ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాజ్యం వీరభోజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుల కాలంలో బలమున్న వాడిదే రాజ్యం, అందుకే రాజ్యం వీరభోజ్యం అనేవారు. ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో కూడా బలమున్నవాడిదే రాజ్యం అవుతోంది. ఎన్నికల్లో ప్రజలు తమకు మెజారిటీ ఇచ్చారా? లేదా? అనేది ముఖ్యం కాదిప్పుడు. మనం ఎంతమంది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయగలమనేదే ముఖ్యం. శాసన సభ్యుల సంఖ్యను ఏదో ఒకరకంగా పెంచుకోవటం, ఆ తరువాత అధికారాన్ని హస్తగతం చేసుకోవటం ఒక రాజకీయ ప్రక్రియగా మారింది. అధికారమే పరమావధి అయినప్పుడు పదవి, అధికారం, ధనం కోసం ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం అత్యంత సహజం. మధ్యప్రదేశ్‌లో అధికారం కోసం జరుగుతోన్న రాజకీయ నాటకం ఇలాంటిదే. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు బి.జె.పి. ప్రజాస్వామ్యంతో ఆడుకుంటోంది. ఆరుగురు మంత్రులు, మరో పదిహేడుమంది కాంగ్రెస్ శాసన సభ్యులను తమ వైపు తిప్పుకోవటం ద్వారా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వస్తోంది. ఎన్నికల్లో డబ్బు పెట్టి గెలిచిన ప్రజాప్రతినిధులు ఆ తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కూడా ధనం, పదవికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, గాంధీ కుటుంబం రాజకీయ వారసుడు రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన జ్యోతిరాధిత్య సింధియా అకస్మాత్తుగా పార్టీ ఫిరాయించి బి.జె.పి. తీర్థం పుచ్చుకోవటంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయం తలకిందులైంది. నాలుగు సార్లు లోకసభ సభ్యుడుగా ఎన్నిక కావటంతోపాటు కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించిన జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బి.జె.పి.లో చేరిపోయారు. జ్యోతిరాధిత్య సింధియాలాంటి కరడుగట్టిన కాంగ్రెస్‌వాది కూడా బి.జె.పి. తీర్థం పుచ్చుకోవటం చూస్తుంటే రాజకీయాల్లో ఎప్పుడు, ఏదైనా జరగవచ్చుననేది మరోసారి రుజువైంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు రెండురోజుల ముందు జ్యోతిరాధిత్య సిందియా ఢిల్లీ అల్లర్లకు బి.జె.పి. బాధ్యత వహించాల్సిందేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. మొదట రాజ్యసభ, ఆ తరువాత కేంద్రంలో మంత్రి పదవి ప్రతిపాదన ముందుకు రాగానే అంతా మారిపోయింది. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను ప్రశంసలతో ముంచెత్తారు. బి.జె.పి.లో చేరిన తరువాత రెండు రోజులకే సింధియాకు రాజ్యసభ టికెట్ లభించటం చూస్తుంటే పదవీ రాజకీయం ఏ స్థాయికి చేరుకున్నదనేది సుస్పష్టం అవుతుంది. సింధియా ఆదేశం మేరకు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన పదిహేడు మంది శాసన సభ్యులు, మరి కొందరు స్వతంత్ర సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయటం ద్వారా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధమయ్యారు. అంతకు కొన్ని రోజుల ముందు వరకు కూడా వీరు కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని సమర్థించిన వారే. జ్యోతిరాధిత్య సింధియాకు ఇప్పుడు రాజ్యసభ సీటు ఆ తరువాత కేంద్ర మంత్రివర్గంలోస్థానం కల్పించటం ద్వారా బి.జె.పి. అధినాయకత్వం మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. అంతా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో జరిగిపోతున్న ఈ తంతు కూడా ప్రజాస్వామ్యం పేరుతోనే కొనసాగటం గమనార్హం. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ఆరుగురు మంత్రుల రాజీనామాతో కాంగ్రెస్ బలం 108కి పడిపోయింది. బి.ఎస్.పి.కి ఇద్దరు సభ్యులున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ఒక శాసనసభ్యుడుండగా నలుగురు స్వతంత్ర సభ్యులు. ఇక బి.జె.పి. బలం 107, ఇప్పటికే శాసన సభలో రెండు ఖాళీలున్నాయి. ఆరుగురు మంత్రులను కలుపుకుంటే మొత్తం ఖాళీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆరుగురు మంత్రుల రాజీనామా, మరో ఇరవై రెండు మంది తమ రాజీనామాలను స్పీకర్‌కు సమర్పించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పతనం చేసి తాము అధికారంలోకి రావటమే బి.జె.పి. అంతిమ లక్ష్యం. ప్రతిపక్షం ప్రభుత్వాలను కూలదోసి అధికారంలోకి రావటం కాంగ్రెస్ సంప్రదాయం. ఇప్పుడీ సంప్రదాయాన్ని బి.జె.పి. పుణికిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. బి.జె.పి. అధినాయకత్వం కర్నాటకలో కూడా ఇదే పద్దతిలో అధికారంలోకి రావటం అందరికి తెలిసిందే. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బి.జె.పి. పలు ప్రయత్నాలు చేసి చివరకు కాంగ్రెస్, జె.డి.యు. శాసనసభ్యులతో రాజీనామా చేయించి పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత బి.జె.పి. అధినాయకత్వం తమ దృష్టిని వరుసగా మహారాష్ట్ర, రాజస్తాన్‌లపై కేంద్రీకరించవచ్చు. మహారాష్టల్రో అధికారంలో ఉన్న శివసేన, ఎన్.సి.పి., కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పటికే పలు విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కూటమి నాయకులు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన అనంతరం పౌరసత్వ సవరణ చట్టం వలన ఎవరి పౌరసత్వం పోదని ప్రకటించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ముంబాయి వెళ్లిన తరువాత మిత్రపక్షాల వత్తిడి మూలంగా మాట మార్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అధ్యయనం చేసేందుకు కూటమి మంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉద్దవ్ థాక్రే మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటం ద్వారా పౌరసత్వ సవరణ చట్టానర్ని అమలును కొంత కాలరం వాయిదా వేయగలిగారు. బి.జె.పి.కి దూరమయ్యాను తప్ప హిందు మతానికి దూరం కాలేదని ప్రకటించిన ఉద్దవ్ థాక్రే ఏదోఒక రోజు పౌరసత్వసవరణ చట్టాన్ని అమలు చేయకతప్పదు. ఇది జరిగిన నాడు కూటమి కుప్పకూలుతుంది. బి.జె.పి. అధినాయకత్వం ఈ సమయం కోసమే ఏదురుర చూస్తోంది. కూటమిని కుప్పకూల్చటం లేదా కూటమిలో తామే చిచ్చు పెట్టటం ద్వారా మహారాష్టల్రో అధికారంలోకి వచ్చేందుకు బి.జె.పి. త్వరలోనే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఉద్దవ్ థాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బి.జె.పి. అంగీకరించిన మరు క్షణం కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుంది. మహారాష్ట్ర అనంతరం బి.జె.పి. రాజస్తాన్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రభుత్వ పతనానికి ఎత్తుగడలు వేయవచ్చు. కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలినప్పుడే బి.జె.పి తదుపరి లక్ష్యం మధ్యప్రదేశ్ అని అందరు ఊహించటం తెలిసిందే. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైన తరువాత బి.జె.పి. తదుపరి లక్ష్యం మహారాష్ట్ర, ఆ తరువాత రాజస్తాన్ కావచ్చు. పంజాబ్, చత్తీస్‌గడ్‌లలో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నందున అక్కడి ప్రభుత్వాలను పతనం చేయటం బి.జె.పి.కి సాధ్యం కాకపోవచ్చు. 2024 లోకసభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఒకటి, రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండేలా చేయాలన్నది బి.జె.పి. వ్యూహంగా కనిపిస్తోంది. రాష్ట్రాలలోని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలను పతనం చేసేందుకు బి.జె.పి. సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసి అధికారంలోకి వచ్చేందుకు బి.జె.పి. ఈ విధంగా వ్యవహరించటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిది. ప్రత్యర్థి పార్టీల శాసన సభ్యులను కొనుగోలు చేసి వారి చేత రాజీనామా చేయించటం ద్వారా శాసన సభలోని బలాబలాలను తారుమారు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి విరుద్దం. ప్రజాస్వామాన్ని గౌరవించే వారెవ్వరు కూడా ఇలాంటి రాజకీయ కుతంత్రాలకు పాల్పడరు. కాంగ్రెస్ మాదిరిగానే బి.జె.పి. కూడా నీతి,నియమాలకు చెల్లు చీటి రాసేంది. విలువలతో కూడిన రాజకీయాలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో బి.జె.పి. అధినాయకత్వాన్ని పరుషంగా విమర్శించిన జ్యోతిరాధిత్య సిందియాను అక్కున చేర్చుకోవటం ఏమిటి? అతని వర్గానికి చెందిన దాదాపు ఇరవై మంది శాసన సభ్యులను తాము అధికారంలో ఉన్న బెంగళూరుకు తరలించి గొర్రెల మాదిరిగా ఒక హోటల్‌లో పెట్టి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయించటం ద్వారా అధికారంలోకి రావటం ఏమిటి? పదవి, అధికారమే పరమావధి కాబట్టే ఇలాంటి రాజకీయ కుతంత్రాలను బి.జె.పి. అధినాయకత్వం సునాయసంగా చేయగలుగుతోంది. ప్రజాస్వామ్య విలువల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ప్రత్యర్తి పార్టీల శాసన సభ్యులను ప్రలోభానికి గురి చేసి రాజీనామా చేయించటం ద్వారా అధికారంలోకి రారు. అయితే ప్రత్యర్థులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించనప్పుడు తామెందుకు గౌరవించాలన్నది బి.జె.పి. నాయకుల ఆలోచన కావచ్చు.

కె.కైలాష్ 98115 73262