ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

దాడులు చేయాలి.. దడ పుట్టించాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్వామాలో ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహమ్మద్ స్థావరంపై మెరుపు దాడులు చేయించటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ పరువుప్రతిష్టలను ఇనుమడింపజేశారు. ప్రపంచం దృష్టిలో మన గౌరవ మర్యాదలను మరింతగా పెంచారు. వ్యూహాత్మకంగా చేసిన వైమానిక దాడి ద్వారా పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పారు. పాకిస్తాన్‌ను అన్ని విధాలా ఆదుకుంటున్న చైనాకు సైతం స్పష్టమైన సందేశం పంపించడంలో మోదీ విజయం సాధించారు. పాకిస్తాన్‌పై బిగించిన ఈ పట్టును కేంద్ర ప్రభుత్వం ఇక ఏ పరిస్థితిలోనూ సడలించకూడదు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పోషిస్తే ఇలాంటి దాడులు తప్పవని పాకిస్తాన్‌కు స్పష్టం చేయాలి. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహమ్మద్, లష్కరే తయ్యబా, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలో చిన్న దాడికి పాల్పడినా వాటితోపాటు పాక్‌ను కూడా శిక్షించాలి. కేంద్రం ఏ మాత్రం పట్టు సడలించినా- అది మన బలహీనత మాత్రమే కాదు, ఉగ్రవాద సంస్థల దాడుల పరంపర పెరిగే ప్రమాదం ఉంది.
గతంలో కేంద్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల ఫలితంగా ఇస్లామిక్ ఉగ్రవాదులకు భయం లేకుండాపోయింది. ఉగ్రవాదులను రెచ్చగొడుతున్న పాక్ వారిని పరోక్ష యుద్ధానికి వాడుకుంటోంది. అంతర్జాతీయ స్మగ్లర్, ఉగ్రవాదుల పోషకుడైన దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో గతంలో ముంబయిలో బాంబుదాడులు జరిగినపుడే- పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పాల్సి ఉంది. ముంబయి మహానగరంలో పనె్నండు చోట్ల కాల్పులు జరిపి, బాంబులు వేసి మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నందుకు భారత్ ప్రతీకారం తీర్చుకుని ఉంటే- ఇస్లామిక్ ఉగ్రవాదులు కొంతైనా దారికి వచ్చేవారు. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారతీయ వాయుసేన గట్టి ప్రతిపాదన చేసినా అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వెనక్కి తగ్గటం సిగ్గుచేటు. మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయం మూలంగా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యం చేయలేదు. గతంలో మన పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ధైర్యంతో వ్యవహరించలేదు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పలేక పోయారు. పాక్‌పై యుద్ధానికి సన్నద్ధం అన్నట్టుగా సైన్యాన్ని సరిహద్దులకు తరలించినా ఆ తరువాత ఎందుకో వాజపేయి వెనక్కి తగ్గారు. అమెరికా ఒత్తిడి వల్ల పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో వెనుకంజ వేసినందుకు వాజపేయి ప్రతిష్ట తగ్గింది. పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడి చేసినా వాజపేయి ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోకపోవటాన్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. పాకిస్తాన్‌పైకి ఎప్పుడు దూకుదామా? అని సరిహద్దులో నిరీక్షిస్తున్న మన సైన్యాన్ని దాదాపు ఆరు నెలల పాటు నిలువరించి, ఆ తరువాత ఉపసంహరించుకోవ టం వాజపేయి ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు.
మన్మోహన్, వాజపేయి చేసిన తప్పులను ప్రస్తుత ప్రధాని మోదీ చేయకపోవటం దేశం చేసుకున్న అదృష్టంగా భావించాలి. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కశ్మీర్‌లోని ఊరి సైనిక శిబిరంపై దాడి చేసి దాదాపు ఇరవై మందిని చంపినందుకు ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థ లాంచ్ ప్యాడ్‌లపై మెరుపుదాడి చేయించటం ద్వారా మోదీ సాహసోపేత నిర్ణయాలను శ్రీకారం చుట్టారు. మోదీ ప్రభుత్వం చేయించిన మెరుపుదాడులను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శించడం మన నేతల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. మెరుపుదాడులు జరిగాయా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ- ప్రధానిని, సైనికులను అవమానించిన కొన్ని రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా మెరుపు దాడులు జరిగినా, వాటిని తాము ప్రచారం చేసుకోలేదంటూ వింత వాదన మొదలు పెట్టాయి. మోదీ రాజకీయం చేస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
పుల్వామాలో నలభై మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ స్థావరంపై వైమానిక దాడులు చేయించిన మోదీ సమర్థనీయుడు. భారత్ చేసిన వైమానిక దాడికి ప్రతిగా పాకిస్తాన్ పాలకులు రజోరీ, నౌషేరా ప్రాంతాల్లోని మన సైనిక స్థావరాలపై వైమానిక దాడి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేల కూల్చి భారత్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన ఘనత మన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ది.
ప్రగల్భాలు పలకడం తప్ప పాకిస్తాన్‌కు మరేదీ రాదనేది పచ్చి నిజం. అణుబాంబులు ప్రయోగిస్తామని పదే పదే హెచ్చరికలు చేయడం, ఉగ్రవాదులను ఉసిగొల్పడం ద్వారా పాక్ పాలకులు భారత్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. మనం ఇంతకాలం దాడులకు గురి కావడం తప్ప సరైన ప్రతీకారం తీర్చుకోలేకపోయాం. మోదీ ప్రభుత్వం మొదటిసారి ‘పాకిస్తాన్ అణుబాంబు బెదిరింపుల్లోని డొల్లతనా’న్ని బైటపెట్టింది. కొ న్నాళ్ల క్రితమే చైనా బెదిరింపులకు మోదీ చరమగీతం పాడటం తెలిసిందే. డోక్లామ్ సంఘటనతో చైనా బెదిరింపులకు మోదీ ఫుల్‌స్టాప్ పెట్టటంలో విజయం సాధించారు. డోక్లామ్ ఉదంతంతో మోదీ సర్కారు చైనాతో ఎంతకైనా సిద్ధమేనని వ్యవహరించింది. మోదీ ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా చైనాను దారికి తెచ్చింది. తాజాగా బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ స్థావరంపై దాడి చేసి, ఉగ్రవాద సంస్థలతోపాటు పాకిస్తాన్‌ను కట్టడి చేసే ప్రక్రియకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
పాకిస్తాన్ ఇప్పుడు అత్యంత దారుణమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని ఉంది. సౌదీ అరేబియా ఆర్థిక సహాయం చేస్తే తప్ప రోజు గడవని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. పాక్‌లో అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనిపించటం లేదు. అయినాసరే ఆ దేశ పాలకులు, సైన్యం మాత్రం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం సిగ్గుచేటు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దృష్టి కేంద్రీకరించవలసిన పాక్ పాలకులు, సైన్యం ఆ పనికి బదులు కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కొనసాగించడం విషాదకరం. మరోసారి ఉగ్రవాదులను ఉసిగొల్పితే ఆకస్మిక దాడులు తప్పవనే భయాన్ని పాక్ పాలకుల్లో మన ప్రభుత్వం కొనసాగించాలి. ఇదే భయాన్ని ఉగ్రవాదుల్లోనూ కలిగించాలి. ఆర్థిక సమస్యల్లో చిక్కుకొన్న పాకిస్తాన్ మనతో యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. అణుబాంబు ప్రయోగించే శక్తిసామర్థ్యాలు పాకిస్తాన్‌కు ఉన్నాయా? అనే అనుమానం సైతం చాలామందికి కలుగుతోంది. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు, ఉగ్రవాద సంస్థలకు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూ కశ్మీర్‌లో శాంతిసుమాలు వికసించేలా కృషి చేయాలి. *

-కె.కైలాష్ 98115 73262