అక్షర

విస్మయపరిచే విశేష పరిశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రదేశ చరిత్రలో
కొత్త కోణాలు
స్మారక సంచిక-
రచన: ఆచార్య వెలమకన్ని సుందరరామశాస్ర్తీ
వెల: రూ.100/-
ప్రతులకు: వి.కన్యాకుమారి,
202, విశ్వలక్ష్మి టవర్స్, రవీంద్రనగర్,
3వ లైను, గుంటూరు-6.
**
ఆంధ్రులకు దాదాపు ఆరువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఐతరేయ బ్రాహ్మణంను భారత రామాయణాల వరకు ఎన్నో గ్రంథాల్లో ‘ఆంధ్ర’ ప్రసక్తి ప్రశస్తి ఉంది. వీరు త్రిసముద్రాధిపలాలు శకకర్తలు ఆగ్నేయాసియాకు అక్షర భిక్షను పెట్టినవారు. ఆచార్య నాగార్జునుడు తెలుగువాడు కావటం తెలుగు జాతికే గర్వకారణం. వీరి చరిత్రపై లోగడ మారేమండ రామారావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి మహనీయులు కొన్ని పరిశోధనలు చేశారు. శాతవాహన సంచిక కాకతీయ సంచికల వంటివి వెలువడ్డాయి. ఇప్పుడు వెలమకన్ని సుందరరామశాస్ర్తీ స్మారక ప్రచురణలవారు ఒక సంచికను తీసుకొని వచ్చారు. ఇందులో చారిత్రక పరిశోధకులు ఆచార్య వి.సుందరరామశాస్ర్తీగారు ఆంధ్రదేశ చరిత్రపై జరిపిన వౌలిక పరిశోధనా వ్యాసాలున్నాయి. ఈ సంచికకు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ వి.వి.సుబ్బారెడ్డిగార్లు సంపాదక బాధ్యతను నిర్వహించారు. చరిత్రలో శాసనాల ప్రాముఖ్యం ఏమిటి? విష్ణుకుండిన రాజుల సమగ్ర చరిత్ర దేవాలయాల ప్రాముఖ్యం, గుంటూరు జిల్లా సామాజిక సాంఘిక సాంస్కృతిక వికాస చరిత్ర పృథ్వీమూల రాజవంశము ఆంధ్ర శిల్పము గుహాశిల్పం పరిణామం వంటి అనర్ఘమైన వ్యాసరత్నాలు ఇందులో ఉన్నాయి. దేవాలయ నిర్మాణం ప్రయోజనం వివరించారు. ఆలయాలు సర్వకళా నిలయాలు విద్య వైద్యం కూడా ఆలయ విభాగాలే. ఆలయ నృత్య కైంకర్యంలో స్వామిని పవిత్ర పాత్ర నిర్వహించేది. తర్వాతి కాలంలో ఈ శబ్దం సానిగా మారి అవనతిని పొందింది అని శాస్ర్తీగారు వివరించారు. జల కలశమే పొట్టి గణేశుని ప్రతీక అన్నారు. యక్ష నాగ జాతుల సమ్మేళనమే ఆంధ్రజాతి అన్నారు. పరిశోధక విద్యార్థులకే కాదు అధ్యాపకులకు కూడా ఈ సంచిక కరదీపిక వలె ఉపయోగపడుతుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి విగ్రహం, మాలిక్ కాఫర్ దండయాత్రల సమయంలో శ్రీరంగం నుండి తరలింపబడింది అని శాస్ర్తీగారు పేర్కొన్నారు. తిరుమలలోని వెంకటేశ్వరుడు స్కందుడు. ఆయన పాదాలవద్ద నెమలి ఉంది అన్నారు. ద్రవిడ భాష పైశాచి ప్రాకృతంవలె ఒక ప్రాకృతావిర్భావమేనని చెప్పారు. ఆంధ్ర దేశంనుండి ప్రపంచంలోని వివిధ దేశాలకుగల వ్యాపార సంబంధాలను విశే్లషించారు. ఆంధ్రులకు రాజస్థాన్- పుష్కర్ ప్రాంతాలకు గల సంబంధాన్ని లోగడ చాలామంది చెప్పారు. ఐతే సుందరరామశాస్ర్తీగారు అమందరియా ఆక్సిస్ రష్యాలోని అంధకోయ్ పట్టణాలతో సంబంధం ఉన్నదని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇక్ష్వాకులు కామర్ధకులు రుధకులు వీరికి మధ్య ఆసియాతో సంబంధాలున్నాయా?? దక్కను పీఠభూమి నుండి గుంటూరు చేరారా? (పుట 89.) ఆంధ్రశబ్దము జాతి వాచకమై తర్వాత భాషావాచకమయిందా?
బాహ్లికులు అంటే ఎవరు? ఇక్ష్వాకు వంశస్థుడైన రాముని పూర్వీకుడు కర్ధముడు బాహ్లిక దేశస్థుడని శాస్ర్తీగారు నిర్ధారించారు. (పుట.88) శాస్ర్తీగారి పరిశోధనలు ద్రాఘిష్టములు. విస్మయం, కలిగించేవి. కుమారస్వామి విగ్రహానికి శ్రీమద్రామానుజులవారు శంఖచక్రాలు తగిలించారంటే నేడు మనకు వివాదాంశంగా అనిపించవచ్చు. కాని చరిత్ర పరిశోధకులను శంకింపలేము. బాణుడు హర్షుణ్ణి పొగడటం సహజమే. కాని పులకేశి చేతిలో ఓడిపోయిన సంగతి శాసనాల ద్వారా తెలుస్తున్నది. అంటే శాసనాల ప్రాధాన్యం ఎంతటిదో ఇలాంటి అంశాలు తెలియజేస్తున్నాయి అని సుందరరామశాస్ర్తీగారు అభిప్రాయపడ్డారు. అట్లని శాసనాలలో కూడా అతిశయోక్తులు ఉండవు అని చెప్పలేము. శాలంకాయనులపై వీరి ఆంగ్ల గ్రంథాలు ఇంకా 50కి పైగా అముద్రిత పరిశోధనా వ్యాసాలు అన్నారు. ఈనాడు చరిత్ర విద్యార్థులకు అందుబాటులోకి రావల్సి ఉంది. ఆ దిశగా జరిగిన ఒక మంచి ప్రయత్నమే ఈ స్మారక సంచిక ప్రచురణ. గాంధీజీపై ఒక వ్యాసం శిల్పాంగన అనే మరో రచన ఇందులో చేర్చారు. తమ తండ్రిగారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఈ అమూల్య సంకలనాన్ని వెలుగులోకితెచ్చి వారి సంతానం పిత్రూణం తీర్చుకున్నారు.

-ముదిగొండ శివప్రసాద్