అక్షర

‘సంవేదన’లకు అద్దం పట్టే చేహొవ్ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ.చేహొవ్ కథలు
అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి
వెల: రూ.100/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్
సిఆర్ రోడ్, చుట్టుగుంట
విజయవాడ-4

కాలంలో వెనక్కి వెళ్లి చూడవలసిన కథలు కొన్ని వుంటాయి. ఇప్పటి పరిస్థితులతో, విలువలతో బేరీజు వేస్తే అవి చిత్రంగానూ, హాస్యాస్పదంగానూ అనిపించవచ్చు. కానీ మనుషులు, వారి స్వభావాలు, ప్రవర్తనలు కాలావధులను అధిగమించి నేటికీ ద్యోతకం అవుతూనే ఉంటాయి. అలాంటి పాత్రలతో రూపుదిద్దుకున్న కథలు, కాల పరిణామాలు ఎలా వున్నా కాలం వెంట నిలిచే కథలే. కన్యాశుల్కం అనే సమస్య యథారీతి ఈనాడు ఏ మాత్రమూ లేకపోయినా నేటికీ గురజాడ వారి ఆ రచన ఆ పాత్రలతో, స్వభావాలతో గిరీశం సంస్కృతితో ఎలా నవనవోనే్మషమో అలానే ప్రపంచవ్యాప్తంగా కాలావధులను దాటి నిలుస్తున్న కథకులున్నారు.
రష్యా అక్టోబర్ విప్లవం అనంతరం కనబట్టే తీరుకీ, అంతకు పూర్వపు తీరుకీ తేడా ఉంది. ఆ ప్రాచీన రష్యా సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపకరించే రష్యన్ కథకుడు అంతోన్ చేహొవ్! చేహొవ్ కథలు ధనార్జన, స్వీయ అభివృద్ధికే అంకితమైన వారి గురించీ, పటాటోపం సంకుచిత మనస్తత్వం గల వారి గురించీ, అలాగే దాస్య భావనతో, అతి విధేయతతో అణకువతో వర్తించే బలహీనతల గురించీ అందంగానూ, ఉద్విగ్నంగానూ కనబడతాయి. నిజానికి ఆయన కథల్లో హాస్యం, వ్యంగ్యం తొలి రచనల్లో ఎంతగా కనబడతాయో పరిణతి నందుకున్న దశలో రాసిన పెద్ద కథల్లో జీవితం ఎలా వున్నదీ, ఎలా వుండవలసిందీ చెప్పేవిగా సాక్షాత్కరిస్తాయి. అలాగని నీతులూ, ఉపదేశాలూ చెప్పడు ఆ కథల్లో.
1904లో మరణించిన చేహొవ్ కథల్లో ఆయన జీవించిన నాటి సమాజమే చిత్రితమైంది. అదంతా గతమే! ఆ ఛాయలేవీ రష్యాలో ఇప్పుడు లేవు. అయినా ఇవాళ్టికీ రచయితగా రష్యన్ సమాజం ఆయన పుస్తకాలకై ఎగబడి చదువుతూనే ఉంది. సోవియట్ రష్యాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చేహొవ్ ఎందరికో ఒక అభిమాన రచయిత.
‘తాను వాస్తవంగా ఎలా వున్నదీ మానవునికి చూపిస్తే అతను బాగుపడతాడు’ అన్నదే ఆయన రచనల వెనుకగల ఆశయగత సిద్ధాంతం. ఆ మాట ఆయన అన్నదే కాదు తన కథల్లో ఆ విశ్వాసపు సత్యానే్న, ఆశనే చిత్రించి చూపించాడు. చేహొవ్ కథలను నాలుగు దశాబ్దాల క్రితమే అనువదించి తెలుగు పాఠకులకు అందించినవారు రా.రాగా ప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డి. మానవ జీవన ‘సంవేదన’లకు అద్దం పట్టే ఎ.చేహొవ్ కథలు సరికొత్తగా ఈ తరానికి అందించేందుకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ ప్రచురించిన కథల్లో చేహొవ్ ప్రశస్తమైన ఎనిమిది కథలున్నాయి.
అంతస్తును బట్టి, హోదానుబట్టి మనుషులకు విలువనిచ్చే మనుషులు సమాజంలో అప్పుడూ వున్నారు, ఇప్పుడూ వున్నారు. బహుశా ఎప్పుడూ వుంటారేమో కూడా. చేహొవ్ 1884లో రాసిన ‘ఊసరవెల్లి’ కథ అలా అత్యంత జనాదరణ పొందిన కటిక సత్యం కథ. మార్కెట్ వద్ద ఒక మనిషిని కుక్క కరుస్తుంది. డ్యూటీలో ఉన్న పోలీసు విచారణ మొదలెట్టి అలా కుక్కలను ఊరి మీద వదిలి పెట్టిన వాళ్లను తిడుతూంటాడు. ఆ కుక్క పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌దని ఎవరో చెబుతారు. అంతే ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పోలీసు వెంటనే కుక్క కరిచిన మనిషిని తిట్టడం మొదలెడతాడు. ఇంతలో ఇంకెవరో ఆ కుక్క జనరల్‌ది కాదంటాడు. పోలీసు వైఖరి, మాట తీరు మళ్లీ మారిపోతుంది. కుక్క యజమాని సాంఘిక అంతస్తు మీద విషయం ఆధారపడిందన్నమాట. అతను గొప్పవాడైతే కుక్కదేం తప్పులేదు. అతని హోదా తక్కువదయితే కుక్కే కాదు ఆ కుక్క యజమానిగా అతనూ నేరస్తులన్నమాట! ‘చట్టం వున్నవాడి చుట్టం’ అన్నట్లుగా చట్టాన్ని రక్షించవలసినవాడే ప్రయత్నించడం ‘ఊసరవెల్లి’ స్వభావమే కదా మరి!
మరో మంచి కథ ‘గుల్లలో జీవించిన మనిషి’ (1898) బేవికోవ్ ఏడాది పొడుగునా వాతావరణం ఎలా వున్నా బూట్ల తొడుగులు తొడుక్కొని, గొడుగు వేసుకుని, చందినీ కింద పడుకునే రకం. అతడు బ్రహ్మచారి. ఆడవారికి ఆమడ దూరం. అలాంటి వాడికి ఓ పార్టీలో ఉక్రైనా భాష పాటలు పాడే వార్యాతో పరిచయమవుతుంది. స్వభావతః ఏకాంత జీవికీ, ఆమెకూ వివాహం దాకా విషయ ప్రస్తావనమవుతుంది. వార్యా ఫొటోను బేవికోవ్ తన టేబుల్ మీద అమర్చుకుంటాడు కూడాను. ఒకరోజు వార్యా, తన సోదరుడు కొవలేంకొతో బాటుగా సైకిల్స్ మీద వెడుతూ బేవికోవ్‌కు కనబడుతుంది. ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేదే మింగుడుపడని బేవికోవ్ నిర్ఘాంతపోతాడు. ఆ ఊహనే తట్టుకోలేని అతను వార్యా సైకిల్ తొక్కడం వల్ల తన జీవితంలోకి ఆహ్వానించలేక ఆమె ఫొటో తొలగిస్తాడు. దుర్భర వేదనతో నెల్లాళ్లకే మరణిస్తాడు. ఇవాన్ ఇవానిచ్ అనే పాత్ర చెప్పిన కథగా సాగే ఇందులో - గుల్లలో జీవించే మనుషులు ఎందరో వున్నారు అనీ, పట్టణాలలో గాలి రాని ఇరుగు గదులలో నివసించడం, అక్కరకురాని కాగితాలు రాయడం, పేకాట ఆడటం, కుక్షింభరుల మధ్య కుసంస్కారపు వారి మధ్యా పనిలేని, మతిలేని ఆడవాళ్ల మధ్యా జీవితమంతా గడుపుతూ నిత్యం చెత్త మాట్లాడుతూ, చెత్త వింటూ ఉండడం ఇదంతా కూడా నత్తగుల్లలో జీవించే బ్రతుకే అనే అన్పింపచేస్తాడు!
‘సీతాకోక చిలుక’ కథ ఓల్గా అనే స్ర్తి వివాహితురాలరుూ్య సాగించే స్వేచ్ఛా జీవనం, డాక్టరయిన భర్త దీమొవ్‌తో వుంటూనే ఓ చిత్రకారుడితో సంబంధం నెరపడమూ, అది గ్రహించినా దీమొవ్ ఆమెను ఏమీ అనకపోవడమూ, చిత్రకారుడితో మోసపోయిన ఓల్గా భర్త ఔన్నత్యాన్ని గ్రహించేసరికి డిఫ్తీరియాతో దీమొవ్ మరణించడమూ జరుగుతుంది. 1892 నాటి కథ ఇది.
పాఠకుడి భావుకత్వం మీదా, గ్రహింపు మీదా నమ్మకం వున్న రచయిత చేహొవ్. అందువల్లే అతని కథలు యథాతథ స్థితిని వివరించే దిశగానే సాగుతాయి. అదే సమయంలో మనిషితనాన్ని నిలబెట్టే దిశగా, బ్యురాక్రటిక్ తనాన్ని నిరసించే దిశగా మేల్కొల్పుతాడు. ‘ఇయొనిచ్’ ‘కుక్కను వెంటబెట్టుకున్న మహిళ’ ‘పెండ్లికూతురు’ ‘బురఖా’ వంటి కథలన్నీ తన కాలంనాటి పరిసరాలను, మనుషులను చిత్రిస్తూనే భవిష్యత్ దర్శనాన్ని కూడా కలిగి వున్న రచయితగా నిరూపిస్తాయి. ‘లైలాక్ పూల మీద వ్యాపించే చిక్కని పొగమంచు’ వంటి ఉపమలు తరచుగా అనేక కథలలో కనిపిస్తాయి.
చేహొవ్ కథలు చదవడమంటే జీవితాన్ని చదవడం, మనుషులను చదవడం, నాలుగు దశాబ్దాల క్రితంనాటి అనువాద రచన కనుక రాచమల్లు రామచంద్రారెడ్డి తెలుగు అనువాదం సాఫీగా, హృదయమంగానే సాగినా ఇప్పుడు ఈ కథలను మరింత సరళంగా, హృద్యంగా అనువదించి చెప్పడం ఈ తరానికి ఇంకా బాగుంటుందనిపిస్తుంది.

-సుధామ