ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

భాజపా రాజకీయ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవనేది మరోసారి భాజపా రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని అతి పెద్ద దళిత నాయకురాలు మాయావతిని వేశ్యతో పోల్చటం ద్వారా భాజపా రాజకీయ ఆత్మహత్యాకు ప్రయత్నించింది. ఎన్నికలకు ముందు తమ కాళ్లను తామే నరుక్కోవటం భాజపాకు వెన్నతో పెట్టిన విద్యగా మారుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెనుకబడిన కులాల రిజర్వేషన్ల గురించి పునరాలోచించవలసిన సమ యం ఆసన్నమైందనే ప్రకటన ద్వారా పై ఆర్.ఎస్.ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ భాజపా విజయావకాశాలను సర్వనాశనం చేయటం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ బి.ఎస్.పి అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు మాయావతిని వేశ్యతో పోల్చటం ద్వారా పార్టీ విజయావకాశాలను నీరు కార్చారు.
మాయవతి కోటి రూపాయలు తీసుకుని అసెంబ్లీ టికెట్ ఇస్తోంది, రెండు కోట్లు ఇస్తానని ఎవరైనా ముం దుకు వస్తే ముందు చేసిన కేటాయింపును వెంటనే రద్దు చేస్తోంది, మాయావతి వేశ్య మాదిరిగా వ్యవహరిస్తోంది, వేశ్యలు కూడా మాయావతిలా వ్యవహరించరంటూ దయాశంకర్ సింగ్ భయంకర ఆరోపణలు చేయటం క్షమించరాని నేరం. దళిత వర్గానికి చెందిన ఒక మహిళను భాజపా నాయకుడు ఇలా ఆరోపించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2017 ప్రారంభంలో జరుగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై ఆరోపణలు కుమ్మరించటం పరిపాటిగా వస్తోంది. తమ ఘన కార్యాయాలను వివరించటంతోపాటు ప్రత్యర్థుల లోపాలు, లొసుగులు, తప్పిదాలను ప్రజలకు ఎత్తి చూపించటం ఎన్నికల ప్రచారంలో ఒక భాగం. అయితే ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయటం అనేది ఒక పరిమితికి లోబడి జరగాలి. ఉత్తర ప్రదేశ్ రాజకీయాలకు పరిమితి అనేదే ఉండదు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ప్రత్యర్థులను ఆధార, నిరాధార ఆరోపణలు చేయటం ఒక అలవాటుగా మారింది. రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో హద్దు మీరి వ్యవహరిస్తుంటారు. దయాశంకర్ సింగ్ కూడా హద్దు మీరి మాయావతిపై తప్పుడు ఆరోపణలు చేశారు. దయాశంకర్ సింగ్ క్షమించరాని తప్పు చేశారు. తమది భిన్నమైన పార్టీ అని గొప్పగా చెప్పుకునే భాజపా నాయకుడు ఒక మహిళను అందునా దళిత మహిళలను వేశ్యతో పోల్చటం సిగ్గుచేటు. భారత దేశం సభ్యత, సంస్కృతిని తామే కాపాడుతాము, తామే కాపాడగలుగుతామని ప్రచారం చేసుకునే భాజపా నాయకులు ఒక మహిళ పట్ల ఇలా వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. భాజపా మనువాదానికి ప్రతీక అనే ఆరోపణలను దయాశంకర్ సింగ్ లాంటి నాయకులు నిజం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో కొన్ని సీట్లను డబ్బు తీసుకుని కేటాయిస్తాయనేది జగమెరిగిన సత్యం. భాజపాతోపాటు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దురాచారానికి మినహాయింపు కాదు. బి.ఎస్.పి అధ్యక్షురాలు మాయావతి సైతం ఇలాంటి దురాచారాన్ని పాటిస్తూండవచ్చు. డబ్బుకు సీట్లు అమ్ముకునే దురాచారాన్ని దుయ్యబట్టటం తప్పు కాదు. తప్పు చేయని వారు ఇతరుల తప్పును ఎత్తి చూపించాలి తప్ప తాము తప్పు చేస్తే రాజకీయం, ఇతరులు తప్పు చేస్తే రాజకీయ వేశ్యా వృత్తి ఎలా అవుతుంది? మాయావతిని వేశ్యతో పొల్చటం వెనక రాజకీయ దురహంకారంతోపాటు సామాజిక దురహంకారం కూడా ఇమిడి ఉన్నది.
మాయావతిని వేశ్యతో పోల్చటం ద్వారా దయాశంకర్ సింగ్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి విజయావకాశాలను బాగా దెబ్బ తీశారు. దేశంలోని మైనారిటీలు భాజపా దరిదాపుల్లోకి రారు. దయాశంకర్ సింగ్ ఆరోపణల మూలంగా దళితులు కూడా భాజపాకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం నెలకొన్నది. ఉత్తర ప్రదేశ్‌లోని దళితులెవ్వరు కూడా వచ్చే అసెంబ్లీలో భాజపాకు ఓటు వేయని పరిస్థితులు నెలకొంటున్నాయి. భాజపాకి ఇప్పటికే బ్రాహ్మణ, వైశ్య వ్యాపారస్తుల పార్టీ అనే ముద్ర ఉన్నది. ఈ ముద్రను తొలగించేందుకు భాజపా అధినాయకత్వం నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో దయాశంకర్ సింగ్ బీఎస్‌పీ అధ్యక్షురాలిని వేశ్యతో పోల్చటం ద్వారా భాజపాకు దళిత వ్యతిరేక పార్టీ అనే శాశ్వత ముద్రను వేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బి.సి రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల మూలంగా బలహీన వర్గాలు దూరమైపోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూడవలసి వచ్చింది. వెనుకబడిన కులాల ప్రజలు ఈరోజు కూడా భాజపాని అనుమానంతో చూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలకు మోహన్ భాగవత్ ఆ తరువాత ఎన్ని వివరణలు ఇచ్చినా జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయారు. మోహన్ భాగవత్ ప్రకటన నేపథ్యంలో బిహార్‌లోని వెనుకబడిన వర్గాల ప్రజలందరు జె.డి.యు, ఆర్.జె.డి మహా కూటమికి ఓటు వేసి భాజపాకు శిక్ష విధించారు. భాజపా నాయకులు బిహార్ అనుభవం నుండి ఎలాంటి గుణ పాఠం నేర్చుకోలేదు. అందుకే వారిప్పుడు దళితులను కూడా దూరం చేసుకున్నారు. మైనారిటీలు, బి.సిలు, దళితులను దూరం చేసుకుంటున్న భాజపాకు ఇక మిగిలేది ఏమిటి? భాజపా నాయకులు రాజకీయ విజ్ఞతను కోల్పోతున్నారా? రాజకీయ పార్టీ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాలి కానీ భాజపా ఇందుకు విరుద్ధంగా వ్యవహరించటం ద్వారా తన కాళ్లను తానే నరికేసుకుంటోంది.