అక్షర

పిల్లల ప్రపంచంలోకి వెళదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రమజీవన
విద్యా విప్లవ కావ్యం
-యం.శివరాం,
పే: 280,
వెల: రూ.112/-,
మంచి పుస్తకం,
వీధి నెం.1, తార్నాక,
సికింద్రాబాద్, ఫోన్:9490746614
**
ఇంతకూ ఏమిటి ఈ పుస్తకం? అన్న ప్రశ్న అనివార్యం! పిల్లల చదువులు జరగవలసిన రీతిగా జరగడం లేదని అందరూ అంటారు. జరగవలసిన విప్లవాన్ని గురించి ఆలోచించి, అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్న శివరాం గారు ఈ పుస్తకం రాశారు. ఆయన మాట్లాడారు. పథకాలు, ప్రయోగాలు, ఫలితాలు, పరిస్థితుల గురించి వరుసబెట్టి చెప్పారు. ఆ మాటలే ఈ పుస్తకంలో ఉన్నాయి. అంతేగానీ, ఇది పద్యాలు ఉండే కావ్యం కానే కాదు.
స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరెంట్స్ అన్న మాటల మొదటి అక్షరాలను చేర్చి శివరాం గారు స్టెప్ అనే కార్యక్రమం రూపొందించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ నాలుగు వర్గాల చేత వేయిస్తున్నారు. ‘చదువు పేరిట పిల్లలు హింసకు గురవుతూ తమ సహజ శక్తులను పోగొట్టుకుంటున్న తీరు’ గురించి ఆయన కొత్త గొంతుకతో ముక్కుమీద గుద్దినట్టు చెపుతాడు అన్నారు పుస్తకాన్ని పరిచయం చేసిన పంతంగి రాంబాబు. శివరాం వామపక్ష ధోరణిలో సాగిన వ్యక్తి. జిడ్డు కృష్ణమూర్తి బోధనలను వొంట బట్టించుకుని ఆయన ఆలోచనలు మార్చుకున్నారు. ‘నిజాన్ని వెతుకుతూ, స్వతంత్రంగా, భయం లేకుండా బతుకు గురించి తెలిసి’ బతకాలంటారు శివరాం. తమ ప్రయత్నంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు, పంతుళ్లు, బడి నడిపే వారితో కలిసి ప్రయోగాలు చేస్తున్నారు. ఆ అనుభవాలనే ఈ పుస్తకంలో అందించారు.
పుస్తకం, చిత్రంగా అధ్యాయాలు, శీర్షికలు లాంటివి లేకుండా ఏకధాటిగా రాశారు. ఎందుకో అర్థం కాలేదు. చెప్పిన తీరు ఎంత బాగున్నా, విషయం ఆలోచనలకు దారి తీయవలసినది. అందుకు వ్యవధానం, అక్కడక్కడ ఎక్సర్‌సైజులు ఇస్తే ఎంతో బాగుండేది.
కథనంలో సంగతి మారినపుడల్లా ‘ఎండ తీవ్రంగా వుంది. రాత్రి చల్లగా లేదు’ లాంటి మాటలు వస్తాయి. రచయితలోని ప్రకృతి ఆరాధకుడు కనబడతాడు. ‘టీచర్ తను కల్పించుకున్న ప్రపంచంలో తాను కూరుకుపోయి ఉంటాడు. స్టూడెంట్ తన కల్పనా ప్రపంచంలో తాను కూరుకుపోయి ఉంటాడు. ఈ రెండు కలవవు!’, ‘ప్రతిదాన్ని ఓ పద్ధతిలో, అదీ తెల్సిన పద్ధతిలో, చట్రంలో, మూసలో ఇముడించాల్ననీ, మూసపోయాల్ననీ చూస్తుంది ఆలోచన’!, ‘ఆలోచనలన్నీ కల్మషాలవే, మన మనసులో జ్ఞాపకాల్లో నిక్షిప్తమయినవన్నీ ఈ గతపు కల్మషాలే!’- ఈ వాక్యాల చివర ఆశ్చర్యార్థకాలు పుస్తకంలో లేవని మనవి. అందరూ అవునన్నా, కాదన్నా ఈ ఆలోచనలు, అభిప్రాయాలు మన మెదడుకు పనిపెట్టగలవి!
నీ పేరే రాస్తాను.. అనే కవిత (శ్రీశ్రీది) ఆధారంగా జరిగిన ప్రయోగం. పిల్లల దేహబాధ గురించి పట్టించుకోని బడి యాజమాన్యాలు, ఎన్నో వివరణలు, అన్ని ఆలోచింపజేసేవి. నిజానికి ఈ సంగతులను రచయిత కొత్తగా కనుగొని చెప్పారంటే అబద్ధం. అన్నీ తెలిసినవే, అయినా ఏర్చి, కూర్చి చెప్పినందుకు వారిని అభినందించాలి. కొన్ని అభిప్రాయాలు మాత్రం ‘ముక్కుమీద గుద్దినట్లు’ ఉంటాయి. వాటికీ సిద్ధంగా ఉండాలి.
పుస్తకంలో మాటల తీరు మరింత సులువుగా ఉంటే, మరింత మందికి ఈ ఆలోచనలు సులభంగా అందేవి. ప్రపంచం గురించి, పిల్లల ప్రపంచం గురించి పట్టించుకునే వారందరూ చదవవలసిన పుస్తకం ఇది. చదివి ఊరుకుంటే ప్రయోజనం ఉండదు మరి!

-కె.బి.గోపాలం