హైదరాబాద్

ప్రభుత్వ యంత్రాంగంలో గంథరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులకు చీటికి మాటికి బదిలీలు అవుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏ అధికారికి ఎప్పుడు బదిలీ అవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన అధికారులు స్వల్ప వ్యవధిలోనే పదవీ విరమణ చేస్తుండటంతో వారి ఎంపిక చేసుకున్న అధికారుల జట్లు కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దీంతో అధికార యంత్రాంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల శాఖలు తరుచు మారుతున్నాయి. కొందరు అధికారులకైతే ఏడాది తిరక్కుండానే శాఖలు మారుతున్నాయి. దీంతో వారు తమకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారనే అభిప్రాయం అధికార యంత్రాంగంలో వ్యక్తం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడున్నర ఏళ్లలో ముగ్గురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ప్రదీప్ చంద్రా, ఎస్‌పి సింగ్ పదవీ విరమణ చేయగా, నాలుగవ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కె జోషి ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారినప్పుడల్లా పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులకు బదిలీలు జరుగుతున్నాయి. వీరి పని తీరు ప్రాతిపదికన ప్రభుత్వం వీరిని బదిలీ చేస్తుందా? లేక కొత్తగా బాధ్యతలు చేపడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ టీమ్‌లను మార్చుకోవడంలో వల్ల ఈ బదిలీలు జరుగుతున్నాయా? అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారుల బదిలీలు ముఖ్యమంత్రి ఆమోదంతోనే జరుగుతాయి. అయితే ప్రధాన కార్యదర్శులు మారిన ప్రతీసారి బదిలీలు జరుగుతుండటంతో వీటి వెనుక కొత్తగా బాధ్యతలు స్వీకరించే అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన ఎస్‌పి సింగ్ తన వీడ్కోలు సమావేశంలో తన హయాంలో అధికారులలో ఎలాంటి గ్రూప్‌లను మెయిన్‌టైన్ చేయలేదన్నారు. తను గ్రూప్‌లను మెయిన్‌టైన్ చేయలేదంటే అంతకుముందటి అధికారులు అలా చేసారనే అర్థం స్ఫూరిస్తుంది. కీలకమైన శాఖల అధికారుల బదిలీలు ముఖ్యమంత్రి ఆమోదంతోనే జరుగుతాయి కాబట్టి ఆయన్ను మరెవ్వరైనా ప్రభావితం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా అధికార యంత్రాంగంలో వ్యక్తం అవుతున్నాయి.
ఎస్‌కె జోషి ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కె జోషి బాధ్యతలు స్వీకరించాక అధికార యంత్రాంగంలో జరిగిన భారీ చేర్పులు, మార్పులలో కొందరు కీలక అధికారులకు లూప్ లైన్ పోస్టులు లభించగా లూప్‌లైన్‌లో ఉన్న మరికొందరికీ కీలక పోస్టులు లభించడం చర్చనీయాంశంగా మారింది. రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బిఆర్ మీనాను కీలక బాధ్యతల నుంచి తప్పించి అంతగా ప్రాధాన్యత లేని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ కార్యదర్శిగా నియమించారు. అలాగే ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బిపి ఆచార్యను ఆ పదవి నుంచి తప్పించి లూప్‌లైన్ పోస్టు అయిన ఎంసిహెచ్‌ఆర్‌డి బాధ్యతలు అప్పగించగా, మున్సిపల్ పాలనా, సమాచారశాఖ కమిషనర్‌గా ఉన్న నవీన్ మిట్టల్‌ను అంతగా ప్రాధాన్యతలేని సాంకేతిక విద్యా కమిషనర్‌గా నియమించింది. ఇంధన శాఖ, పరిశ్రమలశాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్‌కుమార్‌ను ఏడాదిన్నర కిందట ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రాధాన్యతలేని పదవీలో నియమించగా, ఇటీవల జరిగిన బదిలీల్లో తిరిగి కీలకమైన మున్సిపల్ పాలనా కార్యదర్శిగా, సమాచార శాఖ కమిషనర్‌గా నియమించింది. ఇటీవల జరిగిన బదిలీల్లో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాజేశ్వర్ తివారీ గతంలో పరిశ్రమలశాఖ కార్యదర్శిగా ఉండగా ముఖ్యమంత్రి కెసిఆర్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు పారిశ్రామికవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లారు. ఆ సందర్భంగా పరిశ్రమలశాఖకు సంబంధించిన కనీస సమాచారం లేదన్న ఆగ్రహంతో ఆయన్ను హెచ్‌ఎండిఏకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అదే రాజేశ్వర్ తివారీని ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖకు ప్రత్యేక కార్యదర్శిగా నియమించి ఇటీవల జరిగిన బదిలీల్లో మరింత కీలకమైన రెవిన్యూ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇలాంటి ఉదంతాలతో ఎప్పుడు ఏ అధికారికి కీలక పదవీ లభిస్తుందో, ఎప్పుడు లూప్‌లైన్‌లోకి పంపిస్తుందో తెలియక అధికార యంత్రాంగంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.