ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పుల్వామా రాజకీయం మంచిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామిక్ ఉగ్రవాదులు పుల్వామాలో కారుతో ఆత్మాహుతి దాడి చేసి నలభై మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను పొట్టన పెట్టుకున్న సంఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయటం శోచనీయం. రాజకీయ ప్రయోజనాల కోసం పుల్వామా దాడిని అడ్డం పెట్టుకుని అధికార పార్టీని విమర్శించటం వలన ఇస్లామిక్ ఉగ్రవాదులు, వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు ప్రయోజనం కలుగుతుందనే నిప్పులాంటి నిజాన్ని ప్రతిపక్ష నాయకులు గ్రహించటం మంచిది. పుల్వామా దాడి లోకసభ ఎన్నికల్లో బి.జె.పి. దాని మిత్రపక్షాలకు కలిసి వస్తుందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. నలభై మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషె మహమ్మద్, దానిని పోషిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మన సైనిక దళాలు మెరుపుదాడి కంటే పెద్ద చర్యకు పూనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉరిలో పదిహేడు మందిని పొట్టన పెట్టుకున్నందుకు మెరుపుదాడి చేసిన భారత సైన్యం నలభై మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను కారు బాంబు దాడితో చంపినందుకు ప్రతీకారం మెరుపుదాడి కంటే పెద్దగానే ఉంటుంది. అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత సైన్యం పెద్ద చర్యకు పూనుకునే అవకాశం ఉన్నది, రెండు దేశాల మధ్య పరిస్థితి భయంకరంగా ఉన్నదని చెప్పటం గమనార్హం. ఈ దాడి వలన కూడా నరేంద్ర మోదీతో పాటు ఆయన నాయకత్వంలోని ఎన్.డి.ఏ.కు లోకసభ ఎన్నికల్లో కలిసి వస్తుందనేది ప్రతిపక్షాల భయం. పుల్వామాకు ప్రతీకారం తీర్చుకునే దాడిలో సైనిక దళాలు అఖండ విజయం సాధిస్తే దాని ప్రభావం తప్పకుండా లోకసభ ఎన్నికలపై ఉంటుంది, బి.జె.పి.కి కలిసి వస్తుంది. దేశంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటన ఎవరికో ఒకరికి, ఏదో ఒక పార్టీకి కలిసి రావటం అత్యంత సహజం. అందుకే పుల్వామా దాడికి ప్రతీకారంగా జరిగే దాడి నరేంద్ర మోదీకి కలిసి రావచ్చు. అంత మాత్రాన పుల్వామా సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నించటం సమర్థనీయం కాదు. ఇస్లామిక్ జైషె మహమ్మద్ ఉగ్రవాద చర్యకు పాల్పడుతుందనేది ముందే పసిగట్టటంలో ఎన్.డి.ఏ. ప్రభుత్వం విఫలమైంది కాబట్టి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని ప్రతిపక్షానికి చెందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు డిమాండ్ చేయటం అర్థరహితం. ఇస్లామిక్ ఉగ్రవాదులు సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్షాలు కలిసి పని చేయాలి తప్ప ఇలా అధికార పక్షాన్ని తప్పుపట్టటం మంచిది కాదు. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌కు, జైషె మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు గట్టిగా బుద్ధి చెప్పటం వలన భారతదేశానికి లాభం కలుగుతుంది, దేశం ప్రతిష్ట పెరుగుతుంది, భారతదేశం తనను తాను కాపాడుకోగలుగుతుంది, అవసరమైతే శతృవులకు గట్టిగా గుణపాఠం నేర్పటమే కాదు అంతమొంతించగలదనే సందేశాన్ని పంపించగలుగుతుంది. పా కిస్తాన్‌కు గుణపాఠం నేర్పించే విషయంలో ప్రతిపక్షాలు అధికార పక్షానికి అండగా నిలబడాలి. ప్రతిపక్షాలు తమ బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించాలి తప్ప పుల్వామా సంఘటన జరిగి వీర జవాన్లు మరణిస్తుంటే నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఎన్నికల డాక్యుమెంటరీ షూటింగ్‌లో ఉన్నాడంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటం ఎంత మాత్రం తగదు. జైషె మహమ్మద్ లాంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను పెంచి, పోషిస్తూ అనునిత్యం మనపై పరోక్ష యుద్ధం కొనసాగిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలా? వద్దా? పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని భావించే పక్షంలో ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ఎన్నికల సమయం కాబట్టి ప్రభుత్వ విధానాలు, పథకాలను విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు పూర్తిగా ఉంటుంది. ఎన్.డి. ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల్లో ఏం సాధించింది, ఏం సాధించలేదనే అంశంపై ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను ప్రజలకు వివరించటంలో ఎలాంటి తప్పు లేదు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపించటం ప్రతిపక్షాల ప్రధాన బాధ్యత కూడా. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపించటం ద్వారా ప్రజల మద్దతు, విశ్వాసాన్ని కూడగట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాలి కానీ ఇలా పుల్వామా సంఘటనను మాత్రం రాజకీయం చేయకూడదు. పుల్వామా దాడి విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎంత విమర్శిస్తే అంత లాభం శతృదేశానికి, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు చేకూరుతుంది. శతృవులను ఎదుర్కొనటంలో భారతదేశం ముఖ్యంగా రాజకీయ పార్టీలు సమైక్యంగా లేవనే సందేశం బైటికి వెళుతుంది. ఇది దేశ ప్రయోజనాలకు ఎంత మాత్రం మంచి కాదు. రాజకీయాలు ఎలా ఉన్నా దేశ రక్షణ విషయంలో అధికార, ప్రతిపక్షాలు సమైక్యంగా పనిచేస్తాయి, కలిసి వ్యవహరిస్తాయనే సందేశం వెళ్లటం వలన శతృదేశాలు దాడి చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయనేది గ్రహించాలి. పుల్వామా దాడి విషయంలో పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీలు, మీడియా ఎలా స్పందించిందనేది పరిశీలిస్తే మనం ఏం తప్ప చేస్తున్నామనేది ప్రతిపక్షానికి కొంతైనా అర్థం అవుతుంది. పుల్వామా దాడికి పాకిస్తాన్ రాజకీయ పార్టీలు, మీడియా పూర్తి భిన్నమైన పద్ధతిలో స్పందించాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మాహుతి దళాన్ని పాకిస్తాన్ మీడియా, రాజకీయ పార్టీలు స్వాతంత్య్ర పోరాటయోధుడుగా చిత్రీకరించాయి, దాడి కుట్ర చేసిన జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థను కాశ్మీర్ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్న గొప్ప సంస్థగా ముద్ర వేశాయి. కాశ్మీర్ స్వాతంత్య్ర సమరయోధుడు చేసిన దాడిలో శతృదేశమైన భారతదేశానికి చెందిన నలభై మంది సైనికులు హతమయ్యారంటూ పాకిస్తాన్ పత్రికలు పెద్ద ఎత్తున వార్తలు రాశాయి. పాకిస్తాన్ టి.వి. చర్చల్లో కూడా ఇదే అంశాన్ని కొండంతలు చేసి చూపించాయి.
ఇక పాకిస్తాన్ రాజకీయ పార్టీల ప్రకటనల గురించి చెప్పనక్కర లేదు. పాకిస్తాన్‌కు చెందిన అన్ని రాజకీయ పార్టీలు కూడా పుల్వామా కారుబాంబు దాడిని సమర్థించాయి. స్వాతంత్య్రం కోసం కాశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే భారత సైన్యం వారిని దురాక్రమణతో అణిచివేస్తోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కురిపించాయి. ఇక మన మీడియా పరిస్థితికి వస్తే కొన్ని మీడియా సంస్థలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే మిగతా మీడియా సంస్థలు ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యవహరించటం ద్వారా వాస్తవాలను మరుగుపరిచాయి. మన ప్రతిపక్ష నాయకులు కేవలం ఐదు రోజుల పాటు పుల్వామా దాడిపై ఎలాంటి ప్రకటనలు చేయకుండా వౌనం వహించాయి. ఆరో రోజు ఎన్.డి.ఏ. ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు, విమర్శలు గుప్పించటం ప్రారంభించాయి. ఎన్.డి.ఏ. ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఫల్యం వల్లనే పుల్వామా దాడి జరిగిందంటూ రాజకీయం చేయటం ప్రారంభించాయి. పుల్వామా దాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనను పరోక్షంగా సమర్థించే విధంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించటం సిగ్గు చేటు. పుల్వామా దాడిని ముందే పసిగట్టటంలో మన నిఘా సంస్థలు విఫలమయ్యాయనేది ఇప్పుడు చర్చించవలసిన విషయమా? నిఘా సంస్థల వైఫల్యం గురించి చర్చించాలంటే ప్రభుత్వంతో మాట్లాడాలి తప్ప ఇలా బహిరంగంగా పత్రికా ప్రకటనలు చేయటం ప్రతిపక్షానికి భావ్యం కాదు. పుల్వామా సంఘటన జరిగి రెండు వారాలు కావస్తున్నా జైషె మహమ్మద్‌కు ముఖ్యంగా పాకిస్తాన్‌కు ఎందుకు బుద్ధి చెప్పలేదనే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉన్నది. ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది? ఏం చేయబోతోంది అనేది ప్రతిపక్షం నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వ పోరాటం కాశ్మీర్ కోసమే తప్ప కాశ్మీర్‌కు వ్యతిరేకంగా లేదా కాశ్మీరీలపై కాదు. కాశ్మీర్ భారతదేశంలోని అంతర్భాగం. దీని పరిరక్షణ గురించి అధికార పార్టీకి ఉన్నత బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుంది. ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వం లొసుగులపై దృష్టి సారించే బదులు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పటం, అందుకు అనుసరిస్తున్న విధానాలపై దృష్టి సారించాలి. దేశానికి సంబంధించిన విషయంలో ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తే ప్రజలు క్షమించరు. ఇస్లామిక్ ఉగ్రవాదం గురించి మాట్లాడితే మైనారిటీ ఓట్లు లభించవనే ఆలోచనతో ప్రతిపక్షాలు వ్యవహరించటం దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు.

- కె. కైలాష్, 9811573262