శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 23: అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కస్తూర్భా కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులైన ప్రేరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జ్ఞానమనేది ఏ ఒక్కరిదో కాదని, కష్టపడి చదివితే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని తెలిపారు. పదో తరగతి విద్యార్థి దశలో అతి ముఖ్యమైన దశ అని, ఈ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను నిర్ణయించుకొని దానికి అనుగుణంగా సాధన చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోల్చితే ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి ర్యాంకులను సాధించడం ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సూచనల మేరకు విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని ఉద్బోధించారు. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు అవసరమైతే మరిన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఆడపిల్లల చదువు గురించి కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలకు ఈరోజుల్లో విద్య ఎక్కువ అవసరమన్నారు. ఆర్థికంగా వారు తమ కాళ్లమీద నిలబడిననాడే వారు స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంటుందని అన్నారు. చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను వారి మీద నమ్మకం ఉంచి చదివిస్తున్నారని, వారి తల్లిదండ్రుల నమ్మకాలకు అనుగుణంగా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు మధుసూదనరావు మాట్లాడుతూ పాఠశాలలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారని, ఈ సామాజిక గ్రూపుల వారికి చదువు ఒక్కటే ఆధారమని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. చదువును మధ్యలో ఆపకుండా ప్రతిఒక్కరు కష్టపడి చదివి నిర్ణయించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ప్రముఖ మానసిక శాస్తవ్రేత్త, విశే్లషకులు హిప్నో కమలాకర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరి మెదడులో శక్తి ఉంటుందని దాన్ని ఉపయోగించే తీరునుబట్టి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రేరణ తరగతుల వల్ల మానసిక ఉల్లాసం చెంది పలు విషయాలు తెలుసుకొని ఎక్కువ మార్కులు సాధించగలరని అన్నారు. ఈ మోటివేషన్ కార్యక్రమం వల్ల విద్యార్థుల మెదడుల్లో ఉన్న శక్తిని మేల్కొలిపి వారు ఏ సబ్జెక్టులలో బలహీనంగా ఉన్నారో తమకు తాము తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు సాధించడం సాధ్యమవుతుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రముఖ సైకాలజిస్టు హిప్నో కమలాకర్‌చే ప్రేరణ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో ఒక్క స్కూల్‌కు చెందిన పరీక్షల జవాబుపత్రాలు వేరే స్కూల్ వారిచే దిద్దించడం జరుగుతుందని అన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు సంబంధించిన యూనిట్, క్వార్టర్లీ, అర్ధసంవత్సరం, సంవత్సరం టెస్టు మార్కులను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. శుభమస్తు షోరూమ్ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఎంతో సహకరించారని అన్నారు. శుభమస్తు షోరూమ్ అధినేత రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో 10కి 10 పాయింట్లు సాధించిన వారికి, వారికి నచ్చిన కళాశాలలో ఇంటర్‌మీడియట్ చదువుకునేందుకు తగిన ఆర్థికసాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హిప్నో కమలాకర్ మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు నెల్లూరు పరిసర ప్రాంతాల పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు.

వీడిన హత్య కేసు మిస్టరీ
* స్నేహితులే నిందితులు
వెంకటాచలం, జనవరి 23: మండలంలోని చెముడుగుంట నక్కల కాలనీ సమీపంలో చెరువు వద్ద ఈనెల 3వ తేదిన హత్యకు గురైన రౌడీషీటర్ పట్నం శ్రీహరి హత్య కేసు మిస్టరీ వీడింది. పాతకక్షలతో శ్రీహరిని అతని స్నేహితులే హత్య చేశారు. నిందితులు ఈనెల 12వ తేదిన కోర్టులో లొంగిపోయారు. కోర్టు అనుమతితో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈసందర్భంగా శనివారం నెల్లూరు రూరల్ సిఐ శ్రీనివాస్‌రావు విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి హత్య జరిగిన తీరును వెల్లడించారు. సిఐ కథనం మేరకు నెల్లూరుకు చెందిన గుర్రం గవాస్కర్ తేజ అలియాస్ గౌతమ్, గుంజు రవి అలియాస్ కత్తి రవి, వాకా అశోక్‌రెడ్డి అలియాస్ అశోక్ ఈనెల 3న నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్‌లో వున్న మద్యం బార్‌లో మద్యం సేవిస్తుండగా పట్నం శ్రీహరి మధ్యలో వెళ్లి వారితో కలిసి మద్యం సేవించాడు. తరువాత అందరు కలసి అక్కడి నుండి చెముడుగుంట పరిథిలోని నక్కల కాలనీ సమీపంలో వున్న చెరువు వద్దకు వెళ్లి అక్కడ మళ్లీ మద్యం సేవించారు. గతంలో శ్రీహరి గవాస్కర్ మధ్య గొడవలు జరిగినప్పుడు గవాస్కర్‌ను శ్రీహరి గాయపరిచాడు. అది మనస్సులో పెట్టుకున్న గవాస్కర్ అ విషయంపై శ్రీహరి వద్ద ప్రస్తావించగా వారి ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వివాదం పెద్దది కావడంతో గవాస్కర్ ఇద్దరి స్నేహితులతో కలిసి శ్రీహరి తల మీద హద్దురాళ్లతో మోది హత్య చేశారు. అనంతరం అక్కడ నుండి నిందితులు నెల్లూరులోని ఇస్కాన్ సిటీ వద్ద వున్న బావిలో హత్యకు వాడిన హద్దురాళ్లను అక్కడ పడేశారు. అయితే ఆందోళనకు గురైన నిందితులు తిరిగి హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి శ్రీహరి మృతదేహం ఎవరికీ కనపడకుండా చెరువు మధ్యలో ముళ్లచెట్లలో పడివేసి అక్కడి నుండి పరారయ్యారు. నిందితులు ఎఎస్ పేటలో జరిగిన ఉత్సవాలను చూసుకుని అక్కడ కొంతకాలం ఉన్నారు. తిరిగి అక్కడి నుండి నెల్లూరుకు వచ్చిన నిందితులు ఈనెల 12వ తేదిన కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన నిందితులను కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని వారి నుండి హత్య కేసు వివరాలను రాబట్టినట్లు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను తిరిగి కోర్టులో అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.

సినీ నిర్మాత ఎఎం రత్నం తల్లి అంత్యక్రియలు
బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 23:ప్రముఖ సినీ నిర్మాత ఎఎం రత్నం తల్లి నరసమ్మ అంత్యక్రియలు శనివారం బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పురప్రముఖులు, స్థానికులు నరసమ్మ అంత్యక్రియలకు హాజరై ఆమెకు నివాళులర్పించారు. పలువురు రత్నం, అతని సోదరుడు దయాకర్‌ను పర్మామర్శించారు.

అత్యాధునిక టెక్నాలజీ ద్వారా పోస్టల్ సేవలు
గూడూరు, జనవరి 23: దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్ట్ఫాసుల ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు న్యూఢిల్లీ పోస్టల్ సర్వీసెస్ బోర్డు టెక్నాలజీ మెంబర్ వి సుధాకర్ తెలిపారు. శనివారం ఆయన గూడూరులోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ దేశంలో 1.55 లక్షల పోస్ట్ఫాసుల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మార్చి 2016 నాటికి 40 వేల పోస్ట్ఫాస్‌లలో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో పోస్ట్ఫాసుల ఆధ్వర్యంలో 300 ఎటిఎంలు అందుబాటులో ఉండగా మార్చి నాటికి మరో 700 ఎటిఎంలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోస్టల్ శాఖ ఉద్యోగులు ఉన్నారు.

కండలేరు, పంబలేరు వాగును పరిశీలించిన
రాష్ట్ర నీటిపారుదల శాఖ నిపుణులు
మనుబోలు, జనవరి 23: గత వరదల వల్ల దెబ్బతిన్న జాతీయ రహదారిని రాష్ట్ర నీటిపారుదల శాఖ నిపుణులు శనివారం పరిశీలించారు. మండల పరిధిలోని కండలేరు వంతెనతోపాటు వరదల వల్ల గండిపడిన జాతీయ రహదారి, ఇదే ప్రాంతంలో కూలిపోయిన వంతెనలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ నిపుణులు రౌతు సత్యనారాయణ, కెవి సుబ్బారావు మాట్లాడుతూ కృష్ణపట్నం నుండి కండలేరు వాగు పారుదల అయ్యే ప్రదేశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు వరదల వల్ల రోడ్డు దెబ్బతినడానికి గల కారణాలను పరిశీలించి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ముఖ్యంగా కండలేరు, పంబలేరు పారుదల ప్రదేశాలు అక్రమణకు గురికావడం వల్ల నీరు వెళ్లే మార్గం లేక రోడ్లకు గండిపడ్డాయని చెప్పారు. కృష్టపట్నం వద్ద సముద్రం ముఖద్వారం గతంలో 3 కిలోమీటర్లకు పైగా ఉండగా కేవలం 380 మీటర్లు వుండడంతో నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో వరద ఉద్ధృతి ఎక్కువైందని తెలుగుదేశం నాయకుడు రాయపనేని రమణయ్యనాయుడు అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ రహదారిపై చిన్నచిన్న వంతెనలు నిర్మించడం వల్ల గండ్లు పడ్డాయని, ఇదే విధంగా మళ్లీ తిరిగి వంతెనల నిర్మాణం చేపడితే రైలు బ్రిడ్జిలు కూడా తెగే పరిస్థితి దాపురిస్తుందని చెప్పారు. ఇకనైనా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుని భవిష్యత్తులో సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ నిపుణుల కమిటీ సభ్యుడు ఎస్‌ఇ కెవి సుబ్బారావు, డిఇ సమీవుల్లా, ఎఇ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

తండ్రికి తగ్గ తనయుడు లోకేష్
మేయర్ అజీజ్ స్పష్టం
నెల్లూరు టౌన్, జనవరి 23: తెలుగుదేశం యువనేత నారా లోకేష్ జన్మదినం ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. శనివారం నగరంలోని నర్తకీ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నారా లోకేష్ జన్మదినాన్ని నారా లోకేష్ సేవా సమితి గౌరవాధ్యక్షులు వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి, అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారన్నారు. సిఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలకు ప్రోత్సాహిమిస్తూ పార్టీని ఒక కుటుంబంలా తయారుచేస్తున్నారన్నారు. కార్యకర్తల కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను లోకేష్ ప్రవేశపెడుతున్నారన్నారు. యువతకు మార్గదర్శకుడిగా, ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరంతరం కార్యకర్తల కోసం ఆలోచిస్తున్నారంటూ లోకేష్‌ని కొనియాడారు. అనంతరం నారాయణ వైద్యశాల సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసి నారా లోకేష్ సేవా సమితి కార్యకర్తలు రక్తదానం చేశారు. తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టిడిపి నాయకులు, మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, టి అనూరాధ, కొండ్రెడ్డి రంగారెడ్డి, నారా లోకేష్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఎం మధు, రాష్ట్ర కార్యదర్శి రామ్‌ప్రదీప్‌రెడ్డి, మస్తానయ్య, వైవి చౌదరి, జనార్దన్‌నాయుడు, డి సుబ్బారావు, బి శ్రీవిద్య, శ్రీహరి, ఎం రజని, రాజేంద్ర, సత్యనాగేశ్వరరావు, ఎం పెంచలనాయుడు, వేనాటి రామచంద్రారెడ్డి, ఎ జానకి, శ్రీనివాసులునాయుడు, దేశాయిశెట్టి హనుమంతరావు, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి పాల్గొన్నారు.

ఎర్రచందనం దొంగలపై గట్టి నిఘా
టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు స్పష్టం
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 23: ఎర్రచందనం అక్రమ తరలింపుపై గట్టి నిఘా ఉంచినట్లు టాస్క్ఫోర్స్ డిఐజి ఎం కాంతారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కవాతు మైదానంలో ఉన్న ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉయన మాట్లాడుతూ ఎర్రచందనం దొంగతనాలు, అక్రమ తరలింపులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇప్పటికే అక్రమ రవాణాకు పాల్పడే పాత నేరగాళ్ల ఫొటోలు సేకరించామన్నారు. పోలీస్ గస్తీ సమయంలో వారి ఫొటోలు ఆయా ప్రాంతాలలో ప్రదర్శించి వారిని వాకబు చేస్తున్నట్లు తెలిపారు. ఆ వృక్ష సంపదను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఎర్రచందనం దొంగల విషయంలో స్థానిక పోలీస్ అధికారుల సహకారం అవసరమన్నారు. వాస్తవానికి ఎర్రచందనం తరలింపు, దొంగతనాల్లో స్థానికుల పాత్ర అత్యల్పమని, వారిని వాటిని అక్రమంగా తరలించే కరడు గట్టిన నేరస్థులు స్థానికులను ప్రలోభ పెడుతున్నారన్నారు. జిల్లా అటవీ, పోలీస్ అధికారుల సమన్వయంతో ఎర్రచందనం దొంగతనాలు, అక్రమ రవాణా జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎఎస్‌పి రెడ్డి గంగాధరరావు, జిల్లా అటవీ అధికారి పి రామకృష్ణ, ఎస్‌బి డిఎస్పీలు కోటారెడ్డి, విక్రమ శ్రీనివాసరావు, కావలి, గూడూరు, ఆత్మకూరు డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

జీవజలం వృథా!
ఆత్మకూరు మున్సిపాలిటీలో నిర్లక్ష్యం
ఆత్మకూరు, జనవరి 23: ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలో తాగునీటి వృథా భారీగా జరుగుతున్నా అధికారులు, సిబ్బంది పనితీరులో మార్పు రావడంలేదు. శనివారం సాయంత్రం ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని నీటి సంప్‌ల నుంచి నీళ్లు నేలపాలయ్యాయి. ఓ సంప్ నిండిన తరువాత మరో సంప్‌లోకి నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఆ దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్ల తరచూ పెద్దఎత్తున నీటి వృథా జరుగుతోంది. అదే సందర్భంలో ఆ కార్యాలయ ప్రాంగణంతో సహా పక్కనే ఉన్న ఆర్డీఓ ఆఫీస్, తదితరాలతోపాటు తిప్పపై నుంచి కిందకు వెళ్లే రోడ్డు అంతా నీరు ప్రవహిస్తూ రొచ్చురొచ్చు పరిస్థితులు ఏర్పడ్డాయి. జనం ఆ రోడ్డున అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని రీతిలో నీటి ప్రవాహ ఉద్ధృతి నెలకొంటోంది. నీటి వృథాతో సహా రోడ్డు మరమ్మతులకు గురయ్యే దుస్థితికి దారితీయడం బాధాకరమైన పరిణామం.

ఘనంగా చండీయాగం
సూళ్లూరుపేట, జనవరి 23: సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో శనివారం మహా చండీయాగం వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాల మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నెలకొల్పి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు.
అమ్మవారి సేవలో ఐఎఎస్ అధికారి
చెంగాళమ్మ దేవతామూర్తిని రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ అనిల్‌చంద్ర పునేత దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఇఓ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

‘రహదారి సూత్రాలు పాటించాలి’
గూడూరు, జనవరి 23: వాహనచోదకులంతా తప్పనిసరిగా రహదారి సూత్రాలను పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని నెల్లూరు రవాణా శాఖ కమిషనర్ శివరామ్‌ప్రసాద్ అన్నారు. శనివారం గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో 27వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ అధిక శాతం రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం రహదారులు బాగున్నందున అతివేగంతో నడపడం, నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా అనేకచోట్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. వీటి నివారణకు వాహన డ్రైవర్ ప్రశాంత మనస్సుతో వాహనాలను నడిపి రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా చేయాలని కోరారు. విద్యార్థులు మోటార్‌సైకిళ్లపై చేస్తున్న విన్యాసాల వల్ల తమ కుటుంబ సభ్యులకు పుత్రశోకం కలిగిస్తున్నారని గూడూరు ఆర్టీవో బి చందర్ అన్నారు. ప్రతిఒక్కరూ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు జకీర్ అహ్మద్, కరుణాకర్, కళాశాల ఎవో జె రామయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 23: ఎస్‌సి, ఎస్‌టి కేసులలో బాధితులకు సత్వరమే న్యాయం, నష్టపరిహారం అందించటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎం జానకి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గోల్డెన్ జూబ్లీ హాలులో శనివారం జరిగిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియలో పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పూర్తిస్థాయిలో పరిహారం అందేలా కేసులు త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి వర్గాల భూములకు సంబంధించిన కేసులలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అట్రాసిటి చట్టంలోని నిబంధనలు అమలుపరచటంలో, వారి సంక్షేమం, పునరావాసం కల్పించటంలో పోలీస్, రెవెన్యూ, సంక్షేమ శాఖలలో జాప్యం తగదన్నారు. ఉప ప్రణాళిక నిధులపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సక్రమ వినియోగానికి చర్యలు చేపడతామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కాలనీలలో వౌలిక వసతులు కల్పించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందిపై వచ్చిన అభియోగాలపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌పి గజారావు భూపాల్ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలకు సంబంధించి బాధితులు చేసిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి న్యాయం చేస్తామన్నారు. ప్రత్యేకించి మండల స్థాయిలో నెలకొకసారి అట్రాసిటి కేసులపై సమీక్షించి అవి ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలించి త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. నగర పరిధిలో మంజూరైన 42 కోట్లు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి హాస్టళ్లకు సంబంధించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గూడూరులో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. సమావేశంలో ఎజెసి సాల్మన్ రాజ్‌కుమార్, డిఆర్వో సుదర్శన్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి మధుసూదన్‌రావు, నెల్లూరు, కావలి, ఆత్మకూరు, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, నరసింహన్, ఎంవి రమణ, కమిటీ సభ్యులు మాలకొండయ్య, ఎం హరిప్రసాద్, సుధాకర్, మాలకొండారెడ్డి, రామచంద్ర శరత్, బషీర్, ఎం మాలకొండయ్య, నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట డిఎస్పీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.