ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అవినీతి అంటే.. రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యా దవ్, కాంగ్రెస్ నాయకుడు కార్తి చిదంబరం నివాసాలపై ఇటీవల సిబిఐ జరిపిన దాడులు మరోసారి రాజకీయ నాయకుల అవినీతిపై చర్చకు తెరలేపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకోసమే తమపై దాడులు చేయిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, లాలూ ప్రసాద్ ఆరోపించి అందరినీ విస్మయపరిచారు. ప్రజల అభివృద్ధికి అంకితం కావాల్సిన రాజకీయ వ్యవస్థ అవినీతికి మారుపేరుగా మారింది. ప్రస్తుతం సిబిఐ, ఇడి దర్యాప్తులను ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల వివరాలు పరిశీలిస్తే మన రాజకీయం ఏ మేరకు అవినీతి మయంగా మారిందనేది అర్థం అవుతుంది. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులపై సిబిఐ, ఈడి కేసులు నడుస్తున్నాయి. ఐదుగురు లోక్‌సభ సభ్యులు, అదే సంఖ్యలో శాసన సభ్యులు ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌ తాలా జైలు జీవితం గడుపుతూ గత వారమే పనె్నండో తరగతి పాస్ అయ్యాడు. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ కర్నాటక జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. అదే రాష్ట్రానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడిని ఇడి త్వరలోనే అరెస్టు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, బిహార్ మాజీ సిఎం, ఆర్‌జెడి పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్ చవాన్, గోవా మాజీ సిఎం కామత్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుధీప్ బందోపాధ్యాయ సహా ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలట్, అస్సాంలో బిజెపి మంత్రి హిమంత బిస్వాస్ శర్మతోపాటు దాదాపు నలభై మంది నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి.
దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇదివరకే దర్యాప్తు ముగిసి శిక్ష అనుభవించిన వారు, అనుభవిస్తున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య ఆందోళనకరంగానే ఉంటుంది. రాజకీయాల్లో ‘దొరికితే దొంగ, దొరకనంత వరకూ దొర’గానే నేతలు చెలామణి అవుతున్నారు. చిదంబరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు కార్తి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడన్నది ఆరోపణ. ఒక మీడియా సంస్థ విదేశాల నుండి నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యక్ష పెట్టుబడిని తెచ్చుకోవటంతోపాటు అనుమతించని రంగాల్లోకి ఆ పెట్టుబడులను తరలించిందన్నది కార్తిపై ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలు రుజువైతే ఈ వ్యవహారంలో నిందితులందరికీ శిక్షలు పడడం ఖాయం. సిబిఐ, ఎన్‌పోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు చిదంబరం, ఆయన కుమారుడి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తోంది. చెన్నై, హైదరాబాదు, గుర్గావ్ సహా పలు ప్రాంతాల్లో చేసిన దాడుల్లో కార్తి చిదంబరం అవినీతికి సంబంధించిన పలు ఆధారాలను సిబిఐ సేకరించిందనే మాట వినిపిస్తోంది. కార్తి చిదంబరంపై ఆరోపణలు రుజువు కావటం అంటే చిదంబరంపై కూడా నేరం రుజువైనట్లే. చిదంబరం అధికారాన్ని అడ్డం పెట్టుకునే కార్తి అవినీతికి పాల్పడ్డారన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ.
తమిళనాడులో జయలలిత అక్రమంగా సంపాదించిన ఆస్తిపాస్తులను ఎవరెవరు తన్నుకుపోయారనేది ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. జయలలిత అక్రమాలకు పాల్పడకుండా కేవలం ప్రజాసేవపై దృష్టి సారిస్తే తమిళనాడులోని బడుగు,బలహీన వర్గాలు, సమాజంలో అట్టడుగున ఉన్న సామాన్య ప్రజలకు కొంతైనా మేలు జరిగేది. జయలలిత అక్రమ సంపాదనను ఇపుడు ఎవరెవరో అనుభవిస్తుంటే, ఆమె నెచ్చెలి శశికళ ప్రస్తుతం కర్నాటక జైల్లో కాలక్షేపం చేస్తోంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువ నాయకుడు అక్రమ సంపాదన మూలంగా ఎలాంటి కష్టాలకు గురి అవుతున్నాడనేది అందరికి తెలిసిందే.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన స్వంత పార్టీకి చెందిన శాసన సభ్యులు, నాయకులు చేస్తున్న ఆరోపణలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నల్లడబ్బును తెల్లధనంగా మార్చుకునేందుకు కేజ్రీవాల్ దాదాపు ఇరవై డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారని మొన్నటి వరకు ఆయన మంత్రివర్గంలో పని చేసిన కపిల్ మిశ్రా బాహాటంగా ఆరోపించారు. ఆయన అంతటితో ఆగకుండా కేజ్రీవాల్ అవినీతికి సంబందించి తన వద్ద ఉన్న సమాచారాన్ని సిబిఐకి అందజేసి దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. నాలుగు డొల్ల కంపెనీలు అర్ధరాత్రి సమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ ఖాతాలోకి రెండు కోట్ల రూపాయలను బదిలీ చేయటం చూస్తుంటే రాజకీయ పార్టీలు, నాయకులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నదీ అర్థం అవుతుంది.
కేవలం అరవింద్ కేజ్రీవాలే కాదు.. చిన్నాచితక పదవిలో ఉన్న చాలామంది నేతలు డొల్ల కంపెనీలను నడుపుతున్నారనేది పచ్చి నిజం. ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు ఈ కేసులో ఈ ఇద్దరికీ ఊరట కలిగించేందుకు నిరాకరించింది. కాంగ్రెస్ నాయకులు నేషనల్ హెరాల్డ్ కేసులో ఆదాయం పన్ను శాఖ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిందేనని స్పష్టం చేసింది. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుధీప్ బందోపాధ్యాయ, ఆ పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీల అవినీతి వ్యవహారం అత్యంత హేయమైంది. పశ్చిమ బెంగాల్‌లో సగటు మనుషుల ఆదాయాన్ని కొల్లగొట్టిన శారద చిట్‌ఫండ్ సంస్థను కాపాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిగ్గు లేకుండా ప్రయత్నించి చివరకు జైలు పాలయ్యారు. బందోపాధ్యాయతోపాటు నలుగురు ఎంపీలు ప్రస్తుతం ఊచలు లెక్కపెడుతున్నారు.
అత్యంత అనుభవజుడు, మంచి పార్లమెంటేరియన్‌గా పెరుతెచ్చుకున్న మాజీ కేంద్ర మంత్రి సౌగత్‌రాయ్ సైతం అవినీతికి తలవంచటం చూస్తుంటే మన రాజకీయ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందనేది అర్థం అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ను సిబిఐ ఇప్పటికి పలుమార్లు ఇంటరాగేట్ చేసింది, ఒక ఇంటరాగేషన్ దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగటం నేరం తీవ్రతకు అద్దం పడుతోంది. వీరభద్ర సింగ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడరన్నది సిబిఐ ఆరోపణ. రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలట్‌లు అంబులెన్స్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ కేసులో అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్‌తోపాటు కార్తి చిదంబరం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వాయిలార్ రవి కుమారుడు రవి కృష్ణ కూడా నిందితులే. 108 అంబులెన్స్ సేవల నిర్వహణ బాధ్యతను ఒక సంస్థకు అప్పగించే విషయంలో వీరంతా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సిబిఐ ఈ కేసులో వీరందరిపైనా చార్జిషీట్ దాఖలు చేయటం గమనార్హం. అంబులెన్స్‌ల నిర్వహణకు అత్యధిక రేట్లు కోట్ చేసిన సంస్థకు ఈ సేవలను అందజేసేందుకు అశోక్ గెహ్లోట్ తదితరులు నిబంధనలను తుంగలో తొక్కారని సిబిఐ, ఈడి ఆరోపించాయి. రాజకీయం, అవినీతి పరస్పర పూరకాలుగా తయారు కావటం అత్యంత ప్రమాదకరమైన పరిణామం.
*