అక్షర

రక్తి కట్టించలేని ‘అర్ధనారీశ్వరుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థనారీశ్వరుడు (నవల),
మూలం: ఆచార్య పెరుమాళ్ మురుగన్,
తెలుగుసేత- ఎల్.ఆర్.స్వామి, వెల: రు.120/-
ప్రతులకు: విశాలాంధ్ర
బుక్‌హౌస్ అన్ని శాఖలు
**
విశాలాంధ్ర ప్రచురణాలయం ఎన్నో గొప్ప పుస్తకాలను, అనువాద గ్రంథాలను తెలుగువారికి అందించిన గొప్ప సంస్థ. ఆ ‘‘ఇమేజ్’’తో ‘‘అర్ధనారీశ్వరుడు’’ నవల చదివితే పప్పులో కాలేస్తాం. హిందూ ‘‘మతోన్మాదులు’’ ఈ నవలాకారుడైన పెరుమాళ్ మురుగన్‌పై దాడి చేశారనీ, క్షమాపణ చెప్పించారనీ తెలుసుకొని తమిళంలోని ‘‘మథోరుబాగన్’’ నవలను ఎల్.ఆర్.స్వామి చేత తెనిగింపజేశారు.
పశ్చిమ తమిళనాడులోని నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సంప్రదాయం (సంపాదకులు పదే పదే సాంప్రదాయం అని తప్పుగా వాడారు). ఈ నవలా రచనకి మూలం. పిల్లలు పుట్టని దంపతులు కథ నవలలో వర్ణించబడింది. ఎన్ని మొక్కులు మొక్కుకున్నా, పూజలు, ఆచారాలు పాటించినా పిల్లలు పుట్టలేదు. ఈ దిగులు దంపతులకంటె ఇరుగుపొరుగు వాళ్ళకే ఎక్కువ. తిరుచెంగోడు- అర్థనారీశ్వరునికి ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతాయి. పద్నాలుగో రోజున ఆ ఉత్సవాలలో ఒక సాంఘిక ఆచారం వుండేది. ఆ రాత్రి ఎవరు ఎవరితోనైనా లైంగికంగా కలిసి సంతానం పొందటం ఒక సంప్రదాయం. అలా కాళి భార్య పొన్న సంతానం పొందుతుంది. ఇది టూకీగా కథ. తమిళంలో ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. పురస్కారాలు వచ్చి ఉండవచ్చు. కానీ తెలుగులో కథాకథనం సాగతీసినట్టు చప్పగా వుంది తప్ప తెలుగు నవలలా సహజంగా కనబడదు. ఎల్.ఆర్.స్వామి గొప్ప అనువాదకులే. అయితే మూలానుసరణంగా అనువదించాలి తప్ప మరీ స్వతంత్రం పాటించకూడదు. అందువల్ల స్వామిగారు సంపాదకులన్నట్టు ‘‘శ్రమించి అనువదించారు.’’ కానీ పఠనీయత తగ్గటంవల్ల బలవంతంగా చదవాలి. సంభాషణల కంటె కథకుడి కథనం ఎక్కువైంది.
‘‘తమ జీవితంలో ఎన్నో సమస్యలు తలయెత్తవచ్చు. ఇతరులకు ఆ సమస్యల పట్ల ఎందుకంత ఆసక్తి!?’’అని కాళి అనటం సామాజిక వాస్తవికత.
‘‘ఈ బ్రాహ్మణులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం ఎందుకు అని అర్థంకాలేదు వాళ్ళకు. తెల్లవాళ్ళ పరిపాలనలో బ్రాహ్మణులకు ఇంత అధికారం ఇచ్చింది ఎవరు? కల్లు గురించి ఏదీ తెలియని బ్రతుకులో ఒకసారైనా మాంసం ముట్టని సేలం వకీలుకు మంత్రి పదవి ఇచ్చిందెవరు? ‘‘దీని వెనుక రచయిత ఉద్దేశం, ప్రచురణకర్తల ఉద్దేశం తెలుస్తూనే వుంది. ఇంతకీ ఆ బ్రాహ్మణుడు కల్లు సారా నిషేధించే చట్టం తేవటమే అన్యాయమైంది. ఈ చట్టం తేవడానికీ కల్లు, మాంసం ముట్టకపోవడానికి ఏమిటి సంబంధం?
ఆచారాలూ, మూఢ నమ్మకాలు బాగావున్న 1940 ప్రాంతంనాటి కథ ఇది. కొన్ని గిరిజన జాతులలో ఇప్పటికీ ఈ ఆచారాలు మరో రూపంలో వున్నాయి. తెలంగాణ వెనుకబడిన ప్రాంతంలో విచిత్రమైన సంప్రదాయాలు నిజాం కాలంలో బాగా ఎక్కువ. వీటిని ఇవాళ విద్యావంతులెవరూ అనుసరించరు. ఎప్పటిదో ఒక లైంగిక ఆచారం ఇప్పుడు రాయటంలోనూ, తెనిగించడంలోనూ అంతరార్థం ఏమిటి? రాంగోపాల్‌వర్మ లాగా మానిన గాయాన్ని మళ్ళీ రేపటం కాదా? ఒక మతంవారి మూఢ నమ్మకాలను తప్ప ఇతర మతాలలోని మూఢ నమ్మకాలపై నవలలు రాయడం, తెనిగించడం చేస్తారా? చేస్తే తస్లీమానస్రీన్, సాల్మన్ రష్దీలకు పట్టిన దుర్గతి పడుతుంది. ఇటువంటి నవలలు సమాజానికి ఇప్పుడు అవసరమా? సాల్మన్ రష్దీ అన్నట్టు ‘‘ఒక పుస్తకాన్ని నొచ్చుకోకుండా ఉండటం చాలా సులువు. దాన్ని మూసేస్తే చాలు’’.

-ద్వా.నా.శాస్ర్తీ