అక్షర

సంగీత సాహిత్య సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతల దారుల్లో చిరునామా తప్పిపోయినపుడు చేయి పుచ్చుకుని ఆనందం రహదారుల్లో నడిపించేది మంచి సాహిత్యం. బతుకు పుటలు ఒకదానికొకటి నకలుగా మారి విసుగెత్తించినపుడు గుండె కొమ్మలపై కోయిలవాలి మోహనరాగం పాడినపుడు సంతోషం సన్నజాజులు విరిసి జీవన వనం మురిసిపోతుంది.
అద్భుతమైన సంగీతాన్ని విన్నప్పుడు పరవశాల ఊయల్లో ఊగుతుంది మనసు. మంచి సాహిత్యాన్ని చదివినపుడు ఆనంద మేఘాల్లో తేలియాడుతుంది అంతరంగం. సాహిత్య పరిమళం లేని సంగీతం, సంగీత సౌరభంలేని సాహిత్యం శోభించవు.వసు చరిత్రలో ‘లలనా జనాపాంగ వలనా వసదనంగ’ మొ.పద్యాలను వీణమీద వాయించేవారని ప్రతీతి. ‘అరిగా పంచమ మేవగించి‘ మొ.పద్యాల్లో సంగీతానికి సంబంధించిన రాగాల ప్రసక్తి ఉంది. ఆధునిక కవుల్లో ‘మో’ కవిత్వంలో పురందరదాసు కీర్తనలు, బీధోవెన్ సంగీతం పాఠకులను పలకరిస్తుంటాయి.
సంగీత సాహిత్యాలు ఇలా ఎల్లవేళలా మనిషి జీవితాన్ని రాగరంజితం చేస్తునేవుంటాయి. సంగీతానికీ, సాహిత్యానికీ సమప్రాధాన్యాన్ని ఇచ్చి ఎలనాగ గారు రచించిన కవితా సంపుటి ‘అంతర్నాదం’
కవిత్వమనగానే కవి గుండె పులకరిస్తుంది. ప్రాచీన కాలంనుంచి ఆధునిక కాలం వరకు కవిత్యానికి ఎన్నో నిర్వచనాలు వున్నాయి. ‘కవిత్వం ఓ ఆల్కెమీ అది కృష్ణశాస్ర్తీకి తెలుసు, విశ్వనాథకి తెలుసు శ్రీశ్రీకి తెలుసు అంటాడు తిలక్. ఇక్కడ కవి ‘మనసు కుండలో కవ్వం కదిలి కడుపులో సుళ్లు తిరిగాకే/ కవిత్వం ఒలకాలి బయటికి’ అని అంటారు.
‘శోకస్య మాపద్యయస్సశ్లోకః’ అన్నట్టు వేదననుంచే కవిత్వం వస్తుంది. దీనే్న పోగలకుండా పగలకుండా/పులుగు పిల్లరాదు గుడ్డులోంచి బయటకు‘ అని అంటూ దుక్కిదున్ని పండించే కళాసేద్యం/పూలపరుపులు పరచిన బాట కాదు/ మనోమాగాణికి ఆరుతడి పెట్టి/్భవ బీజాల్ని చల్లుకోవాలి/’ అని కవిత్వమెలా వుండాలో ‘ఆల్కెమీ రహస్యం’ కవితలో నిర్వచిస్తారు. ఉత్కృష్టకవన మార్గం, వ్యాసం-వ్యాసంగం, కవితాధర్మం కవితలలో అచ్చమైన కవిత్వం ఎలా వుండాలో నిర్వచించారు. కవి సంగీత ప్రేమికుడు. ‘తరగని సరాగాల గని’లో ‘స్వర పరాగ మేఘ పరిమళం కమ్ముకున్నప్పటి ఆహ్లాద భాగ్యం ముందు అన్ని ఐశ్వర్యాలూ దిగదుడుపే’ నంటూ మధ్యమావతిలో మనసు ముడివడ్డట్టనిపించి జన సమ్మోహినితో జన్మాంతర బంధమున్నట్టు తెలుస్తుంది. ‘హంసనాదానంద తరంగాల మీద తేలిపోతూ అలుపును పోగొట్టుకుంటాను’ అని రాగాలతో తన అనురాగ బంధాన్ని అక్షరీకరిస్తారు.
తరగని సరాగాల గని, వరమై కురిసే స్వరం, అచ్చమైన అదృష్టం కవితల్లో తన సంగీత ప్రియత్వాన్ని వెల్లడిస్తారు.
‘్భషైన జాషువా’లో కలం కార్చిన కన్నీటి అలలమీద కళాప్రతిబింబాల్ని తళుక్కమనిపించిన! అసమాన్య ప్రతిభా తేజమా! అని జాషువాను ప్రస్తుతిస్తూ ‘చిరకాలం నిలిచే కవితకు!చిరునామా జాషువా!’ అని జాషువా కవిత్వాన్ని ప్రశంశిస్తారు. ‘బహుతేజ భాస్కరుడు’లో ఒక అవిటి గాయకుడ్ని వర్ణిస్తూ ‘అవిటి దేహాన్ని దివిటీ చేసుకుని, అగ్నిజ్వాల అయి వెలుగుతుంటాడతడు’ అని చిత్రిస్తూ పాటల పట్టపు సింహాసనాల మీద పరుస్తాడు తన గళ మాధుర్యాన్ని/నాదపు వంతెనగా మారి/అనుమోదపు స్వర్గానికి చేర్చుతాడు శ్రోతల్ని’ అంటూ శరీరానికి అవిటితనమున్నా గళానికి అవిటితనం లేదని తానే ఒక మధురనాదం అనే వంతెన గా మారి శ్రోతల్ని సంతోషాల స్వర్గానికి చేరుస్తాడని ఆ గాయకుని స్వరానికి పట్టం గడతారు కవి. ఇపుడు తిండిలేనివాడైనా వుండొచ్చుకానీ ఇంట్లో టీవీ, చేతిలో సెల్ లేనివాడుండడు. టివీలో స్ర్తిలని ఘోరంగా క్రూరంగ చిత్రించే సీరియళ్లు తప్పవు. వీటిని గురించి ‘మన దేశంలోవో విరగకాస్తున్న మనోవికారాల చెట్లను చూస్తుంటే/మనసు వికలమే/ సీరియల్ రేవుల క్రూర పర్వంలో/ఆహుతవుతున్న సమిధలు’ అని బాధాతప్త స్ర్తిల గురించి చెపుతూ ‘ప్రపంచీకరణ/పల్చబడితే తప్ప/మానసిక రుగ్మతలకు మనం వేయలేము కళ్లెం/’ అని దీనికంతటికీ ప్రపంచీకరణే మూలమంటారు.
ఎలనాగ గారు చిరకాలంనుంచి రాస్తున్న కవిగా, అనువాదకునిగా లబ్ధప్రతిష్టులు. చాలామంది కవుల్లాగా కేవలం వచన కవిత్వానికే పరిమితం కాదు వీరి కలం. పద్యసంపుటులు, గేయ సంపుటులు రచించారు. ఈ సంపుటిలో సత్యవాక్యం, డబ్బాల్లో మనుగడ, సమ్మెటపోట్లు, ఘనమైన వనమాలిత్వం, అంతర్మదనం మొదలగు వచనాలు రాసారు. రంజకం (అను అష్టపది) ఎనిమిది పదాలతో కవిత, మూడేసి పాదాలతో మూడు చరణాలో ‘ముప్పేటలు’ రాసి ప్రయోగాలు చేసారు.
ఈ కవితా సంపుటిలో అక్షరం అక్షరంలో కవికి గల కవిత్వంమీద ప్రగాఢానురక్తి, సంగీతంపట్ల గాఢమైన అభినివేశం అద్దం పట్టినట్టు కనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతుంటే మధుర సంగీత పరిమళాలు వీస్తుంటే చక్కని కవిత్వ వనంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంత చక్కని నాదాన్ని వినిపించిన కవికి అభినందనలు.

-మందరపు హైమవతి