువ్వు గంధర్వ భామినివా? బింబోష్ఠి! నువ్వు అచ్చర లేమవా? రమణీ! నువ్వు విద్యాధర రాజకుమారివా?
కళ్యాణీ! ఈ కాశీలో నిన్ను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఎవరివమ్మా? నిన్ను సందర్శించగా సకలేంద్రియాలకి అత్యంతమూ సంతృప్తి కలుగుతున్నది. రాహుగ్రహం కోరలు అనే రంపం కోతకి వెరచి ఈ లోకానికి ఏతెంచిన చంద్రకళవా? నన్ను రక్షింపవచ్చిన నా పాలిటి భాగ్యదేవతవా? తప్పదు. నిజం. కైవల్య లక్ష్మివయినా కావాలి. లేకున్న స్ర్తి రూపం తాల్చిన కాశీపురిదైనా కావాలి. లేకుంటే ఆకలితో కడుపు నకనకలాడేవారిని ఊరడించి, అమృత భిక్షాన్నం ఒసగే విశాలాక్షివి అయి వుండాలి.
నువ్వు చెప్పిన రీతిగా చేయగలవాణ్ణి. బ్రాహ్మణుడిని కనుక నాకు చపలత్వం నైజం. ఓ పుణ్యసాధ్వీ! అనుగ్రహించి కాపాడు.. నా తల్లి వంటి దానవు. కావున నీ పేరు నాకు నిజంగా చెప్పు’’ అని అడిగాడు. అంత ఆ పుణ్య సాధ్వి వేదవ్యాసుడితో ఈ భంగి వచించింది.
‘‘నువ్వు ‘ఊ’ కొట్టుతూ వుండగా నేను చెప్పడానికి చాలా ఆలస్యం అవుతుంది. నువ్వా, ఆకలిగొని వున్నావు. భోజనానంతరం నిరభ్యంతరంగా చెప్పుతాను. వేళ అతిక్రమించిపోయేది. గంగలో స్నానమాడి తిరిగి భుజింపవిచ్చేయి..’’
అంత పారాశర్యుడు ఆ పూజ్యురాలితో ‘‘తల్లీ! ఒక విన్నపం వుంది. ఆకర్ణించవలసింది. నా శిష్యులు పదివేలమంది వున్నారు. ఆయా వీధుల్లో వేర్వేరుగా భిక్షాన్నం వేడి తీసుకొని రాగా, నేను కూడా ఒక వీధికి ఏకాంతంగా పర్యటించి పంచభిక్ష తెస్తాను. (అయిదు ఇండ్లనుంచి భిక్ష తెచ్చుకోవడం పంచభిక్ష)
ఈ రీతిగా ప్రతి దినము పర్యటించి బిచ్చమెత్తి నేను వెడలునప్పటికి, నన్ను- అగ్ని సమానులైన నా శిష్యులు పైలుడు, జైమిని మొదలైనవారు ముందుండి మెల్ల మెల్లగా కఠశాఖనీ, కఠోపనిషత్తునీ అధ్యయనం కావిస్తూ ఈ కాశీ పట్టణంలోని సూర్యవీధికి నన్ను కలవడానికి వస్తారు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి