ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఎలక్టోరల్ బాండ్స్ గుట్టు విప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు అందజేస్తున్న పారిశ్రామికవేత్తల వివరాలను ప్రజల ముందు పెట్టవలసిందే. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇస్తున్న పారిశ్రామికవేత్తలు, సంస్థల వివరాలు ప్రజలు ముఖ్యంగా ఓటర్లకు అవసరం లేదంటూ బి.జె.పి అధినాయకత్వం చేస్తున్న వాదన ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల మూలంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంస్థలు, వ్యాపారస్తులు, ఇతర వాణిజ్య ప్రముఖులు రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చే విధానానికి బి.జె.పి రెండు సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టటం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చే వారి పేర్లు, ఇతర వివరాలను గుప్తంగా ఉంచుతారు. విరాళాల దాతల పేర్లు, వివరాలను గుప్తంగా ఉంచే విధానాన్ని ఇతర రాజకీయ పార్టీలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వ్యతిరేకిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చే విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు తెలియజేయవలసిందేనని కేంద్ర ఎన్నికల సంఘం వాదిస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి మాత్రం ఇందుకు సమ్మతించటం లేదు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారి వివరాలను వెల్లడించటం సాధ్యం కాదు, ఈ వివరాలు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం లేదని కూడా బి.జె.పి వాదిస్తోంది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చే విరాళాలు ఇచ్చే వారి పేర్లు వెల్లడించాలా వద్దా? అనే అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు గత వారం ఒక ఆదేశం జారీ చేస్తూ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలు, వాటి దాతల పేర్లను సీల్డ్ కవర్లలలో కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశం కూడా సమర్థనీయం కాదు. రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసే వారి వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచాలనే ప్రశ్నకు సుప్రీం కోర్టు కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్న వారి వివరాలను సీల్డ్ కవర్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికే ఎందుకు అందజేయాలి? ఈ వివరాలను ప్రజల ముందు ఎందుకు పెట్టకూడదనే ప్రశ్నలకు సుప్రీం కోర్టు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు అందజేసే పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంస్థలు, వ్యాపార సంస్థలు, వ్యాపార ప్రముఖులు ఉత్తిపుణ్యానికి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తారా? ఏ పారిశ్రామికవేత్త, వాణిజ్యవేత్త, సంస్థ కూడా ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా ఏ రాజకీయ పార్టీకి కూడా విరాళాలు ఇవ్వదు. విరాళాలు ఇచ్చినందుకు బదులుగా వారు ఏదో ఒక ప్రయోజనం తప్పకుండా పొందుతారనేది పచ్చి నిజం. వ్యాపారస్తులు ఎవరికైనా ఒక రూపాయి ఇస్తే దానికి బదులుగా పది రూపాయల లాభం తీసుకునేందుకు ప్రయత్నిస్తారనేది జగమెరిగిన సత్యం. పెద్ద పారిశ్రామిక సంస్థ ఒక రాజకీయ పార్టీకి పది కోట్ల విరాళం ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వంద కోట్ల లాభం పొందటం ప్రతి పారిశ్రామికవేత్త, సంస్థ నైజం. ఈ లెక్కన బి.జె.పి, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు లేదా టి.ఆర్.ఎస్, తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్, ఎస్.పి, బి.ఎస్.పి వంటి ప్రాంతీయ పార్టీలు తమకు లభించే విరాళాలకు ప్రతిగా ఆయా పారిశ్రామికవేత్తలు, సంస్థలకు రెండింతల, మూడింతల ప్రయోజనం కలిగించవలసి ఉంటుంది. ఇలా జరగటం వలన సగటు మనిషికి తీరని అన్యాయం, నష్టం జరిగిపోతుంది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, సంస్థలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఆయా రాజకీయ పార్టీల్లో పెట్టుబడులు పెట్టి ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత తమ పెట్టుబడులకు తగు మోతాదులో లాభాలు రాబట్టుకుంటారు. రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో అందే నిధులు అవినీతికి సోపానాలు. ఈ ఉన్నత స్థాయి అవినీతిని అరికట్టాలంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపం లేదా మరో రూపంలో రాజకీయ పార్టీలకు అందే విరాళాల పూర్తి వివరాలను ప్రజల ముందు పెట్టవలసిందే. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాల్లో పారదర్శకత లేకపోవటం అంటే అవినీతికి పాల్పడుతున్నట్లే. ఇటీవల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చిన విరాళాల్లో దాదాపు 95 శాతం నిధులు బి.జె.పికి అందాయి. బి.జె.పి అధికారంలో ఉన్నది కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ విరాళాలు అందుతాయి. ఎంత ఎక్కువ విరాళాలు అందితే అంతే పెద్ద స్థాయిలో ప్రతి సహాయం (క్విడ్ ప్రోకో) చేయవలసి ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పారిశ్రామికవేత్తలు, సంస్థల నుండి విరాళాలు తీసుకుని అధికారంలోకి వచ్చిన తరువాత వారు అడిగిన పని చేసిపెడుతున్నారు, ఇలా చేయటం అవినీతి కాదా? రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందే విరాళాల గురించి తెలుసుకోవలసిన అవసరం, హక్కు, అధికారం ప్రజలకు లేదంటూ అటర్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ సుప్రీం కోర్టులో వాదించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీకి ఎవరి నుండి ఎంత విరాళం అందుతోంది? విరాళాలు ఇచ్చిన వారు ఆ తరువాత సదరు రాజకీయ పార్టీ నుండి ఏం ఆశిస్తున్నారు? ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు? అనేది ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. వాస్తవానికి ఈ వివరాలు తెలుసుకోవటం ప్రజల హక్కు, అధికారం. ఈ వివరాలను ప్రజలకు అందకుండా చేయటం అంటే తెర వెనక జరుగుతున్న అవినీతిని దాచివేయటమే. సమాచారం ప్రజల హక్కు, అధికారం, ప్రజలకు అన్ని వివరాలు తెలిసినప్పుడే మంచి అభ్యర్థులు ఎంపిక అవుతారు, మంచి పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు వీలుంటుంది. ప్రజలకు సరైన సమాచారం, సకాలంలో అందకుండా చేయటం వలన ప్రజాస్వామ్యం దెబ్బ తింటుందనేది నిజం. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, వారి తీర్పే తుది తీర్పు. మెజారిటీ ప్రజల మద్దతు లభించే పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాంటప్పుడు రాజకీయ పార్టీలకు అందే విరాళాల వివరాలను తెలుసుకునే హక్కు, అధికారం ప్రజలకు లేదని ఎలా అంటారు? ప్రజలకు ఈ హక్కు, అధికారం లేదంటే ప్రజాస్వామ్యం గొంతు నులిపినట్లే. రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే పారిశ్రామిక సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీపై ఒత్తిడి తెచ్చి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేయిస్తే? తాము నడిపించే పరిశ్రమలపై పన్ను భారం తగ్గించుకుంటే? ప్రస్తుతం దేశంలో ఉన్న కొన్ని బడా పారిశ్రామిక సంస్థలు అధికారంలో ఉండే పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం ద్వారా తమ పబ్బం గడుపుకుంటున్నారనే అపవాదు ఉండనే ఉన్నది. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక బడా పారిశ్రామిక సంస్థ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి వార్షిక బడ్జెట్‌లో ఒక వస్తువుపై విధించే పన్ను భారాన్ని పాయింట్ సున్నా ఐదు శాతం తగ్గింపజేయటం ద్వారా సాలీనా వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం పొందిందనే ఆరోపణలు రావటం అందరికీ తెలిసిందే. నిజాయితీకి పెద్దపీట వేస్తాము, అవినీతి విషయంలో శూన్య సహనం పాటిస్తామని చెప్పుకునే బి.జె.పి అధినాయకత్వం ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చే విరాళాల దాతల పేర్లు వెల్లడించేందుకు ఎందుకు వెనుకాడుతోంది? రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే దాతల పేర్లు తెలుసుకోవలసిన అవసరం, హక్కు, అధికారం ప్రజలకు లేదని వాదించటం బి.జె.పి మూల సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదా? బి.జె.పి అధినాయకత్వం, ఎన్.డి.ఏ అధినాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారి పేర్లు, విరాళాల మొత్తాల వివరాలను వెల్లడించేందుకు అంగీకరించాలి. వాస్తవానికి బి.జె.పి లాంటి పార్టీ విరాళాల దాతల పేర్లు వెల్లడించటంలో ముందు వరుసలో ఉండాలి. ఎలక్టోరల్ బాండ్స్ విధానం వలన అవినీతికి కొంత అడ్డుకట్టపడిందని బి.జె.పి వాదిస్తోంది. విరాళాలు ఇచ్చే దాతల పేర్లు వెల్లడించే విధానానికి శ్రీకారం చుట్టటం ద్వారా క్విడ్ ప్రోకో విధానాన్ని భూస్థాపితం చేసేందుకు కూడా బి.జె.పి. శ్రీకారం చుట్టటం మంచిది.

-కె.కైలాష్ 98115 73262