అక్షర

హాలికుల పక్షాన అక్షర సేద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వ్యవసాయం సాటిలేని సృజనాత్మక కళ. ప్రపంచంలో సజీవాన్ని సృష్టించే కళ అదొక్కటే! చరిత్రలో మొట్టమొదటి వౌలిక కళాకారుడు రైతు. చరిత్రలో సాటిలేని వంచన పాలయ్యిందీ రైతే!’’ అంటారు డా పాపినేని శివశంకర్ ఒక వ్యాసంలో. నిజమే! అంతటి సృజనాత్మక కళ, సజీవాన్ని సృష్టించే సాటిలేని మేటి కళ ఎందుకు ఈనాడు వంచన పాలైంది? సంక్షోభంలో పడి శోకిస్తోంది? దీనికి కారకులెవరు? పాలకులా? హాలికులా? ఈ ప్రశ్నలు ప్రతివాని మనస్సులో తొలుస్తూనే ఉన్నాయి. వీటి సమాధానాల కోసం మనం చరిత్రలో కొంత వెనక్కు కొంత ముందుకు నడవాల్సి వుంది. స్వాతంత్య్రానికి పూర్వం మన వ్యవసాయ రంగం శోభాయమానంగా సుఖశాంతులతో భోగభాగ్యాలతో విలసిల్లుతుందా? అంటే, అదీ లేదు! ప్రపంచీకరణ అనే ప్రాణాంతకమైన పక్షి మన దేశంమీద వాలింది 1990 ప్రాంతంలోనే. ప్రపంచీకరణకు ముందు అంటే 1990కి ముందు స్వాతంత్య్రం వచ్చాక వ్యవసాయం పరిస్థితి ఎలా వుంది అంటే, కష్టనష్టాలతో, దారిద్య్రాన్ని చవిచూస్తూ, కొడిగట్టిన దివ్వెలా దీనావస్థలోనే వుంది అన్న విషయం మన కవులే కవిత్వమై కన్నీళ్లు రాల్చారు.
కవికోకిల దువ్వూరి రామిరెడ్డి 1919లో ‘కృషీవలుడు’ కావ్యంలో రైతును కృంగదీసే విపత్కర పరిస్థితులను చెప్తూ ‘‘తల తాకట్టులు పెట్టి ధనికుల దగ్గర / పన్నుకైగొన్న రూపాయలప్పు / కూలికి నాలికిం కూటికిం జాలక / నాముగా గొన్న ధాన్యంపుటప్పు’’ అంటూ ‘నాముగా’ అంటే ధాన్యాన్ని అప్పుగా తీసుకుంటే, చెల్లించేనాటికి హెచ్చుగా చెల్లించే ధాన్యాన్ని ‘నాము’ అంటే వడ్డి అన్నమాట. రైతు ఆనాడు కూడా అప్పుల ఊబిలో కూరుకపోయి ‘‘వాయిదా మించి వచ్చిన వడ్డి యప్పు కట్టలేక’’ పడతి సొమ్ములు కుదువకు పెట్టిన వైనాన్ని వర్ణిస్తాడు కవి.
కనె్నకంటి వీరభద్రాచార్యులు ‘పేదకాపు’ కావ్యంలో ‘‘గాదెలు బూజుపట్టె / ములుగర్రలు మూలన్ జేరె / పొలాలు బీడులై యూదర పట్టుచుండె / ...ప్రజావేదన నేమి చెప్పెద’’ నంటూ వ్యవసాయ బాధల్ని ఎత్తిచూపారు.
తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి కర్షజీవనం గూర్చి ‘‘కర్షకుల కడగండ్లు’’ అనే ఖండికలో 1990 ప్రాంతంలో రైతులు దోపిడీకి గురైన విధానాన్ని చెప్తూ ‘‘పెద్ద వడ్డీలొడ్డి పీల్చె నీ రక్తంబు / చట్టు గుండియ సాహుకారు / బన్నం బెఱింగి నీ పంట నల్పక్రయం / బిచ్చి, బండ్లకు నెత్తె బచ్చు కటిక / లంచంబు నాసించి కించిత్తు నీతికీ / కధికారి నీ కటూ కడ్డుదగిలె / దారుణం బగు పన్ను దయమాలి విధియించి / కటకటా! నృపతి నీ కడుపు మాడ్చె’’ అంటూ వడ్డీ వ్యాపారులు, ధాన్యం వ్యాపారులు, లంచగొండులైన ఉద్యోగులు, పన్నులు అధికంగా విధించే పాలకులు ‘‘అందరు ఎన్నో రీతుల నీ సొమ్ము తిన్నవారె అయినా నిన్ను మాత్రం వాళ్ళు గడ్డిపోచవోలే చూస్తున్నారు’’ అంటారు.
కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువ ‘‘నాగార్జునసాగరం’’ అనే లఘు కావ్యంలో రైతు వలసల్ని ఎత్తిచూపుతూ ‘‘అన్నమో రామచంద్రా యంచు నల్లాడి / పరదేశముల కేగి బ్రతుకువారు.. / పన్ను గట్టుట కిండ్లు వాకిళ్లు తెగనమ్మి / పైమీద బట్టతో మసలువారు’’ రైతు దుస్థితిని ఆవిష్కరించారు.
‘కృషికార్తి’ కావ్యంలో రైతులు అమాయకులు. రాజకీయ నాయకుణ్ణి గ్రుడ్డిగా నమ్ముతారు అంటూ ‘‘ఓట్లు కోసం నుచ్చించి యూఱడించి / పదవులన్నిట తమవారికి భద్రపరచి / గద్దెనెక్కిన నెలనాళ్లు గడవ నిన్ను / మరతు రనుమాట మరచు ‘అమాయకుడవు’ అనె్నం పునె్నం అమాయకుడవు నీవు రైతన్నా’’ అంటారు.
అగ్రరాజ్యాల ఆధిపతోన్మాదాన్ని, వాణిజ్య దాహాన్ని, ఆర్థిక దోపిడీని కొనసాగించడానికి బడుగు బలహీన వర్గ దేశాలమీద విసరిన రంగుల వల ‘ప్రపంచీకరణ’. దాని విషమ సంస్కృతి, ద్రోహ చింతన, దోపిడీ తత్త్వం మన సామాజిక విలువల మీద దాడి చేసింది. మానవ సంబంధాలను తెంపివేస్తూ, వస్తు వ్యామోహాన్ని పెంచివేస్తూ మనిషిని మార్కెట్ వస్తువుగా మార్చివేసింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, గాట్ ఒప్పందాలు, డెంకల్ డ్రాప్టులు, కార్పొరేట్ కబంధ హస్తాల విస్తరణకు తెరలేపాయి. ‘ప్రేమ, సహకారం, శాంతి, అభివృద్ధి, స్వేచ్ఛా వాణిజ్యం పైకి చెప్పే నీతులు. వాని వెనుక ఎన్నో పెద్ద గోతులు అంతుదొరకని అగాథాలు. ముఖ్యంగా మన వ్యయసాయ రంగం మీద పెద్ద దెబ్బ తీశాయి. రైతులు ప్రపంచీకరణకు ముందే ఆకలి చావులతో అల్లాడుతున్నారు. మూలిగే ముదుసలి నెత్తిన తాటికాయ పడ్డట్టు, పచ్చిపుండు మీద కారం చల్లినట్టు, పెనంమీద నుండి రైతు పొయ్యిలో పడ్డ చందమైనాడు. వ్యవసాయం నేడు సంక్షోభంలోకి వెళ్లిపోయింది. సంక్షేమాన్ని మరచిపోయింది. కర్షకుని కన్నీరే వరమైంది. 1990 తరువాత వ్యవసాయ సంక్షేమం మీద కవులు స్పందించిన వైనం.
డా సి. నారాయణరెడ్డి ప్రపంచీకరణ ఫలితంగా పంట భూములు పరిశ్రమలుగా పెద్ద పెద్ద కర్మాగారాలుగా మారిపోవడాన్ని ఎత్తిచూపుతూ ఒక కవితలో ‘‘ఆకాశాన్ని కుమ్మేస్తూ నిలిచిన / ఇనుప యెముకలు సిమెంటు అవయవాలు / శతాధిక సౌద శరీరక శ్రేణులు / మానవీయ చక్షువులతో చూడగలిగితే/ అవి వెల్లివిరిసే వ్యవసాయ సంస్కృతికి కంఠానికి బిగించిన ఉరితాళ్ళు’’ అంటూ ‘మానవీయతా దృష్టితో చూడండి, ఆర్థిక దృష్టితో కూడిన స్వార్థంతో చూడకండి’ అంటారు.
డా నాగభైరవ కోటేశ్వరరావు ‘‘మారాజు బావురుమన్నాడు’’ కవితలో ‘‘శ్రమప్రత్తిగా విప్పారి / అదృష్టం అప్పుగా మితిమీరి / అభిమానం కంటే / ఆత్మహత్య చిన్నదని / వాడు పురుగు మందు తాగాడు / ఎరువుల రేటు పెంచాడు/ వ్యవసాయం చేసేది ఎట్టాగయ్యా అంటే / తుపాకీ గుళ్లు దూసుకపోయాయి /అడగడానికి హక్కు లేని స్వరాజ్యం ఎందుకని/ అమ్మ నేలను అమాయకంగా ప్రశ్నిస్తూ / ఆ మారాజు బావురుమన్నాడు’’ అంటూ అన్నదాతల ఆత్మహత్యల్ని గూర్చి రాశారు.
కె.శివారెడ్డి ‘‘మనమంతా ఒకే సముద్రం’’ అనే కవితలో 1991లో ‘‘చీకట్లు ఇనుప వలలు నిర్జీవ విత్తనాలూ/ తెగిపడిన అంగాలు / దిక్కుమాలినతనాలు / భయోత్పాద వలసలు / ప్రభుత్వ యంత్రాంగం / నిర్వీర్యవౌతుంది పెట్టుబడి విడదీస్తుంది.. దేశ ప్రజల్ని ఆ దేశంలోనే కాందిశీకుల చేస్తుంది’’ అంటాడు.
ఎన్.గోపి పత్తి రైతుల ఆత్మహత్యల్ని గూర్చి రాస్తూ ‘‘తెలిసిందా! పత్తి కూడా చంపుతుందని / పురుగే కాదు పువ్వు కూడా చంపుతుందని’’ అంటాడు.
గొడ్డుమోతు విత్తనాల్ని సృష్టించే వ్యాపారాన్ని దుయ్యబడుతూ డా అద్దేపల్లి రామమోహనరావు ‘‘మట్టి ఉప్పెన’’లో ‘వాడొక టెర్మినేటర్ / అండ్ ట్రైటర్ / మృత్యుజీవాల్ని / జీవనం కోసం తపించే ముఖక్షేత్రాల్లో / చల్లుకుంటూ పోతాడు’’ అంటారు.
డా రాచపాళెం చంద్రశేఖరరెడ్డి తన ‘పొలి’ కావ్యంలో ‘‘చెట్టంత మనిషిని రక్తం పిండి పిండి / దిగులు గువ్వను చేసి / కష్టాల గూట్లోకి నెట్టేసింది / నాగలి విరిగిపోయింది / పవాత పుచ్చిపోయింది / జీతగాళ్ళు వలస పక్షులయారు / రైతు రౌతు మెత్తబడి పోయాడు’’ ప్రపంచీకరణ నేపథ్యంలో రైతుకు పట్టిన దుర్గతిని చెప్తాడు కవి.
కొండ్రెడ్డి ‘దుక్కిచూపు’ అనే దీర్ఘకవితలో ‘‘మనిషి జీవన విధానపు మూలధాతువై మనుగడ సాగిస్తున్న పల్లెపై /ప్రాణాంతక పక్షేదో వాలింది/ పట్టణ సంస్కృతుల రెట్టలతో / నా పల్లె స్వరూపానే్న మార్చి / కూలి తల్లిని చేసింది’’ అంటూ మట్టిని మచ్చికజేసే మావటివాణ్ణి / ప్రపంచీకరణ మదపుటేనుగుతో తొక్కించాక / సైబర్ సైతానుతో రక్షించాక / సంస్కరణలన్నీ శాడిజం సింబల్స్ కాబోతున్నాయి’’ అంటారు. ‘‘అన్నదాతకేల ఆత్మహత్యల రాత / కపట వర్తకులకు కలిమిరాత / రాతలన్ని మన నేతలే రాసిరి’’ అంటూ పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ‘‘పిడికిట బువ్వ ముద్దగా పిసికినప్పుడల్లా / పాలకులు కసిగా గొంతు పిసికిన /రైతే గుర్తొస్తూంటాడు’’ అంటూ చితికిపోతున్న రైతును గుర్తుచేసుకుంటాడు కవి.
బి.హనుమాన్‌రెడ్డి ‘‘పల్లెకు దండం పెడతా’’ దీర్ఘకవితలో రైతుని ‘‘ప్రపంచ బ్యాంకు కుట్టింది / డబ్ల్యుటివో కరిచింది / ప్రపంచీకరణ కదా / ఎక్కడని వెతుకుదాం రైతును / సొంత నేలమీద పరాయి వాడయ్యాడు’’ అంటారు. విప్లవ కవి కౌముది ఒక కవితలో ‘‘నాగలి ఆత్మహత్య చేసుకుందంటే / మనిషి చరిత్ర యావత్తు ఆత్మహత్య చేసుకున్నట్టే లెఖ్ఖ’’ అంటారు.
డా సి.్భవానీదేవి ‘‘మేధో సంపత్తిగల సంతతి హక్కులు కుట్రలు / టెర్మినేటర్ టెక్నాలజీ / జీన్స్ మార్పిడిలో / పునర్జన్మ లేని పాళీ బీజానికి / రైతు డబ్బు గలగలపై ఎంత మోహమో- నంటూ గొడ్డుమోతు విత్తనాలమ్మి రైతు ఫలాల్ని దోచుకునే విధానాన్ని చెప్తారు కవయిత్రి.
డా రావి రంగారావు ‘ఏదైనా అమ్మగలడు’ కవితలో ‘‘వాడు ఆకాశం అమ్ముతున్నాడు / కొనేవాళ్ళు ఎగబడుతుంటే.. / ఈ దేశం, ఈ నేల మనదే / పొలాలు హలాలు మనవే / జలాలు బలాలు మనవే / అయినా సరే! వాడు అమ్ముతాడు / మనం వాడి మాయలో పడి / అమ్ముడు పోతుంటే / మన బతుకుల్ని / అంగడి సరుకులుగా మారుస్తూనే వుంటాడు’’ అంటాడు.
‘‘డాలర్ చీడపురుగై / పచ్చదనాన్ని ఆక్రమించింది / నయావలస మిడతల దండును / పొలాల్లో వదలి / పచ్చదనాన్ని ఎగురవేస్తాడు’’ అంటూ అంగళకుర్తి విద్యాసాగర్ డాలర్ వ్యామోహాన్ని ఎత్తిచూపాడు.
‘‘గాయాలు అమ్మబడతాయి / కనబడతాయి / బదిలీ చెయ్యబడతాయి / మారు బేరానికి అమ్మబడతాయి / గాయాలు అంతర్జాతీయ వ్యాపారం / కన్నీరు దుఃఖం కాదు / నకిలీ నటన’’ అంటారు అడిగోపుల వెంకటరత్నం.
డా బీరం సుందరరావు ‘నేలచూపు’ కవితలో ‘‘రైతుకు నేల చూపు తప్పడంలేదు / కాలం కంప్యూటర్‌లో దాక్కుందని / కొత్త చేతులు చేలోకి వస్తున్నాయని / గుర్తించలేని అమాయకుడతడు’’ అంటూ తరతరాల భూమి స్వప్నాన్ని ధ్వంసం చేస్తున్న అంతర్జాతీయ కుట్రను గురించి రైతుకు తెలియని వైనాన్ని వ్యక్తీకరిస్తాడు కవి. ప్రభుత్వం కుట్రలు దాష్టికాలు మరియు కరువు కాటకాలు బదిలీలో / వలస జీవితాలై పోతున్న రైతు జీవితాల్ని గురించి శ్రీరామ కవచం సాగర్ స్పందిస్తాడు.
కెంగార మోహన్ ‘మనుగడ’ కవితలో రైతు జీవితం గూర్చి ‘‘కార్పోరేట్ విష వలయంలో / విశ్వం జీవిత ఖైది అయ్యింది / సిరులు పండించే అన్నదాత / రిలయన్స్, మోర్, షాపింగ్ మాల్స్ ముందు / భిక్షాటన చేస్తున్నాడు’’ అంటారు. జంధ్యాల రఘు ‘‘రుణ మాఫీ కనిపించని / ఎడారి ఒయాసిస్సు / ఉరితాడు పేనాలన్నా / నులకతాడు కరువాయె / పెట్టుకున్న అర్జీలన్నీ / బుట్టదాఖలాయె’’ అంటూ రైతు నిరాదరణ గూర్చి చెప్పాడు.
హాలికునికి పాలకుల అండదండలు కరువైనాయి. పంట పొలాల్లో పారిశ్రామిక వాడలు, రాజధాని సుందర మహళ్ళు నిర్మిస్తామంటూ వ్యవసాయాన్ని ‘దండగ’ వృత్తిగా భావిస్తూ ప్రపంచీకరణ విపత్తును ప్రజలు గ్రహించనీయకుండా పాలకులు కల్లబొల్లి కబుర్లు చెప్తూనే ఉన్నారు. ఇవాళ సేద్యం క్షతగాత్రమయింది. రైతు జీవన విధానం దుర్భరమైంది. వ్యవసాయాన్ని చేతులార పాలకులు సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారు. రైతు ఉద్యమాలు బలపడాలి. పోరాటాలు వెలుగుచూడాలి. వ్యవసాయానికి సరికొత్త ఊపిరినిచ్చే ప్రతిపాదనలు ప్రభుత్వం నుండి రావాలి. వ్యవసాయం సంక్షోభ దిశనుండి సంక్షేమ దిశకు మారే రోజులు వస్తాయని ఎదురుచూద్దాం.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి