సాహితి
వాన వెలిసాక...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాన వెలిసాక
అప్పటివరకూ గదిలో విసిగిన ప్రాణం
కిటికీలోంచి వీచిన తెమ్మర స్పర్శతో
ఉన్నట్టుండి తేలికపడుతుంది
మట్టి మెత్తని పరిమళపు పువ్వై
విచ్చుకుంటుంది
చూరునుండి కారిన నీటిచుక్కల్ని
నేల చప్పుడు చేస్తూ చప్పరిస్తుంది
చిరుగాలి తన అలల చేతులతో
అప్పటికే తడిసిన మొక్క తల నిమురుతుంటే
బుగ్గపై చినుకు ముత్యాన్ని అద్దుకున్న మొగ్గ
చిలిపిగా తలూపుతుంది
వాన వెలిసాక
నింగి ముఖం కడుక్కున్నట్టు
తేటగా అగుపిస్తుంది
మోడువారిన కొమ్మ
చిగురు తొడిగే ప్రయత్నంలో
తలమునకలౌతుంటే
పుడమి గర్భంలోని తడికి
జలదరించిన విత్తు
లోకాన్ని చూద్దామని
రెండు పచ్చని కనురెప్పలు పైకెత్తుతుంది
అప్పటివరకు వానను
ఆనందంగా ఆస్వాదించిన పసివాడి
మోములోని సీతాకోక
ఉదయానే్న వెలిసిన వాన చూడగానే
ఎక్కడికో ఎగిరిపోయంది
భానుడు కిరణాలను
భుజాన తగిలించుకుని
తూర్పు తెరపై చేరి నవ్వుతూ
చల్లబడిన వాతావరణాన్నంతా
నెమ్మదిగా వేడెక్కిస్తున్నాడు
పిలవని పేరంటంలా వచ్చి
పలకరించే వాన కోసం మాత్రం
అందరూ పలవరిస్తూనే వుంటారు
ఆ ఆహ్లాదకర సమయం కోసం
అర్రులు చాస్తూనే ఉంటారు