శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎపికి ప్రత్యేక హోదా తక్షణమే ప్రకటించాలి:జెఎసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్, నిరుద్యోగ నవ్యాంధ్ర విద్యార్థి జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో జనవరి 24న శ్రీకాకుళం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర సోమవారం గూడూరు చేరుకుంది. ఎపి అణగారిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాన్ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కన్వీనర్ శ్రీహరినాయుడు మాట్లాడుతూ ఎపికి చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుంటే ప్రజల నుండి నిరసనలు ఎదుర్కొనక తప్పదన్నారు. విభజన హామీలను అమలుచేసి తక్షణమే ప్రత్యేక హోదాకల్పన ద్వారా ఎపికి న్యాయం చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. నవ్యాంధ్ర విద్యార్థి జెఏసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు అయ్యన్న, లీలామోహన్, యువజన జెఎసి కన్వీనర్ వసంత్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో అణగారిన వర్గాల సమాఖ్య సమన్వయకర్త ఉడతా శరత్ యాదవ్, గూడూరు డివిజన్ కన్వీనర్ సవరపు కిషోర్‌కుమార్, ఎన్‌ఎస్‌యుఐ డివిజన్ కన్వీనర్ అనిల్‌కుమార్, మోఘదాసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విరిగిన రైలు పట్టా
మనుబోలు, ఫిబ్రవరి 1: మండల పరిధిలోని కొమ్మాలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలో సోమవారం వేకువజామున మళ్లీ రైలుపట్టా విరిగింది. సకాలంలో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించడంతో ప్రమాదం తప్పింది. కొమ్మాలపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని అప్‌లైన్‌లో 150-1-3 వద్ద రైలు పట్టా విరిగి ఉండడాన్ని నైట్ పెట్రోలింగ్ సిబ్బంది ఆవుల భాస్కర్, ఎస్‌కె సాకిర్ గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. ఈ మార్గంలో రైళ్లు 30 కిమీ వేగంతో వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

కాపులకు బిసి రిజర్వేషన్‌లు కల్పించాలి
* వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్
విడవలూరు, ఫిబ్రవరి 1: కాపులకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి డిమాండ్ చేసారు. మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో సోమవారం ప్రసన్న విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులను బిసిలను చేరుస్తామని హామీ ఇచ్చారని, రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. బిసిలకు 1000కోట్లు కేటాయిస్తామని చెప్పి మొక్కుబడిగా కేవలం 100కోట్లు కేటాయించారన్నారు. తునిలో ఘర్షణలు జరగడానికి చంద్రబాబే కారణమన్నారు. కాపులకు బిసి రిజర్వేషన్‌లకు ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కావన్నారు. కాపులు ఐక్యంగా పోరాడి బిసి రిజర్వేషన్‌లు సాధించాలన్నారు. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలతో కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రసన్న ఆరోపించారు. కాపు గర్జనను చూసి ఓర్వలేకనే ఆయన రాజకీయ రంగు పులుముతున్నారని తెలిపారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ప్రసన్న స్పష్టం చేసారు. జగన్‌మోహన్‌రెడ్డిని సిఎం చేయడమే తమ ఉద్దేశమన్నారు. వైకాపా అధికారంలోకి రాగానే బిసిలకు రిజర్వేషన్‌లు కల్పిస్తామన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో బిసి రిజర్వేషన్ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. ప్రసన్న, సునీల్‌కుమార్‌లు రామతీర్థంలోని కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

పథకాలు చేనేతలకు... వర్తించేది బడా కంపెనీలకు
* పలువురు నేతల విమర్శ
వెంకటగిరి, ఫిబ్రవరి 1: చేనేత కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ పథకాల జీవోలు ప్రకటిస్తునాయని, అవి వర్తించేది పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, గౌరవాధ్యక్షులు పముజుల దశరథరామయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టా హేమసుందరం విమర్శించారు. సోమవారం పట్టణంలోని బొప్పాపురంలో చేనేత కార్మికుల సంఘం నాయకులు, సిపిఐ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అన్న విషయాలు నేరుగా చేనేత కార్మికుల వద్దకు వెళ్లి తెలుసుకున్నారు. వారి జీవన స్థితిగతులను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ నెలలో సంభవించిన తుఫాన్‌కు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చేనేత కార్మికులు బాగా నష్టపోయారన్నారు. ఈ జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మదనపల్లిలో చేనేత కార్మికులకు 5వేల రూపాయలు, బియ్యం, వెంకటగిరిలో 10వేల రూపాయలు, బియ్యం ప్రకటించారన్నారు. తన సొంత జిల్లా మదనపల్లిలో మాత్రం బియ్యం, 5వేల రూపాయలు చేనేత కార్మికులకు ఇచ్చారని, వెంకటగిరిలో మాత్రం బియ్యం మాత్రమే ఇచ్చారని, 10వేల రూపాయల ఆర్థిక సాయం మాత్రం ఇవ్వలేదన్నారు. వెంకటగిరి ప్రాంతంలో చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారని, సిఎం స్వయంగా విచ్చేసి ఆర్థిక సాయం ప్రకటించి కూడా పంపిణీలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం వేలాది మంది చేనేత కార్మికులు ఆకలికేకల మధ్య జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేశారని, అయినా జిల్లా కలెక్టర్ వెలుపలికి వచ్చి సమాధానం చేప్పలేదని, జిల్లా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని కార్మికులు నినాదాలు చేస్తే చివరికి జాయింట్ కలెక్టర్ వచ్చి త్వరలోనే చేనేత కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని సమాధానం చెప్పారని, దానికి నాయకులు, కార్మికులు ఒప్పుకోలేదని, కచ్చితమైన సమయం చెప్పాలని మొండికేసినట్లు చెప్పారు. వారం రోజుల లోపల చేనేత కార్మికులు 10వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించకపోతే నిరవధిక నిరాహారదీక్షకు పూనుకుంటామని అధికారులను హెచ్చరించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు పలు సబ్సిడీలు ఇస్తున్నాయని, వాటిని పెద్ద పెద్ద టెక్స్‌టైల్స్, రెడీమేడ్ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని, వాటిని కట్టడి చేయాల్సి బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. చేనేత కార్మికులే కొన్ని వస్త్రాలు తయారు చేయాల్సి ఉండగా, ఇప్పుడు ఆ వస్త్రాలను హ్యాండ్‌లూమ్, టెక్స్‌టైల్స్ కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయని, తద్వారా చేనేత కార్మికులు పూర్తిగా పనులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యరద్శి జింకా చలపతి, సహాయ కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు, వెంకటగిరి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పి బాలకృష్ణయ్య, పట్టణ కార్యదర్శి పేరూరి రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల కోసమే రాజకీయ బదిలీలు
బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపురెడ్డి ధ్వజం
నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 1: ఓ వర్గ ప్రజల ఓట్ల కోసమే పోలీసుల రాజకీయ బదిలీలు చేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం నగరంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని ఉగ్రవాద సంస్థలు తమ వైపు యువత ఆకర్షితులయ్యే విధంగా ఓ వర్గం విద్యార్థులకు అనేక రకాలుగా ఆశచూపి టెర్రరిజం వైపు మళ్లిస్తున్నాయన్నారు. ఈనేపథ్యంలో జిల్లా ఎస్పీ గజరావ్ భూపాల్ ఆ సంస్థల వైపు యువత ఆకర్షితులు కాకుండా చూసేందుకు ఇటీవల సమావేశాన్ని నిర్వహించారన్నారు. జిల్లాలో, నగరంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు వివిధ రకాలకు చెందినవారు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి శాంతియుతంగా జీవిస్తూ ఉండేవారని, ఈ విషయంలో జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉన్నతాధికారులు కూడా ఇతర జిల్లాల నుండి అధిక శాతం ఇక్కడకు బదిలీలపై రావడం అందుకు నిదర్శనమన్నారు. అలాంటి ప్రశాంతమైన నగరంలో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన మూలాలు ఇక్కడ ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేశాయన్నారు. గతంలో నగరంలో, జిల్లాలో కూడా అరెస్టులు జరిగాయన్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో అప్రమత్తమైన ఎస్పీ యువత పెడదారి పట్టకుండా ఉండాలనే సదుద్దేశంతో అవగాహన సదస్సును నిర్వహించారని అన్నారు. ఎస్పీ మాటలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయని, పోలీసుస్టేషన్, పోలీసులు, అధికారుల వాహనాలపై దాడి చేయడం సరికాదన్నారు. అందుకు రాజకీయ నాయకులు వారిని బదిలీ చేయడం అంతకన్నా సమంజసం కాదన్నారు. ఈ దాడి వెనుక కొన్ని ఉగ్రవాద సంస్థల నిర్వాహకులు వారిని రెచ్చగొట్టారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. దాడి ఘటనలో పోలీసులను బలిపశువులను చేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. నీతినిజాయితీగా పనిచేస్తున్న పోలీసులను బదిలీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు ఐజి కూడా ఆ వర్గ ప్రజలతో శాంతియాత్ర చేయిస్తానని అనడం సరికాదన్నారు. ఇలా చేస్తే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుందని, ఉగ్రవాదం కూడా వెర్రితలలు వేసే అవకాశం ఎక్కువ అవుతుందన్నారు. అలాంటిది జరగకుండా ఉండాలంటే ఆ బదిలీలను వెంటనే ఆపి ఉగ్రవాద సంస్థల మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు మిడతల రమేష్, ఎ శ్రీనివాసులు, వై రమణయ్య, సిహెచ్ శ్రీనివాసులు, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

నీటిగుంటలో పడి బాలుడి మృతి
అనంతసాగరం, ఫిబ్రవరి 1: మండలంలోని చిలకలమర్రి గ్రామంలో నీటిగుంటలో పడి మహేంద్ర అనే 8 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. సోమవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో ఉన్న సోమశిల ఉత్తర కాలువ వద్ద నీటిగుంటలో బాలుడు పడిపోయాడు. ఇతడిని గురించి అంతటా గాలించి చివరకు నీటి గుంట వద్ద విగత జీవిగా పడి ఉన్న వైనాన్ని స్థానికులు గమనించారు. ఈ బాలుడు అనంతసాగరంలోని శాంతినికేతన్ పాఠశాలలో రెండ తరగతి చదువుతున్నాడు.

సర్కార్‌లో ఆర్టీసీని విలీనం చేయాల్సిందే
* ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర నేత దామోదరరావుడిమాండ్
ఆత్మకూరు, ఫిబ్రవరి 1: తమ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో తప్పక విలీనం చేయాలంటూ ఎపిఎస్ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి దామోదరరావు డిమాండ్ చేశారు. ఈ నెల 18న జరగనున్న ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియ నిమిత్తం ఆత్మకూరు డిపో వద్ద ప్రచార సభ నిర్వహించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ తమ యూనియన్‌ను 2013లో గెలిపించడం వల్ల కారుణ్య నియామకాలు జరిగాయన్నారు. కాంట్రాక్ట్‌కార్మికులు 17,287 మందిని ఆరు నెలల్లోనే రెగ్యులర్ చేయించామన్నారు. అన్ని కేటగిరిలకు నలభై నుంచి ఏభై శాతం వరకు అలవెన్సులు పెంచినట్లు చెప్పారు. మరలా గెలిపిస్తే పదవీ విరమణ చెందిన కార్మికులకు ప్రతి నెలా పదివేల రూపాయల వరకు పింఛన్ అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదే ఎన్‌ఎంయు గుర్తింపుసంఘంగా ఉన్నప్పుడు కార్మిక హక్కులన్నీ తాకట్టులోకి వెళ్లాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎంప్లారుూస్ యూనియన్ సంపూర్తిగా నెరవేర్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇయూ భారీ మెజారిటీ వస్తే, ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్రహ్మణ్యంరాజు, జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు డి బాబా శామ్యూల్, జి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరిలో
ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఈ నెల 18న జరిగే ఎన్నికల్లో ఎంప్లారుూస్ యూనియన్‌ను గెలిపించాలని ఎంప్లారుూస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దామోదరరావు పిలుపునిచ్చారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90శాతం నెరవేర్చామని, ప్రస్తుతం కార్మికులకు ఉన్న ఏకైక లక్ష్యం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు పోరాడుతున్నట్లు చెప్పారు. కార్మికులను ఓటు అడిగే హక్కు ఎంప్లారుూస్ యూనియన్‌కు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎంప్లారుూస్ యూనియన్ ఉదయగిరి డిపో గౌరవాధ్యక్షులుగా తెలుగుదేశంపార్టీ మండల కన్వీనర్ మనే్నటి వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఏ కష్టం వచ్చినా వారి వెన్నంటే ఉంటామన్నారు. ఎంప్లారుూస్ యూనియన్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యంరాజు మాట్లాడుతూ ఎంప్లారుూస్ యూనియన్‌ను మరలా గెలిపిస్తే రిటైర్డ్ ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పింఛన్ అమలయ్యేలా పాటుపడతామన్నారు. స్థానికంగా ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఎంప్లారుూస్ యూనియన్ నెల్లూరు జోన్ అధ్యక్ష, కార్యదర్శులు బాబు శామ్యూల్, నారాయణ, మహబూబ్, రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు మహబూబ్, శ్రీనివాసులురెడ్డి, సంయుక్త కార్యదర్శి చెంచురామయ్య, సహాయ కార్యదర్శి ప్రసాద్, సుధాకర్, ఉదయగిరి డిపో అధ్యక్ష, కార్యదర్శులు ఎండి కరీమ్, భాస్కరరెడ్డి తదితరులు పాలొగన్నారు.

నాటుసారా నిర్మూలనకు చర్యలు
* అవగాహన కోసం నవోదయం పేరుతో విస్తృత ప్రచారం
నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 1: నాటు సారా ఉత్పత్తి, సరఫరా నిషేధమని, కార్యాచరణ ప్రణాళిక ద్వారా రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం జానకి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న గోల్డెన్ జూబ్లీ హాలులో సోమవారం నాటు సారా నిషేధంపై చేపట్టిన నవోదయ కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బోగోలు, అల్లూరు, దగదర్తి, వెంకటగిరి, డక్కిలి, కావలి మండలాల్లోని 18 గ్రామాల్లో నాటుసారా తయారుచేస్తున్నట్లు గుర్తించామన్నారు. బోగోలు మండలంలోని కప్పరాళ్లతిప్ప, నాగులవరం, చెంచెలక్ష్మీపురం, తాళ్లూరు, బోగోలు, కావలి మండలంలోని కావలి నగరం, అల్లూరు మండలంలోని మూర్తిరాజు సంగం, అల్లూరుపేట, సింగపేట, ఉడ్‌హౌస్‌పేట, దగదర్తి మండలంలోని ఉలవపాళ్ల, అనంతవరం, దామవరం, వెంకటగిరి మండలంలోని బ్యాండ్‌పాళెం, ఎగువపాళెం, అరవపాళెం, నాగులగుంట, డక్కిలి మండలంలోని డి వడ్డిపల్లి గ్రామాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని మూడు శ్రేణులుగా ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ క్రోడీకరించిందన్నారు. ఎ గ్రేడులో బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప అత్యధికంగా నాటుసారా తయారుచేస్తుందన్నారు. బి గ్రేడులో అదే మండలం నాగులవరం, వెంకటగిరి మండలం బ్యాండ్‌పాళెం ఉన్నాయన్నారు. ఈ రెండు గ్రామాలు నాటుసారా ఉత్పత్తి, సరఫరాలో రెండవస్థానంలో ఉన్నాయన్నారు. ఈ గ్రామాల్లో ఈ ఏడాది మార్చి 31లోగా పూర్తిగా నివారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన నాటుసారా నిషేధంపై ఈనెల 1న నవోదయ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. నాటుసారా సేవించటం ద్వారా కలిగే దుష్ప్రభావాలపై గ్రామస్థాయి కమిటీల ద్వారా విస్తృత అవగాహన చర్యలు చేపడుతున్నామన్నారు. నాటుసారా నిషేధించటానికి రెవెన్యూ, ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళలు, ఐసిడిఎస్ సభ్యులతో కలసి పనిచేయాలన్నారు. జిల్లాకు ఉన్న మంచి పేరుందని, ఒక నెలలోగా నాటుసారాను పూర్తిగా నిషేధించి రూపుమాపాలన్నారు. ఉత్పత్తి కేంద్రాలపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కేసుల నమోదు, చర్యలు, తదితర వివరాలతో నివేదికలు పంపాలన్నారు. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సారారహిత రాష్ట్రంగా చేయటమే నవోదయ ఉద్దేశమన్నారు. అటవీ అధికారి జె రవీంథ్రనాథ్ మాట్లాడుతూ నాటుసారా అధికంగా అడవులలో తయారుచేస్తారన్నారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో పూర్తిగా నిషేధించాలన్నారు. ఈ సందర్భంగా తయారుచేసిన పోస్టరును కలెక్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జెసి ఎఎండి ఇంతియాజ్, గూడూరు సబ్-కలెక్టర్ గిరీషా పిఎస్, కావలి ఆర్డీవో నరసింహం, ఎక్సైజ్ శాఖ సహాయ కమిషనర్ జి చెన్నకేశవరావు, స్వచ్ఛంద, సేవా సంస్థల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పకడ్బందీగా సైన్సు విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు
నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 1: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు సైన్సు విద్యార్థులకు, వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు 2016కి సంబంధించిన సైన్సు ప్రాక్టికల్స్ పబ్లిక్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించనున్నట్లు, ఆ పరీక్షల కన్వీనర్, జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) తెలిపారు. సోమవారం నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న కెఎసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ఆర్‌ఐఓ కార్యాలయంలోని ఆయన చాంబర్ విలేఖర్ల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 4 నుండి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయన్నారు. ఈ పరీక్షలను నాలుగు దశలలో నిర్వహిస్తామని, ఇందుకోసం జిల్లాలో 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బైపిసి, ఎంపిసి గ్రూపులకు సంబంధించి విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా పదివేల నూట అరవై ఒక్క మంది హాజరవుతారన్నారు. పరీక్షలను రెండు విడతగా నిర్వహిస్తామని, ఉదయం 9 12 గంటలకు వరకు మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలు వొకేషనల్ కోర్సుగల కళాశాలలో మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులకు సమాంతరంగా ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. వాటికి సంబంధించి ఒక నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీకి కన్వీనర్‌గా ఆర్‌ఐఓ, ఇద్దరు ప్రిన్సిపాల్స్, ఇద్దరు లెక్చరర్స్ సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లో ఒక డిప్యూటీ తహశీల్దార్, ఒక ఎస్‌ఐ, ఒక లెక్చరర్ ఉంటారన్నారు. ఈ ఇందులో కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా జెసి వ్యవహరిస్తారన్నారు. పరీక్షలలో తక్కువ ఉత్తీర్ణత వచ్చిన వారికి రివెరిఫికేషన్ అవకాశం ఉంటుందన్నారు. పరీక్షల మెటీరియల్ మెయిన్ ఆన్సర్‌షీట్స్ ఆర్‌ఐఓ కార్యాలయంలో నేటి నుండి అందుబాటులో ఉంటాయన్నారు.