అక్షర

మానవీయ మినీ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిరిశ జానకి
మినీ కథలు
వెల: రు.100/-
ప్రతులకు: అన్ని పెద్ద
బుక్ షాపులు
---

పెద్ద కధగానీ నవలగానీ రాయడం తేలికే. కానీ మినీ కథ రాయడం కష్టం. అందుకు పరిశీలన శక్తితోపాటు ప్రతిభ ఉండాలి. మినీ కథ అంటే కొండను చిన్న అద్దంలో చూపడం. కనిపించని జాడలు కథలో దిగజారిన మానవతా విలువల గురించి చెప్పారు. సారంగపాణి మూలంగా మల్లీశ్వరి ఆత్మహత్య చేసుకున్నా అతను పశ్చాత్తాపపడడు. కానీ సోమసుందరం నుంచి అయిదువేల రూపాయలు రాబట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. తన స్నేహితుడైన చంద్రాన్ని పిలుస్తాడు. ‘తప్పుచేసిన భావన అతనిలో (సోమసుందరంలో) స్పష్టంగా కనపడింది. కానీ మల్లీశ్వరి చనిపోయినపుడు నీలో అలాంటి భావనగానీ, పశ్చాత్తాపపు జాడలు గానీ కనపడలేదు నాకు’ అని సారంగపాణితో చంద్రం అంటాడు. పాతనోటు కథలో తన పుట్టినరోజున బహుమతి కొనడానికి ఉమేశ్ అయిష్టంగా ఇచ్చిన పది రూపాయల నోటును రవీంద్ర దాచుకుంటాడు. ‘అతను నన్ను శత్రువుగా భావిస్తే అది నా తప్పు కాదు. నేను అతన్ని ఒక స్నేహితుడిగానే అనుకుంటున్నాను. ఇష్టం లేకుండా అతను వంద రూపాయలు ఇచ్చి ఉంటే నా మనసు చాలా బాధపడేది. అలా కాకుండా మనస్ఫూర్తిగా పదిరూపాయలు చాలు అని తనకు ఎంత ఇవ్వాలనిపించిందో అంతే ఇచ్చాడు కదా. అందుకే అపురూపంగా దాచుకున్నాను’ అని రవీంద్ర తన భార్యతో అంటాడు.
ఆత్మస్థయిర్యమే ఆ చిరునవ్వు కథలో ఎన్ని బాధలున్నా దిగమింగి పైకి నవ్వుతూ కనపించే వదిన పాత్రను ఆదర్శవంతంగా చిత్రీకరించారు తమిరిశ జానకి. ‘రేపు విచ్చుకోబోయే మొగ్గని చూసి సంతోషపడుతుంటాను నేను. అందమైన భవిష్యత్తు అది. తప్పకుండా అందమైన భవిష్యత్తును చూస్తానన్న విశ్వాసం నాకుంది. మీరు మొగ్గను చూడరు. దానికింద ఉన్న ముల్లును చూసి దిగాలుపడుతుంటారు’ అని వదిన అంటుంది. ఈ కథలో మనో విశే్లషణ ఉంది. జీవ వైవిధ్యంతోపాటు సందేశం ఉంది. నేను (అహం) కథ రచయితలకు కనువిప్పు వంటిది. పిన్ని కూతురికి నొప్పులొస్తే భార్య వెడుతుంది. రచయిత తన భార్యకు ఫోన్ చేసి ‘అది సరే నాకంటే గొప్పదానివనుకుంటున్నావా? ఉద్ధరించేసే దానిలా వెళ్లావుగానీ ఇక ఆలస్యం చేయకుండా బయల్దేరు’ అని భర్త అంటే ‘మీరు రాతలో చూపిస్తారు సమాజ సేవ. చాలా గొప్ప మనిషిమీరు. మామూలు మనిషిని కదా. మీ ముందు నేనెంత’ అని భార్య అంటుంది. ప్రతి రచయితా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరముందని రచయిత్రి ఈ కథలో తెలిపారు.పరివర్తన కథలో మంచికైనా చెడుకైనా మనిషికి మరో మనిషి తోడు అవసరమని చాటి చెప్పారు. అంతేకాదు మనిషి మారడానికి పదిరోజులో పది సంవత్సరాల కాలం పట్టాలని లేదు. పది సెకన్లు చాలు నిజం అంటారు జానకి. ఈ కథ అవినీతిని వ్యతిరేకించారు. అనుబంధాల గురించి మనసు మూగవోయింది కథలో విశదీకరించారు. సంతోషం సరదా కథ. పెళ్లిలో సామ్రాజ్యం ఫోటో తీస్తుంది. అందులో పదిమంది ఆడవాళ్లుంటారు. కానీ వారి తలలుండవు. కానీ చీరలబట్టి ఎవరి పక్కన ఎవరు నిలుచున్నారో సామ్రాజ్యం చెప్పేస్తుంది. ఇదిగో చూడండి ఈ మైసూరు సిల్కు చీర మా పిన్ని. ఈ ఎర్రపట్టు కంచి చీర మీ మేనత్తగారు. ఈ ఉప్పాడ పట్టుచీర మీ పిన్ని. ఈ గద్వాల చీర మీ చిన్న అమ్మమ్మ అంటూ భర్తకు చెబుతుంది. ఆ చీర సంగతేమో కానీ సంతోషంతో మురిసిపోతున్న భార్య మొహం చాలా అందంగా ఇదవరికంటే ఎంతో అందంగా ముచ్చటగా కనపడింది మోహన్‌కి అంటూ కథ ముగించారు.
ఈ కథల్లో కొన్ని వాక్యాలు కర్మ, క్రియ, కర్త వరసలో ఉన్నాయి. చివర కర్త వస్తే వాక్యం అసహజంగాఉంటుంది. కొన్ని పద చిత్రాలు చాంతాడంత వాక్యంవల్ల గజిబిజిగా మారాయి. నవ్వుకి మారుపేరుగాను ఆవేదనకి ఆమడదూరంగాను వుండే గంటలమ్మ మొహం ఇప్పుడెవరైనా చూస్తే పశ్చిమాన అస్తమిస్తూ పోతున్న సూర్యుడు తూర్పు ముఖంగా కూర్చున్న ఆమె వెనుకనుండి ముందుకి ఒక తెరని చింతలతో అల్లి దింపినట్టుంది. ఇలాంటివి కూరలో కరివేపాకు వంటివి.

-తెలిదేవర భానుమూర్తి