ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

స్తంభింపజేస్తే ఏమిటి ప్రయోజనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోని అది పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అయితే మన పార్లమెంటులో అప్రజాస్వామికం కొనసాగుతోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యే అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయకుండా గుత్త్ధాపత్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలు మార్చ్ మూడో తేదీ నుండి ప్రారంభమైనా ఏ ఒక్క రోజు కూడా సజావుగా జరగలేదు. ఢిల్లీ అల్లర్లపై చర్చ జరపాలనే డిమాండ్‌తో ప్రతిపక్షం ప్రతిరోజూ పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తోంది. ప్రతిపక్షం సభ్యులు ప్రతి రోజు పోడియం వద్దకు దూసుకు రావటం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభా కార్యక్రమాలను స్తంభింపజేయటం పరిపాటిగా మారింది. ప్యానెల్ స్పీకర్ చేతిలో నుండి అధికార పత్రాలు లాగివేసే స్థాయికి ప్రతిపక్షం ఎదిగిపోవటం గర్హనీయం. ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు సభ నుండి సస్పెండ్ అయ్యారంటే లోకసభలో ఏ స్థాయిలో గొడవ కొనసాగుతోందనేది అర్థం చేసుకోవచ్చు. అర్థవంతమైన చర్చలు ప్రజాస్వామ్యానికి అద్దం పడతాయి తప్ప గొడవలు, గందరగోళాలు కాదు. ఢిల్లీ అల్లర్లపై చర్చ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలన్నది ప్రతిపక్షం డిమాండ్. హోలి పండుగ తరువాత ఢిల్లీ అల్లర్లపై ఉభయ సభల్లో చర్చ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. హోలి పండుగకు ముందు పార్లమెంటులో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరిపితే దేశంలో ముఖ్యం గా దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నదని ప్రభుత్వం వాదిస్తోంది. ఢిల్లీలో పరిస్థితి కొంత చక్కబడిన అనంతరం అల్లర్లపై చర్చ జరిపితే బాగుంటుందన్నది ప్రభుత్వం ఆలోచన. అందుకే మంగళవారం హోలి పండుగ జరుపుకోగానే ఢిల్లీ అల్లర్లపై పదకొండో తేదీ లోక్‌సభ, పనె్నండో తేదీ నాడు రాజ్యసభలో చర్చ జరుగుతుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన తరువాత కూడా ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటం అర్థరహితం. ప్రతిపక్షం రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంటు ఉభయ సభల్లో ఢిల్లీ అల్లర్ల చర్చ పేరుతో గొడవ చేస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. హోలి పండుగ తరువాత అల్లర్లపై చర్చ జరిపితే వచ్చే నష్టం ఏమిటనే ప్రశ్నకు ప్రతిపక్షం నుండి ఎలాంటి సమాదానం లేదు. ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరపటం వలన ప్రయోజనం ఏమిటి? అనే ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం రావటం లేదు. ఢిల్లీ అల్లర్లు ఎంత మాత్రం క్షమార్హం కావు. దేశ రాజధానిలో అకస్మాత్తుగా ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరగటం సంఘటిత సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అద్దం పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశంలో పర్యటించే సమయంలో అల్లర్లు జరగటం వెనక కుట్ర ఉన్నదనేది సుస్పష్టం. ఢిల్లీ అల్లర్లు ఒక పథకం ప్రకారం జరిగాయి. మీరట్, ఘజియాబాద్ నుండి రహస్యంగా వచ్చిన అల్లరి మూకలు అల్లర్లు సృష్టించాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అల్లర్లు సృష్టించేందుకు ముందు వేసుకున్న పథకం ప్రకారం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగినట్లు ఆ తరువాత వెలుగులోకి వచ్చిన పలు పరిణామాలు సూచిస్తున్నాయి. ఆం ఆద్మీ పార్టీకి చెందిన ఒక కార్పోరేటర్ ఇంట్లో ఇంటలిజెన్స్ బ్యూరో అధికారిని దారుణంగా హత్య చేయటం చూస్తుంటే అల్లర్లు జరిపేందుకు ఏ స్థాయిలో కుట్ర జరిగిందనేది స్పష్టం అవుతోంది. ఒక వర్గానికి చెందిన ఇళ్ల పైన పెద్ద ఎత్తున రాళ్లు సేకరించి పెట్టటం, రాళ్లు విసిరేందుకు పెద్ద పెద్ద స్లింగ్ షూటర్‌లు ఏర్పాటు చేసుకోవటం చూస్తుంటే ఇదొక పెద్ద కుట్రలో భాగమేననేది మరింత స్పష్టం అవుతోంది. ఢిల్లీ అల్లర్ల ప్రధాన లక్ష్యం కేవలం డొనాల్డ్ ట్రంప్ పర్యటన సమయంలో గొడవ చేయటం ద్వారా భారతదేశం పరువు, ప్రతిష్టను దెబ్బతీయటం కాదు, ఈ లక్ష్య సాధనతోపాటు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్, ఎన్.ఆర్.సిలను దృష్టిలో పెట్టుకుని చేసిన అల్లర్లు ఇవి. ఢిల్లీ అల్లర్లను కేవలం మత కలహాలుగా కొట్టివేసేందుకు ఎంత మాత్రం వీలు లేదు. ఢిల్లీలో మొదటి రోజు జరిగిన అల్లర్లను చూస్తుంటే ఇది స్థానిక ప్రజలు చేసిన గొడవ కాదు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుట్రలో భాగమే. అందుకే ఢిల్లీ అల్లర్లపై లోతుగా దర్యాప్తు జరిపించవలసిన అవసరం ఉన్నది. పార్లమెంటు ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. పార్లమెంటు ఉభయ సభల్లో జరిగే చర్చ నిష్పక్షపాతంగా ఉండాలి. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఈ చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. దేశ సమగ్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఢిల్లీ అల్లర్లపై అన్ని కోణాల నుండి చర్చ, సమీక్ష జరగాలి. ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరిపి అధికార పక్షంపై దుమ్మెత్తిపోయాలన్నది ప్రతిపక్షం ఆలోచన. అధికార పక్షం కూడా ప్రతిపక్షంపై అభాండాలు వేసి తప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ఢిల్లీ అల్లర్లలో దాదాపుఅరవై మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు, వందల సంఖ్యలో వాహనాలు, దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. వందలాది ఇళ్లు, దుకాణాలు, ఇతర సంస్థలు అల్లర్ల మంటల్లో కాలి బూడిదైపోయాయి. దేశ రాజధానిలోని ఈశాన్య ప్రాంతం మూడు రోజుల పాటు అల్లకల్లోలానికి గురైంది. అధికార పక్షం, ప్రతిపక్షానికి ఏ మాత్రం బాధ్యత ఉన్నా ఢిల్లీ అల్లర్లపై ప్రశాంత చిత్తంతో అత్యంత లోతుగా చర్చ జరపాలి. ఢిల్లీ అల్లర్ల మూలాల వరకు వెళ్లటంతోపాటు దోషులను గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి. గతంలో పార్లమెంటు ఉభయ సభల్లో అల్లర్లపై పలుమార్లు వాడి, వేడి చర్చలు జరిగాయి. ప్రతిపక్షం, అధికార పక్షం ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం రకరకాల ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఈ చర్చల అనంతరం ఏం జరిగిందనేది పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. తీవ్రమైన సంఘటనలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది తప్ప ఆ తరువాత దీనిపై ఎలాంటి తదుపరి చర్యలు ఉండవు. సంఘటనలకు బాధ్యులను గుర్తించటం, జవాబుదారీని నిర్ణయించటం ఎప్పుడూ జరగలేదు. ఢిల్లీ అల్లర్ల విషయంలో ఇలా జరుగకూడదు. ఢిల్లీ అల్లర్లకు బాధ్యులైన వారిని గుర్తించాలి, అల్లర్లకు దిగిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ అల్లర్ల సమయంలో కొందరు యువకులు లైసెన్సు లేని రివాల్వర్లతో పోలీసులను బెదిరించటం, రివాల్వర్‌ను పోలీసు గుండెలపై పెట్టి కాల్చి పడేస్తానంటూ పళ్లు పటపట కొరకటం చూస్తుంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిందనేది, ఒక వర్గం ప్రజలను తీవ్ర స్థాయలో రెచ్చగొట్టారనేది స్పష్టం అవుతోంది. ఈ కుట్ర ఎందుకు జరిగిందనేది తెలుసుకోవలసిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఓటు బ్యాంకు రాజకీయం కోసం కొన్ని వర్గాల వారిని వెనకేసుకు రావటం మంచిది కాదు. దేశ ప్రయోజనాలు, భద్రత, సమగ్రత కోసం ఢిల్లీ అల్లర్ల కుట్ర దారులను గుర్తించవలసిన అవసరం ఉన్నది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్., ఎన్.ఆర్.సికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా ఉద్యమం నడుస్తోంది. కొన్ని దేశీ, విదేశీ శక్తులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్.పి.ఆర్, ఎన్.ఆర్.సి.కి వ్యతిరేకంగా ఉద్యమం నడిపిస్తున్న వారే ఢిల్లీలో మూడు రోజుల పాటు అల్లర్లు సృష్టించారు. దేశంలోని పలు ముఖ్యమైన పట్టణాల్లో ఉద్యమిస్తున్న వారి గురించి కూడా పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగాలి.
ఉద్యమం ఉద్దేశాలను తెలుసుకోవటం అధికార, ప్రతిపక్షం బాధ్యత, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో రాజీ కుదరదు. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాలు తమ పార్టీ రాజకీయాలను అతీతంగా ఉభయ సభల్లో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరపగలిగితేనే దేశంలో ప్రజాస్వామ్యం మరింత పటిష్టం అవుతుంది. పార్లమెంటును స్తంభింపజేయం వలన ప్రతిపక్షాలకు ఒరిగేదేదీ లేదనేది నిజం. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలు అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అర్థవంతమైన చర్చ జరగటం లేదని చాలా మంది భావిస్తున్నారు. దీని మూలంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం ఇప్పటికే బాగా సన్నగిల్లింది. ఇది మరింత సన్నగిల్లకుండా చూసుకోవలసిన బాధ్యత ఇరుపక్షాలపై ఉన్నది. అధికార, ప్రతిపక్షాలు చర్చ కోసం చర్చ జరపటం కాకుండా క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించే విధంగా చర్చ జరపటం ద్వారాదేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రయత్నించాలి.

కె.కైలాష్ 98115 73262