ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

లోపభూయిష్ట రిజర్వేషన్ల విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి ఇస్తున్న రిజర్వేషన్లు, తాజాగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వారికి ఇస్తున్న రిజర్వేషన్లు ఓట్లు దండుకునే మంత్రాంగంగా మారటం శోచనీయం. రాజకీయ నాయకులు తమ పదవులను పదిలం చేసుకునేందుకు రిజర్వేషన్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఆయా సామాజిక వర్గాల సర్వతోముఖాభివృద్దికి ఉపయోగించటం లేదు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరుగుతున్నాయా? లేదా? అనేది ఏరోజూ సమీక్షించలేదు. రిజర్వేషన్ల విధానం లోపభూయిష్టంగా మారినా దీనిని సంస్కరించే ధైర్యం మన పాలకులు చూపించలేకపోతున్నారు. రిజర్వేషన్ల విధానం రాజకీయ పార్టీలకు ఓట్లు తెచ్చిపెట్టే సాధనాలుగా మారాయి తప్ప సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాల అభ్యున్నతికి ఆశించిన స్థాయిలో తోడ్పడటం లేదు. రిజర్వేషన్ల మూలంగా బాగుపడిన వాడే బాగుపడుతున్నాడు తప్ప నిజంగా అవసరమున్న వాడికి పెద్దగా మేలు కలగటం లేదు. ఓటు బ్యాంకు రాజకీయానికి అలవాటుపడిన మన నాయకులు తమ పదవీ రాజకీయాల కోసం మరింత మందిని రిజర్వేషన్ల పరిధిలోకి తెస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందు, సిక్కు, జైన, బౌద్ద, ఇస్లాం మతాలని అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడి ఉన్న లేదా బీద ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న వర్గాల ప్రజలకు 27 శాతం, ఎస్.సిలకు 12 శాతం, ఎస్.టిలకు ఏడు శాతం రిజర్వేషన్లకు తోడుగా ఇప్పుడు ఆగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీని వలన మొత్తం రిజర్వేషన్ల శాతం అరవైకి చేరుకున్నది. మిగతా నలభై శాతం అన్ని వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేటాయిస్తారు.
రాజ్యాంగ నిర్మాతలు విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే ఉద్యోగాలు, ఉన్నత విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే రాజ్యాంగంలోని పదిహేనవ ఆర్టికల్‌లో విద్యాపరంగా వెనుకబడి ఉన్న వారికి రిజర్వేషన్లు కల్పించాలని పొందుపరిస్తే 16వ ఆర్టికల్‌లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని పొందుపరిచారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత వర్గాలలోని బీద ప్రజలకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నందుకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టివేయకుండా చూసేందుకు రాజ్యాంగంలోని 15,16 ఆర్టికల్‌లను సవరించి అందులో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న వారితోపాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కల్పించారు. సుప్రీం కోర్టు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా తమ తీర్పులు ఇస్తుంది కాబట్టే నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న పది శాతం రిజర్వేషన్లను కొట్టివేయదని బి.జె.పి నాయకులు వాదిస్తున్నారు. మన పాలకులు గత డెబ్బై సంవత్సరాల పాలనలో వెనుకబడిన వర్గాలు, ఎస్.సి, ఎస్.టి లను ఉన్నత స్థాయికి తీసుకురాలేక పోయారు కానీ ఉన్నత వర్గాలలోని పది శాతం జనాభాను వెనుకబడిన వర్గాలుగా మార్చివేసిన ఘనత సాధించారు. ఇది సిగ్గు చేటు కాదా. సమాజంలోని ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి వెళ్లాలి తప్ప కింది స్థాయికి జారి పోకూడదు. మన దేశంలో ఇందుకు భిన్నంగా జరుగుతోందనేందుకు ఉన్నత వర్గాలలోని బీద వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించటమే నిదర్శనం. ప్రజలు ఏ వర్గానికి చెందినవారైనా రిజర్వేషన్ల ఊతంతో కాకుండా స్వశక్తితో ముందుకు సాగగలిగినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు అవుతుంది. రిజర్వేషన్ల మద్దతు ఉన్న వారు అభివృద్ధి చెందకపోవటం ఒక ఎతె్తైతే ఉన్నత వర్గాల వారికి కూడా రిజర్వేషన్ల అవసరం ఏర్పడటం అంటే మనం పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా? ఉన్నత వర్గాల వారు సైతం రిజర్వేషన్ల సహాయం తీసుకోవలసి రావటం మన పాలకుల అసమర్థత పాలనకు అద్దం పడుతోంది. మన దేశం జనాభా దాదాపుగా 132 కోట్లు కాగా ఇందులో దాదాపు డెబ్బై శాతం మంది బి.సి, ఎస్.సి, ఎస్.టిలుంటే ముప్పై శాతం మంది ఉన్నత వర్గాల వారున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మొత్తం ఉద్యోగాల సంఖ్య దాదాపుగా రెండు కోట్ల ఇరవై లక్షలు. ఇందులో సైనిక దళాల, ఇతర భద్రతా దళాల ఉద్యోగాలు లేవు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ముప్పై రెండు లక్షలైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఉద్యోగాల సంఖ్య దాదాపు ఒక కోటి డెబ్బై లక్షలు. ఈ మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత వర్గాల వారి సంఖ్యే అధికమనే ఒక వాదన. ఎందుకంటే మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రావటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పేందుకు అంగీకరించటం లేదు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలకులందరు దాదాపుగా ఉన్నత వర్గాల వారే. గవర్నర్లు, ఇతర ఉన్నత పదవులను పరిశీలించినా ఉన్నత వర్గాల వారే అధికంగా కనిపిస్తారు. ఇక న్యాయ వ్యవస్థలో దాదాపు తొంభై శాతం పదవులు ఉన్నత వర్గాల వారి ఆధీనంలో ఉన్నాయి. అందుకే న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలని లోకజనశక్తిపార్టీ అధినాయకుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గాల్లో ఏ కులం వారు ఎక్కడెక్కడ ఉన్నారనేది పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యమైన మంత్రి పదవులు, ముఖ్యమైన శాఖలన్నీ ఉన్నత వర్గాల వారికే ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల వ్యవహారం పరిశీలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. దేశంలోని అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, నిర్మాణ రంగాలు ఉన్నత వర్గాల వారివే. విద్యా రంగం, సినిమా రంగం, భవన నిర్మాణ రంగం, ఇలా ప్రతి రంగం ఉన్నత వర్గాల వారి చేతుల్లో ఉండటంతోపాటు అందులోని ఉద్యోగాలు కూడా ఉన్నత వర్గాల వారికే అందుతున్నాయి. ఉన్నత వర్గాల్లో విద్యావంతుల సంఖ్య అధికం కావటం వల్లనే ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మెజారిటీ ఉన్నత పదవుల్లో ఉన్న అగ్రవర్ణాల వారిలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారున్నప్పుడు ఇక బి.సి, ఎస్.సి. ఎస్.టిలు ఎలాంటి దుర్భర పరిస్థితులో ఉన్నారనేది సులభంగానే అంచనా వేయవచ్చు. బి.సి, ఎస్.సి. ఎస్.టి వర్గాల వారు ఇటీవల బాగా చదువుతూండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పోటీ పెరిగిపోయింది. ఒక వైపు బి.సి, ఎస్.సి, ఎస్.టికి చెందిన విద్యావంతులు పెరిగిపోవటం, దీనికి రిజర్వేషన్లు తోడు కావటంతో ఈ వర్గాలకు చెందిన వారు ఉన్నత విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల వారికి పోటీ ఇవ్వటం వలన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విద్యా రంగంలో ముందుకు వెళితే తప్ప మనకు భవిష్యత్తు లేదని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న వెనుకబడిన కులాల వారు తమ పిల్లలను కష్టపడైనా చదివిస్తున్నారు. దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల్లో విద్యావంతుల సంఖ్య పెరిగే కొద్ది ఉద్యోగాలు, ఇతర రంగంల్లో పోటీ పెరిగిపోయి సమాజంలో అనూహ్యమైన మార్పులు రావటం ఖాయం. వెనుకబడిన కులాల వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించటం అనేది రికార్డులకు మాత్రమే పరిమితమై పోయింది. వాస్తవానికి బి.సిలకు ఏడెనిమిది శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ల సౌకర్యం లభించటం లేదు. ఇక ఎస్.సి, ఎస్.టిల్లో రిజర్వేషన్ల అమలు అత్యంత గందరగోళంగా ఉన్నది. ఎస్.సి, ఎస్.టిలో రిజర్వేషన్ల మూలంగా ఉన్నత పదవులు సంపాదించుకున్న వారి పిల్లలే రిజర్వేషన్ల సౌకర్యం పొందుతున్నారు. అట్టడుగున ఉన్న ఎస్.సి, ఎస్.టి వర్గాల ప్రజల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఎస్.సి, ఎస్.టి ఏ.ఐ.ఎస్ అధికారుల పిల్లలకు కూడా రిజర్వేషన్ల సౌకర్యం కల్పించటం ఏ విధంగా సమర్థనీయం. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల విషయంలో అస్తవ్యస్థ విధానాలను అవలంభిస్తున్నాయి. రాజకీయ పార్టీలు బి.సి, ఎస్.సి, ఎస్.టి, ఓ.సిలలోని బీద ప్రజల ఓట్లను ఆశిస్తున్నాయి తప్ప వారి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేయటం లేదు. రిజర్వేషన్ల ఫలితాల గురించి జాతీయ స్థాయిలో లోతైన సమీక్ష జరగాలి. చిత్తశుద్ధితో సమీక్ష జరిపి దీనిలోని లోపాలు, తప్పులను సరిదిద్దేందుకు ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. రాజకీయాధికారంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం లభించనంత వరకు వారి అభివృద్ది, అభ్యున్నత అసాధ్యం. వడ్డించే వాడు మన వాడు కాబట్టే సమాజంలోని కొన్ని వర్గాల వారు మాత్రమే అభివృద్ది చెందుతూ అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. రాజ్యాధికారం అన్ని వర్గాల వారికి లభించినప్పుడే సమసమాజ స్థాపన సాధ్యం అవుతుంది.

- కె. కైలాష్, 9811573262