ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘రాఫెల్’ జపంతో రాహుల్ ఒంటరి పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం ‘బోఫోర్స్ అవతారం’ ఎత్తుతోందా? 1989లో తన తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని బోఫోర్స్ పేరుతో ఓడించిన భాజపా, ఇతర పార్టీలపై ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘రాఫెల్’ పేరిట పగ తీర్చుకుంటున్నారా? దాదాపు 29 ఏళ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ- ‘బోఫోర్స్’ కుంభకోణం పేరుతో ప్రతిపక్షాలు చేసిన ప్రచారం వల్ల ఓడిపోవటం తెలిసిందే. స్వీడన్ నుండి బోఫోర్స్ శతఘు్నలు కొనుగోలు చేయడంలో రాజీవ్‌కు ముడుపులు అందాయని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఆ ఆరోపణల దాడికి రాజీవ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై వీపీ సింగ్ నాయకత్వంలో విపక్ష కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు సైతం బోఫోర్స్ శతఘు్నలను ‘తుప్పు పట్టిన తుపాకుల’ని ఎద్దేవా చేశారు. వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో- పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో మన సైనికులు బోఫోర్స్ శతఘు్నలను ఉపయోగించి శత్రుదేశానికి గట్టిగా బుద్ధి చెప్పారు.
దశాబ్దాలు గడిచినా బోఫోర్స్ కుంభకోణం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. రాజీవ్ కుటుంబంపై అప్పట్లో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ఈ నాటికీ రుజువు కాలేదు. అప్పటి విపక్షాల బాటలోనే- ఇపుడు రాహుల్ గాంధీ రాఫెల్ కుంభకోణంపై విమర్శలు సంధిస్తూ మోదీ సర్కారును మట్టికరిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ‘బోఫోర్స్’పై అప్పట్లో విపక్షాలన్నీ ఏకతాటిపై నడిచాయి. కొన్ని ఆంగ్ల పత్రికలు కాంగ్రెస్‌పై కక్ష కట్టినట్లు దేశ విదేశాల్లో దర్యాప్తు జరిపి కథనాలు రాశాయి. ఇప్పుడు రాహుల్ మాత్రమే రాఫెల్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మోదీ అవినీతిపరుడని ఆరోపణలు చేస్తూ, వ్యూహం ప్రకారం దాడి చేస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను స్వదేశంలో తయారు చేసే కాంట్రాక్టును ఏకపక్షంగా రిలయన్స్ సంస్థకు ఇప్పించారంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 30 వేల కోట్ల రూపాయలను- నష్టాల్లో ఉన్న రిలయన్స్ అధినేత అనిల్ అం బానీ జేబులో మోదీ పెట్టారంటూ రాహుల్ విరుచుకుపడుతున్నారు.
గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్ నుండి యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనపై చర్చలు జరుపుతున్న సమయంలోనే దస్సాల్ట్ సంస్థ 2012లోనే రిలయన్స్ రక్షణ ఉత్పత్తుల సంస్థతో ఒప్పందం చేసుకుంది. యుద్ధ విమానాల ధర వెల్లడి కాకుండా చూసేందుకు రెండు దేశాల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని మోదీ ప్రభుత్వం చెబుతుండగా, ఇందులో ఎలాంటి నిజం లేదని రాహుల్ వాదిస్తున్నారు. మోదీ ప్రభుత్వం వత్తిడి వల్లనే దస్సాల్ట్ సంస్థ అంబానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ తనకు చెప్పారంటూ రాహుల్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఆ ఒప్పందంలో రిలయన్స్ ఉండాల్సిందేనని దస్సాల్ట్ సంస్థ సీనియర్ అధికారి చెప్పారంటూ రాహుల్ చేసిన మరో ఆరోపణ కూడా పరిశీలనకు నిలవకుండా పోయింది. దేశానికి కాపలాదారుగా వ్యవహరించకుండా ప్రధాని మోదీ బడా పారిశ్రామికవేత్తలకు అండగా ఉన్నారని రాహుల్ పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు.
మోదీ పరువు తీసేందుకు రాఫెల్ కుంభకోణం సరైన ఆయుధమని రాహుల్ భావిస్తున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ సిబ్బందితో చర్చలు జరిపి ఆయన కొత్త తరహా రాజకీయానికి నాంది పలికారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు ఆయన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులు కోవటం లేదు. మోదీపై ఆరోపణలు,విమర్శలతో రాహుల్ దాడి చేయని రోజంటూ లేకుండాపోయింది. ఈ విషయంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవటంలో ఆయన విజయం సాధించారు. మొదట్లో సామాజిక మాధ్యమాలను మోదీ విరివిగా ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ఆ విషయంలో రాహుల్, ఆయన సన్నిహితులు ముందంజలో ఉన్నారు. రాహుల్ దూకుడు భాజపాను కలవరంలో పడవేసిందని చెప్పకతప్పదు. రాఫెల్‌పై కొత్త కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎన్డీఏ నేతలు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నారనే అభిప్రాయాన్ని దేశ వ్యాప్తంగా కలిగించటంలో రాహుల్ కొంతవరకు విజయం సాధించారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని దెబ్బ తీయాలనే గట్టి పట్టుదలతో రాహుల్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తనను విదూషకుడిగా భాజపా అభివర్ణిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒక విధంగా మోదీపై రాహుల్ ఒంటరిపోరు కొనసాగిస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి రాఫెల్ విషయంలో రాహుల్‌కు మద్దతు ఇవ్వడం లేదు. బోఫోర్స్ విషయంలో అప్పట్లో ప్రతిపక్షాలన్నీ ఐకమైనట్లు ఇప్పుడు రాఫెల్‌పై విపక్షాలు ఒకే స్వరం వినిపించడం లేదు. మోదీ చిత్తశుద్ధిని అనుమానించలేమని పవార్ అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా రాఫెల్ కుంభకోణంపై సమరభేరి మోగిస్తే దేశం ఈ పాటికి అట్టుడికిపోయేది. మోదీపై సమష్టి పోరాటానికి వామపక్షాలు ఆసక్తి చూపడం లేదు. ప్రతిపక్షాలను కూడగట్టటంలో రాహుల్ విజయం సాధించలేకపోతున్నారు. ప్రతిపక్షాలతో కలిసి మోదీపై యుద్ధం చేయాలన్న ఆలోచన రాహుల్‌కి ఉన్నట్లు కనిపించటం లేదు. దీంతో- రాఫెల్‌ను మరో బోఫోర్స్‌గా మార్చి మోదీని ఆయన ఒడించగలుగుతారా? అనే అనుమానం కలుగుతోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు మహా కూటమిని ఏర్పాటు చేయటంలో రాహుల్ విఫలమయ్యారు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చే సూచనలు కనిపించటం లేదు. బోఫోర్స్‌ను అడ్డం పెట్టుకుని రాజీవ్ గాంధీని ఓడించిన ప్రతిపక్షాలు తాము అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆ కుంభకోణాన్ని ఛేదించలేదు. ఇప్పుడు మోదీపై ఆరోపణలు చేస్తున్న రాహుల్- ఒకవేళ అధికార పగ్గాలు చేపట్టినా రాఫెల్ కుంభకోణంలో నిజానిజాలను వెలుగులోకి తెస్తారనే గ్యారంటీ లేదు.