అక్షర

ఆలోచనలకు అక్షర రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనలు ఆలోకనలు
-పాలంకి సత్య
పుటలు: 224
వెల: రూ.150
ప్రతులకు: సాహిత్య నికేతన్,
3-8-652,
కేశవ నిలయం
బర్కత్‌పురా, హైదరాబాద్-29
*
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నది ఆర్యోక్తి. బుద్ధి జీవి అయిన మానవుడు చూసిన దృశ్యాల గురించి ఆలోచిస్తాడు. నేత్రాలతో చూసిన వాటిని మనోనేత్రంతో చూడగలిగినపుడు ఆలోచనలు పరుగులు తీస్తాయి. ఆలోచనల, ఆలోకనలో సమన్వయానికి అక్షర రూపమే పాలంకి సత్య రచించిన ‘ఆలోచనలు ఆలోకనలు’ పుస్తకం. ఈ పుస్తకంలో నూట పదిహేడు శీర్షికలు ఉన్నాయి. అవి అయిదు అధ్యాయాలుగా విభజింపబడ్డాయి.
మొదటి అధ్యాయం ‘మహిళా ప్రపంచం - మనోగతం’లో ఇరవై ఏడు వ్యాసాలు పొందుపరచబడ్డాయి.
‘న స్ర్తి స్వాతంత్య్ర మర్హతి’ అన్న వాక్యం చెప్పి, మనువు స్ర్తి స్వేచ్ఛను నిషేధించాడన్న నమ్మకం చాలామంది స్ర్తిలలో ఉంది. కానీ ఇంట్లో ఆప్తులైన పురుషుల మధ్య ఉన్నప్పటికీ స్ర్తిలు రక్షణ లేనివారే. ఎవరైతే తమకు తాము రక్షించుకొంటారో వారే సురక్షితలు అని మనువు చెప్పాడన్న విషయం ‘మనువు అన్నది - మనం అనుకుంటున్నది’ అన్న వ్యాసంలో వివరించబడింది.
గాంధీ బ్రిటిష్ వారిపై పోరాటానికి ముస్లింల మద్దతు సంపాదించాలంటే టర్కీలో జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమానికి బాసటగా నిలవాలని భావించారు. ఖలీఫా పాలనలో సామాన్యుల ఇక్కట్లు వారి దృష్టికి రాలేదు. అదృష్టవశాత్తూ ఖలీఫా అధికారం నిలబడి తీరాలన్నా ఉద్యమం ఫలించలేదు. ఇస్లాం ఫండమెంటలిజానికి చిహ్నమయిన ఉద్యమమూ, ఆ ఉద్యమానికి భారతదేశంలో లభించిన మద్దతూ మన దేశ చరిత్రలో మాయని మచ్చలు అన్న విశే్లషణ ‘ఖిలాఫత్ ఉద్యమం - ఒక సాధారణ స్ర్తి దృక్పథం’ వ్యాసంలో ఉంది.
రెండో అధ్యాయం ‘సంస్కృతి నేర్పే సంప్రదాయం’లో కూడా ఇరవై ఏడు వ్యాసాలు చోటు చేసుకున్నాయి.
వధువుని ఎన్నుకొనేటప్పుడు చూడాల్సినవి ఏమిటి? కేవలం శరీర వర్ణాన్ని చూసి నిర్ణయించవచ్చునా? తెల్లరంగు ఉన్న అమ్మాయిలకు ఉన్న డిమాండు పత్రికా ప్రకటనలు చూస్తే తెలుస్తుంది. కేవలం రంగు మాత్రమే కాదు ఇతర సుగుణాలని గమనించాలన్న అభిప్రాయం ‘తెల్లతోలుపై మోజు తెల్లదొరతనాన్ని అంగీకరించడమే’ అన్న వ్యాసంలో ఉంది.
నేటి బాలలే రేపటి పౌరులు అన్నది ఆర్య వాక్యం. వారిని ఉత్తములుగా తీర్చిదిద్దేటందుకు పాఠశాలలు ఎంతవరకూ కృషి చేయగలుగుతున్నాయి? చిన్నతనం నుంచే మాతృభాషలో కాకుండా పరాయి భాష అయిన ఆంగ్లంలో చదువు నేర్పించడం జరుగుతోంది. ‘వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా’ అన్న పాటకు బదులుగా ‘రెయిన్ రెయిన్ గో అవే, లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే’ అన్న పాట నేర్చుకుంటున్నారు. అపూర్వ స్నేహానికి గుర్తుగా డేమర్, విథియస్ కథ చెప్తాము కాని కృష్ణ కుచేలోపాఖ్యానం చెప్పరు లాంటి ఉదాహరణలు ‘మన సంస్కృతి దూరమైన పసిపిల్లల చదువు’ శీర్షికలో ఉన్నాయి.
మూడో అధ్యాయం ‘రాజనీతి - పౌర ధర్మం’లో పద్దెనిమిది వ్యాసాలు పొందుపరచబడ్డాయి. పాలకులు సమర్థ పాలన అందించకపోతే జరిగే అనర్థాలు ‘తెలివితక్కువ వారు పాలకులైతే’ అన్న వ్యాసంలో సోదాహరణంగా విశదీకరించబడ్డాయి. వానకు మట్టి గోడ కూలిపోతే ఎవరిని శిక్షించాలన్న ప్రసక్తి రాజుగారి ముందుకు వచ్చినపుడు వానదేవుడు, మేఘాలు, కుమ్మరి ఆనం, ఆనంలో కుండలు తయారుచెయ్యమని చెప్పిన పెళ్లికొడుకు.. వీరందరిలో ఎవరిని శిక్షించాలి అన్నపుడు రాజుగారు పెళ్లికొడుకుని శిక్షార్హుడిగా తేలుస్తారు. కాని పెళ్లికొడుకు సన్నగా ఉండడం వల్ల కొరత వేయడం సాధ్యపడదు. లావుగా ఉన్నవాణ్ణి వెతికి కొరత వేయిస్తాడు రాజు. నేటి పాలకుల నిర్ణయాలు కూడా జనహితానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి కదా!
నాలుగో అధ్యాయం ‘చరిత్ర అందించే విజ్ఞానం’లో కూడా పద్దెనిమిది వ్యాసాలు చోటు చేసుకున్నాయి. ‘అధ్యయనం చాలదు ఆచరణ ముఖ్యం’ అన్న వ్యాసంలో అవగుణాలు వదిలెయ్యడం ఎంత ముఖ్యమో, అవగుణాలున్న కుహనా గురువులని గుర్తించి వదిలెయ్యడం అంతే అవసరం’ అన్న సూత్రం వక్కాణించబడినది.
నేడు మనోవైజ్ఞానిక శాస్త్రం ద్వారా అనేక మంది మానసిక సమస్యలు నుండి బయట పడుతున్నారు. ప్రపంచంలో తొలి మనోవిజ్ఞానవేత్త ఎవరు అన్న ప్రశ్నకు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అన్న సమాధానం సూచించబడినది.
చివరి అధ్యాయంలో ‘ఇదిగో అసలు రహస్యం అదే ఆధ్యాత్మికం’లో నిజమైన చింతామణి, అసంతృప్తికి అసలు కారణం, శ్రోతలూ శిష్యులు అనేక రకాలు, భగవంతుని కట్టివేయగల్గింది ప్రేమ మాత్రమే తదితర వ్యాసాలు పొందుపరచబడ్డాయి. ఆచరణాత్మకమైన సూచనలతో ప్రబోధాత్మకమైన సూచనలున్న ‘ఆలోచనలు ఆలోకనలు’ పుస్తకం అన్ని వయసుల వారూ చదువతగినది.

-పి.సత్యనారాయణ