అక్షర

అందరికీ అక్కరకొచ్చే ‘అంటరాని దేవతలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటరాని దేవతలు
-డా.పసుమర్తి
సత్యనారాయణ మూర్తి
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*

సమాజ హితాన్ని కోరేదే సాహిత్యమన్నప్పుడు ‘అంటరాని దేవతలు’ నవల నూటికి నూరుపాళ్లు అలాంటి హితకరమైన రచన. డా.పసుమర్తి సత్యనారాయణ మూర్తి తెలుగు నేలలో జన్మించి ఇంగ్లండ్‌లో డాక్టర్‌గా ఉద్యోగించి స్వగ్రామమైన యలమంచిలిలో వైద్య విద్యారంగాలలో సేవలందించటంతోపాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన సమాజ సేవకులైన వైద్యులు. వీరి తొలి నవల ‘అన్‌టచ్‌బుల్ గాడెస్’ను ప్రముఖ సీనియర్ కథకులు, సాహితీవేత్త ద్విభాష్యం రాజేశ్వరరావు తెలుగులోకి అనువదించి ‘అంటరాని దేవతలు’ పేరుతో మనముందుంచారు.
అంటరానితనం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో రూపాల్లో ఉన్నా మన దేశంలో కులపరంగా ఒక వివక్షగా అనాదికాలం నుంచి ఉన్న సామాజిక రుగ్మత. ఈ అంశంపై తాను జీవించిన కాలంలో ధైర్యంగా ఎదుర్కొని దళితుల విముక్తికి సంక్షేమానికి పాటుపడిన కుటుంబాలలో రచయిత కుటుంబం కూడా ముఖ్యులు. డా.పసుమర్తి సత్యనారాయణ మూర్తి గారి స్వీయ చరిత్ర నవలా రూపంలో ఉన్నత విలువల్ని ప్రసారం చేయటానికి అక్షరంగా ఆవిర్భవించింది.
ఈ నవలా కాలం రెండవ ప్రపంచ యుద్ధ సమయంతో మొదలౌతుంది. విశాఖపట్నం నేపథ్యంగా జరిగే కథలో జపాన్ విశాఖ మీద బాంబు దాడికి తెగబడుతున్నప్పుడు చిన్నపిల్లవాడుగా ఉన్న ముఖ్యపాత్ర లేదా నాయక పాత్రధారి శివ కుటుంబం యలమంచిలికి వలస వెళ్లిపోతుంది. శివ తండ్రి అయిన దుర్గాప్రసాద్ కుల మత ప్రసక్తి ఎంచని మానవతా విలువలుగల డాక్టర్‌గా యలమంచిలిలోని సకల ప్రజలకు ఆరాధనీయునిగా పూజింపబడతాడు. విశాఖపట్నంలో ఉన్నప్పుడు శివకి పాకీపిల్ల నూకాలమ్మ అనే ‘నూకీ’తో పరిచయం ఆసక్తిగా మారింది. బ్రాహ్మణ కుటుంబంలో సాంప్రదాయిక విధానంలో పెరుగుతున్న శివకి నూకీ జీవితం పట్ల విచారం, ఆలోచనలు రేకెత్తుతాయి. యలమంచిలి చేరుకుని క్రమంగా పెరుగుతున్న శివకి ‘నూకీ’ అడపాదడపా తటస్థపడుతూ అతని ఆలోచనల్ని పరిణతి వైపు నడిపిస్తుంటుంది. దళిత కుటుంబానికి చెందిన కృష్ణ అనే క్రిస్ట్ఫర్ స్నేహం, తండ్రి సంస్కారం శివని మనిషిగా ఎదగటానికి దోహదం చేస్తాయి. నవలలో యలమంచిలిలోని పూరిపాక స్కూల్‌ని తండ్రి మంచి కట్టడంగా మార్చడం, డాక్టర్‌గా ఆయన ఔదార్యం, సహనం శివని కూడా డాక్టర్ వృత్తిలోకి నడిపిస్తాయి. మల్లి లాంటి అనాధ పట్ల డాక్టర్ దుర్గాప్రసాద్ దయాగుణం ఆదర్శవంతంగా ప్రకాశిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లకి ఉన్న ఆచారాల పట్టుదల తండ్రికి లేకపోవటం, గృహ ప్రవేశం సమయంలో ఆయన అన్ని కులాల వాళ్లతో సహపంక్తి భోజనం చేయటం వంటి సందర్భాలు శివ సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని ఓ మెట్టు ఎక్కిస్తాయి. శివ డాక్టర్ కావటానికి యలమంచిలి గ్రామస్తులంతా సహాయం చేయటం, అతను ఎంబిబిఎస్ లో చేరాక వివిధ స్థాయిలలో అనుకోని రీతిలో అతనికి అందిన సహాయాలు చదువుతుంటే మనందరి జీవితాల్లో కూడా కొన్నికొన్నిసార్లు అనుకోని రీతిలో సాయం చేసిన మంచి మనుషులు గుర్తొస్తారు. మనుషుల మీద నమ్మకం పెరుగుతుంది కూడా!
బ్రిటీషు ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మామయ్య ప్రమోషన్ పొంది విశాఖపట్నం వెళ్లిపోవటంతో శివ తండ్రి తనదైన ఇల్లు ఏర్పాటు చేసుకొని ఆ ఊళ్లోనే స్థిరపడతాడు. శివ ఇండియాలో డాక్టర్ చదువు, లండన్‌లో సర్జన్ చదువు.. ఇలా అంచెలంచెలుగా సాగిపోతుంటుంది. తండ్రికి మాత్రం శివ తిరిగి వచ్చి యలమంచిలిలో ప్రాక్టీస్ పెట్టాలని కోరిక. శివ కూడా సుముఖంగానే ఉన్నాడు. నూకీ, భీముడు స్నేహంలో శివకి సమాజంలో అట్టడగు వర్గాల వారి బాధలు, సమస్యలు తెలుస్తుంటాయి. జంతుబలి చూసిన శివ జాతరలో తెలివితప్పి పడిపోయినప్పుడూ, అంతకు ముందు విశాఖ బీచ్‌లో చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు కూడా శివని ‘నూకీ’నే కాపాడింది. వాళ్లది ప్రేమ అవునా కాదా అనిపిస్తుంది. అది సాధారణంగా ‘ప్రేమ’ అని వాడే అర్థంలో కాదుగానీ మనిషిని మనిషి ప్రేమించే ప్రేమ అన్నది నిజం. నూకీ లాంటి పాకీ అమ్మాయిని సహజమైన హృదయంతో మనిషిలా ప్రేమించిన శివ నూకీ మరణంతో తల్లడిల్లిపోతాడు. అతనికి లోకం శూన్యమై పోతుంది. శివ ‘నూకీ’ పాడె మోయటం, చితికి నిప్పంటించటం చూసి సమాజం ముక్కున వేలేసుకుంది. శివ స్నేహితుడు కృష్ణ శివ లండన్ వెళ్లటానికి సాయం చేస్తాడు. కృష్ణ దళితుడైతేనేం అలాంటి స్నేహితుడుంటే ఇంకెవరైనా ఎందుకు అన్పిస్తుంది. ప్రాణంలో ప్రాణంగా ఒకరి కష్టసుఖాలు మరొకరివిగా జీవితమంతా వాళ్లిద్దరూ కలిసి నడుస్తారు. శివ లండన్ అనుభవాల్లో రచయిత కన్పిస్తారు సహజంగానే. డాక్టర్ వృత్తిలోని నైపుణ్యం, కాలనిర్దేశం, సీనియర్ల వాత్సల్యం, వృత్తిపట్ల అంకితభావం, కేసుల్ని స్టడీచేసే విధానం వీటిపట్ల కొంత అవగాహన, గౌరవం కలుగుతాయి. సహ పరిశోధక విద్యార్థి లోరా పరిచయం శివలో చైతన్యం కల్గిస్తుంది. శివలోని క్రమశిక్షణ, స్థితప్రజ్ఞతకు ఆశ్చర్యపడిన లోరా అతని సిగ్గరితనం గురించి, ఔన్నత్యం సంస్కారాల గురిచి మెచ్చుకుంటుంది. ‘అన్ని మతాలూ సంఘం కట్టుబాటు తప్పిపోకుండా ఉండటానికి కొన్ని సూత్రాలు, నిబంధనలూ చెబుతూ ఉంటాయి. ఓ మతానికో, మరో మతానికో కొంతమేరకు మారినా నీ చుట్టూ ఉండే వాతావరణం, నీ తల్లిదండ్రుల వల్లా నీ ఎదుగుదల, నీ మనస్సు ప్రభావితవౌతాయి’ అని లోరా చెప్పిన మాటలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి.
తండ్రి సడన్‌గా చనిపోవటంతో కుంగిపోయి యలమంచిలికి ఉన్నపళంగా తిరిగి వచ్చిన శివకి చివరి చూపు కూడా అందలేదు. తండ్రి జీవన విధానం వల్ల ఆ వూరి వాళ్లు ఎంతగా ప్రేమించారో, శివ మళ్లీ డాక్టర్‌గా ఆ వూరికే రావాలని ఎంతగా కోరుకుంటున్నారో శివ తెలుసుకుంటాడు. అందుకే అక్కడికే తిరిగి వచ్చి వైద్యునిగా కొంతకాలం సేవలందించాడు. మళ్లీ లండన్, తర్వాత కాలిఫోర్నియాలో కృష్ణ దగ్గరికి వెళ్లిపోయాడు.
శివ జీవితం పరమశివుని నిర్ణయమేనని అడుగడుగునా రచయిత సూచిస్తూంటారు. ఆస్తికులందరి భావన ఇదే గదా! భార్యని పోగొట్టుకున్న కృష్ణ దగ్గరికెళ్లిన శివకి మల్లి కన్పిస్తుంది. అనాధ బాలిక అయిన మల్లి పెంటయ్య దగ్గర కృష్ణ చెల్లెలా పెరిగి వివాహ బంధం విచ్ఛిన్నమై అమెరికాలో జీవిస్తోంది. బాల్యిం నించి తనంటే ఇష్టపడే మల్లి అక్కడ అలా కలవటంతో ఉక్కిరిబిక్కిరి అయిన శివ కృష్ణకి జరిగిన భార్యా వియోగానికి విచారిస్తూనే మల్లి తనదవుతున్నందుకు చాలా ఆనందిస్తాడు. ‘లోన్ సైప్రస్ ట్రీ’ లాంటి ఒంటరి జీవితాల్లో కూడా వసంతం ఉంటుందని నిరూపిస్తూ, శివ, మల్లిల వివాహం కృష్ణ ఆశీస్సులతో జరిగింది. కృష్ణ అలా బాధపడుతూ జీవించటం సహించలేని శివ స్నేహితుడి మంచికోరి అతనంటే అభిమానించే తన చెల్లెలు భారతిని కృష్ణతో వివాహం చేయటానికి పూనుకుంటాడు. దానికి మల్లి కూడా ఆనందిస్తుంది.
జీవితంలో అవమానాలు, కష్టాలు ఎదురైనా గెలిచి నిలిచిన నూకీ, శివ, కృష్ణ, మల్లి పాత్రలు ఈ నవలలో మణిమకుటాలు. ఎవరు ఏ కులంలోనైనా పుట్టటం యాదృచ్ఛికం. తక్కువ కులం అని సమాజం ముద్ర వేసిన కులంలో పుట్టిన వాళ్లు బాల్యం నించి ఎదుర్కొనే కష్టనిష్టూరాల మీద, అనుభవించే వేదనల మీద, ఎన్ని పుస్తకాలు రాస్తే తీరుతాయి. మన వ్యవస్థలోని మనం, కులం, మతం వలయాలు దాటి బయటకి రావాలి. వృత్తిమతంగా, దేశం కులంగా మనగలిగే రోజు రావాలి. ఇందులో డాక్టర్ల పాత్ర మరింత విశిష్టమైనదని రచయిత బోధించారు. అంతా తిరిగి యలమంచిలి వెళ్లి ఏనాటికైనా జన్మభూమి రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకోవటంతో గాంధీ కలలు గన్న ‘సురాజ్యం’ అనే ‘గ్రామ రాజ్యం’ కళ్ల ముందు నిలుస్తుంది. అంబేద్కర్ ఆశయమైన కుల వ్యవస్థను రూపుమాపే పనిని చేపట్టటానికి శివ దీక్షకు కృష్ణ, మల్లి బలాన్నిచ్చారు. భవిష్యత్ పట్ల కోటి ఆశలు, సంకల్పాలతో ముందుకు సాగే ఆ జంటలు పాఠకులకు నవ్య స్ఫూర్తినిస్తాయి.
ఈ నవల నవల కాదు. ఓ ఆదర్శ జీవన విధానం ‘ఇతరుల కోసం జీవించేవాడే బతికున్నవాడు మిగిలిన వారు జీవన్ముృతులు’ అనే స్వామి వివేకానంద వాక్కు అక్షర రూపం దాల్చినట్లున్న రచన ఇది. ఆదిశంకరాచార్యుల వారికి కాశీ క్షేత్రంలో శివుడు ఒక ఛండాలుని రూపంలో అడ్డువచ్చి చేసిన జ్ఞాన బోధని రచయిత గుర్తు చేశారు. దేశ ప్రగతికి కులాలు, మతాలను అధిగమించి అంతా ఒక్కటిగా మనుషులుగా నిలవాలన్నది రచన ముఖ్యోద్దేశం.
ఈ నవలలోని పాత్రలన్నింటినీ కులం, మతం ప్రసక్తి పక్కనపెట్టి చదివితే రచనా పరమార్థం నెరవేరదు. సంఘసేవ, వృత్తికి అంకితం కావడం వంటివి ఇతర రచనల్లో చూస్తుంటాం. కానీ మనుషులు కులాలు, మతాలు మర్చిపోయి మానవతా గుణాలయిన దయ, ప్రేమ, స్నేహాలకి ప్రాధాన్యత నీయటంతో ముగ్ధులవౌతాం. తెలివితేటలు ఏ ఒక్క కులం సొత్తుకావు. అవకాశాలు లభిస్తే, లేదా అందిస్తే ఏ కులంలో పుట్టినా, దళితులైనా, మరెవరైనా ఆయా రంగాలలో శిఖరాల నధిరోహించగలరని కృష్ణ లాంటి పాత్రలు నిరూపించాయి. పాకీ పిల్ల ‘నూకీ’ పరమశివుని భర్తగా భావించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందింది. అనాధగా అంటరాని కులంలో పెరిగిన మల్లి ఉన్నత సంస్కారంతో, బుద్ధితో రాణించింది. అందరి మన్నన పొందిన ‘శివ’ ఆదర్శ మానవునిగా నిలబడ్డాడు. ‘అంటరాని దేవతలు’ నవల ఆలోచింపజేస్తుంది. ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. అందుకే ఇది అందరూ చదవాల్సిన ఆమోదయోగ్యమైన రచన.

-డా.సి భవానీదేవి