సాహితి

అమ్మమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మమ్మా వాన పడుతోంది’
ఆరుబయట పక్కలో పడుకొన్న మనవడు ఉలిక్కిపడినప్పుడు
‘పడనీరా చల్లగా ఉంటుంది’అన్న అమ్మమ్మ మాట
అతని జీవితానికొక చూపునిచ్చింది

వానకి భయపడి ఇంటిలోకి పరుగెట్టనక్కరలేదు
వానలో తడవటం బావుంటుంది
దయలాంటి వానకి, ప్రకృతిలోని అందమంతా కరిగి నీరైనట్లు పడేవానకి
నిన్ను అర్పించుకోవటం బావుంటుంది

మట్టివాసనల్ని మేల్కొలుపుతూ
నిన్ను అర్ద్రతలోకి చల్లగా నడిపించే వాన పట్ల,
వాన లాంటి జీవితం పట్ల నీకుండాల్సింది భయం కాదు, ప్రేమ

అమ్మమ్మ దేనినీ ధిక్కరించలేదు
ఎవరినీ ఎప్పుడూ గద్దించగా చూడలేదు

భూమిలాంటి అమ్మమ్మ
అంత ఉమ్మడి కుటుంబానికీ కేంద్రమై కూడా
తనని నేపధ్యంలోనే నిలుపుకొంది

తాతయ్య తడినిండిన మేఘ గర్జనలకి
ఆమె బెదురుతున్నట్లు వుండేది కాని
ఆమె బెదిరే మనిషి కాదని తాతయ్యికి తెలుసు
భయం చివర సమస్త జీవితాన్నీ దీవిస్తున్నట్టు విచ్చుకొనే
ఆమె చిరునవ్వు చూసిన మనవడికీ తెలుసు

జలధరం లాంటి ఉమ్మడి కుటుంబం క్రమంగా
తెల్లని మబ్బుతునకలుగా చెదిరిపోయి
జీవిత సహచరుడూ సెలవులు తీసుకొన్న చివరి రోజులలో
కూతురు అమ్మయి రుణం తీర్చుకొంటున్నపుడు

అగాధమైన నిశ్శబ్దం నిండిన కన్నులలో
చివరి రోజులోకి భయం లేక ప్రయాణిస్తున్నట్లుండే
ఆమె జీవ స్పందనలని గమనించినప్పుడల్లా
యవ్వనపు తొందరల మధ్యనున్న మనవడు
అమ్మమ్మ ఏం ఆలోచిస్తుందీ అని విస్మయపడుతూనే ఉండేవాడు
ఒక ఉక్కపోసే సాయంత్రంలోకి చేరుకొన్న మబ్బులు

చినుకుల్లా కరిగి భూమిని నిశ్శబ్దంగా తాకుతుంటే
గదిలోంచి బయటకు వెళుతున్న మనవడితో ఆమె
‘ఏమిటది, వానపడుతోందా’ అన్నపుడు
అతను ఊహించలేదు అవి తనతో ఆమె చివరి మాటలని
ఉక్కపోతతో నిండనున్న జీవితంలోంచి చివరి వానాకాలం వెళ్ళిపోనుందని

జీవితం అమ్మమ్మలా దయగలదీ, ఓర్పు నిండినదీ
కాదని తెలుసుకొంటున్నా
దానిని ప్రేమనిండిన చిరున్వుతో ముగించటమెలాగో
ఆమె నీడలో పెరిగిన కూతురు కొడుకు నేర్చుకొన్నట్టే ఉన్నాడు

బహుశా, అందుకనే
గాయాలతో నిండిన జీవితాన్ని
ప్రేమనిండిన కవిత్వంగా మార్చగలుగుతున్నాడు

- బివివి ప్రసాద్, 9032075415