సాహితి

బాల సాహిత్యం పంథా మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల సాహిత్యం అనగానే పంచతంత్ర కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, ఈసపు కథలు, చందమామ కథలు గుర్తురావడం సహజం. మారుతున్న కాలంతో బాటు మనము మారుతున్నట్టే పిల్లలు కూడా మారుతున్నారు. కాలం బాటే వేగం అందుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. పూర్వకాలంలో సమష్టి కుటుంబాలు ఉండేవి. ఎక్కువమంది సంతానం ఉండేవారు. అప్పట్లో అందరికీ విద్య, ఆహారం, వసతులు కల్పించడం కష్టమయ్యేది అమ్మానాన్నలకు. ఇప్పుడు ఒకరో ఇద్దరో పిల్లలు ఉంటున్నారు. ఆదాయ వనరులూ పెరిగాయి. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. వారిని విద్యావంతులను చేయాలని ఆరాటపడుతున్నారు. పిల్లలు కూడా వారికి లభిస్తున్న మెరుగైన విద్యావకాశాలను వినియోగించుకుంటున్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. సైన్సు, కమ్యూనికేషన్ రంగాలు చాలా అభివృద్ధి చెందాయి. పాతికేళ్ళ వయసులో టెలివిజన్‌ను చూసిన తరం నిన్నటి తరానికి పుట్టిన కొన్ని నెలలకే టీవీ చూసే నేటి తరానికి ఆలోచనల్లో తేడా స్పష్టంగా ఉంటుంది. బాల్యంలోనే విషయాలపై అవగాహనా శక్తి పెరుగుతోంది.
సింహం, పులి, ఏనుగు వంటి జంతువులను కథల పుస్తకాల బొమ్మల్లో చూసి నిన్నటి తరం పిల్లలు ఆనందించేవారు. నగర వాసుల పిల్లల్లో కొందరు మాత్రం జంతు ప్రదర్శనశాలలో చూస్తుంటారు. ప్రస్తుతం టీవీ చానల్స్ పుణ్యమా అని ఏనిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్ వచ్చిన తర్వాత పులి, సింహం, ఏనుగు లాంటి జంతువుల్ని, రకరకాల సర్పాలని, వివిధ జాతుల పక్షుల్ని వాటి జీవన విధానాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు నేటి తరం పిల్లలు. కనీవినీ ఎరుగని మరెన్నో జీవుల గురించి సైతం తెలుసుకోగలుగుతున్నారు. ఎర్రకోట మీద రాష్టప్రతి ప్రసంగం అంటే ఎలా వుంటుందో ఊహించుకునే నాటి తరం పిల్లలకీ, స్వయంగా చూడగలుగుతున్న నేటి పిల్లలకీ ఆలోచనా శక్తిలో తేడా తప్పకుండా ఉంటుంది. ఐక్యూ శాతం కూడా ఎక్కువే. నేటి తరం పిల్లలకు తాతల కాలం నాటి కథలు చెబితే బుద్ధిగా వినేసి ‘ఊఁ’ కొడతారా? సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడటం మీద అమ్మమ్మ, తాతయ్య మనకు చెప్పిన కథలనే వాళ్లకు చెబితే నమ్ముతారా? గూగుల్లో వెతికి సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడే విధానం మనకు అప్పజెబుతారు. నేటి పిల్లలకి ప్రతిదీ శాస్ర్తియంగా రుజువులతో చెబితేగాని నమ్మరు.
అప్పటి సాహిత్యం నేటి పిల్లలకు సరిపోదు. పంచతంత్ర కథలు, జాతక కథలు, ఈసపు కథలు, కాశీ మజిలీ కథలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలు, సింద్‌బాద్ సాహసయాత్రలు మాత్రమే చాలవు. విలువలతో కూడిన విద్య, ఉల్లాసం కలిగించే కథలు, ఊహల్లోకి తీసుకువెళ్లే కల్పనా సాహిత్యం అవసరమే కానీ ఇవాల్టి స్పీడు యుగానికి సరిపడే కొత్త పంథాలో వ్రాసిన రచనలు కావాలి. ఈ విషయాన్ని కొన్ని పత్రికలు ముందే గుర్తించాయి. గృహలక్ష్మి పత్రిక 1930 సెప్టెంబర్ నుంచి ప్రత్యేకంగా పిల్లల కోసం ‘బాల విజ్ఞాన శాఖ’ అనే కొత్త శీర్షిక ప్రారంభించింది. తొక్కుపల్కులు, చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు, వినోద కథలు, చిట్టి కథలు, నీతి కథలు, పిట్టకథలు, విజ్ఞాన విశేషాలు, పిన్ని లేఖలు - కొనే్నళ్ళ పాటు ప్రచురించింది. తరువాత కాలంలో బాల సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించింది మాత్రం భారతి, బాలకేసరి, బాల తదితర పత్రికలు. అదే ఒరవడిని నేటి పత్రికలూ కొనసాగిస్తున్నాయి. పిల్లల కోసం ఓ పేజీని ప్రత్యేకంగా కేటాయించి వారిపట్ల తమకున్న ప్రేమను, బాధ్యతను నిరూపించుకుంటున్నాయి. పిల్లలకు వినోదం, విజ్ఞానం, వికాసం అందించడంలో భాగంగా పద వినోదం, గడి-నుడి, గణితంలో గమ్మత్తులు, తేడాలను గుర్తించడం, లెక్కలతో చిక్కులు విప్పడం, పదవృత్తం, దారి కనుక్కోండి, పదాలు కనుక్కోండి, ఇచ్చిన తెలుగు ఆధారాలతో ఇంగ్లీషు పదం కనుక్కోండి, జంతర్ మంతర్ (గజిబిజి పదాలను సరైన అమరికలో వ్రాయడం), డైలీ సుడోకు, చుక్కలు కలపండి, పొడుపు - విడుపు, మీకు తెలుసా?, చిలిపి ప్రశ్న, మెదడుకు మేత, బొమ్మలతో ప్రశ్నలు, సైన్సు సంగతులు మొదలైనవి ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నం ఎంతమాత్రం సరిపోదు. నేటి బాలల వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే సాహిత్యం రావాల్సి ఉంది. కథలు, గేయాలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్లు ఇలా ఏ రూపంలో వచ్చినా సరే బాలసాహిత్యాన్ని సుసంపన్నం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల శ్రేయస్సు కోరి ఎన్ని మంచి పుస్తకాలు వచ్చినా - మానవత్వం, పరోపకారం, పెద్దలను గౌరవించడం వంటి విషయాలు చెబుతూనే మిగతావాటిపైనా వారి అవగాహనకు తగిన రీతిలో చెప్పాలి. అప్పుడే సమాజానికి మంచి బాల సాహిత్యం అందుతుంది.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు 9490799203