ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షాల ఐక్యత ఎండమావేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్డీఏ మిత్రపక్షమైన ఎల్‌జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ప్రతిపక్షాల సమైక్యతను నారింజ పండుతో పోల్చారు. నారింజ పండు బైటికి ఒకటిగానే కనిపిస్తుంది కానీ, లోపల తొనలన్నీ విడివిడిగానే ఉంటాయి. ప్రతిపక్ష నేతలు పైకి ఒకటిగా కనిపించినా, లోపల ఎవరికి వారేనన్నది ఆయన విమర్శ. పాశ్వాన్ పోలిక కొంతవరకూ నిజమే. వాస్తవానికి ప్రతిపక్షం నారింజ పండు మాదిరి బైటికి ఒకటిగా కనిపించటం లేదు. ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై విపక్ష నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేదు. మమతా బెనర్జీ, మాయావతి వంటి నేతలు ఎవరికి వారే ప్రధాని పదవిని చేపట్టాలనుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుల మధ్య అపనమ్మకం రాజ్యమేలుతోంది. ప్రతిపక్షాల సమైక్యత నారింజ పండులా కాకుండా మేడిపండుగా మారే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత ఆదివారం కోల్‌కతలో నిర్వహించిన భారీ సభకు ఇరవై ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. వీరంతా ఒకటిగా కనిపించేందుకు ప్రయత్నించారే తప్ప ఐక్యత ఎంతమాత్రం లేదు. మమత ఏకపక్ష వైఖరికి నిరసనగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ సభకు హాజరుకాలేదు. విప క్షం సమైక్యతకు భంగం వాటిల్లకుండా లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్విని కోల్‌కత సమావేశానికి రాహుల్ పంపారు. మిగతా విపక్ష నాయకులను పేరుపేరునా పిలిచిన మమత కాంగ్రెస్ నాయకత్వానికి ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. కోల్‌కత సభకు హాజరుకావాలంటూ ఆమె ఒక లేఖను రాహుల్‌కు పంపి చేతులు దులుపుకొన్నారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించాలన్న చిత్తశుద్ధి మమతా బెనర్జీకి ఉంటే- ఆమె తన అహంభావం, మొండితనాన్ని పక్కన పట్టి రాహుల్, సోనియాలను స్వయంగా ఆహ్వానించి ఉండాల్సింది. రాహుల్, సోనియాల ఉదారవైఖరి వల్లనే కోల్‌కత సభ అభాసుకాలేదు. కాంగ్రెస్ అధినాయకత్వానికి మమత మొక్కుబడిగా లేఖ రాసిన సంగతి తెలియగానే తెదేపా అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీకి వచ్చి రాహుల్‌తో చర్చలు జరిపారు. కోల్‌కత సభకు తాను వెళ్లాలా? వద్దా?? అని చంద్రబాబు సంశయిస్తుండగా, ‘విపక్షాల ఐక్యతకు నిదర్శనంగా ఆ సభకు వెళ్లాల’ని రాహుల్ సూచించినట్లు సమాచారం. అందుకే రాహుల్‌ను కలిసిన తర్వాత చంద్రబాబు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఈ ఇద్దరూ మీడియా తో మాట్లాడుతూ కోల్‌కత సభకు వెళ్తున్నట్లు ప్రకటించారు. మమతతో పోల్చితే రాహుల్, చంద్రబాబు, పవార్‌లు ప్రతిపక్షం సమైక్యత విషయంలో బాధ్యతతో వ్యవహరించారు. రాహుల్‌ను ప్రత్యక్షంగా ఆహ్వానించనప్పుడు తామెందుకు కోల్‌కత వెళ్లాలనే ధోరణితో చంద్రబాబు, పవార్ వ్యవహరించి ఉంటే ప్రతిపక్షం సమైక్యత ఈపాటికి ముక్కలైపోయేది. కోల్‌కత సభకు హాజరైన వారిలో ఐదారుగురు విపక్ష నేతలు మాత్రమే జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయగలరు. మోదీని ఓడించేందుకు ఏర్పాటయ్యే ఎలాంటి కూటమి అయినా కాంగ్రెస్ లేకుండా ముందుకు పోతుందా?
రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించేందుకు మమతా బెనర్జీ అంగీకరించడం లేదు. ఆమె దృష్టిలో రాహుల్ అసలు నాయకుడే కాదు. ఆయన విపక్ష కూటమికి నాయకత్వం వహించడం ప్రధాని పదవిని ఆశిస్తున్న మమతకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కోల్‌కత సభకు రాహుల్ హాజరైతే- తన నాయకత్వానికి ముప్పు వస్తుందని ఆమె భయం. ఈ నేపథ్యంలోనే ఆమె కోల్‌కత సభకు రాహుల్‌ను దూరం చేయడం, విపక్షం తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చాక తేల్చాలన్న పాట పాడుతున్నారు. విపక్షాల ఐక్యతకు గండి పడకుండా సోనియా,రాహుల్ గాంధీ హుందాగా, గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అందుకే కోల్‌కత సభ విజయవంతం కావాలంటూ వీరు సందేశాలు పంపారు.
ఎన్నికల అనంతరం ప్రధాని పదవిని చేపట్టేందుకు తనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటే- మమత, మాయావతిల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు రాహుల్ ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారు. రాహుల్ పట్ల మమత వైఖరి ఇలా ఉండగా మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ సీట్ల సర్దుబాట్లపై బిఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ పొత్తు కుదుర్చుకుంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు వీరు సుముఖత చూపించడం లేదు. కాంగ్రెస్‌ను విస్మరించి మాయావతి, అఖిలేశ్ సీట్ల సర్దుబాటుకు వ్యూహరచన చేయడం అంటే రాహుల్‌ను పరోక్షంగా అవమానించినట్టే! మోదీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి పనిచేయాలంటూ నినాదాలిచ్చే మాయావతి, అఖిలేశ్ వంటి నేతలు యూపీలో ఎందుకు ఐక్యత చూపరు? ఈ ఇద్దరి పొత్తు రాజకీయాల పట్ల రాహుల్ ఎలాంటి వ్యా ఖ్యలు చేయలేదు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కూడా కోల్‌కత సభకు హాజరు కాలేదు. ఆమె తరఫున బిఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మిశ్రా పాల్గొన్నారు. మమత నిర్వహించిన సభకు మాయావతి ఎందుకు వెళ్లలేదనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఇద్దరు మహిళా నేతలూ ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. అందుకే 80 లోక్‌సభ సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌లో తన బద్ధ శత్రువైన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో మాయావతి సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. యూపీలో చెరో 38 సీట్లలో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చిన అఖిలేశ్, మాయావతి- కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. విపక్ష పార్టీలకు మెజారిటీ సీట్లు లభిస్తే మాయావతి నాయకత్వాన్ని అఖిలేశ్ బలపరుస్తారు. ఇందుకు బదులుగా భవిష్యత్‌లో అఖిలేశ్ యూపీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు మాయావతి పార్టీ సహకరిస్తుంది. యూపీలో మెజారిటీ సీట్లను వీరు గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర వహించే అవకాశం ఉంది. ఇదే జరిగితే మమతా బెనర్జీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించే అవకాశాలు సన్నగిల్లుతాయి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలనే ఆలోచనతోనే మాయావతి కోల్‌కత సభకు హాజరు కాలేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆ సభకు తాను హాజరైతే మమత నాయకత్వాన్ని బలపరిచినట్టు అవుతుందని మాయావతి అనుమానించారు.
ప్రధాని మోదీ విమర్శలకు తగ్గట్టుగా ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసమే సమైక్యతా రాగాన్ని ఆలపిస్తున్నాయి. ‘మోదీ దుష్టపాలన నుండి దేశా న్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షం యావత్తూ కలిసి పని చేయాలం’టూ ఇతర పార్టీల నాయకులు ఇస్తున్న పిలుపు వెనుక స్వార్థ రాజకీయం తప్ప మరేదీ లేదు. విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నియంతలుగా వ్యవహరిస్తూ, జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించటంతో సమానం. మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి.దేవెగౌడ కోల్‌కత సభలో చెప్పినట్లు ప్రతిపక్షాల మధ్య సీట్ల పంపకం అంత సులభం కాదు. ప్రతిపక్షాల మధ్య సమైక్యత నారింజ పండులా ఉండాలి తప్ప మేడిపండులా కాదు. *

-కె.కైలాష్ 98115 73262