అక్షర

అక్షరాకాశంలో ‘సరికొండ’ సూర్యోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూపుడు వేలుపై
సూర్యోదయం
సరికొండ నరసింహరాజు
వెల: రు.100/-
పుటలు: 152
ప్రతులకు: రచయత, ఇం.నెం.ఎ-116,
పైలాన్ కాలనీ
నాగార్జునసాగర్, 508 503
9441364022.. అన్ని ప్రముఖ పుస్తక షాపుల్లో
***

వేయి పడగల విషసర్పమై ప్రపంచీకరణ మన సంస్కృతిని కాటువేసింది. కులవృత్తులను సర్వనాశనం చేసింది. మన అలవాట్లను, ఆచారాలను మార్చివేసింది. మాతృభాషపై ద్వేషాన్ని రగిలించింది. ఆంగ్ల భాషపై వ్యామోహాన్ని పెంచింది. మానవులమధ్య మారాకు వేయాల్సిన మమతానురాగాలను పెళ్లగించి ఆర్థిక సంబంధాలకు మాత్రమే ప్రాముఖ్యతనిచ్చింది. గాంధీ పుట్టిన దేశంలోనే హింసారక్కసి విలయ తాండవం చేస్తోంది. ప్రజల్ని కన్నబిడ్డలుగా పాలించాల్సిన పాలకులు ఓట్లకోసం అధికారం కోసం నానా పాట్లు పడుతున్నారు. రక్తంలో ఎర్రకణాలు, తెల్లకణాల బదులు స్వార్ధ కణాలు పెరిగి కళ్లముందు తోటి ప్రాణి మరణిస్తున్నా మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు. కానీ కవి మాత్రం నాకెందుకులే అని నిర్లిప్తతా కవచంలో నిద్రపోతూ ఉండలేడు. అన్యాయాన్ని ప్రతిఘటిస్తాడు. అక్రమాల్ని ప్రశ్నిస్తాడు. నిర్భయంగా ఈ రెండూ కవికి సహజ లక్షణాలు. అప్పుడు అక్షరాకాశంలో కవితా సూర్యోదయాన్ని ఆవిష్కరిస్తాడు. అలాంటి కవే సరికొండ నరసింహరాజుగారు. ఆ పుస్తకమే ‘చూపుడు వేలుపై సూర్యోదయం’.
ఈ సంపుటిలో విభిన్న వస్తువులపై సంధించిన కవితాస్త్రాలున్నాయి. బుల్లితెరకు బానిసలైన పిల్లలు, పెద్దలు, ఆడపిల్లలు ఈ లోకంలోకి రాకుండా తల్లి కడుపులోనే చరమగీతం పాడెయ్యడం, కాలేజీ విద్యార్థినులపై ప్రేమ పేరిట కామపిశాచాలు దాడి చేయడం, రైతుల ఆత్మహత్యలు, ఆంగ్లభాషా వ్యామోహం, చెట్లు నరికెయ్యడం అన్నీ కవికి కవితా వస్తువులే.
విద్యార్థులను వేధించే మృగాళ్ల గురించి ‘కస్తూరి మృగం’ కవితలో ‘జాగ్రత్తగా వెళ్లమ్మా కాలేజీకి/ప్రేమ తోడేళ్లు పొంచి వుంటాయి. లేత కుందేళ్ల మాంసం పీక్కు తింటాయ్/కత్తిమీదో...యాసిడ్‌మీదో...నీ పేరు రాస్తాయ్’ అని ప్రేమోన్మాదుల వికృత చేష్టలను వర్ణిస్తాడు. వూరికే వర్ణించి వదిలెయ్యకుండా ‘ఓ కస్తూరీ తిలకమా! నీవు తిరగబడ్డ ‘మృగం’ కావాలసిందే..! అని బాధితులను లొంగిపోకుండా తిరగబడమంటారు. హింసోన్మాదుల చేతిలో బలవకుండా ధిక్కార గీతాలు కావాలని, ధైర్య వాచకాలు కావాలని ప్రబోధిస్తారు. ఈనాడు పిల్లలు, పెద్దలు అందరూ టీవికి బానిసలే. టీవీలో ఏముందీ ప్రకటనల మధ్య వచ్చే కార్యక్రమాలే కదా! రేజర్‌కైనా, సబ్బుకైనా అమ్మాయిలే నమూనాలు. అందుకే ‘మార్నింగ్ 7వో క్లాక్/బికినీ సుందరి రేజర్‌తో ప్రత్యక్షం. షేవ్ చేయడం మొదలెడుతుంది’ అని పురుషులు వాడే వస్తువులకు కూడా అమ్మాయిలే ప్రచార సాధనాలుగా వినియోగింపబడడాన్ని విమర్శిస్తారు. ఇంతకు ముందు మనకు చిన్న కిరాణా కొట్లు, చిల్లర దుకాణాలు వుండేవి. కానీ ఇప్పుడు మాల్‌లు, రిలయెన్స్ ఫ్రెష్‌లు, వాల్‌మార్టులు మొదలైన బృహత్ వస్తు విక్రయశాలలు ఎక్కడబడితే అక్కడ వెలిసాయి. మాల్‌లోకి అడుగుపెట్టగానే అక్కడ కంటికి ఆకర్షణీయంగా ప్రదర్శించిన వస్తవుల్ని చూసి అవసరమున్నా లేకపోయినా వస్తువులు కొంటాము. దీనే్న ‘నా చేతికి మొలిచిన ఆరోవేలు దురదపెడుతుంది! మెగామాల్ కొలిమిలోకి క్రెడిట్ కార్డుల అగ్నిప్రవేశం’ అని కనిపించిన వస్తువునల్లా కొనాలనే కోరిక అగ్నిలాగ వ్యాపించింది అంటారు.
ఇంకా ఈ సంపుటిలో ‘మట్టి ఘోష, రాతిదీపం, ఆకుపచ్చ దీపాల్ని ఆర్పుతున్నారెవరో, పిండ ‘ప్రధానం’ సాక్షిగా, బాల్యం మరణ వాంగ్మూలం, నడిచే శవాలం, దగ్ధ చిత్రం, క్షమించు గాంధీ, కాగడా మల్లె కవితలు చదవదగినవి.నేలహంగు, నాగలి శిలువ, చెట్టు గుడి, కాలుష్యం కత్తి, ఆశలపల్లకి, వృత్తుల వృత్తలేఖిని, చెమట ముత్యాల దండలు, నవ్వుల పున్నాగ చెట్టు, ముళ్ల సంతకాలు, ఎలాస్టిక్ కిరణాలు మొ..రూపకాలు హృదయాన్ని రసభరితం చేస్తాయి. సరికొండ నరసింహరాజుగారు ఇంతకుముందే ‘‘్భస్మ సింహాసనం ఒక విధ్వంసక ముఖ చిత్రం’’ కవితా సంపుటితో సుప్రసిద్ధులు. ఈ పుస్తకం చదివాక ఈనాటి సంక్షుభితమైన, సంక్లిష్టమైన సమాజ పరిస్థితులు కలవరపరుస్తాయి. కొన్ని కవితలు వెంటాడతాయి. నిద్రపట్టనివ్వకుండా చేస్తాయి. హృదయాన్ని కల్లోలపరుస్తాయి.

-మందరపు హైమవతి