అక్షర

ప్రపంచం మీ పిడికిట్లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అదే గాలి’’
(ప్రపంచ దేశాల
కవిత్వం- నేపథ్యం)
-ముకుంద రామారావు
ఎమెస్కో,
వెల: రు.300;
పేజీలు: 559
***
ముకుంద రామారావు కవి, కథకుడు, అనువాదకుడు. కవిగా అరడజన్ పుస్తకాలను వెలువరించారు. కథకుడిగా చిన్న కథలు, సూఫీ కథలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కథలు రాశారు. అనువాదకుడిగా ‘‘అదే ఆకాశం, శతాబ్దాల సూఫీ కవిత్వం, నోబెల్ కవిత్వం’’ తర్వాత ఇప్పుడు ప్రపంచ కవిత్వ చరిత్రను ‘‘అదే గాలి’’పేరుతో అందిస్తున్నారు.
ఈ ప్రపంచ దేశాల కవిత్వం ప్రాచీన నాగరికతకు నిలయమైన చైనాతో మొదలవుతుంది. అక్కడ కవిత్వం అయిదువేల ఏళ్ళకు పూర్వమే మొదలయింది. క్రీ.పూ.600 ప్రాంతంలో వెదురుకర్రల మీద రాయబడింది. క్రీ.పూ.221లో మొదటి చక్రవర్తి చినకాలం నుండి మొదలుకుని ఇప్పటి ఆధునిక కవిత్వంవరకు దశలవారీగా విశే్లషిస్తూ, వివరిస్తూ వచ్చారు. ఎనిమిదవ శతాబ్దంవరకు జపాన్‌లో కవిత్వం లేదనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ప్రపంచానికి జపాన్ ప్రసాదించిన హైకూ కవిత్వం, ఇతర మినీ కవితా ధోరణులు- వాటి ప్రాచుర్యం గురించి తెలియజేశారు. జపాన్‌కు వ్యతిరేకంగా కొరియా స్వాతంత్య్రంకోసం పోరాడిన యోధుడు, బౌద్ధనాయకుడు, కవి హాయోంగ్ (1879-1944)తో ఆధునిక కవిత్వం ఆరంభమయింది. 1980 ప్రాంతం నుండే కొరియా కవిత్వం ప్రపంచ భాషల్లోకి అనువాదం అవుతున్నది. తమనుతాము కవులుగానే వియత్నామీయులు ఎప్పుడూ భావించుకుంటారు. వియత్నాం మొదటినుండి ఒక యుద్ధ్భూమి. వియత్నాం యుద్ధ కవితలను అక్కడివారే కాదు, ప్రపంచవ్యాప్తంగా కవులు రాశారు. అనేక సంఘర్షణల, అనేక భాషల అద్భుత సమ్మిశ్రీతం వియత్నాం కవిత్వం. ఆగ్నేయాసియాలోని అనేక దేశాలలో సంస్కృతం, పాళీ, చైనా భాషలు రాజ్యమేలాయి. రానురాను తమ భాషల్ని ఆయా దేశాలు అభివృద్ధి చేసుకున్నాయని చెబుతూ, ఆయా దేశాల్లో వెల్లివిరిసిన కవితారీతుల గురించి తెలియజేశారు. ‘‘మన ఇరుగుపొరుగు దేశాల కవిత్వం’’ శీర్షికన ముందుగా ఇస్లాం ప్రభావిత దేశాలలో వచ్చిన కవిత్వాన్ని వివరించారు. తర్వాత హిమాలయ పర్వతాల మొదలుకుని హిందూ మహాసముద్రం వున్న దేశాల ప్రత్యేకతను వాటి కవిత్వ రీతుల గురించి తెలియజేశారు.
మధ్యప్రాచ్యంలోని దేశదేశాలనుబట్టికాక ఆ ప్రాంత భాష- అరబ్బీ, పర్షియన్, హీబ్రూ, టర్కిష్ పరంగా ప్రసిద్ధులైన కవులను, వారి కవిత్వ చరిత్రను తెలియజేశారు. ఆయా దేశాల ముఖ్యమైన కవులు, కవిత్వ చరిత్రను వివరించారు. అవిగాక వేరుగా ఎడారి కవిత్వం, యుద్ధాల మూలంగా వచ్చిన యుద్ధ కవిత్వం, శాంతి కవిత్వం, స్ర్తిల కవిత్వాన్ని కూడా పరామర్శించారు. ముఖ్యంగా అరబ్బీ కవిత్వాన్ని ఇస్లామ్ యుగానికి ముందు, ఇస్లాం యుగం- ముఖ్య కవులు, కవిత్వం అంటూ విభజించి సూఫీ కవిత్వ ఆవిర్భావ వికాసాలను తెలియజేసిన విధానం బాగుంది. అలాగే ప్రాచీన భాషలైన పర్షియన్, హీబూలను కూడా ప్రాచీన, ఆధునిక కవిత్వాలుగా విభజించి వివరించారు. రష్యన్ కవులు, రచయితలది ఎప్పుడూ ప్రజల స్వరమే అని రష్యన్ కవిత్వాన్ని విశే్లషిస్తారు. మధ్య ఆసియా కవిత్వం మొదటినుండి ఒక మనోవికాస ప్రక్రియ అంటూ, ఆరు మధ్య ఆసియా దేశాల కవిత్వ చరిత్రను తెలియజేశారు. అనాదిగా మధ్య ఆసియా అనేక యుద్ధాలు, భాషలు, మతాలు, ప్రాంతాల కలయిక. వాటి ప్రభావమే అక్కడి కవిత్వమని నిర్ధారించారు. 1991లో విచ్ఛిన్నమైన సోవియట్ సమాఖ్యలోని దేశాలలో మధ్య ఆసియాకు సంబంధించిన ఆరుదేశాలు పోగా, మిగతా తొమ్మిది దేశాల కవిత్వ చరిత్రను ఇందులో తెలియజేశారు. ఆస్ట్రేలియాలోకి బ్రిటీష్‌వారు ప్రవేశించక పూర్వం, ప్రవేశించిన తరువాత అని ఆస్ట్రేలియా కవిత్వాన్ని విభజించవచ్చంటారు. వారసత్వం, పరిసరాల ప్రభావాల సంయోగం న్యూజిలాండ్ కవిత్వమని చెబుతూ, ఈ రెండింటికి వలసవాద కవిత్వంగా శీర్షికను వుంచారు. ఆఫ్రికా కవిత్వం అన్యాయానికి అక్రమానికి విరుద్ధంగా ముందు పోరాటం చేసింది. అందులో ఒక్కొక్కటిగా గెలుపుబాట పట్టాక అది వారిచుట్టూ పరిస్థితుల్ని, చీకటి అడవుల్ని, పల్లె పట్టణంగా మారడాన్ని, వారి మత వ్ఢ్యౌల్ని గానంచేయడం మొదలెట్టింది. అది మరింత పదునెక్కి వలసవాదులు పెట్టిన యాతనని క్షమించి, వారిచ్చిన భాషలతో ప్రపంచానికి చేరువవడం మొదలయింది.
రెండవ ప్రపంచయుద్ధం తరువాత యూరప్- తూర్పు యూరప్, పశ్చిమ యూరప్ కూటాలుగా వేరుచేయబడ్డాయి. తూర్పుయూరప్ అనేక సంస్కృతులు, స్వజాతీయులు, చరిత్రలు కలగలిసి ఉన్న ప్రాంతం. దాన్ని తూర్పుయూరప్ కవిత్వంలో చూడవచ్చు. పశ్చిమ యూరప్ ప్రాంత కవిత్వం పూర్తిగా పశ్చిమ ప్రాంతానికి ప్రతినిధిగా చెప్పుకోవచ్చు. ప్రపంచ సాహిత్యాన్ని వైవిధ్యభరితమైన కవిత్వ ధోరణులతో ఎక్కువగా ప్రభావితం చేసిన ప్రాంతం అది. ఇక అమెరికాలో వెలసిన మొదటి కవిత్వం అక్కడికి వలస వచ్చిన ఆంగ్లేయులదే. అక్కడి సమకాలీన కవిత్వం అనేక ధోరణులకు ఆలవాలంగా నిలిచింది. కరీబియన్ లేదా వెస్ట్‌ఇండీస్ కవిత్వం కరీబియన్ దీవులకు వలసపోయిన వారి కవిత్వం మొదటినుండి వీరి కవిత్వం క్రియాశీలమైన కళగానే వుంది.
ఇలా ఒక్కొక్క ఖండాన్ని తీసుకుని, ఆ ఖండానికి ప్రాతినిధ్యతను వహించే ముఖ్యమైన దేశాలను, వాటి కవిత్వాన్ని సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. తెలుగు తప్ప ఇతర భాషలు తెలియని పాఠకుడు ఈ ఒక్క పుస్తకం ద్వారా ప్రపంచ దేశాల కవిత్వ చరిత్రను తెలుసుకోగలుగుతాడు. ఆ దిశగా రచయిత చేసిన కృషిని, నిజాయితీని, నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించాలి.
ఏ సాహిత్యమూ శూన్యంనుండి బయటపడదు. ఆ దేశ చారిత్రిక పరిస్థితులు వాటిని నిర్దేశిస్తాయి. ఆ దేశ చరిత్ర అక్కడి సాహిత్య పరిశీలనకు కొంత లోచూపును తప్పకుండా ప్రసాదిస్తుంది. అందుకే మొదటగా ఆయా దేశాల భౌగోళిక స్వరూపం-చరిత్రను, వారివారి భాషల చరిత్రను, వారి సాహిత్య చరిత్ర- కవితాధోరణులను దశలవారీగా కాలక్రమానుగుణంగా కవిత్వంలో వస్తున్న మార్పులను సోదాహరణంగా వివరించారు. ఇలా ప్రణాళికాబద్ధంగా రూపొందించిన వ్యాసాలు ఆసక్తికరంగావుండి ఆకట్టుకుంటాయి. విచిత్రం ఏమిటంటే ఆగ్నేయాసియా దేశాలమీద చైనా భాష, మధ్యప్రాచ్యంలో అరబ్బీ, కామన్‌వెల్త్ దేశాలమీద ఆంగ్లము, వలసవాద దేశాల మీద సామ్రాజ్యవాదులు భాషా పెత్తనం కొనసాగించాయనీ, వాటి ఉక్కుపిడికిళ్ళ నుండి విడివడి ఆయా దేశ భాషలు అభివృద్ధిచెందిన తీరును, మార్పులను విశదంగా తెలియజేయడం బాగుంది. మతం, వలసలు, ఆధునికత ఏర్పడకముందు, ఆ తర్వాత అంటూ కాల విభజన చేసుకుని విశే్లషించడం బాగా వచ్చింది. ముఖ్యంగా రచయిత ప్రపంచ కవిత్వాన్ని అనువదించడంలో మంచి పఠనీయతా గుణాన్ని ఆపాదించడమేకాకుండా, వాటిలో కవిత్వం వుండేలా చూసుకోవడం గమనించదగ్గ విషయం. సమాచారాత్మకంగా, విజ్ఞానాత్మకంగా వున్న ఈ పుస్తకం మంచి రెఫరెన్స్ పుస్తకంగా నిలబడిపోతుంది.

-కె.పి.అశోక్‌కుమార్