అక్షర

జీవితాన్ని అధ్యయనం చేసిన ‘విధి వంచితుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనిషికి భావోద్వేగాలుంటాయి. భావోద్రేకాలుంటాయి. సంఘర్షణలుంటాయి. కష్టసుఖాలుంటాయి. వాటన్నిటి కలయికే జీవితం’ అని రచయిత గోపాల కృష్ణమూర్తి ఒక కథ ఎత్తుగడలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఆయన సమాజాన్ని నిశితంగా పరిశీలించారు. అన్ని వర్గాల గురించి తెలుసుకున్నారు. ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అధ్యయనం చేసారు. అనేక కోణాలనుంచి జీవితాన్ని లోతుగా గమనించారు. ఈ సంపుటిలోని కథలు, కథానికలలో ఆ అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు. అన్యాయాన్ని చెప్పడంలో ఎక్కడా వెనకాడలేదు. సన్నివేశంలో ఒక అంశం ప్రధానమని తోస్తే దానిని విపులీకరించారు. ఎన్నో సంగతులు అందులో విశే్లషించారు.
ఇందులో 24 కథలు, కథానికలు వున్నాయి. రచయిత ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసారు. అందుకే అభివ్యక్తిలో స్పష్టత గోచరిస్తుంది. రచయితకున్న నేపథ్యం దృష్ట్యా ఇతివృత్తాల ఎంపికలో సౌలభ్యం చేకూరింది. దాంపత్య బంధాలు, గృహహింస, సహజీవనం, అద్దెకు గర్భం, కుహనాప్రేమ, అగ్రవర్ణాల పేదరికం, ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఉపాధ్యాయ వృత్తిలో సమస్యలు, పోలీసుల పాట్లు ఇత్యాదులు వస్తువులయ్యాయి. కొన్ని యాత్రానుభవాలను కథలుగా మలుచుకున్నారు. ఒక కథకు కొనసాగిపుంగా మరో కథ రాయడం విశేషం. ‘రాజీ’ కథలో భార్య రాధారాణి భానుమతి సినిమాకు వెళ్దామంటుంది. భర్త రాజశేఖరం హిందీ సినిమాకంటాడు. అది పేచీగా మారింది. తర్వాత ఆలోచించుకుని పరస్పరం అంగీకారానికి వస్తారు. ‘దాంపత్య జీవితంలో అప్పుడప్పుడు ప్రణయ కలహాలు వుండాలి’ అని రచయిత చమత్కరిస్తారు. ‘నిప్పులాంటి నిజం’ కథలో పెళ్లయి మూడేళ్లయినా తల్లి కాకపోవడంతో సీతాలును అత్త పైడమ్మ కోడల్ని గొడ్రాలుగా ముద్రవేస్తుంది. సీతాలు కడుపులో కాయ పెరిగి బాధపడుతోంది. అత్త సాధింపులెక్కువయ్యాయి. ఇష్టం లేకపోయినా కోడల్ని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లింది. ఆ కపటి, సీతాలు గర్భవతి అని అబద్ధం చెప్పాడు. అత్త కోడల్ని కులటగా ప్రచారం చేసింది. సీతాలు నింద భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్‌మార్టంలో నిజం బయటపడింది. వైద్యుడు ఎయిడ్స్ వ్యాధితో మరణిస్తాడు. పెళ్లి కాకుండానే సుమిత్ర సుధాకర్‌తో సహజీవనం సాగించింది. నెలతప్పినప్పుడు గర్భస్రావం చేయించుకోమన్నాడు సుధాకర్. సుమిత్ర విడిపోతుంది. కొడుకు పుట్టాడు. తర్వాత కథలో సురేష్ అనే సహృదయుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ‘సహజీవనం‘, ‘మజిలీ’ జంట కథలో ఇతివృత్తమిది. ‘అద్దెగర్భం’ పేదరికంవల్ల పల్లవి తన గర్భాన్ని అద్దెకిస్తుంది. బిడ్డను సిజేరియన్ చేసి తీసారు. తర్వాత పల్లవి చనిపోయింది. భర్త కేటరింగు పనిలో సహాయకుడిగా చేరతాడు తర్వాత కథలో. అవే ‘సహజీవనం‘, ‘చితికిన బతుకులు’ కథలు. ప్రేమ పేరుతో యువతుల్ని మోసంచేస్తున్న కుటిల యువకుల్ని ‘కుహనా ప్రేమ’ నిరసిస్తూ యువతులకి రచయిత హెచ్చరిక చేస్తారు ‘గురివింద గింజలు‘లో. రామశాస్ర్తీ రెండో కొడుకు కుటుంబ వృత్తి పౌరహిత్యం చేపట్టాడు. పెద్ద కొడుకు సూర్యం చదివి ఉద్యోగి కావాలనే ధ్యేయంతో శ్రమించి బిఎ డిగ్రీ పొందాడు. కానీ ఎంత ప్రయత్నించినా రిజర్వేషన్ నిబంధనలు మధ్య అతనికి నిరాశే ఎదురైంది. ఇంట్లోనివాళ్లు మనసు నొప్పించే మాటలంటున్నారు. చివరకు సూర్యం ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. ‘విధివంచితుడు’ కథ ఇది. రచయిత ‘నా మనవి’లో ఇలా అన్నారు: ‘నేను సామాజిక సమస్యలకి ప్రాధాన్యం ఇచ్చాను. ఆ సమస్యలకి పరిష్కారం చూపలేకపోయినా ఆవేదనగా నిట్టూర్పు విడిచాను’ జిజ్ఞాసులైన పాఠకులకు పరిష్కార మార్గాల గురించి ఆలోచించే అవకాశమిచ్చారు.

-జిఆర్కే