మెయిన్ ఫీచర్

దుర్జనులను దునుమాడే దుర్ముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైత్ర శుక్ల సమారంభే జగతాం జగదీశ్వరః
సర్వం చక్రే తదారాజన్‌ తతస్తస్మిన్ సదాదినే॥
సృష్టికర్త బ్రహ్మ తన సృష్టినంతా ఈరోజునే ముగించాడనీ, యుగారంభమయిందనీ బ్రహ్మపురాణం, ధర్మసింధువు ఉటంకిస్తున్నాయి. ప్రజ్ఞాచక్షువైన మన పూర్వఋషులు ఖగోళ శాస్త్రాన్ని తమ మేధాసంపత్తితో కాలగమనాన్ని, కాలమానాన్ని పరిశోధించి ఎన్నో అద్భుత విషయాలకు రూపకల్పన చేశారు. అలా రూపొందించినదే ఉగాది.
ఋతువుల్లో మొదటిదైన వసంతం, తెలుగు మాసాల్లో మొదటిదైన చైత్రమాసం, పక్షములలో మొదటిదైన శుక్లపక్షం, తిథులలో తొలి తిథియగు పాడ్యమి, నక్షత్రములలో ప్రథమమైన అశ్విని- ఇలా ఆదిగాగలవన్నీ కలసిన ఆది పండుగే ‘ఉగాది’యని మన పురాతన ప్రామాణిక గ్రంథాలన్నీ వక్కాణిస్తున్నాయి.
గ్రహ, నక్షత్ర, యుగ, వత్సర, మాస, పక్ష, తిథి ఆదిగా వత్సరాధిపుల ప్రాదుర్ధవ సమయంలో జగత్తుకు వెలుగునిచ్చిన వేళ, విజ్ఞానం వెల్లివిరిసిన వేళ, అందుకే ఇది పండుగవేళ. ఉగాది హేల.
విష్ణ్ధుర్మోత్మర పురాణం అనుసరించి చైత్రమాస శుక్లపాడ్యమి అశ్విని నక్షత్రమందు భూమధ్యరేఖపై సూర్యోదయం సంభవిస్తుంది. అదే యుగారంభ మనబడుతుంది. చాంద్రమానం పాటించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర దేశస్థులతోపాటు త్రివిష్ఠపం (నేపాలు) జాతీయులకు కూడ నూతన సంవత్సర ప్రారంభం. ఈ యుగాదినే తెలుగువారు ఉగాదిగా జరుపుకుంటున్నారు.
అసలు కాలం అనేది అనంతమైనది. కాని, కాలానికి ఖగోళశాస్త్రం ఆధారంగా లెక్కలు వేసి కాలమానాన్ని గుణించారు. ఈ విశ్వాన్ని అంతరిక్షంగా భావనచేసి, అందున్న గ్రహ సంచారాన్నిబట్టి కాలగణనం చేసారు మన పూర్వజ్యోతిష శాస్తవ్రేత్తలు.
భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక దినమని, చంద్రుడు భూమిని పరిభ్రమిస్తే ఒక మాసమని, భూమి సూర్యుని చుట్టూ తిరిగితే ఒక సంవత్సరమని ఖగోళ శాస్త్ర నిపుణులు స్పష్టపరిచారు. అలా ఏర్పడినవే నిముషాలు, గంటలు, రోజులు, మాసాలు, ఋతువులు, ఆయనాలు, సంవత్సరాలు. కాలం నుండే శకాలు కూడా లెక్కించారు.
ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే ‘అనంతమైన కాలానికి కాలస్వరూపుడను నేనే’నన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ.
ఒకప్పుడు కమలాకర భట్టు అనే జ్యోతిషశాస్త్ర నిపుణుడు నాటి మేధావి వర్గంతో చర్చించి చంద్రుని గమనంలో లెక్కించడం సులభమని ఒప్పించి, చాంద్రమానాన్ని పాటించడం అనువైన పద్ధతియని అంగీకరింపజేశాడు. అలా అప్పట్నుంచి చాంద్రమానమూ కొనసాగుతూ వస్తున్నది.
తెలుగుదనాన్ని నిండుగా అలిదికొన్న తెలుగు పండుగ ‘ఉగాది పండుగ’. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి, సుసంపన్నం చేస్తూన్న పెద్ద పండుగ ‘‘ఉగాది పండుగ’’ అని చెప్పక తప్పదు.
ఉగాదినాడు ప్రతి ఒక్కరూ చెయ్యవల్సిన విధి విధానాలు శాస్త్రాల్లో ప్రవచించబడ్డాయి.
ఉగాదినాడు వేకువనే తైలాభ్యంగన స్నానం చేయాలి. అలా ప్రతి నిత్యం చేయాలి. అలాచేయడంవల్ల ఆరోగ్యపుష్ఠి చేకూరుతుందని ఆయుర్వేద శాస్త్రంఅంటుంది.
తైలాభ్యంగనంతోపాటు మరో నాలుగు కర్తవ్యాలను కూడా శాస్త్రాలు తెలియజేశాయి. అవి- నూతన వత్సరా స్తోత్రం; నింబ కుసుమభక్షణం, పంచాంగ శ్రవణం; ధ్వజారోహణం.
రెండవ కృత్యంగా ప్రతి యింటి ముంగిట, అలాగే లోపల రంగవల్లులతో, ద్వారాలకు మామిడి తోరణాలతో, వేప మండలతో అలంకరించాలి. దేవుని మండపాన్ని సుగంధ భరితమైన పూలతో అలంకరించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను భక్తిశ్రద్ధలతో పూజించి ఉగాది పచ్చడి నివేదించి దానిని ఆరగించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
మూడవ విధి- నింబకుసుమ భక్షణం. దీనినే మనం ఉగాది పచ్చడి అంటాం. వేప పూత, మామిడి తొక్కు, కొత్త బెల్లం, చింతపండు, లవణం, మిరియాల పొడి కలిపి గుజ్జుగా చేసిన దానినే ఉగాది పచ్చడి అంటారు. షడ్రుచులతో చేసిన ఈ గుజ్జు జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు సంకేతంగా చెప్పబడింది. అంతేకాక, ఆయుర్వేద శాస్తర్రీత్యా ఇది తిన్నవారికి వాతపిత్త దోషాలను హరించి సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉంచుతుందని పెద్దల ఉవాచ.
నాలుగవదైన పంచాంగ శ్రవణం దేవాలయాలలో గాని, రచ్చబండల వద్దకాని అందరూ సమావేశమై సిద్ధాంతులు చెప్పే రాబోయే సంవత్సరంలో జరుగబోయే శుభాశుభాలు గ్రహాల తీరుతెన్నులు, నక్షత్ర, రాశిఫలాలు, కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకుని దాని ప్రకారం నడుచుకునేటందుకు ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం కలుగుతుంది. పంచాంగ శ్రవణం గంగాస్నానంతో సమానమైన ఫలాలనందిస్తుందని పురాణ, వ్రత గ్రంథాలు ప్రవచిస్తున్నాయి.
చివరిదైన ధ్వజారోహణ కృత్యం. దీనిని ‘పతాక ప్రతిష్ఠాపన’అని కూడ అంటారు. ఈ ఆచారం ప్రముఖంగా మహారాష్ట్రీయులు పాటిస్తారు. కాషాయ రంగు పట్టువస్త్రాన్ని, త్రికోణాకారంలో రూపొందించి, వెదురుగడకు కట్టి ప్రతి ఇంటిపై ఎగురవేస్తారు. ఇటువంటి పతాకాలను ప్రతి కోవెల శిఖరంపై గమనించవచ్చును. శాలివాహనుల కాలంనుండి ఈ ఆచారం దేశమంతటా ఆచరిస్తూ ప్రభువులకు కృతజ్ఞతలు సూచించడంగా భావన చేస్తున్నారు. కాలక్రమాన ఈ కృత్యం కేవలం మహారాష్టక్రే పరిమితం కావడం అనూహ్యం.
ఉగాదినుండే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులు శ్రీరామచంద్రునితోపాటు, ఆదిపరాశక్తికి దేవీ నవరాత్రులవలే నిర్వహిస్తారు. నవరాత్ర పూజలు నిర్వహించినవారు సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తారని, వారికి మృత్యుభయం ఉండదని ధర్మసింధువు స్పష్టం చేస్తున్నది.
‘మన్మథ’కు అక్షతలతో వీడ్కోలు పలికి, దుర్జనులను, దురాత్ములను దునుమాడడానికి వస్తున్న ‘దుర్ముఖి’కి సుగంధ పుష్పాలతో స్వాగతం పలుకుదాం.

- ఎ.సీతారామారావు