మెయిన్ ఫీచర్

రాముడు, కృష్ణుడు ఆదర్శపురుషులు కారా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా ఉన్న కొందరు పెద్దలే శ్రీరాముని, శ్రీకృష్ణుని గురించి అవాకులు చెవాకులు రువ్వుతున్నారు. శ్రీమద్రామాయణం, మహాభారతం చదివిన వారికి ఈ విమర్శలకు జవాబులు తెలుస్తాయి. కానీ ఈ కాలంలో ఆంగ్ల మాథ్యమంలో అధ్యయనం చేసిన వారికి సంస్కృత గ్రంథాలు చదివే తీరిక, అవకాశం ఉండడం అరుదు.
ఎనిమిది మంది భార్యలున్న శ్రీకృష్ణుని ఆదర్శపురుషుడిగా ఎలా కొలుస్తారో తెలియడం లేదని వీరి విమర్శ.
ఈనాడు హిందువులకు బహుభార్యా నిషేధ చట్టం ఉన్నా ముస్లింలకు లేదు. పూర్వం రాజులు చాలామంది భార్యలను స్వీకరించడం నాటి చట్టాలకు నిషిద్ధం కాదు. బహుభార్యలుంటే ఆదర్శ పురుషుడు కాదనే నియమం ఎక్కడుంది?
శ్రీకృష్ణుడు చేసిన ఘనకార్యాలే ఆయనను ఆరాధ్యునిగా చేశాయి. శ్రీకృష్ణుని కాలంలో కొందరు పరిపాలకులు ఐకమత్యంతో ఉంటూ జనాన్ని అణచి నిరంకుశంగా వ్యవహరించారు. కంసుడు యాదవ వంశం వారిని తరిమికొట్టి, తండ్రిని, బావను జైల్లోపెట్టి అధికారం చెలాయించాడు. తనను చంపేవాడు పుట్టాడేమో అనే సంశయంతో ఇంటింటా పసికందులను చంపించాడు.
జరాసంధుడు ఎందరో రాజులను జయించి, వారిని బంధించి బలి వేయడానికి పూనుకున్నాడు. దుర్యోధనుడు దురాశతో, వంచనతో పాండవులను అడివికి తరిమి, పట్ట్భాషేకం లేకుండానే చక్రవర్తిగా చెలామణి అయ్యాడు. ఆడదాన్ని నడి సభలో తండ్రి, తాత, గురువు, ఎందరో మహారాజుల సమక్షాన బట్టలూడలాగి అవమానించాడు. వాళ్ళ జోలికి రాని విరాట రాజు ఆవుల మందను అపహరించాడు. నరకుడు వేలాది స్ర్తిలను అపహరించి బంధించాడు. వీళ్ళ దుర్మార్గాలను వేలెత్తి చూపినవాడు లేడు. వీళ్ళ మిత్ర బృందం చాలామంది ఉన్నారు.
వీళ్ళందరి బెడద తొలగించి ధర్మరాజుకు పట్టం కట్టి, ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలన జరిగేలా చేయడం శ్రీకృష్ణుడు చేసిన అసాధారణ ఘనకార్యం. పదమూడు ద్వీపాలతోపాటు భారత వర్షాన్ని ధర్మరాజు పాలన చేశాడు. ఆయన తర్వాత మూడువేల సంవత్సరాల వరకు ధర్మరాజు పాలన ప్రభావం జనంపై ఉంది. దేశంలో ఎవరైనా వృత్తిలేకుండా ఉంటే అతనికి వృత్తికి కావలసినవన్నీ ఇవ్వడం ధర్మరాజు పాలనలో జరిగింది. యుధిష్ఠిర శకం ఏర్పడడానికి అతని ధార్మిక పాలనే కారణమని పరిశీలిస్తే గోచరిస్తుంది.
యుధిష్ఠిరుడు అర్జునుని వంటి శస్త్రాస్త్ర సంపన్న యోధుడు కాడు, భీముడి వంటి బలవాలి కాడు. ఆయన ‘నాకు రాజ్యం వద్దు. అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటా’నని చాలాసార్లు ప్రయత్నించాడు. ఇతరుల ఒత్తిడిచే రాజ్యపాలనానికి అంగీకరించినవాడు. ఆయన చక్రవర్తి కావడం శ్రీకృష్ణుని చలవే.
ఈ కలియుగంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కూడా ధర్మపాలనకు యుధిష్ఠిరుణ్ణి ఉదాహరించడం కాలజ్ఞానం గ్రంథంలో కనబడుతుంది.
శ్రీకృష్ణుని కాలానికి సాంఖ్యం, యోగం, కర్మ, భక్తి, జ్ఞానం, ధ్యానం, మూర్త్యారాధన మొదలయిన ధార్మిక మార్గాలున్నాయి. వాటన్నిని ఆయన భగవద్గీతలో అద్భుతంగా సమన్వయం చేశాడు. ఇది ఆధ్యాత్మిక మార్గాలకు ఏకత్వం కలిగించిన మహాగ్రంథం. బోధాయనుడు దీనికి వ్యాఖ్యానం వ్రాశాడంటారు. అప్పటినుండి మహాత్మాగాంధీ గారి వరకు దీనికి వ్రాసిన వ్యాఖ్యానాలెన్నో.
మాదే గొప్ప మార్గం. మరోటి కాదు అనే భావనవల్ల ఇతర దేశాల్లో జరిగిన, జరుగుతున్న మత యుద్ధాలు, వాటి వలన కలుగుతున్న, కలిగిన వినాశం చరిత్ర చదివిన వారికి తెలుసు. భారతదేశంలో ఉన్న మత సమన్వయ భావంవల్ల ఇక్కడ విదేశీయ మతాలు కూడా వ్యాపించగలిగాయి. ఆ మత సమన్వయ భావన కల్గించిన మహాపురుషులలో శ్రీకృష్ణుడు ముందున్నాడు.
జైలులో పుట్టి అడవిలో ఆవుదూడను కాచుకుంటూ పెరిగిన ఒక బాలకుడు అపార విజ్ఞానం, శస్త్రాస్త్ర విద్యలు సంపాదించి, అధికారం కోరకుండా ప్రజలకింత ఉపకారం చేయడం సామాన్యమా? ఈ ఘనకార్యాలకే ఆయన విజ్ఞానం, యోగశక్తి, శస్త్రాస్త్ర విద్యలు సర్వం వినియోగించాడు. అందుకే ఋషులు, కవులు ఆయన గొప్పదనాన్ని మనసారా కీర్తించారు.
శ్రీరాముడు ఆదివాసి నాయకురాలు తాటకిని చంపాడని మరొక కువిమర్శ. రామకథకు మొదటి ఆధారం రామాయణం. దానిలో తాటక వృత్తంత మంది. సుకేతువు యక్షుడు యక్షులు దేవతలకు కలిగిన సంతానం. సుకేతువు తపస్సు చేసి బ్రహ్మవరం వల్ల మహాబలవంతురాలైన తాటకను సంతానంగా పొందాడు. ఆ యక్ష వనితను సుందునికిచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడు మారీచుడు. సుందుడు అగస్త్యుని వల్ల మరణించాడు. ఆ కోపంతో తల్లి కొడుకులు అగస్త్యుని పైకి దాడికి వెళ్ళారు. అగస్త్యుడు శపించాడు. దీనివల్ల తాటకకు మారీచునికి రాక్షస లక్షణాలు కలిగాయి. ఆ శాపంవల్లనే తాటకకు వికృత రూపం వచ్చింది. ఆమె అగస్త్యునిపై కోపంతో అత్తపై కోపం దుత్తపై చూపినట్లు ఆ ప్రాంతాన్ని నాశం చేసింది.
ఆమె ఆకారం చాలా పెద్దది. వికృతమయిన రూపం. అత్యధికమయిన బలం. ఆమెను చూస్తేనే పిరికి గుండెలు పగిలిపోతాయి. ఆమెకు మాయాబలం కూడా ఉంది.
ఆ ప్రాంతాన్ని నాశం చేసిన తాటకను చంపమని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆమె స్ర్తి కనుక రాముడామెను చంపవద్దనుకున్నాడు. ఆమెనక్కడ నుండి పారిపోయేలా చేస్తానని లక్ష్మణునితో అన్నాడు. ఆమె మీది మీదికి వచ్చేసింది. ఆమెను విశ్వామిత్రుడు తన మంత్రబలంతో ఆపి, ఆమెను వధించమని శ్రీరామునికి నచ్చజెప్పాడు.
ఆమె ధూళి రేగ గొట్టింది. మాయాబలంతో రాళ్ల వాన కురిపించింది. ఆమె చేతులను శ్రీరాముడు బాణాలతో నరికాడు. బాణాల దెబ్బలకు ఆమె ముక్కు చెవులు తెగిపడ్డాయి. ఆమె మాయాబలంవల్ల అనేక రూపాలుస ధరించింది. అంతర్థానమయింది. రాళ్ళవాన కురిపించింది. ‘అసుర సంజెవేళ. ఈమె మాయాబలంతో వృద్ధి పొందుతుంది. సంధ్యా కాలానికి ముందే చంపమని విశ్వామిత్రుడు చెప్పాడు. శబ్ద వేధి విద్యతో శ్రీరాముడామెపై బాణాలు వేశాడు. ఆమె వేగంగా శ్రీరుముని పైకి దూసుకు వచ్చింది. ఇక కొట్టక తప్పలేదు. శ్రీరామ బాణాలతో ఆమె మరణించినది.
ఇంతకు తాటక ఆదివాసుల నాయకురాలు కాదు. ఆమె దేవ సంతతికి చెందింది. మాయావిని మహాబలవతి. అగస్త్యుని మీద కోపంతో ఆ ప్రాంతం నాశం చేసింది. అయినా రాముడామెనక్కడనుండి పంపివేయాలనుకున్నాడు. అయినా రాళ్ళ వానతో మాయతో తీవ్రయుద్ధం చేయడంవల్ల శ్రీరుముడామెను చంపక తప్పలేదు. యుద్ధ సమయంలో కూడా ఆమె వెంట పరివారం ఎవరూ రాలేదు. తాటకి ఆదివాసుల నాయకురాలనే మాట రామాయణానికి విర్ద్ధుం.
ఇంకో ఆక్షేపం లక్ష్మణుడు అందగత్తె అయిన శూర్పణఖ ముక్కుచెవులు కోశాడని. అక్కడి సన్నివేశం గమనించండి. సీతారామలక్ష్మణులు గోదావరీ తీరంలో వారి ఆశ్రమంలో ఉన్నారు. అక్కడికి రావణుని చెల్లెలు శూర్పణఖ వచ్చింది. రాముని అందం ఆమెకు నచ్చింది. ఆమె వికృతంగా ఉంటుంది. శ్రీరాముడు యువకుడు. ఆమె వృద్ధురాలు. అయినా రాముని చూసి కామించింది. నీవెందుకు ఇక్కడకు వచ్చావని అడిగింది. రాముడు తమ వృత్తాంతం సంగ్రహంగా చెప్పాడు. ఆమె నేను రాక్షసిని కావలసిన రూపాన్ని ధరించగలను. రావణ కుంభకర్ణుల సోదరిని. నాకు మహాప్రభావం ఉంది. నాకు కావలసిన బలం వస్తుంది. వెళ్ళాలనుకొన్నచోటికి వెళ్ళగలను. నేను నీకు తగిన దానిని. ఈ సీతను నీ సోదరుణ్ణి నేను తినివేస్తాను. మనం ఈ పర్వత వనాల్లో విహరిద్దాము’ అంది. రాముడు ‘ఈ సీత నా భార్య నా ప్రియురాలు. నీలాంటి స్ర్తికి సవతి ఉండడం దుఃఖకరం. లక్ష్మణుని చేపట్టు’ అని పరిహాసం చేశాడు.
ఆమె లక్ష్మణునితో ‘నేను నీకు భార్యనవుతాను. దండకలో విహరిద్దాము’ అంది.
లక్ష్మణుడు నేను రామదాసుణ్ణి. నాకు భార్యవయితే నీవు కూడా దాసురాలివే అవుతావు. రామునికే రెండవ భార్యవైతే వికృతంగా ఉన్న సీతను వదలి అందమయిన నీతోనే ఉంటాడు’ అని పరిహాసం చేశాడు. ఆమె నిజమే అనుకొని ‘ఈ సీత వలన నీవు నన్ను ఆదరించి స్వీకరించడం లేదు. ఈమెను చంపి తినివేస్తాను. అపుడు సవతి లేకుండా నీతో హాయిగా సుఖిస్తాను’ అని రామునితో పలికి సీతపైకి దూసుకు వెళ్ళింది.
ఇలా చంపడానికి వచ్చిన శూర్పణఖను మరొకరయితే చంపి ఉండే వారు. కాని లక్ష్మణుడు ముక్కుచెవులు కోశాడు. అలాంటి సన్నివేశం మనకెదురయితే ఏం చేస్తాం అని ఆలోచించుకుంటే ఇలాటి విమర్శలు చెయ్యరు.
వేదాలు గజిబిజిగా ఉన్నాయని, అవి పండితులకే అర్ధంకావని వారు మరొక విమర్శ చేశారు.
స్పష్టంగా అర్థం అయ్యే భాషలో ఉన్నవి, అనేక వ్యాఖ్యానాలున్నవి. అయిన రామాయణ మహాభారతాలనే అపార్థం చేసుకుని అప విమర్శలు చేసే స్థితి ఉంటే ప్రపంచంలో అతి ప్రాచీన వాఙ్మయమయిన వేదాలెలా అర్థం అవుతాయి. వేదాలు అర్థం కావాలంటే వేదాంగాలు చదవాలి. కనీసం వేదాంగాలు చదివి వ్రాసిన మహానుభావుల భాష్యాలయినా చదవాలి. ‘దేవుడున్నాడు. ఆయనను హృదయంలో ధ్యానించాలి. ఆయన ఒకడే. అనేక రకాలుగా ఆయనను భావిస్తారు. ఆయన అనుగ్రహం పొందడానికి స్తుతించవచ్చు. వివిధ ప్రక్రియలలో ఆయనను ఆరాధించవచ్చు. సంగీతంతో ఆయన మహిమను గానం చేయవచ్చు.
ఆయనను తెలుసుకోవడానికి యోగ మార్గం ఒక బాట.’’ అని ప్రపంచంలో మొదట చెప్పినవి వేదాలే. తరువాత బయలుదేరిన మతాలు వారిలో కొన్నింటిని స్వీకరించి ప్రత్యేక మతాలుగా ఉంటున్నాయి. ఖగోళంలో ఉన్న తారా నక్షత్ర సమూహం ఒక శిశుమారం ఆకారంలో ఉంది. దానిని ఇలా ధ్యానించమని వేదం చెప్పింది.
2010 సంవత్సరంలో ఐరోపా అంతరిక్ష సంస్థ ఉపగ్రహంపై ప్లాంక్ టెలిస్కోప్ పెట్టి సంవత్సర కాలం ఉపగ్రహం తిరుగుతూంటే విశ్వచిత్రం తీసింది. ఆ చిత్రంలో ఆ శిశు మారం ఆకారం వేదంలో వర్ణించిన విధంగా కనబడుతోంది. వేదం ప్రణవాన్ని అనేక విధాలుగా ప్రశంసించింది. ఆ ప్రణవ లిపి ఆ విశ్వచిత్రంలో కనబడుతుంది. ఇలాంటి అద్భుత విషయాలు వేదంలో ఉన్నాయి. కాబట్టి వేదం కొంతయినా అర్థం కావాలంటే దానికోసం జీవితం అంకితం చెయ్యాలి.
ఇప్పుడు వినవస్తున్న కువిమర్శలు మూల గ్రంథాలు చూడకుండా చేసినవని, అవి ప్రామాణికాలు కావని సారాంశం.

- చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ