జాతీయ వార్తలు

ఏప్రిల్‌కల్లా అన్ని రాష్ట్రాల్లో ఆహార భద్రతా చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: ఈ ఏడాది ఏప్రిల్ నాటికల్లా తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడం జరుగుతుందని కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం చెప్పారు. ఇప్పటివరకు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని అమలు చేశాయని, మరో 11 రాష్ట్రాలు అమలు చేసే ప్రక్రియలో ఉన్నాయని ఆయన చెప్పారు. 2013లో పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించగా, దీన్ని అమలు చేయడానికి రాష్ట్రాలకు ఒక ఏడాది గడువు ఇచ్చారు. అప్పటినుంచి ఈ గడువును గత ఏడాది సెప్టెంబర్ వరకు మూడుసార్లు పొడిగించారు. దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ప్రతి నెలా ప్రతి వ్యక్తి 5 కిలోల సబ్సిడీ ఆహార ధాన్యాలు కిలో రూపాయి నుంచి 3 రూపాయలకే పొందడానికి చట్టపరమైన హక్కును ఈ ఆహార భద్రతా చట్టం కల్పిస్తుంది. ‘మేము అధికారంలోకి వచ్చే సమయానికి ఆహార చట్టాన్ని కేవలం 11 రాష్ట్రాలే అమలు చేశాయి. ఇప్పుడు 25 రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని అమలు చేస్తాయి’ అని పాశ్వాన్ విలేఖరులకు చెప్పారు. ఇప్పటికీ ఈ చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాల్లో గుజరాత్, జమ్మూ, కాశ్మీర్, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ అరుణాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, మిజోరాం, దాద్రా, నాగర్ హవేలి, తమిళనాడు ఉన్నాయి.
ఆహార సబ్సిడీకి చెందిన నేరుగా నగదు బదిలీని పుదుచ్చేరి, చండీగఢ్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని పాశ్వాన్ చెప్పారు. దాద్రా, నాగర్ హవేలి కూడా ఈ పైలట్ పథకాన్ని అమలు చేయడానికి పూర్తి సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రజా పంపిణీ విధానం (పిడిఎస్)ను బలోపేతం చేయడానికి గత 19 నెలల్లో తీసుకున్న చర్యలను మంత్రి వివరిస్తూ రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయడం పిడిఎస్‌ను అక్రమాలకు తావు లేనిదిగా చేయడంలోకి ఒక ముఖ్యమైన అంశమని, దేశవ్యాప్తంగా ఉన్న 24.99 కోట్ల రేషన్ కార్డుల్లో 97 శాతం కార్డులను డిజిటలైజ్ చేయడం జరిగిందని, త్వరలోనే వందశాతం డిజిటలైజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 10.10 కోట్ల రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయడం జరిగిందని, 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆన్‌లైన్‌లో కేటాయించడం అమలు చేస్తున్నారని, 61,904 రేషన్ షాపులను ‘పాయింట్ ఆఫ్ సేల్’ పరికరాలతో అనుసంధానం చేయడం జరిగిందని పాశ్వాన్ చెప్పారు. ఈ ఏడాది మార్చినాటికి 2 లక్షల రేషన్ దుకాణాల్లో ఈ పరికరం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే ప్రజా పంపిణీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలను ప్రదర్శించడానికి ట్రాన్స్‌పరెన్సీ పోర్టల్‌ను 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అలాగే పిడిఎస్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక ఆన్‌లైన్ వ్యవస్థను అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఒకవేళ ఆహార ధాన్యాలను ఇవ్వని పక్షంలో లబ్ధిదారుడికి ఆహార భద్రత అలవెన్సు చెల్లింపునకు సంబంధించిన నిబంధనలను కూడా నోటిఫై చేయడం జరిగిందని పాశ్వాన్ చెప్పారు.