అక్షర

ప్రాచీన నగరాలపై అద్భుత పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీనాంధ్ర నగరములు
-ఆదిరాజు వీరభద్రరావు
వెల: రు.70/-
ప్రతులకు: నవచేతన
అన్ని శాఖలు

సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు ఆదిరాజు వీరభద్రరావుగారు ‘ఆంధ్ర చంద్రికా గ్రంథమాల’ పక్షమున 1950లో ఒక అపురూప పరిశోధనా గ్రంథం ప్రచురించారు. ఇందులో రెండువేల సంవత్సరముల చరిత్రగల ఆంధ్రనగరములు, వాటి శిల్ప, చిత్రమలు ఉన్నాయి. దీనిని 2015 డిసెంబర్‌లో నవచేతన ప్రచురణకర్తలు పునర్ముద్రించారు. ఇందులో పాలంపురము, ఓరుగల్లు వంటి తెలంగాణ ప్రాంత నగరములే కాక ప్రస్తుతం కర్నాటకలో వున్న కళ్యాణి, అనెగొంది వంటి ప్రాచీన నగరముల చరిత్ర కూడా ఉంది.
ఓరుగల్లు శిల్పములు, పటములు, బోనగల్లు, గోలకొండల చరిత్రలు, చిత్రపటములు ఉన్నాయి. యల్లమ్మపురమే అలంపురంగా రూపాంతారం చెందిందని ప్రతిపాదించారు. ఎల్లమ్మ అనగా రేణుక. ఈమె కాకతీయుల కాలం నాటి ప్రముఖ దైవము. ఆలయ నిర్మాణము శ్రీశైల నిర్మాణము నాటిదే కావచ్చు. పశ్చిమ చాళుక్యులకు ఇది రాజధాని. గ్రామ మధ్యములోని రెండు శాలంకాయన శివలింగములు, 607 లింగ సమన్వితమై ఉన్నాయి.
‘లతలు పుష్పములు కన్నుల పండువగా చెక్కబడినవి. చతురాకార శిఖరములు పిరమిడ్లను పోలి ఉన్నాయి. ఇవి యవనుల దండయాత్రకు గురి అయినాయి. శిరోవిహీనమైన నగ్నమూర్తి విగ్రహమున్నది.
రససిద్ధుడొకడు ఇసుక ఆకుపసరుల సమ్మేళనముతో ఆలయ నిర్మాణము చేసినట్టు ప్రతీతి. గ్రామ మధ్యములో సూర్యదేవాలయం ఉన్నది. వృక్షము, క్రింద ధర్మబోధ చేయు బుద్ధమూర్తిని చూచినచో ఇది ఒకప్పటి బౌద్ధ, జైన క్షేత్రమేమో అనిపిస్తుంది. ఇక్కడ పెక్కు వీరగల్లులు ఉన్నాయి.
అనెగొంది: ఇది ఒకప్పటి నిజాము నవాబుగారి సామంతరాజ్యము. అత్యంత ప్రాచీన కాలములో ఇక్కడ యవనులు తమ ప్రాచీన నామములు కోల్పోయి స్థిరపడినట్టు ఆదిరాజువారు సూచించారు. క్రీశ 515లో వీరు ఓరుగల్లును జయించారని పేర్కొన్నారు.అప్పటికి ఓరుగల్లు నగరము లేదు. మరి వీరు జయించినది అనుమకొండ ప్రాచీన ప్రాంతమా? అనమకొండ పేరు హనుమద్గిరి అని జనోక్తి. ఈ యవనులు బౌద్ధులయ్యారని ఆదిరాజువారు పేర్కొన్నారు.
కళ్యాణి: చాళుక్యుల రాజధాని. సమిష్టి చాళుక్య కుటుంబమునకు వాతాయి (బాదామి) రాజధాని తర్వాత విడివడిన కుటుంబములలో ఒక శాఖకు చాళుక్యులు శాతవాహనులవలెనే ఆంధ్రులు (23వ పుట) కొండాపురము, హైదరాబాద్‌కు 43 కిమీ దూరంలో బీదరు మార్గంలో ఉంది. ఇది నేడొక చిన్న గ్రామము. పూర్వము మహానగరము. ఇక్కడ దొరికిన కుండలు, గాజులు, ఎర్రమట్టితో నిర్మించిన తొమ్మిది అడుగుల ఎత్తు మూడు అడుగుల లోతు గల పాత్రలు లభించాయి.
తెల్లని మట్టితో యక్షిణి, కుబేరుడు, బోధిసత్వుడు మొదలైన మూర్తులను నిర్మించారు.
సింహము, ఎద్దు, గుర్రము, గొర్రె వంటి జంతువుల మూర్తులు దొరికాయి. ధర్మచక్రము (లేదా విసనకర్ర) పట్టుకొనిన స్ర్తి మూర్తి ఉంది.
తలకట్టు అజంతా శిల్ప శైలికి సన్నిహితము. హాస్యకుశలురైన శిల్పులు లంబోదరులు, చప్పిటి ముక్కు గల మూర్తులను నిర్మించారు. ఇక్కడ ఇనుప కొడవలి, గొడ్డలి, పటకాలు, బాకులు, మేకులు దొరికాయి. సువర్ణము దంతముతో చేసిన అలంకరములు లభ్యములు.
క్రీశ మొదటి శతాబ్దము నాటి ఆగస్టసు(రోము) చక్రవర్తి నాణెములు దొరికాయి.
మూడు విహారములు, రెండు చైత్యములు, మూడు స్థూపములు, ఒక దాగోబా బయల్పడినాయి. దాగోబా అంటే ధాతుగర్భము. ఇది బౌద్ధ మత సంబంధి.
కొలనుపాక: నేడు యాదాద్రికి సమీపంలో ఆలేరునుండి పడమరకు ప్రయాణం చేస్తే ఈ నగరంవస్తుంది. ప్రస్తుతం ఇదొక కుగ్రామము. తొలుత పశ్చిమ చాళుక్యుల పాలనలో ఉంది. ఆరవ విక్రమాదిత్యుని పాలన కూడా ఇక్కడ సాగింది. ఈ కొలనుపాకకు దక్షిణ కాశి అని ఒకప్పటి పేరు.
ప్రతాపరుద్రుడు ఓరుగల్లులో పాలకునిగా ఉండగా రాష్టక్రూట సామంతుడు ఈ కొల్లిపాకను పాలించినట్టు శాసనాధారము. ఇక్కడ నందులు, లింగములు, సప్తమాతృకలు చెల్లాచెదురుగా ధ్వంసమై కన్పిస్తున్న దృశ్యములు నేడు ఆలయ ప్రాంగణములో చూడవచ్చు.
ఇక్కడి సోమేశ్వరాలయము వీరనారాయణ గుడి శిథిలములు కాకతీయుల నాటివి. ఈ సోమేశ్వరుడు కుమారసోమేశ్వర పాలకుని కాలములో నిర్మితమా? అని ఆదిరాజువారు ప్రశ్నించారు. (పుట 37)
గోలకొండ: దీని మట్టికోటను నిర్మించిన వాడొక ఆంధ్రరాజన్యుడు (పుట 42) 1364లో ఓరుగల్లు పాలకుడుగా కన్నయ్య నాయకుడు బహిమినులకు వశము చేసినట్టు వీరు పేర్కొన్నారు. గోలకొండ ప్రాచీన నామము మానుగల్లు. కులీ కుతుబ్‌షాహి దీనికి గోలకొండ అని పేరు పెట్టి ఉండవచ్చు. గోలకొండ మూడు కోటల సమూహము.
పానగల్లు: ఇచ్చటి ఉదయనరాజు జైనమతావలంబి. ఈయనకు శైవులకు మత యుద్ధములు జరిగినట్టు ఆదిరాజు వారికథనం. పండితారాధ్యులవారి శాపముతో 12వ శతాబ్దంలో ఈ నగరము నశించెనని చారిత్రక కథనము.
ఇక్కడి త్రికూటాలయము త్రిమూర్తులకు అంకితము.
ఛాయా సోమేశ్వరాలయము ప్రాచీనమే కానీ విష్ణ్వాలయము ఆర్వాచీనము. శిలాశాసనములు నేటికీ ఇక్కడ గోడలలో గోరీలలో ఎన్నో లభ్యమవముతున్నాయి. వాటిని పరిశీలిస్తే మరింత చరిత్ర వెలికి వస్తుంది.
ప్రతిష్ఠానము: ఇది నేడు ఔరంగాబాదు జిల్లాలో ఉంది. ఒకప్పటి శాతవాహన రాజధాని ఇది. గోదావరీ నదీ తీరస్థము. రెండు వేల సంవత్సరముల చరిత్రగల నగరము.
బోనగిరి: ఇది హైదరాబాదుకు 56 కిలోమీటర్ల దూరంలో వున్న భువనగిరి. బోనగిరి ఒకప్పుడు ఆంధ్రరాజధానిగా ఉండెను (పుట 63)
దీనికి సాటిరాగలిగినది ఒక్క ఓరుగల్లు మాత్రమే అని రచయిత భావించారు. బోనయ్య అనే గొర్రెల కాపరి పేరుతో ఇది బోనగిరి అయిందనే ఇతిహాసమునకు జనశ్రుతియే ఆధారము.
రాచకొండ: హైదరాబాదుకు 33 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఒకప్పుడిది రాజధాని గిరిదుర్గము.
ఇక్కడ రెండు గండశిలలు మధ్య ఒక బిలము ఉంది. ఇందేదో రహస్యముందని స్థానికుల కథనము. శివ, వీరభద్ర, రామాలయములున్నాయి. ఇచ్చటి రేచర్ల సింగమనాయకుని కుమారుడు అనపోతానాయకుడు కాకతీయ సామంతుడు. ప్రతాపరుద్ర సేనానాయకులలో ఒకడు. మహామండలేశ్వర, ఆంధ్ర దేశాధీశ్వర, కాకతీయ స్థాపనాచార్య బిరుదాంకితుడు. రాచకొండ దుర్గమునకు ఐదు కిలోమీటర్ల దూరంలోని అరణ్యములలో స్తనరహిత స్ర్తిమూర్తి శిల్పముంది. దీనిపై ఏదో ఐతిహ్యమున్నది. అది జనశ్రుతి.
ఓరుగల్లు: దీనిపై ఆదిరాజువారు 60 సంవత్సరాల పూర్వము రచించిన చరిత్రకాంశములకన్నా నేడు మరిన్ని లభించాయి. ఐతే ప్రతాపరుద్రుని కొడుకు జుట్టయ్య అని (పుట 81) ఆదిరాజువారు దేని ప్రకారము నిర్ణయించారో తెలియడం లేదు. ఉలుఘ్‌ఖాన్ దండయాత్ర తర్వాత ప్రతాపరుద్రుడు బంధవిముక్తుడై తిరిగి పాలించాడనేది వేదమువారి రూపకల్పనము.
విజానగరము: దీనికే వేల్పుకొండ, జఫర్‌గఢ్ అని నామాంతరములు. ఇది గిరిదుర్గము. అగస్త్య మహర్షి పూజించిన సాలగ్రామ రూపము ఇచ్చటి శిల్పవిన్యాసము చాళుక్య శైలికి సన్నిహితము.
అనుమకొండ: అనుమడు, కొండడు అనే వ్యక్తుల పేరుపై జరిగిన నిర్మాణమా? హనుమద్గిరి సంస్కృతీకరణమా?
లేప+అక్షి=లేపాక్షి; లే-పక్షీ-అని జటాయువును రాముడు అనిన ప్రదేశం అనే జానపద కథా కల్పన జరిగినది.అట్టిదే బోనయ్య కథయా? ఇది భువనగిరి కావచ్చు.
నృసింహాలయము, యాదగిరిగుట్ట, జఫర్‌గఢ్ వంటి ప్రదేశములలో యోగానంద నారసింహ దేవాలయములు వెలసినవి. అంటే గిరిదుర్గముపై నృసింహారాధకులు ఉన్నట్టు భావింపవలసి వస్తుంది.
సింహము=లియో=సింహరాశి.
70 ఏళ్ల క్రితం ఆదిరాజు చేసిన పరిశోధన నేటికీ చారిత్రక పఠితులకు ఆస్వాద యోగ్యంగానే ఉంది. దీనిని ప్రచురించిన నవచేతన సంస్థవారు అభినందనీయులు.

-ముదిగొండ శివప్రసాద్