ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఎన్నికల రుతువులో వరాల జల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిసారీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు తాయిలాలు, రాయితీలు ప్రకటించే దుష్ట సంప్రదాయం మన దేశంలో ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరాల జల్లు కురిపించడం వెనుక- ఓట్లు దండుకోవాలనే దురాలోచన తప్ప మరొకటి కనిపించటం లేదు. తమ మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలను అమలు చేయని రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు ఆర్థిక పరమైన వాగ్గానాలు చేస్తూ ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం ఆనవాయితీగా మారింది. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా, అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు పథకాలను ప్రకటిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగైదు నెలల నుండి వరాలను ప్రకటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మోదీ ప్రభుత్వం తాజాగా ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం సీట్లు రిజర్వు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించింది. రిజర్వేషన్లు లేనందున తమకు అన్యాయం జరుగుతోందన్న ఉన్నత వర్గాల వారిని బుజ్జగించేందుకే మోదీ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ల ఎత్తుగడ వేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఎస్సీ, ఎస్టీలకు, గత కొన్ని దశాబ్దాలుగా వెనుకబడిన కులాలకు ఇస్తున్న రిజర్వేషన్లు ఏ మేరకు సక్రమంగా అమలయ్యాయి? రిజర్వేషన్ల మూలంగా ఈ వర్గాల వారు ఏ మేరకు లబ్ధి పొందారు? అనే విషయాలను ప్రభుత్వం ఇంతవరకూ సమీక్షించలేదు. రిజర్వేషన్లు అస్తవ్యస్తంగా అమలవుతున్నాయి. వీటిని శాస్ర్తియ పద్ధతిలో అమలు చేయాలనే ఇంగిత జానాన్ని ఏ ప్రభుత్వాలూ ఎప్పుడూ ప్రదర్శించలేదు. రిజర్వేషన్లను ఆయా వర్గాల అభున్నతికి కాకండా ఓటు బ్యాంకు రాజకీయానికి మాత్రమే పాలకులు ఉపయోగించుకున్నారు. రిజర్వేషన్ల వల్ల సంబంధిత వర్గాలకు న్యాయం జరిగిందా? లేదా? అనేది కాకుండా తమకు ఓట్లు పడ్డాయా? లేదా? అనే ప్రాతిపదికపై రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇంతకాలం పనిచేశాయి. ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కల్పిస్తున్న 10 శాతం రిజర్వేషన్ల విషయంలోనూ ఇదే జరగబోతోంది.
మోదీ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’లో ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు, రైతులకు సాలీనా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం, అసంఘటితరంగ కార్మికులకు పెన్షన్ వంటి తాయిలాలు ప్రకటించింది. ఈ పథకాల వెనక ఉన్న ఏకైక లక్ష్యం ఓటర్లలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే. మోదీ ప్రభుత్వానికి అంతగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఈ విధాన నిర్ణయాలు తీసుకుని అమ లు చేయవలసి ఉంది. కానీ, సార్వత్రిక ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఈ నిర్ణయాలు ప్రకటించటం వెనక రాజకీయం తప్ప మరొటి కనిపించటం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, బడుగు- మధ్య తరగతి వర్గాల ప్రజలందరికీ కనీస ఆర్థిక సహాయం హామీ పథకాన్ని అమలు చేస్తామని ఘనంగా ప్రకటించారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవసరం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సైతం ఇలాంటి వరాల జల్లులే కురిపిస్తున్నారు. తమను గెలిపిస్తే అరచేతిలో స్వర్గం చూపిస్తామని గాలిబుడగల్లాంటి మాటలను ఎర వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పథకాలను ఎందుకు అమలు చేయలేకపోయారనే ప్రశ్నకు వీరి వద్ద సమాధానం ఉండదు. ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలు ఇవ్వడం అలవాటుగా మారింది. ఎలాంటి భయం, సంకోచమనేదే లేకుండా హామీలు ఇస్తున్నారు. ఎందుకిలా జరుగుతోందన్నది అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ‘ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు? అమలు చేయలేని హామీలను ఎందుకు ఇచ్చారు?’ అని ప్రజలు నిలదీయరన్న ధీమాతోనే రాజకీయ నాయకులు, పార్టీలు ఈ విధంగా వ్యవరిస్తున్నారు. జనం నిలదీసి అడగనంత కాలం పాలకులు ఇదే తీరున వ్యవహరిస్తారు. ప్రజలు చదువుకున్న వారు, విద్యావంతులు, జాగృతులైతేనే పరిస్థితిలో ఎంతోకొంత మార్పు వస్తుంది. ఎన్నికలకు ముందు వరాల జల్లు కురిపించే పార్టీలు, నాయకులను నిలదీయటమే కాదు, పాలకులను జనం అసహ్యించుకొనే పరిస్థితులు నెలకొన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.
ఆదాయపు పన్ను పరిమితిని పెంచినందుకు, రాయితీలు ఇచ్చినందుకు ఓట్లు వేయకుండా సమాజానికి అవసరమయ్యే పనులను పాలకులు చేస్తున్నారా? లేదా? అనే పరిశీలన ఆధారంగా ఓట్లు వేసే స్థాయికి ఓటర్లు ఎదగాలి. పోలింగ్‌కు ముందు డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగిపోయి ఓట్లు వేసినంత కాలం దేశం బాగుపడదు. రాజకీయ నాయకులు, పార్టీలు దారికి రావు. ప్రలోభాలకు లొంగిపోయినపుడు నాయకులను నిలదీసే అధికారం ఓటర్లకు ఎలా ఉంటుంది? పార్టీలు, నాయకులు ఓటర్లను ముందే కొనేసుకుంటున్నారు కాబట్టే ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా తమ ప్రయోజనాలను చూసుకుంటున్నాయి తప్ప ప్రజల గురించి ఆలోచించ టం లేదు. ఓటర్లకు ఇదివరకే మేలు చేశాం గనుక వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదనే రీతిలో నా యకులు వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులు యాభై నుండి వంద కోట్ల వరకు ఖర్చు చేసి విజయం సాధించిన వారున్నారు. ఇలా గెలిచిన వారు ప్రజల గురించి ఆలోచిస్తారా? లేక తమ పెట్టుబడిని చక్రవడ్డీతో వసూలు చేసుకోవటంపై దృష్టి సారిస్తారా? 2014 ఎన్నికల్లో గెలిచిన పలువురు ఎంపీలు ఇప్పటికీ తమ పెట్టుబడి మొత్తం చేతికి రాలేదని తపన పడుతున్నారు. భారీగా ధనం ఖర్చు చేసి గెలిచినా లాభం ఉండటం లేదు, తమ సొంత పనులు, వ్యాపారాలకు సంబంధించిన పనులు జరగకపోవటం వల్ల సంపాదన లేకుండాపోయిందని పలువురు ఎంపీలు వాపోతుంటారు. ప్రభుత్వాలను నడిపించటం, ఎన్నికల్లో విజయం సాధించటం అనేది ఒక వ్యాపార వ్యూహంగా మారింది. రాజకీయ పార్టీలు, బడా నాయకులు డబ్బు వెదజల్లి ఓట్లు కొనుక్కోవటం అనే దుష్ట సంప్రదాయం రోజురోజుకూ పాతుకుపోతోంది. ప్రజల నుండి ప్రతిఘటన లేదు కాబట్టే ఈ దుష్ట సంప్రదాయం కొనసాగుతోందనేది పచ్చి నిజం. ఐదు సంవత్సరాల పాటు సమర్థంగా, నిజాయితీగా, నిబద్దతతో పనిచేసే వారికే ప్రజలు ఓట్లు వేయాలి.
నోటుకు వోటు విధానం వల్ల నిజాయితీపరులు, నిబద్ధత గల వారు రాజకీయాలలోకి రావటం లేదు. వచ్చినా ఎన్నికల్లో గెలవలేకపోతున్నారు. నేతల మోసపూరిత విధానాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే స్థాయికి ఎదగాలి. మాట తప్పితే జనం ఆగ్రహిస్తారన్న భయం రాజకీయ పార్టీల్లో రావాలి. ఎన్నికల హామీల పేరుతో వంచన చేసే ప్రజాప్రతినిధులను ఇంటికి పంపేలా చట్టాలు తేవాలి.
*

-కె.కైలాష్ 98115 73262