అక్షర

అసిమోవ్ అద్భుత ఆవిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజాక్ అసిమోవ్‌తో జీవితం
కొన్ని జ్ఞాపకాలు
రచన: జావేట్ జెప్సన్ అసిమోవ్;
అనువాదం: త్రిమూర్తి;
అలకనంద ప్రచురణలు, విజయవాడ- 520 008.
పే: 255;
వెల: రూ.225/-

అసిమోవ్ చెయ్యి తిరిగిన, ప్రపంచమంతటా పేరున్న సైన్స్ రచయిత. ఎంత సైన్స్ రాశాడో అంతగా కల్పన (సైన్స్) కథలు కూడా రాశాడు. మరమనుషుల ఆలోచనకన్నా ముందే వాటికి కొన్ని నియమాలు తన కథలలో రాసిన ఘనుడు అసిమోవ్. ఆయన పోయి 20 ఏళ్లు దాటింది. అసిమోవ్ రచనలు తెలుగులోకి ఎంతగా వచ్చాయో తెలియదు. రాలేదనే అనాలి. ఈమధ్యన కొద్దిగా వచ్చాయి. ఆయన రచనల గురించే తెలియని తెలుగు పాఠకునికి ఆయన గురించి చెప్పే ప్రయత్నంచేశారు ప్రచురణకర్తలు. అసిమోవ్ భార్య జానెట్ స్వయంగా వైద్యురాలు. భర్తతో, ఆయన భారాలు, బతుకు పంచుకున్న అనుభవాలను ఆమె పుస్తకంగా రాయడానికి పూనుకున్నారు. సహజంగానే భర్త గురించి చెప్పినదానికన్నా తన గురించి ఎక్కువ చెప్పుకున్నారు.
ఇద్దరి బతుకుతీరు, భావాలు వేరువేరు. చిన్ననాటి నుంచీ ఇద్దరి తీరుల్లో తేడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సంగతులను మనముందు ఉండడంలో జానెట్ అరమరికలు, అనుమానాలు లేకుండా రాసిన తీరు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంది. మతం గురించి మొదలు మనస్తత్వాలు, తెలివిలేనితనం పట్ల అసహనం, సెక్స్, వైద్యం, ఎనె్నన్నో సంగతులను గురించి చేసిన వ్యాఖ్యానాలు, వర్ణనలు, చర్చలు సీరియస్ పాఠకులను ఆలోచింపజేస్తాయి.
ప్రయాణాలు, క్యాంపులు, అతని పట్టలేనితనం మొదలయిన అంశాలు రచయిత్రిలోని కథకురాలని పరిచయంచేస్తాయి. పుస్తకంలో అనుబంధంగా ఆమె రాసిన కథలు కూడా ఉన్నాయి. అవి చాలానే ఉన్నాయి. ఆసక్తికరంగా ఉన్నాయి కూడా.
పుస్తకం మొత్తం చదివిన మీద, అసిమోవ్ గురించి మరింత తెలుసుకోవాలన్న భావం మిగిలింది. ఇందులో చాలా చెప్పి ఉండవలసింది అనిపించింది. ఎందుకంత తక్కువ రాశారో మరి!
అనువాదం గురించి ఒక మాట అవసరమనిపించింది. మొదటి భాగంలో విషయమే చాల చిక్కుగా ఉంది. అనువాదం అన్యాయంగా ఉంది. సొంత మర్త్యత్వం, అంచేత, తన్ను, స్వాంతన, గూఢాచారి లాంటి మాటలు, ఇంగ్లీషు తరహా వాక్య నిర్మాణం అడ్డుతగిలి చదవనివ్వలేదు. తరువాత భాగంలో (ఓపికగా ముందుకు చదివితే) కొంత బాగానే నడిచింది. ఈ విషయంలో ప్రచురణకర్తల బాధ్యత, సంపాదకుల అవసరం, (మళ్లీ!) గుర్తుకువచ్చాయి. అందరూ మరింత బాధ్యతతో పనిచేస్తే పాఠకులకు మంచి పుస్తకాలు అందుతాయి.
ఈమధ్యన అనువాదాలు బాగా వస్తున్నట్లుంది. అది ఎంతో అవసరం. అయితే జాగ్రత్తగా మంచి అనువాదాలు చేయించాలి. ఈ పుస్తకం ఆ దారిలో ఒక ప్రయత్నం!!

-కె.బి.గోపాలం