ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

సమర్ధతలో మోదీకి సాటి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోతే తప్ప ఈ దేశం బాగుపడదంటూ కొందరు విపక్ష నేతలు చేస్తున్న వాదనలో ఎలాంటి పస లేదు. మోదీ రెండోసారి ప్రధాని పదవి చేపడితే దేశం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్న వాదనలు లేకపోలేదు. రాజకీయపరమైన స్థిరత్వం ఆయనతోనే సాధ్యమన్న పరిస్థితి కనిపిస్తోంది. కలగూరగంప లాంటి విపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజకీయ అస్థిరత్వం నెలకొంటుంది. విపక్షానికి చెందిన రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, మాయావతితోపాటు ఇంకొందరు ప్రాంతీయ నాయకులు ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. ఈ లక్ష్యసాధన కోసమే వీరు పావులు కదుపుతున్నారు. ఈ నలుగురిలో ఎవరు ప్రధాని పదవిని చేపట్టినా వెన్నుపోటు రాజకీయాలతో మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉంది. పాకిస్తాన్, చైనాలను కట్టడి చేయటంతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో మన దేశం ప్రతిష్ట పెరగాలన్నా, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నా మోదీ లాంటి సమర్ధ నేత అవసరం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి అత్యంత ధైర్యవంతుడు, నిష్టాగరిష్టుడైన మోదీ ప్రధాని పదవిని చేపట్టాడు. వ్యక్తిగత స్వార్థం లేకుండా, దేశం గురించి ఆలోచించే మోదీ లాంటి నాయకుడు ఎన్నిసార్లు ప్రధాని పదవి చేపట్టినా తక్కువే. ఆయన ఓడిపోవాలని కలలు కంటున్న నేతలందరూ కుటుంబ రాజకీయాలకు, అవినీతికి పెద్ద పీట వేస్తున్నవారే. కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, టీఆర్‌ఎస్, ఎస్పీ, బిఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, వైకాపా, డీఎంకే, జేడీఎస్, ఎంఐఎం, శివసేన, బిజూ జనతాదళ్ వంటి పార్టీలన్నీ కుటుంబం ఆధారంగా పనిచేస్తున్న పార్టీలే. నేతి బీరకాయలోని నెయ్యి చందంగా ఈ పార్టీల్లో ప్రజాస్వామ్యం శూన్యమన్న సంగతి జగమెరిగిన సత్యం. మోదీని ఓడించేందుకు వీరంతా రకరకాల సమీకరణలు చేస్తున్నవారే. వారసత్వ రాజకీయాలకు నిలయమైన పార్టీల్లో ఇతర నేతలు ఎంతటి సమర్ధులైనా కీలక పదవులు మాత్రం దక్కవు. ఈ పార్టీలు అధికారంలో ఉంటే కేంద్రీకృత అవినీతి కొనసాగుతుంది. ఈ పార్టీలకు మెజారిటీ లభించే పక్షంలో సదరు కుటుంబాలకు చెందిన వారే ప్రధాని లేదా ముఖ్యమంత్రి పదవులను చేపడతారు. మోదీ లాంటి వ్యక్తులు అధికారంలో కొనసాగితే కుటుంబ పాలనకు పేరుగాంచిన పార్టీల మనుగడకు ప్రమాదం ముంచుకొస్తుంది. అందుకే వారు మోదీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
మోదీ వల్ల అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి పెరిగిందని ఈ పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో సుప్రీం కోర్టు ఎన్డీఏ ప్రభుత్వానికి దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం రాఫెల్ వ్యవహారం లో అనిల్ అంబానీకి ముప్పై వేల కోట్ల రూపాయల మేర కు మోదీ లాభం చేకూర్చారంటూ ఆరోపణలు చేశారు. రాహుల్ చేసిన ఈ ఆరోపణ తప్ప మోదీ ప్రభుత్వంపై మరే ఆరోపణలు రాలేదు. మోదీపై ఆరోపణలు చేస్తున్న నాయకులంతా అవినీతికి చిరునామా అన్నది ప్రజలకు బాగా తెలుసు. మోదీపై ప్రతిపక్షం చేస్తున్న మరో పెద్ద ఆరోపణ- నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నది. పెద్ద నోట్ల రద్దు అనేది ఎంతో ధైర్యంతో తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం నీరుకారిపోవటానికి కారణం మన సమాజంలో పేరుకున్న అవినీతి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని బ్యాంకింగ్ రంగం అధికారులు ఏ విధంగా విఫలం చేశారన్నది అందరికీ తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థ నీతినిజాయితీతో పనిచేసి ఉంటే లక్షల కోట్ల రూపాయల నల్లధనం పట్టుబడేది. కొందరు బ్యాంకు అధికారులు కుమ్మక్కు కావటంతో నల్లధనం తెల్లధనంగా మారిపోయి, పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కొన్ని పార్టీల నాయకులకు తీరని నష్టం కలిగించింది.
మన దేశంలో నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తోంది. ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థ పతనమైతే ఎవరికి నష్టం కలుగుతుందనేది సామాన్య ప్రజలు సైతం ఊహించుకోవచ్చు. సామాజిక వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు కూడా మోదీ కృషి చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాలకు కూడా స్వచ్ఛ భారత్ పథకాన్ని అమలు చేయవలసి రావటం సిగ్గుచేటు. మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం గురించి దేశ ప్రధాని ఒక సామాజిక ఉద్యమం చేపట్టాల్సి రావడం గత పాలకుల అసమర్థతకు అద్దం పడుతోంది. స్వచ్ఛ భారత్ లాంటి పథకాలను గత పాలకులు గొప్పగా ప్రకటించినా, వాటిని సమర్ధవంతంగా అమలు చేయలేకపోయారు. గత పాలకులకు, మోదీకి ఉన్న వ్యత్యాసం ఇదే. ఈ పథకాలన్నింటినీ తమ పార్టీ గతంలోనే అమలు చేసిందని చెప్పుకునే వారు, నేడు బీదరికం నిర్మూలనకు ‘న్యాయ్’ లాంటి పథకాన్ని తీసుకొస్తామనడం వారి సైద్ధాంతిక దివాలాకోరుతనానికి నిదర్శనం.
ఇక, దేశభక్తి పేరుతో మోదీ రాజకీయం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించటం సిగ్గుచేటు. గతంలో అధికారం వెలగబెట్టిన చాలా పార్టీలు దేశభక్తి అనేది లేకుండా చేశాయి. పాకిస్తాన్‌ను కట్టడి చేసే విషయంలో గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన వారు పట్టుదలతో ధై ర్యంగా వ్యవహరించారా? 1948లో పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరులు జమ్మూ కశ్మీర్‌పై దాడి చేసినప్పుడు అప్పటి ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ గట్టిగా వ్యవహరించి ఉంటే మనకీనాడు ఉగ్రవాదుల సమస్య ఉండేది కాదు. అప్పటి సైనికాధికారి జనరల్ తిమ్మయ్య కోరినట్లు మరో మూడు వారాల సమయం నెహ్రూ ఇచ్చి ఉంటే ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అనేదే ఉండేది కాదు. పాకిస్తాన్, చైనాల మధ్య భూసంబంధం ఉండేదే కాదు. పాకిస్తాన్ దాడిని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించేందుకు నెహ్రూ తొందరపడడంతో మన సైన్యం ముందుకు సాగకపోవటంతో- మూడింట ఒక వంతు జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లింది. 1971 యుద్ధంలో బంగ్లాదేశ్‌ను విడగొట్టిన అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాక్ అక్రమిత కశ్మీర్‌ను మాత్రం ముట్టుకోలేదు. అప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సరైన నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఇస్లామిక్ ఉగ్రవాద సమస్య ఉండేది కాదు.
గత పాలకులు ముందుచూపుతో వ్యవహరించలేదు కాబట్టే పాకిస్తాన్ ఇప్పటికీ ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్,చైనాలను కట్టడి చేసేందుకు, దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు మోదీ లాంటి సాహసి ప్రధానమంత్రిగా కొనసాగటం ఎంతో అవసరం. మోదీకి భార్యాపిల్లలు లేరు కాబట్టి దేశ ప్రజల బాధ అతనికేం అర్థం అవుతుందంటూ కొందరు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు వింత వాదనలు వినిపిస్తున్నారు. ఈ విమర్శలు చేసేవారు తమ పిల్లలకు పదవులు కట్టబట్టేందుకు ప్రయత్నించటం తప్ప ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? ఎందుకూ కొరగాని నాయకుల కుటుంబ సభ్యులు మంత్రి పదవులు, పార్టీ పదవులు చేపడుతున్నారు. దీనిని దేశసేవ అనాలా? మోదీ లాంటి భవబందాలు లేని వ్యక్తులే దేశానికి నిజమైన సేవ చేయగలుగుతారు. ఎల్లవేళలా తమ కుటుంబం, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు నిజమైన సేవ చేయలేరు. స్వంత కుటుంబాలు లేని అబ్దుల్ కలాం, నరేంద్ర మోదీ లాంటి దేశం కోసం చిత్తశుద్ధితో పని చేస్తారు. అలాంటి వారు అధికారంలో ఉండడం దేశానికి శ్రేయస్కరం.

-కె.కైలాష్ 98115 73262