అక్షర

దాంపత్య బంధాల విలువ తెలిపే కథన చాతుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరూ ఇద్దరే
(నవల)
దూరి వెంకటరావు
పుటలు: 120,
వెల: రూ.80/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు.

దంపతుల మధ్య సదవగాహన, సహనం, సహానుభూతి వుంటే ఆ సంసారం సుఖసంతోషాలతో వెల్లివిరుస్తుంది. ఆధునిక జీవిత విధానంలో దీనిని సాధించడం అంత సులభం కాదు. పరిస్థితులు అనూహ్యంగా మారాయి. మనోభావాలు వెనుకటి మాదిరి లేవు. అభిరుచుల్లో వ్యత్యాసముంటుంది. అవకాశాలు వేరుగా వుంటాయి. వ్యక్తిపరంగా స్వేచ్ఛకోరుకునే సందర్భాలు భిన్నంగా వుంటాయి. ఇలాంటి అనేక కారణాలవల్ల దాంపత్య సంబంధాలను పూర్వస్థితితో పోల్చుకోవడానికి వీలులేదు.
‘ఇద్దరూ ఇద్దరే’ నవలలో దూరి వెంకటరావు దాంపత్య సమస్యను ప్రధాన భూమికగా తీసుకున్నారు. రెండు కుటుంబాల కథ అయినప్పటికీ మరో రెండు కుటుంబాల ప్రస్తావన ఉపకథగా నడుస్తుంది. సన్నివేశ పరంపరలో నవలను ఉత్కంఠ భరితం చేశారు. ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ధారావాహికగా ప్రచురితమైన ఈ నవల రచయిత శిల్పచణతకు తార్కాణంగా నిలుస్తుంది. ఊహించని మలుపులు తారసపడినప్పుడు పాఠకులు ఆశ్చర్యపోతారు.
‘‘సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. షాపింగ్‌కి సిద్ధంగా వుండు- అని చెప్పి వెళ్లిన సంజయ్ ఎంతకీ రాకపోయేసరికి శృతికి చిర్రెత్తింది’’తో నవల ప్రారంభమవుతుంది. ఈ ఒక్క వాక్యంలో చాలా సంగతులు వెలుగులోకి వచ్చాయి. భార్య శృతి అభిరుచి, భర్త సంజయ్ కార్యాలయం పనివల్ల ఇబ్బంది అర్థమవుతాయి. వీరికి పెళ్లయి మూడేళ్లయినా ఇంకా సంతానం కలగలేదు. సంజయ్ ఒక కంపెనీలో డైరెక్టరుకు పి.ఎ.గా పనిచేస్తున్నాడు. బాధ్యతలెక్కువ. తీరుబడి వుండదు. శృతికి భర్తతోపాటు సరదాగా కాలం గడపాలని కోరిక. అది జరగడం లేదు. పైకి ఇందుకు భిన్నంగా కనిపించే దంపతులు సౌజన్య, మనోజ్. వారికో పాప దీప. మంచి ఉద్యోగం. కారు వుంది. ఆ జంట విందు వినోదాలకు అవకాశాలు ఎక్కువ. ఇది గమనించిన శృతి మరింత నిరాశకు లోనయింది. ఈ రెండు జంటల జీవిత సరళి గురించి రచయిత కథన చాతుర్యంతో పాఠకుల్ని నవల సగభాగం వరకు వింతభ్రమలో వుంచడం గమనార్హం. ఉపకథ ప్రధాన ఇతివృత్తంలో ఒక ముఖ్యాంశంగా ఉపకరిస్తుంది. సునంద, గంగాధరం దంపతులు. మూడోఏడు వచ్చిన కొడుకు తల నీలాలు ఇచ్చేందుకు తిరుపతి వెళ్తారు. మోసంతో ఒకావిడ బాబును ఎత్తుకుపోతుంది. సునంద పిచ్చిదవుతుంది. ఆమె మనసు కుదుటపరచేందుకు గంగాధరం తనతోడల్లుడు తాతారావు, అతని భార్య దుర్గమ్మ, వారి బిడ్డను తన ఇంట్లో వుంచుకుంటాడు. తాగుడుకు బానిసైన తాతారావు అక్కడ ఎక్కువ రోజులుండలేదు. సునంద కన్నుమూస్తుంది. గంగాధరం ఒంటరివాడవుతాడు. ఒక అనాథ బాలుణ్ణి చేరదీసి చదివిస్తాడు. పై చదువులకు కావలసిన పైకం అతని పేర జమచేసి ఎటో వెళ్లిపోతాడు.
సంజయ్ ప్రమోషన్ రావడంతో తీరిక చిక్కింది. శృతి కోరుకున్న జీవితం లభించింది. వాస్తవానికి సంజయ్‌కి శృతిపైన ఎంతో ప్రేమ. అది ఇప్పుడు శృతి తెలుసుకోగలిగింది. ఒకరోజు శృతితో సినిమాకి వెళ్తుంటే రోడ్డుపైన గంగాధరం మృతదేహం కనిపిస్తుంది. సంజయే దహన సంస్కారాలు చేస్తాడు. ‘‘కన్నతండ్రితోనే తలకొరివి పెట్టించింది పాశం’’అనే వాక్యం ద్వారా సంజయ్ గంగాధర కొడుకని రచయిత ధ్వనింపచేస్తాడు. శృతి గర్భం ధరిస్తుంది.
నిజానికి మనోజ్ తాగుబోతు. స్ర్తిలోలుడు. ఈ సంగతి సౌజన్య బయటపెట్టి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించమని శృతిని కోరుతుంది. సంజయ్ తన కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పించగలుగుతాడు. సంజయ్ తన పేర గంగాధరం రాసిన ఇల్లు, మామిడి తోటను సద్వినియోగం చేయాలనుకుంటాడు. ఇంట్లో తాతారావు కుటుంబాన్ని వుంచాడు. అనాధులైన పిల్లలకోసం ఆశ్రమ పాఠశాల స్థాపించాడు. ‘‘సంజయ్ శృతి ఇద్దరూ ఇద్దరే. ఒకరు గాడితప్పిన జీవితాన్ని సరిదిద్దితే మరొకరు అయినవాళ్లకు ఆధారం చూపి అనాథలకు ఆశ్రయం కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటవేశారు’’అని రచయిత నవల ముగిస్తారు.
......................................................................................................
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

- జిఆర్కె