అక్షర

స్ర్తివాద సాహిత్యంలో కొత్త కోణాల ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధిత (సాహిత్య వ్యాసాలు)
- పుటలు: 190.. వెల: 195/-
ప్రతులకు: సిక్కోలు బుక్‌ట్రస్ట్, ఎంఐజి-1000,
జిల్లా పరిషత్ ఎదురుగా, హౌసింగ్‌బోర్డు కాలనీ, శ్రీకాకుళం-532001, సెల్-9989265444.
**
అణచివేత, అసమానతల అంతులేని వివక్షలో స్ర్తిలు ఎలా నలిగిపోయారో, పురుషాధిక్య సమాజంలో స్ర్తిలు కేవలం రెండవ తరగతి పౌరులుగా ఎలా మిగిలిపోయారో తెలిపిన వ్యాస సంపుటి ‘సాధిత.’ కన్యాశుల్కం, బాల్య వివాహాల దురాచారాల ఊబిలో, సంప్రదాయాల సమాధిలో జీవచ్ఛవాల్లో బ్రతికిన వనితల గుండె చప్పుళ్లు ఇవి. మధ్యతరగతి మిధ్యా విలువల కోరల్లో చిక్కి ఇటు బయటకు రాలేక అటు ఇంట్లో కట్టుబాట్ల కట్టుకొయ్యకు కట్టుబడి గొంతెత్తి అరవడానికి వీల్లేక మూగబోయిన మధ్యతరగతి మహిళల వెతల బతుకులకు భాష్యాలివి. రచయిత్రి అయ్యగారి సీతారత్నంగారు.
ప్రబంధ యుగంలో స్ర్తిలను శరీరాలుగా మాత్రమే నిర్వచించారు. తన శరీరంతో పురుషునికి ఆనందం కలిగించే ఒక శృంగార వస్తువుగానే స్ర్తిని పరిగణించారు. భావకవితా యుగంలో స్ర్తిలను ప్రేయసులుగా ఊహించారు. మాతృమూర్తులుగా అభినందన పద్యాలతో అర్చించారు. ఆధునిక కవిత్వంలోను స్ర్తిని ఒక వస్తువుగానే భావించారు. తిలక్ కూడ ‘‘వర్ణనీయవస్తువే’’ తిరగబడి రాస్తున్నపుడు అని స్ర్తిని కేవలం ఒక వస్తువుగానే పరిగణించాడు.
పితృస్వామ్య వ్యవస్థలో పతియే ప్రత్యక్ష దైవమని, భర్తలు తిరుగుబోతులైనా, తాగుబోతులైనా భార్యలు గౌరవించాలని బోధించారు. ఆడపిల్లలకు చదువులెందుకన్నారు. నాలుగ్గోడల పంజరంలో, చీకటి ఊచలమాటున మగ్గిపొమ్మన్నారు. ఆ సమయంలో సనాతనాచారాల గోడల్ని బద్దలు కొట్టారు గురజాడ. ఆత్మవిశ్వాస ప్రపంచపు తలుపులు తెరచి అసంఖ్యాక స్ర్తిల చేతుల్ని పట్టుకొని తీసుకువచ్చారు బయటకు. పితృస్వామ్య సమాజం ఉలిక్కిపడేలా భర్తకు కొత్త నిర్వచనమిచ్చారు. బానిస యజమానుల భార్యాభర్తల సంబంధానికి సజీవమైన కొత్త పోలిక తెచ్చారు. ‘‘మగడు వేల్పన పాతమాటది ప్రాణమిత్రుడ నీకు అని సంప్రదాయవాదులు కలలోనైన ఊహించని విధంగా సరికొత్త అర్థమిచ్చారు. అంతవరకు ఎవరూ గుర్తించనివిధంగా స్ర్తిల వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని గుర్తించి స్ర్తిలకు ఆరాధ్య దైవమయ్యాడు. ఇలాంటి గురజాడ అభ్యుదయ దృక్పథాన్ని ‘‘గురజాడ వారి బుచ్చమ్మ’’, ‘‘స్ర్తివాదం తొలి రూపం గురజాడ కవిత్వం’’ వ్యాసాల్లో విశదీకరిస్తారు రచయిత్రి.
‘‘జాషువా కవిత్వం- సామాజిక మానవ విలువలు’’ వ్యాసంలో అంటరానితనం, అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణినీ ధిక్కరిస్తూ రాసిన జాషువా కవితా ధోరణులను వెల్లడిస్తారు.
గురజాడ, చలం మొ. రచయితలకు, కుటుంబరావుకిగల తేడాను ‘‘కుటుంబరావు కథలు- స్ర్తి పాత్రలు’’లో విశే్లషిస్తారు. మిగిలిన రచయితల రచనలలో స్ర్తిలపట్ల సానుభూతి కలిగించే పాత్రలు, వారి అణచివేతపై ఆగ్రహించేవి, భావుకతతో పరిమళించే పాత్రలుంటాయి. కానీ కొ.కుటుంబరావు కథల్లో భిన్నమైన పాత్రలుంటాయని చెప్తారు. ఆయన కథలు తార్కికతతో కూడిన ఆలోచనలు కలిగిస్తాయని అంటారు.
తెలుగు కవిత్వంలో ప్రబంధ యుగం ముఖ్యమైనది. ప్రబంధాలలో ముఖ్యమైనది శృంగార రసం. నాయకీ నాయకుల ప్రథమ దర్శనం, ఆ తర్వాత ఒకరిపై ఒకరికి గాఢానురక్తి, ఆ తర్వాత విరహం, తర్వాత సంయోగం. అన్నిట్లో ఇదే మూసపోసిన ఇవే కథలు, కానీ పింగళి సూరన సృష్టించిన కళాపూర్ణోదయంలోని విభిన్నమైన సుగాత్రీ శాలీనుల వృత్తాంతాన్ని, ఆ కథని తీర్చిదిద్దిన సూరన నైపుణ్యాన్ని ‘‘సుగాత్రి శాలీనుల కథ- శ్రమైక జీవన సౌందర్యం’’ వ్యాసంలో కళ్లకు కట్టినట్లు చిత్రిస్తారు.
శాలీనుడు ఇల్లరికపుటల్లుడు. సుగాత్రి అతని భార్య, పెళ్లయినాక భార్య నలంకరించి భర్త దగ్గరకు పంపిస్తారు. కానీ శరీరం నిండా నగలు ధరించిన భార్య సౌందర్యం అతణ్ణి ఆకర్షింప చేయలేక పోతోంది. తోట పనిచేస్తూ అలవాటు లేని శ్రమకు దేహమంతా చెమట ముత్యాల హారాలు మెరిసిపోతుంటే శాలీనుడు ఆమెను ఆదరిస్తాడు. 20వ శతాబ్దంలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని చెప్పి శ్రీశ్రీ కంటే ముందే శ్రమలో వున్న సౌందర్యాన్ని శాలీనుడు గుర్తిస్తాడు. ఇక్కడ సూరన కథా కథన చాతుర్యాన్ని రచయిత్రి అద్భుతంగా ఆవిష్కరిస్తారు.
ప్రసార మాధ్యమాలలో సినిమా ముఖ్యమైనది. సామాన్య ప్రజలమీద సినిమా ప్రభావం గొప్పది. సినిమాలలో స్ర్తిల సమస్యలను ఎలా చిత్రీకరించారో ‘‘స్ర్తిల సమస్యా పరిష్కార మార్గాలు- తెలుగు సాంఘిక సినిమాపాత్ర’’ వ్యాసంలో తెలియపరుస్తారు. ‘గృహలక్ష్మి’ సినిమా నుండి భర్తల మద్యపానం, వేశ్యా వ్యామోహం స్ర్తిల సమస్యలుగా ప్రాచుర్యం పొందాయి. స్ర్తిల శీలం చుట్టూ తిరిగే కథలు అంతులేని గృహహింస ఇవన్నీ తెలుగు సినిమాల లక్షణాలు. అక్కడ నుంచి ఆధునిక యుగం వరకు కొంత అభ్యుదయ మార్గంలో స్ర్తిల పాత్రలు ఎలా మలచబడ్డాయో ఈ వ్యాసంలో విపులంగా విప్పి చెప్పారు. ఒకప్పటి వితంతువుల కష్టనష్టాలను, వేశ్యల జీవితాలను, పురుషుని బలహీనతలను ప్రదర్శించిన సినిమా ఆ తర్వాత స్ర్తి పురుషుల మధ్య అగాథాన్ని తగ్గించి స్ర్తి పురుషుల సమానత్వాన్ని ప్రచారం చేసింది. తాగుబోతు భర్తకు సేవచేసే భార్య స్థితి నుంచి న్యాయం కోసం, సత్యం కోసం పోరాడే ఒక చైతన్యం ప్రవృత్తిగల మహిళ వరకు సినిమా రంగం చేసిన ప్రయాణాన్ని కూలంకషంగా ఈ వ్యాసం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ‘మూడు మంచి చిత్రాలు’ వ్యాసం చదవదగింది. ఇప్పటికీ సినిమా, ఫొటోగ్రఫీ, దర్శకత్వం మొదలైన రంగాలు పురుషాధిక్య ప్రధానాలు. ముఖ్యంగా సినిమాల్లో హీరోకున్న ప్రాముఖ్యం హీరోయిన్‌కి వుండదు. ఎప్పుడూ హీరో పక్కన గంతులు వేస్తూ ఒక అందాల బొమ్మగా మాత్రమే వుంటుంది హీరోయిన్. అలాకాకుండా తమ చిత్రాలలో స్ర్తిలను ఉన్నత వ్యక్తిత్వం గలవారిగా చిత్రించిన తోడు, గ్రహణం, అంకురం సినిమాల గురించి ఎన్నో విశేషాలను వివరిస్తారు. ఇంకా ఈ సంపుటిలో ‘‘స్ర్తివాద కథల్లో స్ర్తి పాత్రల చిత్రీకరణ’’, ‘‘సంఘటనాత్మక కవిత్వం’’, ‘‘చారిత్రక పరిణామక్రమంలో స్ర్తివెనకబడటానికి కారణాలు’’, ‘ఆధునిక కాలంలో స్ర్తిల చైతన్యానికి కారణాలు’ గురించి మంచి వ్యాసాలున్నాయి.
బమ్మిడి జగదీశ్వరరావు, కుప్పిలి పద్మ కథల గురించి, రావిశాస్ర్తీ ‘ఇల్లు’, ఓల్గా ‘మానవి’ నవలలోని అంతరార్థాలను వివరించిన వ్యాసాలు చదవదగినవి. ప్రాచీనాధునిక సాహిత్యంపై అవగాహన, భాషమీద పట్టు, సరళమైన శైలి రచయిత్రి సొంతం. స్ర్తివాద దృక్పథంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన వ్యాసాలివి.
**

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-మందరపు హైమవతి